ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఎయిమ్స్ న్యూఢిల్లీ ఈ - ఐసియు వీడియో క‌న్స‌ల్టేష‌న్ కార్య‌క్ర‌మం ప్రారంభం

ఇప్ప‌టివ‌ర‌కు 11 రాష్ట్రాల‌కు చెందిన 43 పెద్ద ఆస్ప‌త్రులకు ఈ కార్య‌క్ర‌మం వ‌ర్తింపు

Posted On: 20 JUL 2020 10:35AM by PIB Hyderabad

కోవిడ్ -19 మ‌ర‌ణాల‌ను త‌గ్గించే దిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వ కృషిని బ‌లోపేతం చేసేందుకు ఎయిమ్స్ న్యూఢిల్లీ, దేశ‌వ్యాప్తంగా గ‌ల ఐసియు డాక్ట‌ర్ల‌తో  ఈ-ఐసియు పేరుతో 2020 జూలై 8న ఒక వీడియో క‌న్స‌ల్టేష‌న్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది.  దేశ‌వ్యాప్తంగా గ‌ల కోవిడ్ చికిత్సా స‌దుపాయాల‌లో, కోవిడ్ -19 పేషెంట్ల‌కు చికిత్స నందిస్తూ కోవిడ్ పై పోరాటంలో ముందున్న డాక్ట‌ర్ల‌తో కేసుల నిర్వ‌హ‌ణ‌పై చ‌ర్చించ‌డానికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. కోవిడ్ -19 పేషెంట్ల‌కు చికిత్స‌నందిస్తున్న వారికి, ఐసియులో చికిత్స‌నందించే వైద్యుల‌కు ఏవైనా సందేహాలు ఉంటే వారు ఈ -ఐసియు విధానంలో త‌మ ప్ర‌శ్న‌ల‌ను అడిగి వాటికి సమాధానం తెలుసుకోవ‌చ్చు. అ‌లాగే వారు త‌మ అనుభ‌వాల‌ను , తెలుసుకున్న విజ్ఞానాన్ని ఎయిమ్స్‌లోని నిపుణులు, ఇత‌ర‌ ఫిజీషియ‌న్ల‌తో ఈ వీడియో ప్లాట్ ఫాం ద్వారా  పంచుకోవ‌చ్చు.
ఐసియు , ఆక్సిజ‌న్ స‌దుపాయం , ఐసొలేష‌న్ స‌దుపాయం క‌ల వెయ్యి ప‌డ‌క‌ల ఆస్ప‌త్రుల‌లో అనుస‌రిస్తున్న మంచి ప‌ద్ధ‌తుల‌ను బ‌లోపేతం చేయ‌డంతోపాటు , ఇత‌రుల అనుభ‌వాల‌ను తెలుసుకోవ‌డం ద్వారా  కోవిడ్ -19 మ‌ర‌ణాల‌ను త‌గ్గించ‌డం ఈ చ‌ర్చ‌ల ముఖ్య ఉద్దేశం. ఇప్ప‌టివ‌ర‌కూ ఇందుకు సంబంధించి 43 సంస్థ‌ల‌తో ముంబాయి (10), గోవా (3), ఢిల్లీ(3), గుజ‌రాత్ (3), తెలంగాణా (2), అస్సాం(5), క‌ర్ణాట‌క‌(1) , బీహార్ (1), ఆంధ్ర‌ప్ర‌దేశ్ (1) , కేర‌ళ (1) , త‌మిళ‌నాడు (13) నాలుగు సెష‌న్లు నిర్వ‌హించారు.

ఒక్కొక్క సెష‌న్ సుమారు ఒక‌టిన్న‌ర నుంచి రెండు గంట‌ల పాటు వీడియో కాన్ఫ‌రెన్సు ప‌ద్ద‌తిలో వీటిని నిర్వ‌హించారు. కోవిడ్ -19 పేషెంట్ల చికిత్స‌కు సంబంధించిన అన్ని అంశాల‌ను వీరు చ‌ర్చించారు.  ఇన్వెస్టిగేష‌న‌ల్ థెర‌పీలు అయిన రెమిడెసివిర్, క‌న్వ‌ల్‌సెంట్ ప్లాస్మా, టోసిలిజుమాబ్ వంటి వాటిని హేతుబద్ధంగా వాడాల్సిన అంశాన్ని ఈ సంప్ర‌దింపుల సంద‌ర్భంగా ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించారు.   కోవిడ్ పేషెంట్ల‌కు చికిత్స‌ను అందిస్తున్న బృందాలు ప్ర‌స్తుత వ్యాధి సూచ‌న‌లు, వీటిని విప‌రీతంగా వాడ‌డం వ‌ల్ల వ‌చ్చే అన‌ర్ధాలు , అలాగే సామాజిక మాధ్య‌మాల‌లో విస్తృత ప్ర‌చారం ఆధారంగా జ‌రిగే  ప్రిస్క్రిప్ష‌న్లను ప‌రిమితం చేయ‌వ‌ల‌సిన అవ‌స‌రం వంటి వాటి గురించీ చ‌ర్చించారు.
 ప్రోనింగ్‌ను వాడ‌డం, ఆక్సిజ‌న్ ఎక్కువ‌గా స‌ర‌ఫ‌రా,  వ్యాధి ముదిరిన కేసుల‌లో వెంటిలేట‌ర్ సెట్టింగ్‌లు వంటి వాటిని కూడా ఈ సంద‌ర్భంగా చ‌ర్చించారు. కోవిడ్ -19 నిర్ధార‌ణ‌లో వివిధ ప‌రీక్షా వ్యూహాల విష‌యంలో ప‌ర‌స్ప‌రం అభిప్రాయాల‌ను క‌ల‌బోసుకున్నారు.
 
తిరిగి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సిన అవ‌స‌రానికి సంబంధించి, వ్యాధిగ్ర‌స్తుల‌ను చేర్చుకోవ‌డం, వారిని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి చేయడానికి ప్ర‌మాణాలు, పేషెంట్‌ను ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి చేసిన‌త‌ర్వాత ల‌క్ష‌ణాలు, తిరిగి ప‌నిలోకి వెళ్ల‌డం వంటి వాటిని  ఈసంద‌ర్భంగా చ‌ర్చించారు.

మ‌రొక ముఖ్య‌మైన అంశం, పేషెంట్ల‌తో స‌మాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవ‌డం, ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌కు ప‌రీక్ష‌లునిర్వ‌హించ‌డం, కొత్తగా ప్రారంభమయ్యే డయాబెటిస్, స్ట్రోక్, డయేరియా మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ వంటి అసాధారణ ల‌క్ష‌ణాల గురించి కూడాఇందులో చ‌ర్చించారు. న్యూఢిల్లీ ఎయిమ్స్ కు చెందిన బృందం ప్ర‌తి విజువ‌ల్ కాన్ఫ‌రెన్సులోనూ ఒక గ్రూపు నుంచి మ‌రో గ్రూప్‌కు విజ్ఙానాన్ని బ‌దిలీ చేయ‌డంలొ అనుసంధాన‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించింది. దీనికితోడు త‌మ స్వంత అనుభ‌వాలు, ఈ అంశాల‌పై వ‌చ్చిన‌ విస్తృత స‌మాచారాన్ని ఆయా రంగాల ప్ర‌త్యేక నిపుణులు స‌మీక్షించారు.

రానున్న వారాల‌లో ఈ-ఐసియు వీడియో ద్వారా సంప్ర‌దించే కార్య‌క్ర‌మం దేశవ్యాప్తంగా గ‌ల‌ చిన్న ఆరోగ్య సదుపాయాలు అంటే 500 బెడ్లు అంత కంటె ఎక్కువ క‌లిగిన వాటితో నిర్వ‌హిస్తారు.


 

****(Release ID: 1639885) Visitor Counter : 253