PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 10 JUL 2020 6:49PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 • కోవిడ్‌-19 నుంచి కోలుకునేవారి జాతీయ సగటు మెరుగుపడి 62.42 శాతానికి చేరిక; 18 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇది జాతీయ సగటుకన్నా అధికం.
 • మరణాల శాతం మరింత తగ్గి 2.72కు చేరిక; అలాగే 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇది జాతీయ సగటుకన్నా తక్కువ.
 • దేశంలో ప్రస్తుతం చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,76,882.
 • ప్రస్తుత కష్టతరమైన సవాలును ఎదుర్కొనడంలో ప్రభుత్వానికి లేదా సమాజానికి గొప్ప స్ఫూర్తినిచ్చేవి కరుణ, అప్రమత్తతలేనని ప్రధానమంత్రి ఉద్ఘాటన.
 • దేశవ్యాప్తంగా 41వేల ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య-శ్రేయో కేంద్రాల్లో... ప్రత్యేకించి ప్రస్తుత కోవిడ్‌ సమయాన ప్రజలకు సార్వత్రిక, సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు.

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ తాజా సమాచారం:

కోలుకునేవారి శాతం 62.42 శాతానికి చేరిక;18 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇది జాతీయ సగటుకంటే ఎక్కువ; అలాగే 2.72 శాతానికి తగ్గిన మరణాలు

దేశంలో కోవిడ్-19 మ‌హ‌మ్మారినుంచి కోలుకునేవారి సంఖ్య స్థిరంగా పెరుగుతూనే ఉంది. ఆ మేర‌కు గడ‌చిన 24 గంటల్లో 19,138 మందికి వ్యాధి న‌యం కాగా, మొత్తం కోలుకున్నవారి సంఖ్య 4,95,515కు పెరిగింది. త‌దనుగుణంగా కోలుకునేవారి శాతం కూడా 62.42కు చేరింది. ప్రస్తుతం 2,76,882 మంది చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఇక దేశంలో 1,218 కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రులు, 2,705 ఆరోగ్య రక్షణ కేంద్రాలు, 10,301 చికిత్స కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు దాదాపు 18 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కోలుకునేవారి శాతం జాతీయ సగటుకన్నా అధికంగా నమోదు కావడం విశేషం. అంతేకాకుండా జాతీయ స్థాయిలో మరణాల శాతం కూడా మరింత తగ్గి 2.72కు దిగివచ్చింది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే ఇది అత్యంత తక్కువ కావడం గమనార్హం. ఆ మేరకు 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మరణాల శాతం జాతీయ సగటుకన్నా తక్కువగా ఉండటం ఇందుకు నిదర్శనం. ‘పరీక్షలు, పసిగట్టడం, చికిత్స అందించడం’ అనే త్రిముఖ వ్యూహాన్ని జాతీయంగా అమలు చేయడం వల్ల కోవిడ్‌-19 కేసుల గుర్తింపు దిశగా ఇప్పటివరకూ 1,10,24,491 నమూనాలను వివిధ ప్రయోగశాలల్లో పరీక్షించారు. అంతేకాకుండా రోజువారి పరీక్షల సంఖ్య క్రమేణా పెరుగుతుండగా గత 24 గంటల్లో 2,83,659 నమూనాలను పరీక్షించారు. ప్రయోగశాలల సంఖ్య కూడా రోజురోజుకూ విస్తరిస్తూ మొత్తం 1169కి చేరగా ప్రభుత్వ రంగంలో 835, ప్రైవేటు రంగంలో 334 వంతున ఈ వ్యవస్థ మరింత బలోపేతమైంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1637809

41వేలకుపైగా ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య-శ్రేయో కేంద్రాల్లో (AB-HWC) ప్రత్యేకించి కోవిడ్‌ వేళ ప్రజలకు సార్వత్రిక-సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ

కోవిడ్‌-19పై పోరాటంలో ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద పనిచేస్తున్న ఆరోగ్య-శ్రేయో కేంద్రాలు (HWC) మూలస్తంభంగా నిలిచాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఐదు నెలల్లో 8.8 కోట్లమంది ఈ కేంద్రాలను సందర్శించడమే ఇందుకు నిదర్శనం. అంతేకాకుండా గత ఐదు నెలల వ్యవధిలో 1.41 కోట్ల మంది అధిక రక్తపోటు, 1.13 కోట్ల మంది మధుమేహం, 1.34 కోట్ల మంది నోటి సమస్య/రొమ్ము లేదా గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ తదితర పరీక్షలు చేయించుకున్నారు. అలాగే కోవిడ్‌-19 సవాళ్ల నడుమ ఒక్క జూన్‌ నెలలోనే 5.62 లక్షలమంది అధిక రక్తపోటు రోగులకు, 3.77 లక్షల మంది మధుమేహులకు మందులు పంపిణీ చేయబడ్డాయి. మరోవైపు కోవిడ్‌ ముప్పు మొదలైనప్పటినుంచి నేటిదాకా 6.53 లక్షల యోగా-శ్రేయో తరగతులు కూడా నిర్వహించారు. ఇక 2020 జనవరి నుంచి జూన్‌ మధ్యకాలంలో అదనంగా 12,425 ఆరోగ్య-శ్రేయో కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేంద్రాల సంఖ్య 29,365 నుంచి 41,970కి పెరిగింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1637798

రేవా అత్యాధునిక భారీ సౌర‌శ‌క్తి ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ప్ర‌ధానమంత్రి

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ దృశ్య‌-శ్ర‌వ‌ణ మాధ్య‌మంద్వారా ఆసియాలోనే అతిపెద్ద విద్యుత్ ప‌థ‌క‌మైన రేవా అత్యాధునిక భారీ సౌర‌శ‌క్తి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ- ప్రభుత్వ కార్యక్రమాలన్నిటిలోనూ జీవ‌న సౌలభ్యంస‌హా ప‌ర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్న‌ద‌ని గుర్తుచేశారు. ఈ మేర‌కు స్వచ్ఛ‌భారత్, పేద కుటుంబాలకు వంట‌గ్యాస్ పంపిణీ, స‌హ‌జ‌వాయు నెట్‌వ‌ర్క్‌ల అభివృద్ధివంటి కార్యక్రమాలను ప్రస్తావించారు. ఇవ‌న్నీ జీవ‌న‌ సౌలభ్యంపై దృష్టి సారించ‌డంతోపాటు పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను మెరుగుపరిచేవిగా పేర్కొన్నారు. ప్ర‌పంచ మ‌హమ్మారి కోవిడ్‌-19వ‌ల్ల త‌లెత్తిన ప్ర‌స్తుత సంక్షోభ ప‌రిస్థితుల‌ను ప్ర‌స్తావిస్తూ- ప్రస్తుత కష్టతరమైన సవాలును ఎదుర్కొనడంలో ప్రభుత్వానికి లేదా సమాజానికి గొప్ప స్ఫూర్తినిచ్చేవి కరుణ, అప్రమత్తతలేనని ఉద్ఘాటించారు. దిగ్బంధం మొద‌లైన నాటినుంచి పేద‌ల‌కు, ఆప‌న్నుల‌కు ఆహార‌, ఇంధ‌న స‌ర‌ఫ‌రాపై ప్ర‌భుత్వం ప్ర‌ధానంగా శ్ర‌ద్ధ వ‌హించిందని ఆయ‌న చెప్పారు. అదే స్ఫూర్తితోనే ప్ర‌స్తుత దిగ్బంధ విముక్తి‌ద‌శ లోనూ ఆహారం, వంట‌గ్యాస్ ఉచిత సరఫరాను ఈ ఏడాది నవంబరుదాకా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయ‌న వివ‌రించారు. అంతేకాకుండా ప్రైవేటు రంగంలోని లక్షలాది ఉద్యోగుల భ‌విష్య‌నిధి ఖాతాల‌కు పూర్తివాటా చందాను ప్రభుత్వమే జ‌మ‌చేస్తున్న‌ద‌ని పేర్కొన్నారు. అదేవిధంగా వ్యవస్థ అందుబాటులో లేనివారికి ల‌బ్ధి క‌ల్పించ‌డం ల‌క్ష్యంగా ప్ర‌ధాన‌మంత్రి-స్వానిధి(PM-Swanidhi) ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు తెలిపారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1637797

750 మెగావాట్ల రేవా సౌర‌శ‌క్తి ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్ర‌ధానమంత్రి ప్రసంగం పూర్తిపాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1637755

వివిధ రంగాల్లో నిపుణ కార్మిక‌శ‌క్తి గిరాకీ-స‌ర‌ఫ‌రా అంత‌రం త‌గ్గింపు దిశ‌గా ‘అసీమ్‌’ (ASEEM) పేరిట కృత్రిమ మేధ ఆధారిత వేదిక‌ను ప్రారంభించిన‌ నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపన మంత్రిత్వ శాఖ

సమాచార ప్రవాహం మెరుగుతోపాటు నిపుణ కార్మిశ‌క్తి విప‌ణిలో గిరాకీ-స‌ర‌ఫ‌రాల మ‌ధ్య అంత‌రం తొల‌గించే దిశ‌గా

కేంద్ర నైపుణ్యాభివృద్ధి-వ్య‌వ‌స్థాప‌న మంత్రిత్వ‌శాఖ చొర‌వ చూపింది. ఈ మేర‌కు “స్వ‌యం స‌మృద్ధ భార‌త నిపుణ ఉద్యోగ‌-యాజ‌మాన్య గుర్తింపు” (ASEEM) పోర్ట‌ల్‌ను ప్రారంభించింది. నిపుణులైన వ్య‌క్తులు సుస్థిర జీవ‌నోపాధి అవ‌కాశాలు పొందేవిధంగా తోడ్ప‌డ‌టం దీని ల‌క్ష్యం. ఇలా నిపుణ కార్మిక‌శ‌క్తి నియామ‌కానికి తోడ్ప‌టంతోపాటు   పరిశ్రమ సంబంధిత నైపుణ్య సాధ‌న‌కు, విస్త‌రించే ఉద్యోగావకాశాలను... ప్ర‌త్యేకించి కోవిడ్ అనంత‌ర కాలంలో  అందిపుచ్చుకునేందుకు కూడా ఈ కృత్రిమ మేధ‌స్సు ఆధారిత డిజిట‌ల్‌ వేదిక ఉద్దేశించ‌బ‌డింది. ఈ పోర్టల్ ప్రారంభం సంద‌ర్భంగా నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపన శాఖ మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే మాట్లాడుతూ-  నిపుణ కార్మిక‌శ‌క్తిని గుర్తించి, వారిని జీవనోపాధి అవకాశాలతో అనుసంధానించడం ద్వారా కోలుకునే దిశ‌గా భారత ప‌యనాన్ని వేగవంతం చేయడమే ఈ కార్య‌క్ర‌మ ప్ర‌ధాన లక్ష్యమన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1637755

కొరియా రక్షణశాఖ మంత్రితో భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ టెలిఫోన్‌ సంభాషణ

భారత రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇవాళ టెలిఫోన్‌ద్వారా కొరియా జాతీయ రక్షణశాఖ మంత్రి ఇవాళ గౌరవనీయ ‘జియాంగ్‌ క్యోయింగ్‌-డో’తో టెలిఫోన్‌ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా తమతమ దేశాల్లో కోవిడ్‌-19 పరిణామాలపై వారిద్దరూ చర్చించారు. ఈ ప్రపంచ మహమ్మారిపై పోరు దిశగా అంతర్జాతీయ కృషిలో భారత్‌ పోషిస్తున్న పాత్రను శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆయనకు వివరించారు. తదనుగుణంగా భారత్‌-కొరియాల మధ్య పరస్పర సహకారంపైనా వారు చర్చించారు. అలాగే అనేక ద్వైపాక్షిక రక్షణ సహకార అంశాలపైనా వారు చర్చలు జరిపారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1637760

2020 మే నెలలో పారిశ్రామిక ఉత్పత్తి-వినియోగ ఆధారిత సూచీ స‌త్వ‌ర‌ అంచనాలు (ప్రాతిప‌దిక 2011-12=100)

దేశంలోని వివిధ ఫ్యాక్ట‌రీలు/త‌యారీ సంస్థ‌ల నుంచి అందుకున్న గ‌ణాంకాల‌ను స‌మాచార వ‌న‌రులుగా ప‌నిచేసే సంస్థ‌ల‌ నుంచి పొందిన త‌ర్వాత వాటి ఆధారంగా పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (IIP) స‌త్వ‌ర అంచనాలు ప్రతి నెల‌లోనూ 12వ తేదీన (ఆ రోజు సెల‌వైతే ముందు రోజున‌) విడుదల చేయ‌బ‌డ‌తాయి. అయితే, కోవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తి నివార‌ణ‌కు ప్ర‌భుత్వం చేప‌ట్టిన చ‌ర్య‌ల‌తోపాటు దేశ‌వ్యాప్త దిగ్బంధం దృష్ట్యా పారిశ్రామిక సంస్థలలో అధిక‌శాతం 2020 మార్చి చివరినుంచి మూత‌ప‌డ్డాయి. దీంతో ఈసారి ఆరు వారాలు ఆలస్యంగా అంచ‌నాలు విడుద‌ల‌య్యాయి. దీని ప్ర‌కారం 2020 మే నెలలో సూచీ 88.4గా న‌మోద‌వ‌గా, 2020 ఏప్రిల్‌లో 53.6తో పోలిస్తే ఆర్థిక వ్యవస్థలోని పారిశ్రామిక కార్యకలాపాలలో క్ర‌మ‌బద్ధంగా పెరుగుద‌ల‌ను ఇది సూచిస్తోంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1637852

రాష్ట్రాలు/‌కేంద్ర‌పాలిత ప్రాంతాలు 2020 ఆగస్టు 31లోగా మిగిలిన ఉచిత ఆహార ధాన్యాలు, స్వ‌యం స‌మృద్ధ భార‌తం కింద కేటాయించిన ప‌ప్పుదినుసుల పంపిణీని పూర్తిచేయ‌వ‌చ్చు

కోవిడ్-19 మహమ్మారి నేప‌థ్యంలో 2020 ఆగస్టు 31వరకు స్వ‌యం స‌మృద్ధ భార‌తం కింద లబ్ధిదారులకు కేటాయించిన ఉచిత ఆహార ధాన్యాలలో మిగిలిన స‌రుకుల‌ పంపిణీ కోసం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఆగస్టు 31 వరకూ అదనంగా వ్య‌వ‌ధి ఇవ్వాల‌ని కేంద్ర మంత్రిమండ‌లి నిర్ణయించినట్లు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార-ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ విలేక‌రుల‌కు వివ‌రించారు. కాగా, 2020 జూలై నుంచి నవంబరుదాకా 5 నెలలపాటు పీఎంజీకేఏవై-2 కోసం 201.1 లక్ష‌ల ట‌న్నుల ఆహార ధాన్యాలను రాష్ట్రాలు/‌కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు కేటాయించామని ఆయన పేర్కొన్నారు. ఇందులో 91.14 ల‌క్ష‌ల ట‌న్నుల‌ గోధుమలు, 109.94 ల‌క్ష‌ల ట‌న్నుల బియ్యం ఉన్నాయని తెలిపారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1637796

ఈవీ చార్జింగ్‌ యూనిట్లు సంబంధిత మౌలిక వసతుల ఏర్పాటు దిశగా ‘నోయిడా’ ప్రాధికార సంస్థతో ఈఈఎస్‌ఎల్‌ ఒప్పందం

విద్యుత్‌ వాహనాలను ప్రోత్సహించడంతోపాటు వివిధ ప్రాంతాల్లో ఆ వాహనాలకు చార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటు, సంబంధిత మౌలిక వసతుల కల్పనకోసం కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థల సంయుక్త సంస్థ ‘ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌’ (EESL) ఇవాళ న్యూ ఓఖ్లా ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (NOIDA)తో ఒప్పందం కుదుర్చుకుంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1637732

కోవిడ్‌ అనంతర భారత ఆర్థిక వ్యవస్థలో వెదురు రంగం ఓ ముఖ్యమైన భాగం కానుంది: డాక్టర్‌ జితేంద్ర సింగ్‌

కోవిడ్ అనంతర భారత ఆర్థిక వ్యవస్థలో వెదురు రంగం ఒక ముఖ్యమైన భాగం కానుందని కేంద్ర సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ‘కేన్-బ్యాంబూ టెక్నాలజీ సెంటర్‌’ (CBTC) పరిధిలోని వివిధ సాముదాయిక బృందాలు, వెదురు వాణిజ్యం సంబంధిత ప్రతినిధులతో నిర్వహించిన వెబినార్‌లో ఆయన ప్రసంగించారు. ఈశాన్య ప్రాంతంలో స్వయం సమృద్ధ భారతం కార్యక్రమాన్ని వెదురు రంగం ముందుకు నడిపిస్తుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన “స్థానికంపై స్వగళం” పిలుపు నేపథ్యంలో ఈశాన్యభారత కోవిడ్‌ అనంతర ఆర్థిక వ్యవస్థకు వెదురు కొత్త ఊపునివ్వగలదని చెప్పారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1637814

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 • చండీగఢ్‌: కోవిడ్‌-19 సవాళ్ల నడుమ జూలై 15వ తేదీన చండీగఢ్‌ నగరంలో ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం-2020 నిర్వహించనున్నారు. మహమ్మారి కారణంగా దిగ్బంధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని కార్యకలాపాలూ స్తంభించాయి. ఆర్థిక మందగమనంవల్ల ఉపాధి అవకాశాలు సన్నగిల్లిన నేపథ్యంలో నైపుణ్యాభివృద్ధి అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో చండీగఢ్‌ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం కింద ఇండియా స్కిల్స్ సహకారంతో ఈ యువత దినోత్సవాన్ని డిజిటల్‌/ఆన్‌లైన విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 2020 జూలై 7నుంచి చేపట్టిన పలు వెబినార్లు 2020 జూలై 15 వరకు... అంటే- ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవందాకా కొనసాగుతాయి.
 • పంజాబ్: కోవిడ్‌-19వల్ల తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన రాపిడ్ యాంటిజెన్ పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైన నేపథ్యంలో కోవిడ్ ప్లాస్మా థెరపీ చికిత్సను సౌలభ్యం దిశగా ప్లాస్మా బ్యాంక్ ఏర్పాటుకు పంజాబ్ ముఖ్యమంత్రి అనుమతించారు. ఈ ప్రక్రియ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులలో ఐసీఎంఆర్ ప్రయోగాత్మక ప్రాజెక్టు కింద కొనసాగుతోంది. ఆరోగ్యం విషమస్థితికి చేరిన రోగులకు ప్లాస్మా బ్యాంక్ సంసిద్ధ ఔషధ వనరుగా ఉపయోగపడుతుంది.
 • హర్యానా: రాష్ట్రంలో ప్రజలు నవ్య కరోనా వైరస్ బారినపడకుండా చూడటంలో భాగంగా మాస్కులు, హస్త పరిశుభ్రకాల పంపిణీకి హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ చేపట్టిన కార్యక్రమాన్ని రాష్ట్ర మహిళా-శిశు అభివృద్ధి శాఖ మంత్రి ప్రారంభించారు. కోవిడ్‌-19 నిరోధం దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు జారీచేసే మార్గదర్శకాలను ప్రజలంతా కచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.
 • మహారాష్ట్ర: రాష్ట్రంలో గత 24 గంటల్లో 6,875 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం  కేసుల సంఖ్య 2.30 లక్షలకు చేరింది. ఇప్పటివరకూ నయమైనవారి సంఖ్య 1.27 లక్షలుకాగా, మరో 93,652 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కాగా, ముంబైలో కరోనావైరస్ సోకిన రోగుల సంఖ్య 88,795కు పెరిగింది. మరోవైపు మహారాష్ట్రలో రాపిడ్ యాంటీబాడీ టెస్టులకు ధరల పరిమితి  నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
 • గుజరాత్: రాష్ట్రంలో గురువారం ఒకేరోజు అత్యధికంగా 861 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 39,280కి చేరింది. ఇందులో సూరత్ నగరం/జిల్లా పరిధిలో గరిష్టంగా 307 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే అహ్మదాబాద్‌లో 153, వడోదరలో 43 వంతున నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 9,528గా ఉంది.
 • రాజస్థాన్: రాష్ట్రంలో ఈ ఉదయం వరకూ 115 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 22,678కి పెరిగింది. ఈ కేసుల్లో గరిష్ఠంగా పాలి జిల్లా (35)కు చెందినవి కాగా, జైపూర్ (22), అజ్మీర్ (10) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
 • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో గురువారం 305 కొత్త కేసులు నమోదవగా మధ్యప్రదేశ్‌లో మొత్తం కేసులు 16341కి చేరాయి. ప్రస్తుతం 3,475 మంది చికిత్స పొందుతుండగా ఇప్పటిదాకా 12,232 మంది కోలుకున్నారు.
 • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో 133 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,666కు చేరింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో యాక్టివ్‌ రోగుల సంఖ్య 748గా ఉంది.
 • గోవా: గోవాలో 112 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 2,151కి పెరిగింది. వీటిలో 869 యాక్టివ్‌ కేసులున్నాయి.
 • అసోం: రాష్ట్రంలోని జీఎంసీహెచ్ ఐసీయూలో చికిత్స పొందుతున్న మరో నలుగురు కోవిడ్‌-19 రోగులు మరణించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి ట్వీట్‌ చేశారు.
 • మణిపూర్: మణిపూర్‌లోని స్వయంప్రతిపత్తిగల చందేల్‌ జిల్లా పాలనమండలి మూడడుగుల ఎత్తయిన హస్తపరిశుభ్రకాల డిస్పెన్సర్లను, పరిశుభ్రకాలను, మాస్కులను, కోవిడ్-19పై అవగాహన పోస్టర్లను జిల్లా యంత్రాంగానికి విరాళంగా ఇచ్చింది. కాగా, JNIMSలోని ఏకైక మహిళా డాక్టర్‌ కోవిడ్-19 బారినపడ్డారు. దీంతో మణిపూర్ జిరిబామ్ జిల్లాలో వ్యాధి పీడితుల సంఖ్య 51కి చేరింది.
 • మేఘాలయ: మేఘాలయలోని అంప్లింగ్‌లో బీఎస్‌ఎఫ్‌కు చెందిన మరో 26 మంది జవాన్లకు కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 121కి చేరగా, ఇప్పటిదాకా 45 మంది కోలుకున్నారు.
 • మిజోరం: మిజోరంలో 23 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 226కు చేరగా, ప్రస్తుతం 83 మంది చికిత్స పొందుతున్నారు.
 • నాగాలాండ్: రాష్ట్రంలో 36 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 732కు చేరింది. వీటిలో 428 యాక్టివ్‌ కేసులు కాగా, ఇప్పటిదాకా 304మందికి వ్యాధినయమైంది.
 • కేరళ: రాష్ట్ర రాజధాని తిరువనంతపురం పరిధిలోని పూంతురా ప్రాంతంలో పరిస్థితి సంక్లిష్టంగా ఉన్నందున ఇతర రాష్ట్రాలవారితో సంభాషణ సందర్భంగా తగు జాగ్రత్త వహించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కె.కె.శైలజ ప్రజలకు సూచించారు. తమిళనాడులోని తీవ్ర కోవిడ్-19 ప్రభావిత ప్రాంతాల నుంచి కేరళకు చాలామంది వాణిజ్యం కోసం వస్తుండటంతో వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. మరోవైపు కొళ్లం, అలెప్పీలలో చేపలు పట్టడం, విక్రయించడాన్ని నిషేధించారు. రాష్ట్రంలో నిన్న నమోదైన కొత్త కేసులలో 133 స్థానికంగా సంక్రమించినవి కాగా, మరో 7 కేసులకు మూలాలు తెలియరాలేదు. ఇక వివిధ జిల్లాల్లో 2,795మంది చికిత్స పొందుతుండగా మరో 1,85,960మంది నిర్బంధ పరిశీలనలో ఉన్నారు.
 • తమిళనాడు: పుదుచ్చేరిలోని కారైకల్‌లో హస్త సాముద్రికం చూసే వ్యక్తినుంచి 13మందికి కోవిడ్‌ సోకింది. కాగా, పుదుచ్చేరి శాసనసభ ప్రాంగణంలో అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు ధర్నా చేస్తున్నారు, రేషన్ కార్డున్న ప్రతి కుటుంబానికీ కోవిడ్-19 నుంచి ఉపశమనం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తు్న్నారు. ఇక తమిళనాడు రాష్ట్ర సహకారశాఖ మంత్రి సెల్లూర్ కె.రాజుకు వ్యాధి నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటిదాకా రాష్ట్రంలోని 11 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు కోవిడ్‌ బారినపడ్డారు. వివిధ జిల్లాల్లో కేసులు పెరగడంతో కేంద్ర బృందం రాష్ట్రాన్ని సందర్శించింది. మరోవైపు రెండు రోజులుగా స్వల్పంగా తగ్గిన కేసుల సంఖ్య గురువారం 4,231 తాజా కేసులతో ఒక్కసారిగా మళ్లీ పెరిగింది. వీటిలో 1,216 చెన్నైలో నమోదయ్యాయి. నిన్నటిదాకా మొత్తం కేసులు: 1,26,581,  యాక్టివ్ కేసులు: 46,652, మరణాలు: 1765, చెన్నైలో యాక్టివ్ కేసులు: 20,271గా ఉన్నాయి.
 • కర్ణాటక: ముఖ్యమంత్రి సిబ్బందిలోని ముగ్గురికి కోవిడ్‌-19 నిర్ధారణ కావడంతో ముఖ్యమంత్రి కూడా నిర్బంధవైద్య పరిశీలనలోకి వెళ్లారు. ఆశా కార్మికులు తమ వేతనం, పని పరిస్థితులు సంబంధిత సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగారు. బెంగళూరులో ఉండదలచిన వలసకార్మికుల స్థితిగతులపై నివేదిక సమర్పించాలని కర్ణాటక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, 2019-20 విద్యా సంవత్సరానికిగాను ఇంజనీరింగ్, డిప్లొమా కోర్సులతోపాటు డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు అభ్యసించే మధ్య సెమిస్టర్ల విద్యార్థులందరినీ పరీక్షలు లేకుండా పై తరగతికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక కర్ణాటకలో నిన్న 2,228 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే 957 కోలుకోగా, 17 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 31,105, యాక్టివ్‌ కేసులు: 17,782 మరణాలు: 486గా ఉన్నాయి.
 • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో ప్రయాణికులను నగదురహిత లావాదేవీల దిశగా ప్రోత్సహించడం కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ జూలై 20ప్రథంపేరిట మొబైల్ అనువర్తనాన్ని ప్రారంభిస్తుంది. ఇక రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలనూ జూలై 31దాకా మూసివేయాలని పాఠశాల విద్యా కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో ఇంటర్‌ రెండో ఏడాది కంపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులను ఉత్తీర్ణులుగా ప్రకటించాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. కాగా, తిరుమలను నియంత్రణ జోన్‌ పరిధినుంచి తప్పిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 21,020 నమూనాలను పరీక్షించగా, 1608 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే 981 మంది వ్యాధి నుంచి కోలుకోగా, 15 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 25,422, యాక్టివ్ కేసులు: 11,936 మరణాలు: 292 డిశ్చార్జెస్: 13,194గా ఉన్నాయి.
 • తెలంగాణ: కోవిడ్-19 నుంచి కోలుకున్న వ్యక్తులు ముందుకొచ్చి చికిత్స పొందుతున్నవారి కోసం ప్లాస్మా దానం చేయాలని ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అభ్యర్థించారు. కాగా, కొత్త కేసుల నమోదులో తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం దేశంలో అగ్రస్థానంలో ఉంది. కొద్ది వారాల కిందట మహారాష్ట్ర,  ఢిల్లీ తర్వాతి స్థానంలో ఉన్న తెలంగాణ (జూలై 8 నాటికి) నేడు 21.91 శాతంతో అగ్రస్థానంలోకి వచ్చింది. ఇది జాతీయ కేసుల సగటు 7.14 శాతంతో పోలిస్తే మూడు రెట్లు అధికం కావడం గమనార్హం. రాష్ట్రంలో నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసులు: 30,946 యాక్టివ్ కేసులు: 12,423 మరణాలు: 331 డిశ్చార్జెస్: 18,192గా ఉన్నాయి.

FACTCHECK

******(Release ID: 1637899) Visitor Counter : 17


Read this release in: English , Urdu , Hindi , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam