PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 17 JUN 2020 6:45PM by PIB Hyderabad

(కోడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • గడచిన 24 గంటల్లో కోవిడ్‌-19 నయమైనవారి సంఖ్య 6,922; మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,86,934కి చేరగా- కోలుకునేవారి శాతం 52.80కి పెరిగింది.
  • దేశంలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల కోసం ప్రయోగశాలలు 924కు పెంపు.
  • కోవిడ్‌-19పై ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి రెండో విడత చర్చ; దిగ్బంధంపై  వదంతులు అరికట్టడంతోపాటు దిగ్బంధ విముక్తి రెండోదశపై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచన.
  • దేశీయాంగ శాఖ మంత్రి ఆదేశాలకు అనుగుణంగా కోవిడ్‌-19 మృతులకు అంత్యక్రియలను వేగిరం చేసిన ఢిల్లీలోని ఆస్పత్రులు.
  • దేశంలోని 5 రాష్ట్రాల్లో 960 కోవిడ్‌ సంరక్షణ బోగీలు ఏర్పాటు చేసిన భారత రైల్వేశాఖ.
  • ప్రభుత్వ సంస్థలద్వారా ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో గోధుమ కొనుగోళ్లు.

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం; కోలుకునే వారి శాతం మెరుగుపడి 52.8కి చేరిక

దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కోవిడ్‌-19 నుంచి 6,922 మంది కోలుకోగా, వ్యాధి నయమైనవారి సంఖ్య 1,86,934కు చేరి, కోలుకునేవారి శాతం 52.80కి పెరిగింది. ప్రస్తుతం 1,55,227 మంది చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా నిర్ధారణ పరీక్షల కోసం ప్రభుత్వ, ప్రైవేటు ప్రయోగశాలల సంఖ్య పెరిగింది. ఈ మేరకు ఇప్పుడు ప్రభుత్వ రంగంలో 674, ప్రైవేటు రంగంలో 250 (మొత్తం 924) ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి. తదనుగుణంగా గడచిన 24 గంటల్లో 1,63,187 నమూనాలను పరీక్షించగా- ఇప్పటిదాకా పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 60,84,256కు చేరింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632066

దిగ్బంధ విముక్తి తొలిదశ అనంతర పరిస్థితిపై సీఎంలతో ప్రధానమంత్రి రెండోవిడత చర్చలు

దేశవ్యాప్తంగా దిగ్బంధ విముక్తి తొలిదశ అనంతర పరిస్థితిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ముఖ్యమంత్రులతో సమావేశమై కోవిడ్‌-19 మహమ్మారి నియంత్రణ ప్రణాళికపై వారితో చర్చించారు.

   దేశంలోని కొన్ని పెద్ద రాష్ట్రాలు, న‌గ‌రాల్లో వైర‌స్ వ్యాప్తి ఎక్కువ‌గా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. అధిక జ‌న‌స‌మ్మ‌ర్దం, భౌతిక‌దూరం పాటించే వీలు లేక‌పోవ‌డం, పెద్ద సంఖ్య‌లో జ‌న సంచారం వంటివి ప‌రిస్థితిని మ‌రింత స‌వాలుగా మార్చివేశాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయిన‌ప్ప‌టికీ పౌరుల స‌హ‌నం, యంత్రాంగం స‌ర్వ‌స‌న్న‌ద్ధ‌త‌,  క‌రోనా యోధుల అంకిత‌భావం వ‌ల్ల మ‌హ‌మ్మారి వ్యాప్తి నియంత్ర‌ణ‌లో ఉంద‌ని చెప్పారు. సకాలంలో రోగుల జాడ పసిగట్టడం, చికిత్స, నమోదు ద్వారా కోలుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని చెప్పారు. దిగ్బంధం సమయంలో ప్రజలు చూపిన క్రమశిక్షణతోనే వైరస్‌ అనూహ్యంగా విజృంభించకుండా అరికట్టడం సాధ్యమైందన్నారు. ప్రస్తుతం దిగ్బంధ విముక్తి ప్రారంభమైన నేపథ్యంలో దిగ్బంధానికి సంబంధించిన వదంతులను నిరోధించడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో దిగ్బంధ విముక్తి రెండో దశలో ప్రజల కష్టనష్టాలను కనీస స్థాయికి తగ్గించడం గురించి ఆలోచించాలని సూచించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632218

కోవిడ్‌-19పై ముఖ్యమంత్రులతో చర్చలో భాగంగా ప్రధానమంత్రి ప్రారంభ వ్యాఖ్యలు

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1632069

దేశీయాంగ శాఖ మంత్రి ఆదేశాలకు అనుగుణంగా కోవిడ్‌-19 మృతులకు అంత్యక్రియలను వేగిరం చేసిన ఢిల్లీలోని ఆస్పత్రులు

దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా ఆదేశాలకు అనుగుణంగా ఢిల్లీలోని అన్ని (కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు) ఆస్పత్రులలోనూ  కోవిడ్‌-19 మృతులకు అంత్యక్రియలను వేగిరం చేశారు. ఈ మేరకు దేశీయాంగ శాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన జూన్‌ 14నాటి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు నిన్నటినుంచి కోవిడ్‌-19 రోగుల మృతదేహాలకు అంత్యక్రియలను ఆస్పత్రుల సిబ్బంది వేగంగా పూర్తిచేస్తున్నారు. ఇందుకోసం ముందుగానే సంబంధిత రోగుల బంధువుల, కుటుంబసభ్యుల సమ్మతి తీసుకుంటున్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631999

దేశంలోని 5 రాష్ట్రాల్లో 960 భార‌తీయ‌ రైల్వేశాఖ‌ కోవిడ్ సంర‌క్ష‌ణ బోగీలు

కోవిడ్‌-19పై భార‌త పోరాటంలో భాగంగా జాతి ప్ర‌యోజ‌నార్థం భార‌త రైల్వేశాఖ త‌న‌వంతు తోడ్పాటునిస్తోంది. ఈ మేర‌కు పెద్ద సంఖ్య‌లో రైలు బోగీల‌ను కోవిడ్ సంరక్ష‌ణ కేంద్రాలుగా మార్చి, ఆయా రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు చేప‌ట్టిన ఆరోగ్య సంర‌క్ష‌ణ సేవ‌లు స‌వ్యంగా సాగేందుకు సాయ‌ప‌డుతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ మొత్తం 5,231 బోగీల‌ను మార్పుచేయగా, వీటిలో ప్రస్తుతం 960 బోగీలు 5 రాష్ట్రాల్లో ఉన్నాయి. స్వ‌ల్ప‌, ఓ మోస్త‌రు వ్యాధి ల‌క్ష‌ణాలున్న‌వారికి చికిత్స నిమిత్తం జోన‌ల్ రైల్వేలు ఈ తాత్కాలిక కోవిడ్ సంర‌క్ష‌ణ కేంద్రాలను రూపొందించాయి. ప్రస్తుతం ఢిల్లీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లకు వీటిని రైల్వేశాఖ అందజేసింది. ఈ 960 బోగీలకుగాను ఢిల్లీలో 503, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో  372, తెలంగాణ‌లో 60, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 20, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 5 వంతున ఉన్నాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632216

ప్రభుత్వ సంస్థలద్వారా ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో గోధుమ కొనుగోళ్లు

ఈ ఏడాది దేశంలో ప్రభుత్వ సంస్థల ద్వారా గోధుమ కొనుగోళ్లు మునుపెన్నడూ లేనంత అత్యధిక స్థాయిలో సాగి 16.06.2020నాటికి కొత్త రికార్డు సృష్టించాయి. ఈ మేరకు కేంద్ర నిల్వల కింద 382 లక్షల టన్నులు సేకరించడంతో 2012-13నాటి 381.48 లక్షల టన్నుల రికార్డు చెరిగిపోయింది. అందునా ప్రస్తుత కోవిడ్‌-19 మహమ్మారి ఫలితంగా దేశవ్యాప్త దిగ్బంధం అమలవుతున్న పరీక్ష సమయంలో ఈ కొత్త మైలురాయిని అధిగమించడం విశేషం. కాగా, ఈ సంవత్సరం మధ్యప్రదేశ్‌లో కేంద్ర నిల్వ కోసం అత్యధికంగా 129 లక్షల టన్నుల గోధుమ సేకరించగా, 127 లక్షల టన్నులతో పంజాబ్‌ రెండోస్థానంలో నిలిచింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632182

భారత-కెనడా ప్రధానమంత్రుల మధ్య టెలిఫోన్‌ సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని గౌరవనీయ జస్టిన్‌ ట్రూడోతో టెలిఫోన్‌ద్వారా సంభాషించారు. తమతమ దేశాల్లో ప్రస్తుత కోవిడ్‌-19 పరిణామ పరిస్థితులపై ఈ సందర్భంగా దేశాధినేతలు మాట్లాడుకున్నారు. అలాగే కరోనా ప్రభావిత ఆర్థిక, ఆరోగ్య సంక్షోభాలను ఎదుర్కొనడంలో అంతర్జాతీయ సహకారానికిగల అవకాశాలపై వారిద్దరూ చర్చించారు. కోవిడ్‌ అనంతర కాలంలో భారత-కెనడా భాగస్వామ్యం ప్రపంచ గమనంలో మానవతా విలువలను ముందుకు తీసుకెళ్లే ఒక బలమైన శ్రేయోశక్తి కాగలదని వారిద్దరూ అంగీకరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థసహా బహుపాక్షిక వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వారిద్దరూ అంగీకారానికి వచ్చారు. అలాగే వివిధ అంతర్జాతీయ వేదికలపై ఆరోగ్య, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై సమష్టిగా, సన్నిహితంగా కృషిచేయాలని వారు నిర్ణయించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632219

నేషనల్‌ ఎలిజిబిలిటీ-కమ్‌-ఎంట్రన్స్‌ టెస్ట్‌ యూజీ, జూలై-2020 వాయిదా గురించి బహిరంగ ప్రకటన నకిలీదని, వదంతి మాత్రమేనని ఎన్‌టీఏ స్పష్టీకరణ

‘నేషనల్‌ ఎలిజిబిలిటీ-కమ్‌-ఎంట్రన్స్‌ టెస్ట్‌ యూజీ, జూలై-2020 వాయిదా’ పేరిట 15.06.2020న ఒక నకిలీ బహిరంగ ప్రకటన వెలువడటం జాతీయ పరీక్షల ప్రాధికార సంస్థ (NTA) దృష్టికి వచ్చింది. సామాజిక మాధ్యమాలుసహా వివిధ వేదికలలో ఇది ప్రచారం కావడాన్ని గమనించింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను, ప్రజలను తప్పుదోవ పట్టించే ఈ వదంతి మూలాలపై విచారణ చేపట్టింది. దీన్ని ప్రచారంలోకి తెచ్చిన సంఘ వ్యతిరేక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాముగానీ, సంబంధిత అధికార యంత్రంగంగానీ అటువంటి నిర్ణయమేదీ తీసుకోలేదని, ఇది వదంతి మాత్రమేనని అభ్యర్థులు, తల్లిదండ్రులు, ప్రజలకు స్పష్టం చేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632091

జనౌషధి కేంద్రాల్లో రూ.1కి ఒకటివంతున శానిటరీ నాప్కిన్స్‌ లభ్యం

దేశవ్యాప్తంగాగల 6,300 ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన (PMBJP) కేంద్రాల్లో ఒక్కొక్కటి రూ.1 కనీస ధరతో ‘జనౌషధి సువిధ శానిటరీ నాప్కిన్‌’లను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజారోగ్యంపై సామాజిక అవగాహన పెంపు ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి శానిటరీ నాప్కిన్‌ ధర బహిరంగ మార్కెట్‌లో రూ.3 నుంచి 8వరకూ ఉంటుంది. కాగా, నేటి కోవిడ్‌-19 పరిస్థితుల నడుమ దేశంలోని జనౌషధి కేంద్రాలు ప్రజలకు అత్యవసర మందులను, ఇతర వస్తువుల లభ్యతకు భరోసా ఇస్తున్నాయి. ఇందులో భాగంగా దేశంలోని అన్ని కేంద్రాల్లోనూ జనౌషధి సువిధ శానిటరీ నాప్కిన్లు లభిస్తాయి. ఈ నేపథ్యంలో 2020 మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో దేశవ్యాప్తంగా పీఎంబీజేపీ కింద 1.42 కోట్ల ప్యాడ్లు అమ్ముడయ్యాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632168

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • పంజాబ్: రాష్ట్రంలో సూక్ష్మస్థాయి కోవిడ్‌ నియంత్రణ, ఇంటింటి నిఘా వ్యూహంద్వారా కోవిడ్ మహమ్మారిని అరికట్టడానికి చేసిన కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రశంసించారు. అంతేకాకుండా మహమ్మారి నియంత్రణలో పంజాబ్‌ గణనీయ విజయం సాధించిన ఈ విధానాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించాలని సూచించారు. కాగా, మహమ్మారి వ్యాప్తిని మరింత సమర్థంగా అరికట్టడంలో రాష్ట్ర సన్నద్ధత గురించి  ముఖ్యమంత్రి ఆయనకు వివరించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆరోగ్య సదుపాయాలలోని 2,3 స్థాయుల ఆస్పత్రులలో 5,000 ఏకాంత చికిత్స పడకలను సిద్ధంగా ఉంచామన్నారు. అలాగే స్వల్ప లక్షణాలున్నవారి కోసం 1వ స్థాయి కోవిడ్ సంరక్షణ కేంద్రాల్లో 10నుంచి 15,000 పడకలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అవసరమైతే ఈ 1వ స్థాయి పడకల సంఖ్యను 30,000కు పెంచవచ్చునని వివరించారు. ఇక తృతీయ స్థాయి సంరక్షణ కోసం, రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రుల భాగస్వామ్యాన్ని కూడా స్వీకరిస్తున్నదని తెలిపారు.
  • హర్యానా: రాష్ట్రంలోని కోవిడ్‌-19 రోగులను ‘ఆయుష్మాన్ భారత్-ప్రధానమంత్రి జనారోగ్య యోజన (AB-PMJAY) కిందకు తెచ్చామని హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. దీంతోపాటు వారికి చికిత్స కోసం రాష్ట్ర ఆరోగ్య ప్రాధికార సంస్థ వైద్య నిర్వహణ ప్యాకేజీని 20 శాతం పెంచిందని, తద్వారా సదరు రోగులు నాణ్యమైన చికిత్స సదుపాయం పొందవచ్చునని చెప్పారు.
  • హిమాచల్ ప్రదేశ్: కరోనా వైరస్‌ వల్ల ప్రపంచం మొత్తంపై దుష్ప్రభావం పడిందని, భారతదేశం దీనికి మినహాయింపు కాదని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కారణంగా మన వ్యూహాలు-ప్రగతి విధానాలు, కార్యక్రమాలపై పునరాలోచనతోపాటు తిరిగి పటిష్ఠంగా రూపొందించుకోవాల్సి వచ్చిందన్నారు. దిగ్బంధం ప్రారంభ దశలో రాష్ట్రంలోని లక్షలాది ప్రజలు... ముఖ్యంగా విద్యార్థులు దేశంలోని అనేక ప్రాంతాల్లో చిక్కుకుపోయారని గుర్తుచేశారు. దీంతో వారిలో అధికశాతం ఒత్తడికి లోనయ్యారని, వారందర్నీ బస్సులు, 13 ప్రత్యేక రైళ్లద్వారా తిరిగి రాష్ట్రానికి తరలించామని, అది ప్రభుత్వ నైతిక బాధ్యతని ఆయన అన్నారు. ఇక దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారందర్నీ సంస్థాగత లేదా గృహనిర్బంధ పర్యవేక్షణలో ఉంచామని చెప్పారు. రాష్ట్రంలో చురుకైన కేసుల అన్వేషణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టడంతో ఐఎల్ఐ లక్షణాలతో, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించడ సులభమైందని పేర్కొన్నారు.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో నిన్న 2,701 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 1,13,445కు చేరింది. వీటిలో 50,044 యాక్టివ్‌ కేసులు కాగా, 1,802మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 57,851కి చేరింది. ఇక నిన్న 81మంది మరణించారు. హాట్‌స్పాట్ గ్రేటర్ ముంబై ప్రాంతంలో 941 కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 60,142కు చేరింది.
  • గుజరాత్: రాష్ట్రంలోని 19 జిల్లాల నుంచి గత 24 గంటల్లో 524 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 24,628కి చేరింది. కాగా, వివిధ ఆస్పత్రుల నుంచి 418 మందిని ఇళ్లకు పంపారు. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 17,090కి పెరిగింది. ఇక తాజాగా 28 మంది మృతితో మరణాల సంఖ్య 1,534కు చేరింది. ఇక అత్యధిక ప్రభావిత అహ్మదాబాద్ జిల్లాలో 332 కొత్త కేసులు, 21 మరణాలు నమోదవడం గమనార్హం.
  • రాజస్థాన్: రాష్ట్రంలో ఇవాళ 122 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 13,338కి చేరగా, ఇప్పటివరకూ 10125 మంది కోలుకున్నారు. కొత్త కేసుల్లో అధికశాతం భరత్‌పూర్ జిల్లాలో నమోదవగా- పాలి, చురు జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రాజస్థాన్ ప్రభుత్వం అంతర్రాష్ట్ర వాహన రాకపోకలపై అన్ని ఆంక్షలనూ తొలగించిన నేపథ్యంలో ఇకపై రాష్ట్రంలో ప్రవేశించే/ఇతర రాష్ట్రాలకు వెళ్లే వ్యక్తికీ పాస్ లేదా నిరభ్యంతర పత్రం అవసరం లేదు. ఏదేమైనా రాష్ట్ర్రానికి వచ్చే/వెళ్లే వ్యక్తులందరికీ పరీక్షలు మాత్రం యధావిధిగా కొనసాగుతాయి.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 134 కొత్త కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 11,069కి పెరిగింది. మరోవైపు తాజగా 11మంది మృతితో మొత్తం మరణాల సంఖ్య 476కు చేరింది. ఇప్పటిదాకా 8,152మంది కోలుకోగా, 31 జిల్లాల్లో నిన్న కొత్త కేసులేవీ నమోదుకాలేదు. కొత్త కేసులలో 48 భోపాల్‌లోనూ, 21 ఇండోర్‌లోనూ నమోదయ్యాయి. కాగా, దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న హాట్‌స్పాట్‌గా ఇండోర్‌ నగరం రికార్డులకెక్కింది.
  • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో 31 కొత్త కేసులు నమోదవగా వివిధ జిల్లాలనుంచి 102 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. బలోడాబజార్ జిల్లా నుంచి నిన్న అత్యధికంగా కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1784కు చేరగా, ప్రస్తుతం 842 మంది చికిత్స పొందుతున్నారు.
  • గోవా: గోవాలో నిన్న 37 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 629కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 544 కాగా, కేసుల పెరుగుదల నేపథ్యంలో రాష్ట్రంలోని బైనా ప్రాంతాన్ని నియంత్రణ జోన్‌గా ప్రకటించే అవకాశం ఉంది.
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలోని ఇటానగర్‌లో కోవిడ్‌-19 విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి ఆహార, వసతి ఖర్చులను రద్దుచేయాలని సాంగో రిసార్ట్ సంస్థ నిర్ణయించింది. కాగా, కోవిడ్‌ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కీలకపాత్ర పోషించాల్సిందిగా రాష్ట్ర బాలల రక్షణ సొసైటీతోపాటు జిల్లాల్లోని శిశు సంక్షేమ కమిటీలు చురుకైన పాత్ర పోషించాలని బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్ సభ్యులు రోజీ తాబా సూచించారు.
  • అసోం: ‘అసోం టార్గెటెడ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్’ (ATSP)ను ఇవాళ గువహటిలోని జాతీయ రహదారి పార్కింగ్‌ ప్రదేశంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంకింద నగరంలో 50,000 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.
  • మణిపూర్: కోవిడ్‌ సంరక్షణ-నిర్వహణ దిశగా రాష్ట్రంలోని 522 మంది వైద్యాధికారులు, 907 మంది నర్సులు, 2500మంది ఇతర సిబ్బందికి రాష్ట్ర కోవిడ్‌ శిక్షణ బృందం శిక్షణ ఇచ్చింది. కాగా, మణిపూర్‌లో ఇప్పటివరకూ 159 మంది కోలుకోవడంతో వ్యాధి నయమైనవారి శాతం 32కు పెరిగింది.
  • మిజోరం: ఐజ్వాల్‌లోని కోలాసిబ్ నుంచి వచ్చిన స్వచ్ఛంద కార్యకర్తల బృందం 64 వ్యక్తిగత రక్షణ సామగ్రి కిట్లను, 250 ఫేస్ మాస్కులను కోలాసిబ్ ప్రధాన వైద్యాధికారికి విరాళంగా అందజేసింది. కాగా, కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ఐజ్వాల్‌లో ‘ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (KISCE)ని  ఏర్పాటు చేయనుంది.
  • నాగాలాండ్: కోవిడ్‌-19పై పోరాటానికి మద్దతుగా, నాగాలాండ్‌లోని మోకోక్చుంగ్ బెటాలియన్‌కు చెందిన అస్సాం రైఫిల్స్ సిబ్బంది జిల్లాలోని ముందువరుస ఆరోగ్య కార్యకర్తల కోసం 1500 ఆధునికీకరించిన ఫేస్ మాస్కులు విరాళంగా ఇచ్చారు.
  • కేరళ: విదేశాల నుంచి విమానాల్లో రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులందరికీ కోవిడ్-19 నెగటివ్ ధ్రువీకరణను తప్పనిసరి చేయాలని కేరళ మంత్రిమండలి నిర్ణయించింది. కాగా, విమానాలలో ఎక్కేముందు ప్రతి ఒక్కరికీ గంటలోగా ఫలితాన్ని  ప్రకటించే ‘ట్రూనాట్ రాపిడ్ టెస్ట్’ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా సాగుతున్న నిరసనల నడుమ వినియోగదారులకు బిల్లులో రాయితీతోపాటు చెల్లింపుల వాయిదాకు విద్యుత్ బోర్డు నిర్ణయించింది. మరోవైపు రాష్ట్ర రాజధానిలో కేసుల సంఖ్య పెరుగుతుండగా, వాటి మూలాలు లభించకపోవడంతో ప్రభుత్వం తీవ్ర అప్రమత్తత ప్రకటించింది. ఇక రాష్ట్రం వెలుపల మరో 8 మంది కేరళీయులు కోవిడ్‌కు బలయ్యారు. రాష్ట్రంలో 79 కొత్త కేసులు నమోదవగా, 60 మంది కోలుకున్నారు. మరో 1,366 మంది ఇంకా చికిత్స పొందుతుండగా- వివిధ జిల్లాల్లో 1,22,143 మంది పరిశీలనలో ఉన్నారు.
  • తమిళనాడు: పుదుచ్చేరిలో 30 తాజా కేసులతో ఒకేరోజులో ఇవాళ అధిక కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు జిప్మెర్‌లో ఒక మరణం కూడా నమోదైంది. దీంతో ఈ కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం కేసుల సంఖ్య 245కు, మరణాలు 5కు పెరిగాయి. ఇక తమిళనాడులో ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన కోసం వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది; ఈ పోర్టల్‌ ద్వారా ఉద్యోగార్థులు, ప్రైవేట్ సంస్థలు కూడా ఉచిత సేవలు పొందవచ్చు. రాష్ట్రంలో నిన్నటినుంచి 1843 కొత్త కేసులు నమోదవగా, 797మంది కోలుకున్నారు; 44మంది మరణించారు. చెన్నైలో కొత్త కేసులు:1257. మొత్తం కేసులు: 46504, యాక్టివ్ కేసులు: 20678, మరణాలు: 479, డిశ్చార్జ్: 24547, పరీక్షించిన నమూనాలు: 7,29,002, చెన్నైలో యాక్టివ్ కేసులు: 15385గా ఉన్నాయి.
  • కర్ణాటక: రాష్ట్రంలో బుధవారం నుంచి హుబ్బళ్లి విమానాశ్రయంలో విమాన రాకపోకలు ప్రారంభం కావచ్చునని ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ ప్రమోద్ ఠాక్రే చెప్పారు. కోవిడ్-19 కేసులు పెరుగుతున్నందున మహమ్మారిపై పోరులో ప్రైవేటు ఆస్పత్రులను కూడా రంగంలో దింపాలని వైద్యవిద్యశాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ అన్నారు. కర్ణాటకలో రెండువారాలుగా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అందువల్ల వ్యాధి సోకినప్పటికీ లక్షణాలు కనిపించని వ్యక్తులపై పర్యవేక్షణ, చికిత్స కోసం కోవిడ్ సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాకుండా నమూనా పరీక్షల సంఖ్యను రోజుకు 15,000 నుంచి 25,000 పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 213 కొత్త కేసులు నమోదవగా, 180మంది  డిశ్చార్జి అయ్యారు. ఇద్దరు మరణించారు. మొత్తం కేసులు: 7213, యాక్టివ్‌ కేసులు: 2987, మరణాలు: 88, డిశ్చార్జి అయినవారు: 4135 మంది.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 15,188 నమూనాలను పరీక్షించిన నేపథ్యంలో 275 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఇద్దరు మరణించగా, 55 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం మొత్తం కేసులు: 5555, యాక్టివ్: 2559, రికవరీ: 2906, మరణాలు: 90గా ఉన్నాయి.
  • తెలంగాణ: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లతోపాటు సంస్థలకు చెల్లింపులను వాయిదా వేయడం కోసం రూపొందించిన ప్రత్యేక నిబంధనలతో తెలంగాణ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ జారీచేసింది. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కేసులు 5406; యాక్టివ్‌ కేసులు 2188; కోలుకున్నవి: 3027గా ఉన్నాయి.

 

FACT CHECK

 

Image

***


(Release ID: 1632221) Visitor Counter : 213