ప్రధాన మంత్రి కార్యాలయం
ముఖ్యమంత్రులతో రెండోరోజు నిర్వహించిన సమావేశంలో అన్‌లాక్ 1.0 తరువాత పరిస్థితులపై చర్చించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
ప్రస్తుత పరీక్షా సామర్ధ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి, దానిని నిరంతరం మరింత విస్తరించాలి: ప‌్రధానమంత్రి
వైరస్ బారినపడి అధిక సంఖ్యలో కోలుకున్న వారి గురించి ప్రముఖంగా తెలియజేయడం ద్వారా వైరస్‌గురించిన భయాలు, కళంకంపై పోరాటం సాగించాలి: ప‌్రధానమంత్రి
లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలు చూపిన క్రమశిక్షణ కోవిడ్ -19 కేసులు విపరీతంగా పెరగకుండా నిరోధించింది : ప‌్రధాన మంత్రి
లాక్‌డౌన్ కు సంబంధించి వస్తున్న పుకార్లపై పోరాటం చే్స్తూ , అన్‌లాక్ 2.0కు ప్రణాళిక రూపొందించుకోవాలి: ప‌్రధానమంత్రి
ప్రజలలో అవగాహన పెంచడానికి , ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు పెంచేందుకు తీసుకున్న చర్యలపై వివరాలు అందించి తమ స్పందన తెలిపిన ముఖ్యమంత్రులు.
Posted On:
17 JUN 2020 5:57PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ, దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులో నిర్వహిస్తున్నసమావేశంలో భాగంగా ఈరోజు రెండోరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ -19 మహమ్మారి ని ఎదుర్కొనేందుకు ప్రణాళిక, అన్‌లాక్ 1.0 అనంతర పరిస్థితులపై ఆయన ఈసమావేశంలో చర్చించారు.
కొన్ని పెద్ద రాష్ట్రాలు, పెద్ద నగరాలలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని ప్రధానమంత్రి చెప్పారు. జనసాంద్రత ఎక్కువగా ఉండడం, సామాజిక దూరం పాటించడంలో ఇబ్బందులు, పెద్ద సంఖ్యలో జనం ఎక్కువమంది తిరుగుతుండడంతో పరిస్థితి సవాలుగా మారిందన్నారు. అయినా , పౌరుల సహనం, పాలనా యంత్రాంగం సంసిద్ధత, కరోనా పోరాటయోధుల నిబద్ధత, వంటివాటివల్ల వైరస్ వ్యాప్తి అదుపులో ఉందన్నారు. సకాలంలో వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి చికిత్స అందించడం, వెంటనే రిపోర్టు చేయడం వంటి వాటివల్ల వ్యాధినుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నదని ఆయన అన్నారు. లాక్‌డౌన్ సమయంలో ప్రజలు చూపిన క్రమశిక్షణ వైరస్ వ్యాప్తి పెద్ద ఎత్తున జరగకుండా నిలువరించగలిగిందన్నారు.
ఆరోగ్య మౌలికసదుపాయాల పెంపు :
కోవిడ్ సవాలును ఎదుర్కోవడానికి అవసరమైన మెరుగైన ఆరోగ్య మౌలిక సదుపాయాల గురించి ,శిక్షణ పొందిన మానవ వనరుల గురించి ప్రధానమంత్రి మాట్లాడారు. దేశీయంగా పిపిఒల తయారీ సామర్ధ్యం పెంపు , మాస్క్‌ల సరఫరా, తగినన్ని డయాగ్నస్టిక్ కిట్ల అందుబాటు, పి.ఎం కేర్ నిధులను ఉపయోగించి వెంటిలేటర్ల సరఫరా, టెస్టింగ్ ల్యాబ్‌ల అందుబాటు, లక్షలాది కోవిడ్ ప్రత్యేక బెడ్ల ఏర్పాటు, వేలాది ఐసొలేషన్, క్వారంటైన్ సెంటర్లు, తగినన్ని మానవ వనరుల వంటివాటిని సమకూర్చిన విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలు, సమాచార వ్యవస్థ, మానసిక మద్దతు, ప్రజల భాగస్వామ్యం వంటి వాటిపై నిరంతరం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.
వైరస్ బారిన పడిన వారిని సత్వరం గుర్తించడం, కాంటాక్టులను తెలుసుకోవడం, వ్యాధి బారినపడిన వారిని వేరుచేసి, చికిత్స అందించడం వంటి వాటికి సత్వర పరీక్షల ప్రాధాన్యతను ప్రధానమంత్రి వివరించారు. ప్రస్తుతం ఉన్న పరీక్షా సామర్ధ్యాలను పూర్తిగా వినియోగించుకోవాలన్నారు. అలాగే వీటిని మరింత విస్తరించేందుకు నిరంతరం కృషి చేయాలని ప్రధానమంత్రి సూచించారు. టెలిమెడిసిన్ ప్రయోజనాలు ఉపయోగించుకోవాలని, పేషెంట్లకు టెలిమెడిసిన్ ద్వారా సలహాలు, మార్గదర్శనం చేసేందుకు సీనియర్ డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. హెల్ప్‌లైన్ల ద్వారా, సకాలంలో సరైన సమాచారాన్ని అందించాలన్నారు. హెల్ప్‌లైన్ల సమర్ధ నిర్వహణకు యువ వలంటీర్ల బృందాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం గురించి ఆయన నొక్కి చెప్పారు.
భయం,కళంకంపై పోరాటం:
ఆరోగ్యసేతు యాప్‌ను పెద్ద సంఖ్యలో డౌన్‌లోడ్ చేసుకున్న రాష్ట్రాలలో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. యాప్ అందుబాటును పెంచేందుకు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సంబంధిత సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి సూచించారు. కోవిడ్ వైరస్ పై పోరాటంలో భావోద్వేగ కోణాన్ని కూడా ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. వైరస్ తమకు సోకుతుందేమోనన్న భయాలు,దానితో ముడిపడిన కళంకం విషయంలో ప్రజలలో అవగాహన పెంచాలని, వైరస్ ను ఓడించి, పెద్ద సంఖ్యలో కోలుకున్న వారి గురించి ప్రజలకు తెలియజేయాలని ప్రధానమంత్రి కోరారు. కరోనాపై పోరాటం చేస్తున్న మన వైద్యులు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు సహాయపడడం, వారికి మద్దతుగా నిలవడం మన ప్రాధాన్యతగా ఉండాలని ఆయన అన్నారు. ఈ పోరాటంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని ప్రధానమంత్రి చెప్పారు. మాస్క్‌లు ఉపయోగించడం, ముఖానికి తొడుగు వాడడం, సామాజిక దూరం పాటించడం వంటి గురించి ప్రజలకు నిరంతరం గుర్తు చేయాలని ఆయన అన్నారు.
స్పందన తెలిపిన ముఖ్యమంత్రులు:
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , ఈరోజు రెండో రోజు నిర్వహించిన సమావేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, కర్ణాటక, బీహార్, ఆంధ్రప్రదేశ్, హర్యానా, జమ్ముకాశ్మీర్, తెలంగాణా, ఒడిషా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
ప్రధానమంత్రి నాయకత్వానికి ముఖ్యమంత్రులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తమ తమ రాష్ట్రాలలో క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి, అలాగే వైరస్‌ను ఎదుర్కొవడంలో సన్నద్దత గురించి వారు ప్రధానమంత్రికి వివరించారు. కోవిడ్ సవాలు ను ఎదుర్కొనేందుకు అందుబాటులో ఉన్న ఆరోగ్య మౌలికసదుపాయాల గురించి వారు వివరించారు. అలాగే దీనిని మరింత బలోపేతం చేసేందుకు తీసుకున్న చర్యలను తెలిపారు ఫ్రంట్‌లైన్ వర్కర్లకు మద్దతు, కంటైన్‌మెంట్ జోన్ల మానిటరింగ్, మాస్క్‌ల వాడకాన్ని ప్రోత్సహించేందుకు ప్రచారం, ఇతర ముందస్తు రక్షణ చర్యలు, పరీక్షల పెంపు, తిరిగివచ్చిన వలస కార్మికులకు లాభదాయక ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తీసుకున్న చర్యల గురించి వారు వివరించారు.
అన్‌లాక్ 2.0 :
ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలు తెలిపినందుకు ప్రధానమంత్రి వారికి కృతజ్ఞతలు తెలిపారు. వైరస్‌పై సమష్ఠిపోరాటం మనల్ని విజయానికి చేరుస్తుందని ప్రధానమంత్రి అన్నారు. తగిన జాగ్రత్త చర్యలు పాటిస్తూ ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయాల్సిన అవసరం గురించి కూడా ప్రధానమంత్రి మాట్లాడారు. లాక్‌డౌన్‌పై పుకార్లకు అడ్డుకట్టవేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఇప్పుడు దేశం అన్‌లాకింగ్ దశలో ఉందని ఆయన అన్నారు. మనం అన్‌లాక్ రెండో దశ గురించి , మన ప్రజలకు హాని జరిగే అవకాశాలను తగ్గించడం ఎలా అన్నది ఆలొచించాలని ఆయన అన్నారు
ఆంక్షల తగ్గింపుతో ఆర్థిక రంగ పనితీరుకు సంబంధించిన సూచికలు కోలుకుంటున్న సూచనలిస్తున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉందని అన్నారు. మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి అలాగే నిర్మాణ రంగ పనులు చేపట్టడానికి చర్యలు తీసుకోవలసిందిగా ప్రధానమంత్రి రాష్ట్రాలకు సూచించారు. ఎం.ఎస్.ఎం.ఇ లు, వ్యవసాయం, మార్కెటింగ్ రంగాలకు ఊతం ఇచ్చేందుకు ఆత్మనిర్బర భారత్ కింద తీసుకున్న చర్యల గురించి ప్రధానమంత్రి వివరించారు. రాగల నెలల్లో వలస కార్మికులు ఎదుర్కొనే సమస్యల సవాళ్ల పై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ప్రధాని గుర్తుచేశారు.
కేంద్ర హోం మంత్రి ఈ సందర్బంగా మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, కరోనా వైరస్‌పై పోరాటంలో మనం ఇప్పటివరకు విజయవంత మయ్యామని, అయితే వైరస్ పై పోరాటం ఇంకా ముగియలేదని ఆయన అన్నారు.మనం ఆంక్షలు సడలించే కొద్దీ మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రజల స్వీయ రక్షణకు ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడాన్ని ప్రోత్సహించాల్సిందిగా ఆయన ముఖ్యమంత్రులందరికీ సూచించారు.
దేశంలో వివిధ లాక్‌డౌన్ దశలలో,ఆ తర్వాత అన్‌లాక్ 1.0 లో కేసుల వృద్ధి రేటులో తగ్గుదల కొనసాగుతూ వచ్చిన విషయాన్ని ఆరోగ్య మంత్రిత్వశాఖ ఒ.ఎస్.డి ప్రస్తావించారు. లాక్‌డౌన్ వల్ల కలిగిన సానుకూల ఫలితాలను ఆయన వివరించారు. పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు రాకుండా నిలువరించడానికి, ప్రజల ప్రాణాలు కాపాడడానికి, ప్రజలలో అవగాహన పెంచడానికి, ఆరోగ్య మౌలికసదుపాయాలు పెంచడానికి ఇది దోహదపడిందన్నారు. మన దేశంలో ప్రతి లక్ష జనాభాకు కోవిడ్ బారిన పడిన కేసులు, మరణాల సంఖ్య ప్రపంచంలోనే తక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు.
*****
(Release ID: 1632218)
Visitor Counter : 226
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam