PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 14 JUN 2020 7:08PM by PIB Hyderabad

(కోడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 • దేశంలో కోవిడ్‌-19 నయమైనవారి సంఖ్య 1,62,378కి చేరగా- వీరిలో గడచిన 24 గంటల్లో బయటపడినవారు 8,049 మంది; దీంతో కోలుకునేవారు 50 శాతం దాటారు.
 • కోవిడ్‌-19పై నేపథ్యంలో జాతీయ స్థాయి స్థిగతులు, సన్నద్ధతపై మంత్రులు, అధికారులతో ప్రధానమంత్రి సమీక్ష
 • ఢిల్లీలో కోవిడ్‌-19 పరిస్థితిపై దేశీయాంగ శాఖ మంత్రి అధ్యక్షతన సమీక్ష సమావేశం; జాతీయ రాజధానిలో 2 రోజుల్లో రెట్టింపు; 6 రోజుల్లో మూడింతలైన ప్రయోగశాలల సంఖ్య.
 • పరిశోధనాత్మక చికిత్సలో భాగంగా రెమ్‌డెసివిర్‌ ఔషధాన్ని పరిమిత అత్యవసర వినియోగానికి మాత్రమే అనుతించినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టీకరణ

Image

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం; 50 శాతం దాటిన కోలుకునే రోగుల సంఖ్య; వ్యాధి నయమైనవారి సంఖ్య 1,62,378కి చేరిక

దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కోవిడ్‌-19 నుంచి 8,049మంది కోలుకోగా, నయమయ్యే రోగులు 50 శాతం దాటారు. ఈ మేరకు వ్యాధి నయమైన వారి సంఖ్య 1,62,378కి చేరగా, కోలుకునేవారి శాతం 50.60కి పెరగింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కోవిడ్‌-19 రోగులలో సగానికిపైగా కోలుకున్నట్లయింది. సకాలంలో రోగుల గుర్తింపు, సముచిత వైద్య నిర్వహణలే కోలుకునేవారి సంఖ్య పెరగటానికి దోహదపడ్డాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,49,348కాగా, వీరందరూ చురుకైన వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. మరోవైపు నవ్య కరోనా వైరస్‌ సోకినవారిని గుర్తించేందుకు భారత వైద్య పరిశోధన మండలి (ICMR) పరీక్ష సదుపాయాలను గణనీయంగా పెంచింది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 646, ప్రైవేటు రంగంలో 247 (మొత్తం 893) ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 1,51,432సహా ఇప్పటిదాకా మొత్తం 56,58,614 నమూనాలను ఈ ప్రయోగశాలల్లో పరీక్షించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631530

కోవిడ్ -19 తాజా సమాచారం; రెమ్‌డెసివిర్‌పై వివరణ

కోవిడ్‌-19 వ్యాధి వైద్య నిర్వ‌హ‌ణ విధివిధానాల‌ను ఉన్న‌తీక‌రిస్తూ ‘రెమ్‌డెసివిర్’ ఔష‌ధం వాడకంపై స్పష్టీకరణతో కేంద్ర ఆరోగ్య‌-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ 2020 జూన్ 13న కొన్ని నిర్దేశాలు జారీచేసింది. పరిశోధనాత్మక చికిత్సలో భాగంగా రెమ్‌డెసివిర్‌ ఔషధాన్ని పరిమిత అత్యవసర వినియోగానికి మాత్రమే అనుతించినట్లు అందులో స్పష్టీకరించింది. ఈ ఔష‌ధాన్ని సిఫార‌సుతో నిమిత్తంలేని ‘టోసిలిజుమాబ్, ప్లాస్మా’ (కోలుకున్న‌వారి ర‌క్త‌జీవ ద్రవ్యం)తోపాటు ప‌రిశోధ‌నాత్మ‌క చికిత్స కింద నిర్దిష్ట అత్యవ‌సర వినియోగంలో భాగంగా మాత్ర‌మే వాడాల‌ని స్ప‌ష్టం చేసింది. అలాగే వాటి వినియోగ ఫలితాలపై పరిమిత రుజువులు, లభ్యత ఆధారంగా మాత్రమే ప్రస్తుతానికి వాటిని వాడాల్సి ఉంటుందని పేర్కొంది. అత్యవసర పరిస్థితిలో అదీ ఓ మోస్తరు వ్యాధిలక్షణాలతో (ఆక్సిజన్‌ సరఫరా) చికిత్స పొందుతున్న రోగుల విషయంలో మాత్రమే రెమ్‌డెసివిర్‌ వాడకాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. ఈ సందర్భంగా ఎలాంటి వైరుధ్యాలు తలెత్తకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది. తాజా విధివిధానాల మేరకు దేశంలో అనుమానాస్పద లేదా ప్రయోగశాల నిర్ధారిత కేసులకు సంబంధించి వ్యాధి తీవ్రమై ఆస్పత్రిలో చేరిన వయోజనులు, పిల్లలకు నిర్దిష్ట పరిమితులకు లోబడి ఈ మందుల అత్యవసర వినియోగానికి అనుమతించినట్లు వివరించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631536

కోవిడ్‌-19పై భారత్‌ పోరాటాన్ని సమీక్షించిన ప్రధానమంత్రి

దేశంలో కోవిడ్‌-19పై జాతి ప్రతిస్పందనాత్మకత గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న మంత్రులు, సీనియర్‌ అధికారులతో సమీక్షించారు. ప్రపంచ మహమ్మారి నేపథ్యంలో జాతీయంగా నెలకొన్న స్థితిగతులు, సన్నద్ధతలపై ఈ సమావేశం లోతుగా చర్చించింది. ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీసహా వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుత స్థితిని కూడా పరిశీలించింది. మరోవైపు ఢిల్లీలో ప్రస్తుత, ఆవిష్కృతమవుతున్న కోవిడ్‌-19 వ్యాధి నేపథ్యంపైనే కాకుండా రాబోయే రెండు నెలల అంచనాలపై చర్చించింది. జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌, ముఖ్యమంత్రిసహా ప్రభుత్వ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య, దేశీయాంగ శాఖ మంత్రులకు ప్రధాని సూచించారు. కోవిడ్‌-19 సవాళ్లను ఎదుర్కొనడానికి తగిన సమన్వయంతో కూడిన సమగ్ర ప్రణాళికను రూపొందించాల్సిందిగా వారిని కోరారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631452

ఢిల్లీలో కోవిడ్‌-19 ప‌రిస్థితిపై దేశీయాంగ శాఖ మంత్రి అమిత్ షా అధ్య‌క్ష‌త‌న స‌మీక్ష స‌మావేశం

ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌, ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్నర్ అనిల్ బైజాల్‌, ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌, ఎయిమ్స్ (AIIMS) డైరెక్ట‌ర్‌సహా ఇతర సీనియ‌ర్ అధికారులు పాల్గొన్నారు. ఢిల్లీలో కోవిడ్‌-19 వ్యాప్తిని అరిక‌ట్టి జాతీయ రాజ‌ధానిని సుర‌క్షితం చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా చెప్పారు. న‌గ‌రంలో క‌రోనా రోగుల‌కు ప‌డ‌క‌ల కొర‌త దృష్ట్యా కోవిడ్ సంర‌క్ష‌ణ కేంద్రాలుగా మ‌ల‌చిన 500 రైలు బోగీల‌ను ఢిల్లీకి త‌క్ష‌ణం అంద‌జేయాల‌ని మోదీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు శ్రీ షా వెల్ల‌డించారు. త‌ద్వారా చికిత్స‌కు అవ‌స‌ర‌మైన స‌క‌ల సౌక‌ర్యాల‌తో మ‌రో 8,000 ప‌డ‌కలు అందుబాటులో ఉంటాయ‌ని ఆయ‌న‌ పేర్కొన్నారు. ఢిల్లీలో కోవిడ్‌ నిర్ధారణ ప్రయోగశాలల సంఖ్య రెండు రోజుల్లో రెట్టింపు కాగా, ఆరు రోజుల్లో మూడింతలకు చేరిందని ఆయన అన్నారు. కాగా, ప్రైవేటు ఆస్పత్రులు కోవిడ్‌ రోగుల కోసం తక్కువ ధరతో 60 శాతం పడకలు కేటాయించడంతోపాటు ధర నిర్ణయం దిశగా చర్చలకుగాను నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వి.కె.పాల్‌ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు శ్రీ షా చెప్పారు. ఈ కమిటీ రేపటికల్లా చర్చలు ముగించి, నివేదిక సమర్పిస్తుందని పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631584

వ్యవసాయ రంగంలో ప్రైవేట్‌ పెట్టుబడుల పెంపు అవసరాన్ని నొక్కిచెప్పిన శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌

దేశ వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు పెంచాల్సిన అవసరం గురించి కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ నొక్కిచెప్పారు. దీనివల్ల వ్యవసాయ రంగం మరింత వర్ధిల్లుతుందని, దీంతోపాటు దేశ స్వావలంబన, సౌభాగ్యం ఇనుమడిస్తామని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయోత్పత్తి పెంపుతోపాటు ఇబ్బందుల తొలగింపు దిశగా శాస్త్రవేత్తలు తమవంతు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ సంక్షోభంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రగతి చక్రాల వేగం మందగించిందని శ్రీ తోమర్‌ గుర్తుచేశారు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో లభ్యమయ్యే వనరులతో మన రైతులు పంటలు సమృద్ధిగా పండించారని, దిగ్బంధ సమయంలోనూ పంటకోతలు ఆటంకం లేకుండా సాగాయని పేర్కొన్నారు. అలాగే నిరుటితో పోలిస్తే పంట దిగుబడులు కూడా పెరిగాయని, దీంతోపాటు ఖరీఫ్‌ సాగు కూడా నిరుటికన్నా 45 శాతం ఎక్కువగా నమోదైందని చెప్పారు. దీన్నిబట్టి మన గ్రామాలు, రైతుల దృఢ సంకల్పం ఎలాంటిదో స్పష్టమైందన్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631489

అధిక నాణ్యత, తక్కువ ఖర్చుతో ఫేస్ మాస్కును రూపొందించిన బార్క్: డాక్టర్ జితేంద్ర సింగ్

కేంద్ర‌ అణు ఇంధనశాఖకు అనుబంధ సంస్థ భాభా అణు ప‌రిశోధ‌న కేంద్రం (BARC-ముంబై) అధిక నాణ్యతగ‌ల ఫేస్ మాస్కును రూపొందించింది. అతిసూక్ష్మ ప‌ర‌మాణు సంగ్ర‌హ‌ణ సామ‌ర్థ్యం (HEPA)గ‌ల వ‌డ‌పోత (ఫిల్టర్‌) స‌దుపాయంతో అభివృద్ధి చేసిన ఈ మాస్కును త‌క్కువ ఖ‌ర్చుతోనే బార్క్ అభివృద్ధి చేయ‌డం విశేషం. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్- గడ‌చిన ఏడాది కాలంలో తమ‌ శాఖల ప్రధాన విజయాలను వివ‌రించిన సంద‌ర్భంగా ఈ మేర‌కు వెల్ల‌డించారు. కోవిడ్‌-19 మహమ్మారి విజృంభణ నేపథ్యంలో సమాజానికి అండగా నిలిచేందుకు ముందడుగు వేసిన శాస్త్రవేత్తలను ఆయన ప్రశంసించారు. కాగా, అత్యున్నత నాణ్యమైన మాస్కుతోపాటు అణు/కేంద్రక పరమాణు రంగ శాస్త్రవేత్తలు రేడియో ధార్మికతతో రోగకారక నిర్మూలన అనంతరం వ్యక్తిగత రక్షణ సామగ్రిని పునరుపయోగించే విధానం కూడా రూపొందించారని మంత్రి తెలిపారు. కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ ప్రస్తుతం దీన్ని పరిశీలిస్తోందని చెప్పారు. దీంతోపాటు ఆర్టీపీసీఆర్‌ పరీక్ష కిట్ల అభివృద్ధికి కొత్త రంగాలను గుర్తించే కార్యక్రమం పూర్తయిందని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ తెలిపారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631488

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 • కేరళ: చార్టర్డ్ విమానాల్లో రాష్ట్రానికి తిరిగివచ్చే ప్రవాసులకు కోవిడ్-19 సోకలేదన్న ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేయడంపై మంగళవారం ప్రధానమంత్రితో చర్చ అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆరోగ్యశాఖ మంత్రి కె.కె.శైలజ చెప్పారు. కోవిడ్‌-19 సామాజిక వ్యాప్తిని కేరళ ప్రభుత్వం సమర్థంగా నిరోధించిందని, దిగ్బంధం సడలింపు తర్వాత సామాజిక వ్యాప్తిద్వారా ప్రజల్లో కేవలం 10 శాతం మాత్రమే వైరస్‌బారిన పడ్డారని మంత్రి అభిప్రాయపడ్డారు. దీన్ని 5 శాతానికి తగ్గించే దిశగా ఆరోగ్యశాఖ చురుకుగా పనిచేస్తోందని ఆమె చెప్పారు. ఇక తాజాగా గల్ఫ్‌ దేశాల్లో ఐదుగురు, ముంబైలో ఒకరు వంతున మరో ఆరుగురు కేరళీయులు మరణించారు. దీంతో గల్ఫ్ దేశాల్లో మరణించిన మలయాళీల సంఖ్య 225కి పెరిగింది. నిన్న రాష్ట్రంలో 85 కొత్త కేసులు నమోదవగా ప్రస్తుతం 1,342 మంది రోగులు చికిత్స పొందుతున్నారు.
 • తమిళనాడు: పుదుచ్చేరిలో 18 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 194కు పెరగ్గా, 4 మరణాలు నమోదయ్యాయి. కరోనావైరస్ సోకిన తమిళనాడు అన్నా డీఎంకే శాసనసభ్యుడికి ప్రభుత్వం పూర్తి వైద్య సహాయం అందిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కాగా, కోయంబత్తూరులో 18 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. రాష్ట్రంలో నిన్న 1989 కొత్త కేసులు నమోదవగా, 1362 మంది కోలుకున్నారు. మరో 30 మరణాలు నమోదయ్యాయి. చెన్నైలో కొత్త కేసుల సంఖ్య 1484 కాగా, మొత్తం కేసులు: 42687కు పెరిగాయి. యాక్టివ్ కేసులు: 18878, మరణాలు: 397, డిశ్చార్జ్: 22047, చెన్నైలో యాక్టివ్ కేసులు: 14180గా ఉన్నాయి.
 • కర్ణాటక: రాష్ట్రంలో దిగ్బంధం విధించే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో అటువంటి ప్రతిపాదనేదీ ప్రభుత్వంముందు లేదని వైద్యవిద్యాశాఖ మంత్రి కె.సుధాకర్ స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వం సదుద్దేశంతోనే ఆన్‌లైన్ తరగతులను నిషేధించిందని విద్యాశాఖ మంత్రి సురేష్ కుమార్ చెప్పారు. కాగా, రాష్ట్రంలో నిన్న 308 కొత్త కేసులు నమోదవగా 209మంది డిశ్చార్జి కావడంతోపాటు మూడు మరణాలు సంభవించాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 6824, యాక్టివ్‌ కేసులు: 3092, మరణాలు: 81, డిశ్చార్జి అయినవారి సంఖ్య: 3648.
 • ఆంధ్రప్రదేశ్: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ కార్యదర్శి మార్గదర్శకాలను జారీచేశారు. అయితే, ఈ సందర్భంగా ఎమ్మెల్యేల సిబ్బందికి అనుమతి నిరాకరించారు. తిరుమల ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ తుది దశలో ఉందంటూ బీజేపీ నాయకుడు సుబ్రమణ్యంస్వామి టీటీడీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఇక రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 15,633 నమూనాలను పరీక్షించడంతో 253 కొత్త కేసులు, రెండు మరణాలు నమోదవగా మరో 82మంది  డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం మొత్తం కేసులు: 4,841 కాగా, యాక్టివ్: 2034, రికవరీ: 2723, మరణాలు: 84గా ఉన్నాయి.
 • తెలంగాణ: రాష్ట్రంలో కోవిడ్-19 నేపథ్యంలో జిల్లా ఆసుపత్రులు 60 శాతందాకా డాక్టర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. కాగా, వలస కార్మికులతోపాటు చిక్కుకుపోయిన పర్యాటకులు, విద్యార్థులను వారి గమ్యం చేర్చడానికి దక్షిణ మధ్య రైల్వే ఇప్పటిదాకా 240 ‘శ్రామిక్‌ స్పెషల్‌’ రైళ్లను నడిపింది. ఇక ఇక్కడినుంచి బయల్దేరే రైళ్లతోపాటు ఈ మార్గం మీదుగా వచ్చివెళ్లే ‘శ్రామిక్‌ స్పెషల్‌’ రైళ్ల నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించింది. ఇక రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,737కాగా, మరణాలు 182గా నమోదయ్యాయి. అధికారిక సమాచారం ప్రకారం- ఈ కేసులలో అధికశాతం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోనివే కావడం గమనార్హం.
 • మహారాష్ట్ర: రాష్ట్రంలో మరో 3,427 కేసులు నమోదు కాగా, మొత్తం కేసులు 1,04,568కి పెరిగాయి. కాగా, ముంబై నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి కొంతవరకు అదుపులోకి వచ్చింది. అయితే, రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలతోపాటు సోలాపూర్, ఔరంగాబాద్, యావత్మల్, జల్గావ్ వంటి జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది.
 • గుజరాత్: రాష్ట్రంలో కోవిడ్-19 కొత్త కేసులపరంగా గుజరాత్‌లో జూన్‌ నెలకు ప్రాముఖ్యం ఏర్పడింది. ఈ మేరకు జూన్‌లో తొలిసారిగా ఇవాళ ఒకే రోజు 517 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 23,079కి చేరగా, తాజాగా 33 మంది మృతితో మరణాల సంఖ్య 1,449కి పెరిగింది. కాగా జూన్ నెలలో ఈ 13 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 6,285 కేసులు నమోదయ్యాయి.
 • రాజస్థాన్: రాష్ట్రంలో ఆదివారం 131 కొత్త కేసులు నమోదవడంతో 12,532కు చేరుకోగా, తాజాగా నలుగురి మృతితో మరణాల సంఖ్య 286కు పెరిగిందని రాజస్థాన్‌ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. తాజా కేసులలో ధోల్‌పూర్ నుంచి 40, భరత్‌పూర్‌ నుంచి 34, అల్వార్‌ నుంచి 15, జైపూర్‌ నుంచి 12 వంతున నమోదయ్యాయి.
 • మధ్యప్రదేశ్‌: రాష్ట్రంలోని భోపాల్ నగర యంత్రాంగం సోమవారం నుంచి మతపరమైన ప్రదేశాలను తెరవడానికి అనుమతి ఇచ్చింది. కాగా ఇప్పటివరకు నగరంలో 2,145 కేసులు నమోదవగా, 69 మరణాలు సంభవించాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా గడచిన 24గంటల్లో 198 కొత్త కేసుల నమోదుతో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 10,641కి పెరిగింది.
 • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో తాజాగా 105 కేసుల నమోదుతో  యాక్టివ్‌ కేసుల సంఖ్య 913కు చేరింది.
 • అసోం: రాష్ట్రంలో 43 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 3943కు చేరగా, ఇందులో 2127 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటిదాకా 1805 మంది కోలుకోగా 8 మరణాలు సంభవించాయి.
 • మణిపూర్: రాష్ట్రానికి తిరిగివచ్చే వారందరికీ సత్వర రోగ నిర్ధారణ పరీక్షలకు వీలుగా కొత్త కోవిడ్‌-19 పరీక్ష పరికరాలను ఏర్పాటు చేయాలని మణిపూర్ ప్రభుత్వం యోచిస్తోంది. వీటి సాయంతో రోజుకు 3000 నుంచి 4000 నమూనాలను పరీక్షించవచ్చు. కాగా, కోవిడ్‌-19పై రాష్ట్ర సంప్రదింపుల కమిటీతో సమావేశానికి ముఖ్యమంత్రి అధ్యక్షత వహించారు; రాష్ట్రానికి తిరిగివచ్చిన వారందరికీ త్వరగా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే అంశంపై ఈ సందర్భంగా చర్చ సాగింది.
 • మిజోరం: రాష్ట్రంలోని నిర్బంధవైద్య పర్యవేక్షణ కేంద్రాల్లోని వారికి మాదకద్రవ్యాలు, మద్యం అందించిన ఆరుగురు యువకులపై మిజోరం పోలీసులు కేసు నమోదు చేశారు.
 • నాగాలాండ్: రాష్ట్రానికి తిరిగివచ్చిన ఆరుగురు  వ్యక్తులకు కోవిడ్‌-19 సోకినట్లు నిర్ధారణ కావడంతో వాంగ్‌ఖావ్‌ ప్రభుత్వ కళాశాల, ఐటిఐ ప్రాంగణాలకు పరిసరాల్లో కిలోమీటరు మేర జన సంచారాన్ని మోన్ జిల్లా పాలన యంత్రాంగం నిషేధించింది. మరోవైపు పొగాకురహిత గ్రామాల గుర్తింపుతోపాటు పొగాకు నిషేధంపై పర్యవేక్షణను రాష్ట్ర పొగాకు నియంత్రణ విభాగం కొనసాగిస్తోంది.
 • సిక్కిం: రాష్ట్రంలో 5 కొత్త కేసులు నమోదవగా వీరంతా ఇతర రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చినవారే. ప్రస్తుతం సిక్కింలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 63గా ఉంది.

FACT CHECK

Image

******(Release ID: 1631600) Visitor Counter : 62