ప్రధాన మంత్రి కార్యాలయం
కోవిడ్-19 కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటాన్ని సమీక్షించిన - ప్రధాన మంత్రి.
Posted On:
13 JUN 2020 6:05PM by PIB Hyderabad
కోవిడ్-19 మహమ్మారిపై భారతదేశం యొక్క ప్రతిస్పందనను సమీక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీనియర్ మంత్రులు మరియు అధికారులతో సమగ్ర సమావేశం నిర్వహించారు. మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో ప్రస్తుత పరిస్థితిని, సంసిద్ధతను, ఈ సమావేశం సమీక్షించింది. ఈ సమావేశం ఢిల్లీ తో సహా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని స్థితిగతులను కూడా వివరంగా తెలుసుకుంది. ఈ సమావేశంలో హోంమంత్రి, ఆరోగ్య మంత్రి, ప్రధానమంత్రి యొక్క ప్రధాన కార్యదర్శి, క్యాబినెట్ కార్యదర్శి, ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఐ.సి.ఎమ్.ఆర్. డైరెక్టర్ జనరల్ తో పాటు సంబంధిత సాధికారిత బృందాల కన్వీనర్లు పాల్గొన్నారు.
కోవిడ్-19 కేసుల ప్రస్తుత స్థితి, సమీప భవిష్యత్తులో ఏవిధంగా ఉండే అవకాశం ఉందీ అనే విషయాల గురించి ఎన్.ఐ.టి.ఐ. సభ్యుడు, వైద్య అత్యవసర యాజమాన్య ప్రణాళిక సాధికార బృందం కన్వీనర్ డాక్టర్ వినోద్ పాల్ సవివరంగా తెలియజేశారు. మొత్తం కేసులలో మూడింట రెండొంతులు 5 రాష్ట్రాల్లో నమోదు కాగా, పెద్ద నగరాల్లో కూడా అధిక సంఖ్యలో కేసులు నమోదౌతున్నట్లు గమనించడమైంది. ముఖ్యంగా పెద్ద నగరాలు ఎదుర్కొంటున్న సవాళ్ళ దృష్ట్యా, రోజువారీ కేసుల గరిష్ట పెరుగుదలను సమర్థవంతంగా నిర్వహించడానికి పరీక్షలను పెంచడంతో పాటు పడకల సంఖ్యను పెంచి, మెరుగైన సేవలనందించడం గురించి ప్రత్యేకంగా చర్చించారు.
నగరాలు, జిల్లాల వారీగా అవసరమైన ఆసుపత్రి పడకలు / ఐసోలేషన్ పడకల గురించి సాధికారిత బృందాల సిఫారసులను ప్రధానమంత్రి పరిగణలోకి తీసుకున్నారు. రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలతో సంప్రదించి అత్యవసర ప్రణాళికను చేపట్టాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. రుతుపవనాల ప్రారంభమవుతున్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లు జరిగేలా చూడాలని కూడా ఆయన మంత్రిత్వ శాఖకు సూచించారు.
రాజధానిలో కోవిడ్ 19 వ్యాధి యొక్క ప్రస్తుత పరిస్థితి, తదుపరి కార్యాచరణతో పాటు, వచ్చే 2 నెలల్లో అంచనాల గురించి కూడా చర్చించారు. కోవిడ్-19 కేసుల ద్వారా ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోడానికి వీలుగా సమన్వయంతో, సమగ్ర ప్రతిస్పందనను రూపొందించడానికి, భారత ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్లకు చెందిన సీనియర్ అధికారులందరి సమక్షంలో, ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి తో ఒక అత్యవసర సమావేశం నిర్వహించాలని, కేంద్ర హోంమంత్రి, ఆరోగ్యమంత్రులకు ప్రధానమంత్రి సూచించారు .
కోవిడ్-19 వ్యాప్తిని విజయవంతంగా అరికట్టడంలో మరియు నియంత్రించడంలో అనేక రాష్ట్రాలు, జిల్లాలు మరియు నగరాలు చేసిన అత్యుత్తమ కృషిని ఈ సందర్భంగా గుర్తించి, అభినందించారు. ఇతరులకు ప్రేరణ మరియు వినూత్న ఆలోచనలను కలిగించడానికి వీలుగా ఈ విజయగాధలు మరియు ఉత్తమ అభ్యాసాలను విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు.
*****
(Release ID: 1631452)
Visitor Counter : 299
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam