హోం మంత్రిత్వ శాఖ

ఢిల్లీ లో కోవిడ్-19 పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన సమావేశం

ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ అనిల్ బైజల్, ముఖ్యమంత్రి శ్రీ అరవింద్ కేజ్రీవాల్, ఎయిమ్స్ డైరెక్టర్ తో పాటు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.


ఢిల్లీ లో కోవిడ్-19 వ్యాప్తిని తనిఖీ చేయడానికి మరియు దేశ రాజధానిని సురక్షితంగా ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది - కేంద్ర హోంమంత్రి


మార్పు చేసిన 500 రైలు పెట్టెలను మోడీ ప్రభుత్వం వెంటనే ఢిల్లీ ప్రభుత్వానికి అందించనుంది. తద్వారా మరో 8,000 పడకలు కోవిడ్-19 రోగులకు అందుబాటులోకి వస్తాయి.


కోవిడ్ -19 పరీక్షల సంఖ్య 2 రోజుల్లో రెట్టింపు, 6 రోజుల్లో మూడు రెట్లు పెరగనున్నాయి - హోంమంత్రి శ్రీ అమిత్ షా


ప్రైవేటు ఆసుపత్రులు 60 శాతం పడకలను తక్కువ రేటుతో అందుబాటులో ఉంచేవిధంగా చూసేందుకు, కరోనా పరీక్ష మరియు చికిత్సలకు రేటును నిర్ణయించడానికీ కమిటీ ఏర్పాటు - శ్రీ అమిత్ షా

Posted On: 14 JUN 2020 4:44PM by PIB Hyderabad

ఢిల్లీ లో కోవిడ్-19 వ్యాప్తిని తనిఖీ చేయడానికి మరియు దేశ రాజధానిని సురక్షితంగా ఉంచడానికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా అన్నారు.  సీనియర్ అధికారులతో పాటు ముఖ్యమంత్రి శ్రీ అరవింద్ కేజ్రీవాల్‌తో జరిగిన ఈ సమావేశంలో వైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా ఢిల్లీ పౌరుల భద్రత కోసం అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.

 

ఢిల్లీ ఆసుపత్రులలో కరోనా రోగులకు పడకల కొరత దృష్ట్యా,  మార్పు చేసిన 500 రైలు పెట్టెలను వెంటనే ఢిల్లీ ప్రభుత్వానికి అందజేయాలని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  దీంతో, ఢిల్లీ లో మరో 8,000 పడకలు అందుబాటులో ఉంటాయి.  వీటిలో కోవిడ్ -19 రోగుల చికిత్సకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఉంటాయి.

కాంటాక్ట్ మ్యాపింగ్ ‌ను మెరుగుపరిచేందుకు రాజధాని లోని కంటైన్‌మెంట్ జోన్లలోని ప్రతి ఇంటిలో ఆరోగ్య సర్వేలు నిర్వహించడం జరుగుతుందనీ, సర్వే నివేదిక వారం రోజుల లోపు అందుబాటులో ఉంటుందనీ, కేంద్ర హోంమంత్రి తెలిపారు.  సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం నివాసితులందరూ వారి మొబైల్ ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు. 

ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడిచేసే చర్యల్లో భాగంగా, రాబోయే రెండు రోజుల్లో కోవిడ్-19 పరీక్షల సంఖ్య రెట్టింపు అవుతుందనీ,  ఆరు రోజుల తర్వాత ఆ సంఖ్య మూడు రెట్లు పెరుగుతుందనీ హోంమంత్రి తెలిపారు. దీనితో పాటు,  కంటైన్మెంట్ జోన్లలో, ప్రతి పోలింగ్ స్టేషన్ లో పరీక్షా సౌకర్యం అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు. 

ఢిల్లీ లోని క్లినిక్ ‌లు మరియు చిన్న చిన్న ఆస్పత్రులకు కరోనా వైరస్ ‌కు సంబంధించిన మార్గదర్శకాలు మరియు సమాచారాన్ని సమర్థవంతంగా ప్రసారం చేయడానికి, ఎయిమ్స్‌లో సీనియర్ వైద్యుల కమిటీని ఏర్పాటు చేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా కరోనాకు వ్యతిరేకంగా పోరాటంలో ఉత్తమ పద్ధతులు క్షేత్ర స్థాయి వరకు చేరడానికి అవకాశం ఉంటుంది.   టెలిఫోన్ ద్వారా సలహాలు, సూచనలు అందజేయడానికి వీలుగా ఒక హెల్ప్‌లైన్ నంబర్ ‌ను ఏర్పాటు చేసి, రేపు ప్రారంభించనున్నారు. 

ప్రైవేటు ఆసుపత్రులు 60 శాతం పడకలను తక్కువ రేటుతో అందుబాటులో ఉంచేవిధంగా చూసేందుకు, కరోనా పరీక్ష మరియు చికిత్సలకు రేటును నిర్ణయించడానికీ నీతీ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికె పాల్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు శ్రీ షా చెప్పారు.  ఈ కమిటీ తన నివేదికను రేపు సమర్పించనుంది.

కరోనా మహమ్మారిని యుక్తితో మరియు శక్తితో పరిష్కరించడంలో దేశ సంకల్పాన్ని హోంమంత్రి నొక్కి చెప్పారు.  తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాల బాధలను ఆయన ఈ సందర్భంగా పంచుకున్నారు.  మృతుల అంత్య క్రియలకు సంబంధించి తాజా మార్గదర్శకాలను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇది అంత్య క్రియలు నిర్వహించడానికి వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తుందనీ ఆయన చెప్పారు. 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో ప్రజలందరి అప్రమత్తత, సహకారంతో దేశం విశ్వవ్యాప్తమైన కరోనా మహమ్మారితో  పోరాడుతోందని, శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.   ఈ సంక్షోభ సమయంలో అంకితభావంతో, ఆదర్శప్రాయమైన సేవలందిస్తున్న అనేక స్వచ్ఛంద సంస్థలకు ఈ దేశం కూడా  హృదయపూర్వకంగా ఋణపడి ఉంది.  ఈ ప్రయత్నంలో, స్కౌట్సు, గైడ్సు, ఎన్.సి.సి, ఎన్.‌ఎస్.‌ఎస్. మరియు ఇతర స్వచ్ఛంద సంస్థల సేవలను వాలంటీర్లుగా ఆరోగ్య సేవలతో నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ తో సమర్థవంతంగా పోరాడటానికి మరో ఐదుగురు సీనియర్ అధికారులను ఢిల్లీ ప్రభుత్వానికి నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ రోజు జరిగిన సమావేశంలో అనేక ఇతర నిర్ణయాలు కూడా తీసుకున్నారు.  భారత ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, ఎయిమ్స్ తో పాటు ఢిల్లీ లోని మూడు మునిసిపల్ కార్పొరేషన్లకు చెందిన వైద్యుల సంయుక్త బృందం ఢిల్లీ లోని అన్ని కరోనా ఆసుపత్రులను సందర్శించి, అక్కడ ఉన్న ఆరోగ్య మౌలిక సదుపాయాలను, కోవిడ్-19 రోగుల చికిత్స కు అవసరమైన సంసిద్ధతను పరిశీలించిన అనంతరం ఒక నివేదికను సమర్పిస్తుంది.   

ఈ రోజు తీసుకున్న వివిధ నిర్ణయాలను, కేంద్ర ప్రభుత్వం మరియు ఢిల్లీ ప్రభుత్వాలకు చెందిన ఆరోగ్యశాఖతో పాటు ఇతర విభాగాలు మరియు నిపుణులు క్షేత్ర స్థాయిలో అమలు  అయ్యేలా చూడాలని  శ్రీ షా ఆదేశాలు జారీ చేశారు.

ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, పల్స్ ఆక్సిమీటర్ల ‌తో సహా అవసరమైన అన్ని వనరులను అందిస్తామని ఢిల్లీ ప్రభుత్వానికి, భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది.

ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ అనిల్ బైజల్, ముఖ్యమంత్రి శ్రీ అరవింద్ కేజ్రీవాల్, ఎయిమ్స్ డైరెక్టర్ తో పాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

*****



(Release ID: 1631584) Visitor Counter : 260