PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 25 MAY 2020 6:31PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 • దేశంలో కోవిడ్‌-19 నయమైనవారు 57,720మంది; కోలుకున్నవారి శాతం 41.57కి పెరిగింది.
 • మొత్తం నిర్ధారిత కేసుల సంఖ్య 1,38,845కాగా, వైద్య పర్యవేక్షణలోని కేసులు: 77,103.
 • భారతీయుల స్వదేశ-విదేశీ ప్రయాణంపై దేశీయాంగ శాఖ ప్రామాణిక నిర్వహణ ప్రక్రియల జారీ.
 • వ్యక్తిగత రక్షణ సామగ్రి, ఎన్95 మాస్కుల తయారీలో దేశీయ ఉత్పాదన గణనీయంగా పెంపు.
 • దేశంలో ఇప్పటిదాకా 30 లక్షల కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల నిర్వహణ: ఆరోగ్య శాఖ మంత్రి.
 • దిగ్బంధం ఉన్నప్పటికీ ప్రభుత్వ సంస్థలద్వారా నిరుటికన్నా అధికంగా ఈ ఏడాది 341.56 లక్షల టన్నుల గోధుమ కొనుగోలు.

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం; కోలుకునేవారి శాతం మెరుగుపడి 41.57 శాతానికి చేరిక

దేశంలో ఇప్పటిదాకా 57,720 మందికి వ్యాధి నయంకాగా, గడచిన 24గంటల్లో నయమైన వారి సంఖ్య 3,280గా ఉండటంతో కోలుకునేవారి శాతం మెరుగుపడి 41.57గా నమోదైంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం నిర్ధారిత కేసుల సంఖ్య 1,38,845 కాగా, ప్రస్తుతం 77,103 మంది వైద్య పర్యవేక్షణలో ఉన్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1626767

దేశ-విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల స్వదేశ-విదేశీ ప్రయాణంపై ప్రామాణిక నిర్వహణ ప్రక్రియలను ప్రకటించిన దేశీయాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ

దేశవిదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు అత్యవసర కారణాలతో స్వదేశ-విదేశ ప్రయాణం చేయడంపై దేశీయాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ (MHA) ప్రామాణిక నిర్వహణ ప్రక్రియలను (SOP)ప్రకటించింది. ఇదే అంశంపై 05.05.2020నాటి ఎంహెచ్‌ఏ జారీచేసిన ఆదేశాల స్థానంలో ఈ కొత్త ఆదేశాలు అమలులోకి వస్తాయి. ఈ మేరకు విమానాల్లో ప్రయాణించేవారికి మాత్రమేగాక సరిహద్దులగుండా భూ మార్గాన రాకపోకలు చేసేవారికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626629

కఠినమైన విధివిధానాలతో వ్యక్తిగత రక్షణ సామగ్రి (PPE) నాణ్యతకు భరోసా

వ్యక్తిగత రక్షణ సామగ్రి (PPE) కవరాల్స్‌ నాణ్యతకు సంబంధించి కొన్ని మాధ్యమాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ఈ సామగ్రి విషయంలో ఈ సందేహాలకు తావులేదు. ఈ మేరకు కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ గుర్తించిన 8 నాణ్యత నిర్ధారణ ప్రయోగశాలల పరీక్ష-ఆమోదముద్ర తర్వాతే కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖకు చెందిన హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌ తయారీ/సరఫరాదారుల నుంచి కవరాల్స్‌ను కొనుగోలు చేస్తుంది.

మరోవైపు వ్యక్తిగత రక్షణ సామగ్రితోపాటు ఎన్‌95 మాస్కుల తయారీ సామర్థ్యాన్ని భారత్‌ గణనీయంగా పెంచింది. తదనుగుణంగా నేడు రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల అవసరాలను కూడా తీర్చగలుగుతోంది. ఈ మేరకు రోజూ 3 లక్షల పీపీఈలు, ఎన్‌95 మాస్కులను భారత్‌ తయారుచేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని సంస్థలకు 111.08 లక్షల ఎన్‌95 మాస్కులు, 74.48 లక్షల పీపీఈలు సరఫరా చేయబడ్డాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1626769

ఎన్‌పీపీఏ (NPPA) సూచన నేపథ్యంలో ఎన్‌-95 మాస్కుల ధరలను తగ్గిస్తున్న దిగుమతి/తయారీ/సరఫరాదారులు

కేంద్ర ప్రభుత్వం నిత్యావసరాల చట్టం-1955 కింద ఎన్‌-95 మాస్కులను నిత్యావసర వస్తువులుగా ప్రకటించింది. దీంతో వాటి అక్రమ నిల్వ, అక్రమ విక్రయాలు శిక్షార్హనేరంగా పరిగణించబడతాయి. తదనుగుణంగా అక్రమనిల్వ, అక్రమా విక్రయాలపై నిఘా వేయడంతోపాటు సర్జికల్‌, రక్షణ మాస్కులు, శానిటైజర్లు, చేతి తొడుగులు గరిష్ఠ చిల్లర ధరకు మించి విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను ఎన్‌పీపీఏ (NPPA) ఆదేశించింది. మరోవైపు దేశంలో ఎన్‌-95 మాస్కుల నిరంతర లభ్యత దిశగా ప్రభుత్వం కృషిచేస్తోంది. ఇందుకోసం తయారీ/దిగుమతి/సరఫరాదారుల నుంచి బల్క్‌ రేట్లతో ఎన్‌-95 మాస్కులను భారీసంఖ్యలో నేరుగా కొనుగోలు చేస్తోంది. ఇక దేశంలో ఎన్‌-95 మాస్కులను ప్రభుత్వేతర కొనుగోళ్లకు వీలుగా సహేతుక ధరతో అందుబాటులో ఉంచాలని తయారీ/దిగుమతి/సరఫరాదారులకు ఎన్‌పీపీఏ సూచనపత్రం జారీచేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1626785

నజఫ్‌గఢ్‌లోని చౌదరి బ్రహ్మప్రకాష్‌ ఆయుర్వేద చరక్‌ సంస్థాన్‌ ప్రాంగణంలోగల కోవిడ్‌-19 ప్రత్యేక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించిన డాక్టర్‌ హర్షవర్ధన్‌

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ న్యూఢిల్లీలోని నజఫ్‌గఢ్‌లోగల చౌదరి బ్రహ్మప్రకాష్‌ ఆయుర్వేద చరక్‌ సంస్థాన్‌ ప్రాంగణంలోగల కోవిడ్‌-19 ప్రత్యేక ఆస్పత్రిని సందర్శించారు. “ఆయుర్వేదం భారతదేశంలో ఆవిర్భవించిన ఒక సంప్రదాయక ఔషధ విజ్ఞానం మాత్రమేగాక అపార సామర్థ్యంగల వైద్యవిధానం. ఇక్కడి డీసీహెచ్‌సీలో కోవిడ్‌-19 రోగులకు సంపూర్ణ చికిత్స, శ్రేయస్సుకోసం ఈ విధానాన్ని శక్తిమంతంగా వినియోగిస్తారు” అని డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఈ సందర్భంగా అన్నారు. ఈ విజ్ఞానానుభవాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ... ప్రత్యేకించి ప్రస్తుతం కోవిడ్‌-19తో పోరాడుతున్న రోగులకు ప్రయోజనకరం కాగలదన్నారు. కోవిడ్‌-19పై భారత్‌ ప్రతిస్పందనను వివరిస్తూ- “దేశంలో నేడు మనకు 422 ప్రభుత్వ, 177 ప్రైవేటు ప్రయోగశాలల శృంఖలం అందుబాటులో ఉంది. తద్వారా పరీక్షల నిర్వహణ సామర్థ్యం గణనీయంగా పెరిగి, రోజుకు 1,50,000 పరీక్షలు నిర్వహించగల స్థాయికి చేరాం. ఆ మేరకు నిన్న ఒక్కరోజే 1,10,397 పరీక్షలు పూర్తికాగా మొత్తంమీద నిన్నటివరకూ 29,44,874 నమూనాలను పరీక్షించాం” అని ఆయన వెల్లడించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626611

దేశంలో నిరుటికన్నా అధికంగా గోధుమ కొనుగోళ్లు

దేశంలో ప్రభుత్వ సంస్థలద్వారా గోధుమ కొనుగోళ్ల పరిమాణం నిరుటికన్నా అధికంగా నమోదైంది. ఈ మేరకు  నిరుడు 341.31 లక్షల టన్నులు కొనుగోలు చేయగా, కోవిడ్‌-19 వ్యాప్తి, దేశవ్యాప్త దిగ్బంధం ఉన్నప్పటికీ ఈ ఏడాది 24.05.2020 నాటికి 341.56 లక్షల టన్నుల గోధుమ సేకరణ పూర్తయింది. సాధారణంగా ఏటా మార్చి చివరికల్లా పంట చేతికి  రావడం మొదలై, ఏప్రిల్‌ తొలివారంలో కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. అయితే, ఈసారి 24.03.2020 అర్ధరాత్రి నుంచి జాతీయస్థాయిలో దిగ్బంధం విధించడంతో అన్నిరకాల కార్యకలాపాలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. అప్పటికే పంట కోతకు రాగా, కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, వ్యవసాయంతోపాటు అనుబంధ కార్యకలాపాల ప్రారంభానికి అనుమతి ఇచ్చింది.  దీంతో అనేక రాష్ట్రాల్లో 15.04.2020కల్లా పంట కొనుగోళ్లు కూడా మొదలవగా హర్యానాలో కాస్త ఆలస్యంగా 20.04.2020న ప్రారంభమైంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1626786

‘షాహి లిచి, జర్దాలూ మామిడి’ పండ్లను ఇళ్లకు చేరవేసేందుకు బీహార్‌ తపాలా సర్కిల్‌ సన్నాహాలు

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధం దిశగా దిగ్బంధం విధించిన కారణంగా బీహార్‌ రైతులు తాము పండించిన లిచీ, మామిడి పండ్లను మార్కెట్లకు తరలించడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఈ పండ్లను అందుబాటులోకి తేవడంతోపాటు దళారుల బెడద లేకుండా రైతులు నేరుగా తమ పంటను విక్రయించే వీలు కల్పించాలని రాష్ట్ర ఉద్యానశాఖ నిర్ణయించింది. ఈ మేరకు భారత తపాలాశాఖ సమన్యయంతో ప్రజల ముంగిటకు పండ్లను చేర్చేందుకు సిద్ధమైంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626592

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 • పంజాబ్: రాష్ట్రంలోగల వలస కార్మికులు దేశంలోని ఏ ఇతర రాష్ట్రానికైనా కాలినడకన వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాలని, పంజాబ్‌లో ఉన్నంతకాలం వారికి ఆకలిదప్పుల బెడద లేకుండా చూడాలని డిప్యూటీ కమిషనర్లు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులందర్నీ ముఖ్యమంత్రి ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా వలసకార్మికులు రోడ్డమీద నడుస్తూ కనిపిస్తే, వారిని సొంత రాష్ట్రానికి తీసుకెళ్లే బస్సులు, రైళ్లు బయల్దేరే ప్రాంతందాకా పోలీసులు వాహనాల్లో చేర్చాలని స్పష్టం చేశారు. అలాగే వలసకార్మికులు కలతపడే అవసరం లేదని, వారు సొంత రాష్ట్రానికి వెళ్లదలిస్తే వారికి ఉచిత ఆహారపానీయాలు సహా ప్రయాణ సౌకర్యం కూడా కల్పిస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
 • హర్యానా: కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా రాష్ట్రంలో చిక్కుకుపోయిన వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రోజూ వివిధ రైల్వే స్టేషన్లనుంచి శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లను నడుపుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు హర్యానా నుంచి 5 శ్రామిక్‌ స్పెషల్ రైళ్లు 24.05.2020న బయలుదేరినట్లు గుర్తుచేశారు. కాగా, దిగ్బంధంవల్ల రాష్ట్రంలో చిక్కుకున్న వలసకార్మికులను హర్యానా ప్రభుత్వం కొంతకాలం నుంచి వారి రాష్ట్రాలకు ఉచితంగా పంపుతోంది.
 • మహారాష్ట్ర: రాష్ట్రంలో ఆదివారం 3,041 కొత్త కేసులతోపాటు 58 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం సంఖ్య 50,231కు చేరగా మరణాల సంఖ్య 1,635కు పెరిగింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో 39 మరణాలు, 1,725 ​​కొత్త కేసులు నమోదవగా వీటిలో 27 కేసులు ధారవిలోని మురికివాడల సముదాయంలోనివే కావడం గమనార్హం. దిగ్బంధం ఆంక్షల సడలింపు నడుమ ముంబైనుంచి దేశీయ వాణిజ్య విమాన కార్యకలాపాలు ఈ ఉదయం క్రమానుగత పద్ధతిలో మొదలయ్యాయి. తొలిరోజున 45 విమానాలకుగాను 10 విమానాలు రద్దీ అధికంగాగల ఢిల్లీ-ముంబై మార్గంలో నడిచాయి.
 • గుజరాత్: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 394 కొత్త కేసులు నమోదుకాగా, నవ్య కరోనావైరస్ మొత్తం కేసుల సంఖ్య 14,063కు చేరింది. అంతేకాకుండా రాష్ట్రంలో మరణాల సంఖ్య 858కి పెరిగింది.
 • రాజస్థాన్: రాష్ట్రంలో ఇవాళ 145 కొత్త కేసుల నమోదుతో మొత్తం కరోనా వైరస్ పీడితుల సంఖ్య 7,173కు చేరినట్లు రాజస్థాన్‌ ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటిదాకా 163మంది ప్రాణాంతక కరోనా వైరస్‌కు బలయ్యారు. అయితే, గడచిన 24గంటల్లో రాష్ట్రంలో మరణాలేవీ సంభవించలేదు. కాగా, ఇవాళ 10లక్షలకుపైగా మిడతలు జైపూర్ నగరాన్ని కమ్ముకున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో సగానికిపైగా ఈ కీటకాల దాడితో కుదేలవుతుండగా ఇవి దాదాపు 5లక్షల హెక్టార్లలో పంటలను నాశనం చేశాయి.
 • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో మొత్తం 6,371 కేసులకుగాను 3,267 మందికి వ్యాధి నయంకాగా, ఇప్పటిదాకా 281 మరణాలు సంభవించాయి. ఇక మధ్యప్రదేశ్‌లోని మొత్తం కేసులలో సగం అంటే... 3,064 ఒక్క ఇండోర్‌ నగరంలో నమోదైనవే. అలాగే 1,241  కేసులతో భోపాల్ రెండోస్థానంలో ఉంది.
 • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో 36 కొత్త కేసులు నమోదవగా, వీరిలో అధికశాతం ఇతర రాష్ట్రాలనుంచి తిరిగి వచ్చిన వలస కార్మికులు కావడం గమనార్హం. ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 252కు చేరింది. రాష్ట్రంలో మరణాలేవీ లేకపోవడం విశేషంకాగా, యాక్టివ్‌ కేసులు 185గా ఉన్నాయి.
 • అసోం: రాష్ట్రంలోని గువహటిలోగల ఎల్‌జిబిఐ విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులందరికీ కోవిడ్‌-19 పరీక్షను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. కాగా, ప్రయాణికుల వర్గీకరణ మేరకు అసోం పౌరులను గుర్తించి, వారిని సొంత జిల్లాలకు పంపుతామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.
 • మేఘాలయ: హర్యానానుంచి 139మంది మేఘాలయ వాసులు సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. వీరికి తగురీతిలో పరీక్షలు నిర్వహించాక ఫలితాలను బట్టి, వారిని గృహనిర్బంధం లేదా కరోనా సంరక్షణ కేంద్రానికి పంపుతారు. కాగా, రాష్ట్ర్రానికి తిరిగివచ్చిన 22 మంది ప్రస్తుతం షిల్లాంగ్‌లోని పాస్టోరల్ కేంద్రంలో వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. ఇక చెన్నైనుంచి వచ్చిన 14మందికి ఇప్పటికే వ్యాధి నిర్ధారణ అయిన నేపథ్యంలో వారితో వచ్చిన మరో వ్యక్తికి కూడా సోకినట్లు ఇవాళ పరీక్షల్లో తేలింది. వచ్చినరోజునే అతడిని ఏకాంతవాసంలో ఉంచగా, ప్రస్తుతం వైద్యపర్యవేక్షణకు పంపారు. కాగా- మేఘాలయకు చెందిన వలసకార్మికులతో రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి రేపు ప్రత్యేక రైళ్లు బయల్దేరనుండగా, ఢిల్లీ, కేరళ రాష్ట్రాల నుంచి ఎల్లుండి ప్రారంభమవుతాయి.
 • మణిపూర్: మణిపూర్‌ వచ్చే విమాన ప్రయాణికుల కోసం సవరించిన ప్రామాణిక నిర్వహణ ప్రక్రియ జారీఅయింది. ఈ మేరకు విమానాశ్రయంలో ఆరోగ్య తనిఖీ, అంచనాల మేరకు పరీక్షల నిర్వహణ సహా నిర్బంధవైద్య పర్యవేక్షణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
 • మిజోరం: రాష్ట్రంలోని జోరమ్ వైద్య కళాశాల ప్రయోగశాలలో కోవిడ్‌-19 RT-PCR పరీక్షల కోసం ప్రభుత్వం పూలింగ్ పద్ధతిని ప్రారంభించింది. దీనికింద రోజూ 100 నమూనాలను పరీక్షిస్తారు.
 • నాగాలాండ్: రాష్ట్రంలో ఇవాళ నమోదైన కొత్త కేసులలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. వీరు ముగ్గురూ చెన్నై నుంచి నాగాలాండ్‌ తిరిగి వచ్చినవారు. ఇక రాష్ట్రంలోని మోన్‌ పట్టణంలోగల ఐటిఐ వద్ద కోవిడ్‌-19 రోగుల కోసం నిర్బంధవైద్య పర్యవేక్షణ కేంద్రం ఏర్పాటు కోసం ఈ జిల్లాలోని 40 మంది ఎస్‌ఎస్‌ఏ ఉపాధ్యాయుల బృందం సహాయం అందించింది.

*******(Release ID: 1626844) Visitor Counter : 28


Read this release in: English , Urdu , Hindi , Marathi , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam