వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ప్రభుత్వ సంస్థల గోధుమల సేకరణ గత సంవత్సరం గణాంకాలను అధిగమించింది

కోవిడ్ కారణంగా పక్షం ఆలస్యం ఉన్నప్పటికీ, ఈ ఏడాది సేకరణ 341.56 లక్షల టన్నులకు చేరింది. ఇది గత ఏడాది మొత్తం సేకరణ కంటే 25,000 టన్నులు అధికం

Posted On: 25 MAY 2020 12:17PM by PIB Hyderabad

ప్రభుత్వ సంస్థల ద్వారా గోధుమల సేకరణ గత ఏడాది 341.31 లక్షల మెట్రిక్ టన్నులు కాగా ఈ ఏడాది మే నెల 24వ తేదీ నాటికి గోధుమల సేకరణ  341.56 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. కోవిడ్ -19 వైరస్ వ్యాప్తి మరియు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా ఏర్పడిన అన్ని అడ్డంకులను తట్టుకుని, గత ఏడాది సేకరణను అధిగమించాయి. గోధుమ పంట కోత, సాధారణంగా ప్రతి ఏటా, మార్చి చివరి వరకు మొదలవుతుంది, సేకరణ ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమవుతుంది.  అయితే, 2020 మర్చి 24వ తేదీ అర్ధరాత్రి నుండి , జాతీయ లాక్ డౌన్ విధించడంతో, అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి.  అప్పటికి పంట పూర్తిగా తయారై, కోతకు సిద్ధంగా ఉంది.  ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, లాక్ డౌన్ వ్యవధిలో వ్యవసాయ మరియు సంబంధిత కార్యకలాపాలను ప్రారంభించడానికి భారత ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. దీంతో,  చాలా రాష్ట్రాలలో 15.04.2020 నుండి సేకరణ ప్రారంభమైంది.  హర్యాణాలో మరింత ఆలస్యంగా 2020 ఏప్రిల్ 20వ తేదీన గోధుమల సేకరణ ప్రారంభమైంది.  

మహమ్మారి సమయంలో సురక్షితమైన పద్ధతిలో సేకరణ జరిగేలా చూడటం అతిపెద్ద సవాలుగా పరిణమించింది.  దీన్ని అధిగమించడానికి, అవగాహన కల్పన, సామాజిక దూరం మరియు సాంకేతిక పరిజ్ఞానం వంటి బహుముఖ వ్యూహాన్ని అనుసరించడం జరిగింది.  కొనుగోలు కేంద్రాల సంఖ్యను గణనీయంగా పెంచి,  వ్యక్తిగత కొనుగోలు కేంద్రాల్లో రైతుల రద్దీని గణనీయంగా తగ్గించారు. గ్రామ పంచాయతీ స్థాయిలో లభించే ప్రతి సదుపాయాన్ని ఉపయోగించి కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.  పంజాబ్ వంటి ప్రధాన సేకరణ రాష్ట్రాలలో ఈ సంఖ్య 1836 నుండి 3681 కు పెరిగింది, హర్యానాలో 599 నుండి 1800 వరకు, మధ్యప్రదేశ్ లో 3545 నుండి 4494 వరకు గోధుమ కొనుగోలు కేంద్రాలను గణనీయంగా పెంచారు.    సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో, రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లకు తీసుకురావడానికి, నిర్దిష్ట తేదీలు మరియు స్లాట్లు అందించబడ్డాయి. ఇది మార్కెట్లలో రద్దీని నివారించదానికి, సహాయపడింది.  సామాజిక దూరం నిబంధనలను ఖచ్చితంగా అనుసరించడం జరిగింది, అదేవిధంగా, పారిశుధ్య కార్యకలాపాలు క్రమం తప్పకుండా చేపట్టడం జరిగింది.  పంజాబ్ లో, ప్రతి రైతుకు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకోడానికి నిర్దిష్ట స్థలం కేటాయించారు. ఆ ప్రాంతాలలోకి ఇతరులెవ్వరూ ప్రవేశించకుండా కట్టుదిట్టం చేశారు.  రోజువారీ వేలంలో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వ్యక్తులను మాత్రమే వేలం జరిగే ప్రదేశం లోపలికి అనుమతించారు.

వైరస్ వ్యాప్తి ముప్పుతో పాటు, గోధుమ సేకరణ సంస్థలు ప్రధానంగా మూడు సవాళ్లను ఎదుర్కొన్నాయి.  అన్ని జనపనార మిల్లులు పనిచేయకపోవడంతో, సేకరించిన గోధుమలను నింపడానికి ఉపయోగించే జనపనార సంచుల ఉత్పత్తి ఆగిపోయింది, ఇది పెద్ద సంక్షోభాన్ని సృష్టించింది. ఎక్కువగా ప్లాస్టిక్ సంచులను ఉపయోగించడం ద్వారా మరియు  చాలా కఠినమైన నాణ్యతా పరీక్షల అనంతరం ఉపయోగించిన సంచులను తిరిగి ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు పరిష్కరించడం జరిగింది.   నిరంతర పర్యవేక్షణతో పాటు, సకాలంలో తీసుకున్న చర్యల ఫలితంగా, దేశంలో ఎక్కడా, ప్యాకేజింగ్ సామగ్రి కొరత కారణంగా గోధుమల సేకరణ ఆగకుండా కొనసాగింది.   

అన్ని ప్రధాన గోధుమ ఉత్పాదక రాష్ట్రాల్లో అకాల వర్షాల కారణంగా గోధుమలు తడిసాయి.  సాధారణ నాణ్యతా ప్రమాణాల నిబంధనల ప్రకారం తడిసిన నిల్వలను సేకరించడం సాధ్యం కానందున, రైతులకు ఇది ఒక పెద్ద ముప్పుగా తయారయ్యింది.  భారత ప్రభుత్వం మరియు భారత ఆహార సంస్థ (ఎఫ్. సి.ఐ.) వెంటనే జోక్యం చేసుకుని, వివరణాత్మక శాస్త్రీయ విశ్లేషణ నిర్వహించిన తరువాత, ఏ రైతుకు ఇబ్బంది కలుగకుండా గోధుమ నాణ్యతా ప్రమాణాలను సవరించడం జరిగింది.  అయితే సేకరించిన ఉత్పత్తులు వినియోగదారుల కనీస నాణ్యత అవసరాలకు అనుగుణంగా ఉండే విధంగా వీటిని సవరించడం జరిగింది. 

ఇక మూడవ సవాలు, వైరస్ గురించి ప్రజలలో ఏర్పడిన సాధారణ భయం కారణంగా  తగిన సంఖ్యలో కార్మికులు అందుబాటులో లేకపోవడం.  స్థానికుల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర పాలనా యంత్రాంగాలు నిరంతరం తగిన చర్యలను తీసుకోవడంతో, ఈ సమస్య  పరిష్కారమయ్యింది.  మాస్కులు, శానిటైజర్లు వంటి తగిన రక్షణ భద్రతా వస్తువులను కార్మికులకు అందించి,  వారి భద్రతను నిర్ధారించడానికి అవసరమైన ఇతర ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. 

భారత ప్రభుత్వం, భారత ఆహార సంస్థ, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు వారి ఏజెన్సీల సమిష్టి మరియు సమన్వయ ప్రయత్నాలతో, అన్ని మిగులు రాష్ట్రాల్లో గోధుమల సేకరణ చాలా సజావుగా చేపట్టడం జరిగింది. రైతులకు అవసరమైన సహాయం అందిచడానికీ, సెంట్రల్ పూల్‌లో నిల్వలను తిరిగి నింపడానికీ ఇది ఎంతగానో తోడ్పడింది. 

రాష్ట్రాల వారీగా,  గోధుమ సేకరణ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి: 

క్రమ సంఖ్య 

రాష్ట్రం పేరు 

24.05.2020 వరకు గోధుమల సేకరణ 

(లక్షల మెట్రిక్ టన్నులలో)

1

పంజాబ్ 

125.84

2

మధ్యప్రదేశ్ 

113.38

3

హర్యాణా 

70.65

4

ఉత్తరప్రదేశ్ 

20.39

5

రాజస్థాన్ 

10.63

6

ఉత్తరాఖండ్ 

0.31

7

గుజరాత్ 

0.21

8

చండీగఢ్ 

0.12

9

హిమాచల్ ప్రదేశ్ 

0.03

మొత్తం 

                                                                               341.56

 

 

*****

 



(Release ID: 1626786) Visitor Counter : 292