PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 23 MAY 2020 7:55PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • కోవిడ్‌-19 నయమైనవారు 51,783మంది; కోలుకున్నవారి శాతం 41.39కి పెరిగింది.
  • దేశవ్యాప్తంగా నిన్నటినుంచి 6,654 కొత్త కేసుల నమోదుతో మొత్తం రోగుల సంఖ్య 1,25,101కి చేరిక.
  • రానున్న 10 రోజుల్లో మరో 2,600 శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లు నడపనున్న భారత రైల్వేశాఖ
  • నిరుటితో పోలిస్తే ఈ ఏడాది మరింత పెరిగిన వేసవి పంటల సాగు విస్తీర్ణం.
  • దేశంలోని వివిధ ఆస్పత్రులు, వ్యక్తుల అవసరాల మేరకు 2000 టన్నుల ఔషధాలు, వైద్య పరికరాలను చేరవేసిన భారత తపాలాశాఖ.

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి ఇవాళ తమశాఖలోని సీనియర్‌ అధికారులతో కలసి  దేశంలో కోవిడ్‌-19 కేసులు అధికంగా నమోదవుతున్న 11 పురపాలక ప్రాంతాల పరిధిలోని అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులు, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శులు, పురపాలక కమిషనర్లు, మిషన్ డైరెక్టర్లు (NHM) ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. జాతీయ సగటుతో పోలిస్తే కేసులు రెట్టింపయ్యే వ్యవధి తక్కువగా ఉండటం, మరణాల శాతంతోపాటు నిర్ధారిత కేసుల సంఖ్య కూడా అధికంగా ఉండటాన్ని పలు పుర/నగరపాలికలలో ప్రధాన సమస్యలుగా పేర్కొన్నారు. కేసులను త్వరగా గుర్తించి సకాలంలో వైద్య నిర్వహణ చేపట్టి మరణాల శాతం తగ్గింపు దిశగా భరోసా ఇచ్చేవిధంగా కొన్ని పురపాలికల పరిధిలో రోగనిర్ధారణ పరీక్షలను వేగిరపరచాల్సిన అవసరం ఉందని సూచించారు.

దేశంలో ఇప్పటిదాకా 51,783 మందికి వ్యాధి నయంకాగా, గడచిన 24గంటల్లో నయమైన వారి సంఖ్య 3,250గా ఉండటంతో కోలుకునేవారి శాతం 41.39గా నమోదైంది. నిన్నటినుంచి 6,654; కొత్త కేసుల నమోదుతో మొత్తం నిర్ధారిత కేసుల సంఖ్య 1,25,101కి చేరింది.

మరో 10 రోజుల్లో 2,600 ‘శ్రామిక్‌ స్పెషల్‌’ రైళ్లను నడపనున్న భారత రైల్వేశాఖ

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలసకార్మికులను సొంత రాష్ట్రాలకు చేర్చడం కోసం భారత రైల్వేశాఖ నిరంతరం కృషిచేస్తోంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల అవసరాలకు తగినట్లు దేశవ్యాప్తంగా రాబోయే 10రోజుల్లో మరో 2,600 శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లను నడపాలని కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అనేక ప్రాంతాల్లో చిక్కుబడిన సుమారు 36 లక్షల మంది ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుందని అంచనా. కాగా, దిగ్బంధం కారణంగా అనేక ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులతోపాటు యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు తదితరుల కోసం 2020 మే 1 నుంచి రైల్వేశాఖ ‘శ్రామిక్‌ స్పెషల్‌’ రైళ్లను నడుపుతోంది. వీటిని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు మధ్యలో ఎక్కడా ఆగకుండా ఒక రాష్ట్రంలోని ప్రదేశం నుంచి మరో రాష్ట్రంలోని ప్రదేశానికి ఈ రైళ్లను నడిపిస్తోంది. ఇందులో భాగంగా గడచిన 23 రోజుల్లో 2,600 శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లను నడపగా 36 లక్షలమందికి ప్రయోజనం కలిగింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1626443

రైల్వేశాఖ జూన్‌ 1నుంచి నడపనున్న 200 రైళ్లకు జోరుగా టికెట్ల బుకింగ్‌

భారత రైల్వేశాఖ 2020 జూన్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా 200 రైళ్లను నడపడంద్వారా తన ప్రయాణిక రవాణ కార్యకలాపాలను పునరుద్ధరించనుంది. ఈ మేరకు 2020 మే 21 నుంచి ఈ రైళ్లకు టికెట్ల విక్రయం ప్రారంభించింది. ఈ నెల 1వ తేదీనుంచి నడుపుతున్న శ్రామిక్‌ స్పెషల్‌, 12వ తేదీనుంచి ప్రవేశపెట్టిన 30 ప్రత్యేక ఏసీ రైళ్లకు ఈ 200 రైళ్లు అదనం. కాగా, ఈ రైళ్లలో ప్రయాణానికి టికెట్ల బుకింగ్‌ మే 21వ తేదీన మొదలుకాగా, 2020 మే 22వ తేదీ రాత్రి 08:14 గంటల సమయానికి 14,13,277 మంది ప్రయాణికులు 6,52,644 ఆన్‌లైన్‌ టికెట్లను బుక్‌చేసుకున్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1626338

నిరుటితో పోలిస్తే ఈ ఏడాది వేసవి పంటల సాగు విస్తీర్ణం పెరుగుదల; దిగ్బంధం ఉన్నప్పటికీ ఉత్పత్తుల సేకరణలో పెరుగుదల

దేశంలో నిరుటితో పోలిస్తే ఈ ఏడాది వరి, పప్పుదినుసులు, ముతకధాన్యాలు, నూనెగింజలు తదితర వేసవి పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. అలాగే 2020-21 రబీ మార్కెట్‌ సీజన్‌లో భారత ఆహార సంస్థకు 337.48 లక్షల టన్నుల గోధుమ రాగా, ఇందులో 326.96 లక్షల టన్నులు కొనుగోలు చేసినదే కావడం ఈ సందర్భంగా గమనార్హం. కాగా, దిగ్బంధం ఉన్నప్పటికీ ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద 24.3.2020 నుంచి నేటిదాకా రూ.19,100.77కోట్లు విడుదలచేయగా సుమారు 9.55కోట్ల రైతుకుటుంబాలు లబ్ధిపొందాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1626339

దేశవ్యాప్తంగా 2000 టన్నుల ఔషధాలు, వైద్య పరికరాలను చేరవేసిన భారత తపాలా శాఖ

ప్రధానమంత్రి నిర్దేశిత ‘స్వయం సమృద్ధ భారత్‌’ స్వప్న సాకారం దిశగా కృషిచేయాలని కేంద్ర కమ్యూనికేషన్లు-ఎలక్ట్రానిక్స్‌-ఐటీ శాఖల మంత్రి శ్రీ రవిశంకర్‌ ప్రసాద్‌ భారత తపాలా శాఖ సీనియర్‌ అధికారులను ఆదేశించారు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కింద ‘సి-డాట్‌’ రూపొందించిన దృశ్య-శ్రవణమాధ్యమ పరిజ్ఞానం ఆధారిత తొలి దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశంలో ఈ మేరకు మంత్రి ప్రసంగించారు. ఈ పరిజ్ఞానాన్ని విజయవంతంగా ప్రయోగించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కాగా, కోవిడ్‌ సమయంలో భారత తపాలాశాఖ పలు విధాలుగా తనవంతు కృషిని కొనసాగించింది. ఆ మేరకు- దేశవ్యాప్తంగాగల ఆస్పత్రులు, వ్యక్తుల అవసరాలకు తగినట్లు 2000 టన్నులకుపైగా ఔషధాలు, వైద్య పరికరాలను బుక్‌చేసుకుని, వారికి చేరవేసింది; అలాగే రోడ్డు రవాణా నెట్‌వర్క్‌ ద్వారా నిత్యం 25,000 కిలోమీటర్ల మేర వాహనాలను నడుపుతూ 75 టన్నుల పార్శిళ్లు, తపాలాను చేరవేస్తూ సరఫరా శృంఖలాన్ని బలోపేతం చేసింది; ఆధార్‌ ప్రాతిపదిక చెల్లింపు వ్యవస్థకింద భారత తపాలాశాఖ చెల్లింపుల బ్యాంకుద్వారా 85లక్షలమంది లబ్ధిదారులకు రూ.1,500కోట్లకుపైగా పంపిణీ చేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1626403

భారత, మారిషస్‌ ప్రధానమంత్రుల మధ్య టెలిఫోన్‌ సంభాషణ

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, గౌరవనీయులైన మారిషస్‌ ప్రధానమంత్రి ప్రవింద్‌ జగన్నాథ్‌తో ఫోన్‌ద్వారా సంభాషించారు. ఇటీవలి అంఫన్‌ తుఫాను కారణంగా భారత్‌లో ప్రాణనష్టం వాటిల్లడంపై జగన్నాథ్‌ సంతాపం ప్రకటించారు. కోవిడ్‌-19పై మారిషస్‌ సాగిస్తున్న పోరులో అక్కడి వైద్యసిబ్బందికి మద్దతుగా ‘ఆపరేషన్‌ సాగర్‌’ కింద భారత నావికాదళ నౌక ‘కేసరి’ద్వారా ఔషధాలు, వైద్యసిబ్బంది బృందాన్ని పంపినందుకు ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఇటువంటి సంక్షోభ సమయాల్లో పొరుగునగల మిత్రదేశాలకు మద్దతివ్వడాన్ని భారత్‌ తన కర్తవ్యంగా భావిస్తుందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతేగాక ప్రజలతో-ప్రజలకు సంబంధాల నేపథ్యంలో రెండు దేశాల నడుమగల స్నేహం ప్రాముఖ్యాన్ని గుర్తుచేశారు.  

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1626410

భారత ప్రధానమంత్రి, శ్రీలంక అధ్యక్షుల మధ్య టెలిఫోన్‌ సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గౌరవనీయులైన శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్షతో టెలిఫోన్‌ ద్వారా సంభాషించారు. ప్రస్తుత కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా ఈ ప్రాంతంపై పడే ఆరోగ్య-ఆర్థిక ప్రభావాలపై ఈ సందర్భంగా వారిద్దరూ చర్చించారు. కాగా, ఈ మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కొనడంలో శ్రీలంకకు అన్నవిధాలా వీలైనంత మేరకు మద్దతిస్తామని శ్రీలంక అధ్యక్షుడికి ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1626400

దేశవ్యాప్తంగా 72 గంటలకన్నా తక్కువ వ్యవధిలో జాతీయ పరీక్షాభ్యాస యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న 2,00,000 మంది విద్యార్థులు

దేశవ్యాప్తంగా జేఈఈ (మెయిన్స్‌), నీట్‌ తదితర పరీక్షలకు హాజరయ్యే వారికోసం జాతీయ పరీక్షల ప్రాధికార సంస్థ (NTA) రూపొందించిన జాతీయ పరీక్షాభ్యాస్‌ యాప్‌కు విద్యార్థుల్లో విశేషాదరణ లభిస్తున్నదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి శ్రీ రమేష్‌ పోఖ్రియాల్‌ ‘నిషాంక్‌’ తెలిపారు. ఆ మేరకు యాప్‌ను ప్రవేశపెట్టిన తర్వాత 72 గంటలకన్నా తక్కువ వ్యవధిలోనే 2,00,000 మందికిపైగా విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా వీరిలో 80వేల మంది ఇప్పటికే జేఈఈ (మెయిన్స్‌), ‘నీట్‌’ నమూనా పరీక్షలు కూడా రాశారని పేర్కొన్నారు. ఈ విద్యార్థుల్లో అధికశాతం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య పరీక్షల్లో పాల్గొన్నారని మంత్రి వివరించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1626342

సామాజిక రేడియోలలో ప్రకటనల ప్రసార సమయం గంటకు 12 నిమిషాల స్థాయికి పెంచడంపై సంప్రదింపులు సాగుతున్నాయి: శ్రీ ప్రకాష్‌ జావడేకర్‌

సామాజిక రేడియోలలో ప్రకటన ప్రసార సమయాన్ని పెంచడంపై తాను అమితాసక్తితో ఉన్నానని కేంద్ర సమాచార-ప్రసారశాఖ మంత్రి శ్రీ ప్రకాష్‌ జావడేకర్‌ చెప్పారు. ఈ రేడియో స్టేషన్లద్వారా ప్రస్తుతం గంటకు 7 నిమిషాలు ప్రకటనలను అనుమతిస్తుండగా, ఇకపై టీవీ చానెళ్లతో సమానంగా గంటకు 12 నిమిషాల స్థాయికి పెంచనున్నట్లు తెలిపారు. అంతకుముందు కరోనా వైరస్‌పై పోరాటం కొనసాగించాలని సామాజిక రేడియో స్టేషన్లద్వారా ప్రజలనుద్దేశించిన ప్రసంగించిన సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. దేశం నుంచి ఇతర వ్యాధులను పారదోలిన రీతిలోనే కరోనా వైరస్‌ను కూడా తరిమికొట్టగలమని మంత్రి ధీమా వ్యక్తంచేశారు. అయితే, ఇందుకోసం ఇకపై నాలుగంచెల కొత్త సంప్రదాయం అనుసరించాల్సి ఉందన్నారు. తదనుగుణంగా ‘వీలైనంత మేర ఇల్లు వదలరాదని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, ఫేస్‌ మాస్క్‌ ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించా’లని స్పష్టంచేశారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1626221

ఏప్రిల్‌ 2020కిగాను నెలవారీ ఉత్పత్తి నివేదిక

కోవిడ్‌-19 కారణంగా దేశవ్యాప్త దిగ్బంధం కొనసాగిన నేపథ్యంలో 2020 ఏప్రిల్‌ నెలలో ముడిచమురు, సహజవాయువుల ఉత్పత్తి, చమురుశుద్ధి ఉత్పాదకతలు తగ్గాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626327

కోవిడ్‌ అనంతరం ఆత్మవిశ్వాసపూరిత భారత్‌ ఆవిర్భవిస్తుంది; ప్రపంచ వేదికపై తన ప్రతిష్ఠను ఘనంగా చాటుతుంది: డాక్టర్‌ జితేంద్ర సింగ్‌

కోవిడ్‌ అనంతరం ఆత్మవిశ్వాసపూరిత భారత్‌ ఆవిర్భవిస్తుందని, అంతేకాకుండా ప్రపంచ వేదికపై తన ప్రతిష్ఠను ఘనంగా చాటుతుందని కేంద్రం మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో రకరకాల భయాందోళనలు, అంచనాలు వినిపిస్తున్నప్పటికీ నేటినుంచి మరో ఆరు నెలల్లో ప్రపంచమంతా భారత్‌వైపు సగౌరవంగా చూడటంతోపాటు కలసి నడిచేందుకు ఉవ్విళ్లూరుతుందని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ ఆత్మవిశ్వాసం వెలిబుచ్చారు. అలాగే వర్తక-వాణిజ్యాలకు భారతదేశం సురక్షిత గమ్యంగా అవతరించగలదని మంత్రి ఆశాభావం ప్రకటించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1626344

ఎక్కువ సమయం ధరించగలిగే సౌకర్యవంతమైన ఫేస్‌ మాస్కును రూపొందించిన ‘సీఈఎన్‌ఎస్‌’

బెంగళూరులోగల “సెంటర్‌ ఫర్‌ నానో అండ్‌ సాఫ్ట్‌ మేటర్‌ సైన్సెస్‌” (CeNS) లోని పరిశోధకుల బృందం కప్‌ ఆకారంలో మాస్కును (పేటెంట్‌కు దరఖాస్తు దాఖలు) రూపొందించింది. దీన్ని ధరించినవారు ఎదుటి వ్యక్తులతో మాట్లాడేందుకు తగినంత ఖాళీ ఉంటుంది. దీన్ని భారీస్థాయిలో ఉత్పత్తి చేసేందుకుగాను తయారీ విధానాన్ని బెంగళూరులోని ఒక కంపెనీకి దఖలుపరచింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1626440

కోవిడ్‌-19పై పోరాటంలో అజ్మీర్‌ స్మార్ట్‌ సిటీ ‘వ్యూహబృందం’ విశేషపాత్ర

అజ్మీర్‌ పురపాలక సంస్థ నగర్‌ నిగమ్‌లో కోవిడ్‌-19 వ్యూహబృందాన్ని ఏర్పాటు చేసింది. దీనికి అజ్మీర్‌ పాలకయంత్రాంగంలోని సీనియర్‌ అధికారులు, వైద్య-పోలీసు అధికారులు నేతృత్వం వహిస్తున్నారు. నగరంలో ప్రస్తుత కోవిడ్‌-19 పరిస్థితిని పర్యవేక్షిస్తూ పౌరులలో వ్యాధి వ్యాప్తిని నియంత్రించడానికి, తగు చర్యలు తీసుకోవడానికి ఈ బృందం కృషిచేస్తుంది. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ, దేశీయాంగశాఖ జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుజాగ్రత్తలు తీసుకోవడంసహా పౌరులలో విస్తృత అవగాహన కల్పించేందుకు అనుసరించాల్సిన వివిధ వినూత్న వ్యూహాలను రూపొందించి, అమలు చేయడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1626447

‘స్థానికం నుంచి అంతర్జాతీయ స్థాయికి’ ఇతివృత్తంగా 2020 సెప్టెంబర్‌ నుంచి ‘హ్యునర్‌ హాట్‌’ పునఃప్రారంభం

దేశంలోని వివిధ ప్రాంతాల చేతివృత్తులవారు/హస్త కళాకారుల ‘సాధికారత ఆదానప్రదాన’ వేదికగా నిలిచిన ‘హ్యునర్‌ హాట్‌’ నిర్వహణ కరోనా మహమ్మారి కారణంగా సుమారు 5 నెలలపాటు ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ‘స్థానికం నుంచి అంతర్జాతీయ స్థాయికి’ ఇతివృత్తంగా 2020 సెప్టెంబర్‌ నుంచి పునఃప్రారంభం కానుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1626398

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • చండీగఢ్‌: కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌ పరిధిలోని బాపూధామ్‌ కాలనీపై ప్రత్యేకంగా దృష్టి సారించి, వ్యాధి వ్యాప్తిని అరికట్టాలని నగర పాలనాధికారి మరోసారి ఆదేశించారు. ఆ మేరకు లోతుగా, ముమ్మరంగా తనిఖీ నిర్వహించాలని తద్వారా చికిత్సకు తరలించాల్సిన కేసులను త్వరగా గుర్తించే వీలుంటుందని పేర్కొన్నారు.
  • పంజాబ్: విదేశాల్లో చిక్కుకున్నవారిని రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా, అమెరికా నుంచి తొలి విమానం 22.05.2020న మొహాలీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. అనంతరం ఆరోగ్యశాఖ నిర్దేశిత విధానం ప్రకారం... ప్రయాణికులంతా భౌతిక దూరం నిబంధనను కఠినంగా పాటించేలా చూడటంతోపాటు వారికి వైద్య పరీక్షలు నిర్వహించేలా అధికారులు తగు చర్యలు తీసుకున్నారు. కాగా, ఈ వైద్య పరీక్షల అనంతరం ఎవరిలోనూ వ్యాధి లక్షణాలు కనిపించలేదు. అటుపైన మాస్కులతో ముఖాన్ని కప్పడం, హస్తపరిశుభ్రత ద్రవాల వినియోగం, వీలైనన్ని సార్లు చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం తదితర మార్గదర్శకాలను పాటించేవిధంగా విమానాశ్రయంలో నియమించిన ఆరోగ్యశాఖ బృందాలు ప్రయాణికులకు అవగాహన కల్పించాయి.
  • హర్యానా: దేశీయాంగ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా నాలుగోదశ దిగ్బంధ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా టాక్సీలు, క్యాబ్‌ల నిర్వాహక సంస్థలు, మాక్సీక్యాబ్‌లు, ఆటోరిక్షాల్లో సీటింగ్ పరిమితులపై హర్యానా ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది. టాక్సీ, క్యాబ్ నిర్వాహక సంస్థల డ్రైవర్‌తోపాటు ఇద్దరు ప్రయాణికులు... అంటే- వాహనంలో ముగ్గురు వ్యక్తులను మాత్రమే అనుమతించాలి. ఇక ద్విచక్ర వాహనాలపై చోదకులతోపాటు వెనుక ఒక్కరికి మాత్రమే అనుమతించగా, వారిద్దరూ తప్పనిసరిగా హెల్మెట్లు, మాస్కులు, గ్లోవ్స్‌ కూడా ధరించాలి. ఇక మనుషులు లాగే రిక్షాలలో ఇద్దరికి మించి వెళ్లకూడదు. కాగా, డ్రైవర్లు, ప్రయాణికులంతా తమ మొబైల్ ఫోన్లలో ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, తమ ఆరోగ్యస్థితిని క్రమం తప్పకుండా అందులో ఎప్పటికప్పుడు నమోదు చేస్తూండాలని ప్రభుత్వం నిర్దేశించింది.
  • హిమాచల్ ప్రదేశ్: దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి రాష్ట్రానికి రైళ్లలో వచ్చే వ్యక్తులతో వ్యవహరించే వైద్యులు, పారామెడికల్-పోలీసు, ఇతరత్రా సిబ్బంది అందరికీ అవసరమైన వ్యక్తిగత రక్షణ ఉపకరణాలను అందజేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు రాష్ట్రానికి చేరుకునే అవకాశాలు ఉన్నందున ఆయా జిల్లాల్లో సంస్థాగత నిర్బంధ వైద్యపర్యవేక్షణ కోసం అదనపు సౌకర్యాలు కల్పించాలని డిప్యూటీ కమిషనర్లను కూడా ఆయన ఆదేశించారు. అలాగే గృహనిర్బంధంలో ఉన్నవారు ఇతర కుటుంబసభ్యులతో కలవకుండా ఒంటరిగా ఉండేవిధంగా చూస్తూ వైరస్ సంక్రమణ క్రమాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడగల సమర్థ పర్యవేక్షణ యంత్రాంగాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు.
  • అసోం: గువహటిలోని కాలాపహాడ్‌ ఆసుపత్రిని జీఎంసీహెచ్‌ పరిధిలో పూర్తిస్థాయి కోవిడ్‌-19 ప్రత్యేక వైద్యకేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దీన్ని 20 మంది వైద్యులు, 30 మంది నర్సులు, 25 నాలుగో తరగతి సిబ్బంది, 9 క్లీనర్లతో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.
  • మణిపూర్: రాష్ట్రంలో బ్యాంకులు, టెలికాం సంబంధిత కార్మికులందరూ కర్ఫ్యూ పాసులతో నిమిత్తం లేకుండా స్వేచ్ఛగా వెళ్లేందుకు అనుమతిస్తారు. కాగా మణిపూర్‌లో మరో వ్యక్తికి కోవిడ్‌-19 నిర్ధారణ అయింది. ఇతడు ఈ నెల 13వ తేదీన చెన్నైనుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చినవారు కావడం గమనార్హం.
  • మిజోరం: కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల జీతాల్లో కొంత నిలిపివేయాలని మంత్రిమండలి నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు.
  • నాగాలాండ్: నాగాలాండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు బహూకరించిన ఆటోమేటిక్ క్రిమిసంహారక బూత్‌లను దిమాపూర్ రైల్వే స్టేషన్‌వద్ద ఏర్పాటుచేశారు. కాగా, రాష్ట్రానికి తిరిగి వచ్చేవారిపై స్థానికులు లేనిపోని దాష్టీకం ప్రదర్శించకుండా కఠినచర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కమిషనర్లను ఆదేశించింది.
  • కేరళ: రాష్ట్రంలో కోవిడ్ సంక్షోభంపై చర్చించేందుకు బుధవారం దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అనంతరం గురువారంనాడు రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆయన సమావేశమవుతారు. వస్తుసేవల పన్నుపై విపత్తు రుసుమును 5 శాతంకన్నా ఎక్కువ విధించాలన్న కేంద్ర ప్రభుత్వ యోచనను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి విమర్శించారు. ఈ మేరకు రాష్ట్రాల అధికారాలను హరించేదిశగా కేంద్రం కొత్త సంప్రదాయం ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. కాగా, రేపు ఈద్-ఉల్-ఫితర్ వేడుకల నేపథ్యంలో ఇవాళ, రేపు ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ రాత్రి 9 గంటలవరకు అవసరమైన వస్తువుల దుకాణాలు తెరిచి ఉంటాయి. ఇక రాష్ట్రంలోకి తీసుకువచ్చే పండ్లు, కూరగాయల తనిఖీకోసం అన్ని సరిహద్దు తనిఖీ కేంద్రాలవద్ద ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఇవాళ 6 వందే భారత్ విమానాలు రాష్ట్రానికి రానున్నాయి. కాగా, గల్ఫ్‌ దేశాల్లో ఇవాళ మరో ఇద్దరు కేరళీయులు కోవిడ్-19కు బలయ్యారు. రాష్ట్రం వెలుపలి ప్రాంతాల్లో వైరస్ బారినపడి సుమారు 149మంది కేరళీయులు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒకే రోజున ఏకంగా 42 మంది వ్యక్తులకు కోవిడ్-19 నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 216కు చేరాయి.
  • తమిళనాడు: ప్రపంచ మహమ్మారి కారణంగా వస్తుసేవల పన్ను చట్ట నిబంధనల అమలు వీలుకాని నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దడం కోసం తమిళనాడు గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ యాక్ట్-2017ను సవరిస్తూ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ జారీచేసింది. కాగా, గడచిన 58రోజుల్లో అమ్మ క్యాంటీన్లద్వారా 6 లక్షల మందికి ఆహారాన్ని అందించారు. రాష్ట్రంలో చెన్నైతోపాటు నియంత్రణ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో మే 24 నుంచి సెలూన్లు, బ్యూటీ పార్లర్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. రాష్ట్రంలో నిన్న 786 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు: 13,967, యాక్టివ్ కేసులు: 7524, మరణాలు: 94, డిశ్చార్జ్: 7128. చెన్నైలో యాక్టివ్ కేసులు 5681గా ఉన్నాయి.
  • కర్ణాటక: రాష్ట్రంలో ఈ మధ్యాహ్నం 12 గంటలవరకు ఒకేరోజు అత్యధికంగా 196 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో గడగ్ 15, యాదగిరి 72, బెంగళూరు 4, చిక్కబళ్లాపుర 20, కలబుర్గి 1, రాయచూర్ 39, దక్షిణ కన్నడ 3, హసన్ 4, మాండ్యా 28, దావనగేరె 3, కోలార్ 2, బెళగావి 1, ఉత్తర కన్నడ 2, ధార్వాడ్ 1, ఉడుపి 1 వంతున ఉన్నాయి. ఇక ఇవాళ ఇద్దరు మరణించగా, ఒకరు డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో మొత్తం కేసులు 1939కి చేరగా, యాక్టివ్‌: 1297, కోలుకున్నవి: 598, మరణాలు: 42గా ఉన్నాయి. నిన్న మహారాష్ట్ర నుంచి తిరిగి వచ్చిన 116మందికి వ్యాధి నిర్ధారణ అయింది. కాగా, మే 31 వరకూ శ్రామిక్‌ స్పెషల్ రైళ్లలో వలసకార్మికుల ప్రయాణ ఖర్చులను రాష్ట్రం భరించనుంది.
  • ఆంధ్రప్రదేశ్: పొగాకుకు మద్దతు ధర కోరుతూ నెల్లూరులోని రైతులు ముంబై జాతీయ రహదారిపై బైఠాయించి డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఇవాళ 9136 నమూనాలను పరీక్షించిన నేపథ్యంలో గత 24 గంటల్లో 47 కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఒకరు మరణించగా, 47 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య: 2561. యాక్టివ్: 727, రికవరీ: 1778, మరణాలు: 56. ఇతర రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చినవారికి పరీక్షలు నిర్వహించగా 153మందికి లక్షణాలు కనిపించగా 127 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో సగటున 10 లక్షల మందికి 5,486 నమూనాలను పరీక్షిస్తున్నారు.
  • తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం-దక్షిణ మధ్య రైల్వేల సమన్వయంతో ఇవాళ దాదాపు 70,000 మంది వలస కార్మికులను తమ రాష్ట్రాలకు శ్రామిక్‌ స్పెషల్ రైళ్లలో వెళ్లారు. ఈ మేరకు అధికారులు సిద్ధం చేసిన 41 ప్రత్యేక రైళ్లు శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము మధ్య వరుసగా బయల్దేరుతాయి. రాష్ట్రంలో మే 23నాటికి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1761 కాగా, నిన్నటివరకు వలసదారులలో 118 మందికి వ్యాధి లక్షణాలు నిర్ధారణ అయ్యాయి.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో ఇవాళ 2940 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44,582కు చేరింది. కొత్త కేసులలో 1751 హాట్‌స్పాట్ ముంబైలో నమోదైనవి కావడం గమనార్హం. ఇక కోవిడ్‌-19 బారినపడిన వారిలో 63 మరణించగా వీరిలో 27మంది ముంబై వాసులే. దీంతో రాష్ట్రంలో మహమ్మారివల్ల సంభవించిన మరణాల సంఖ్య 1,517కు పెరిగింది.
  • గుజరాత్: రాష్ట్రంలో ఇవాళ 363 కొత్త కేసులు నమోదవగా 392మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 13,273కాగా, గత 24 గంటల్లో కోలుకునేవారి శాతం మెరుగుపడి 44.3గా నమోదైందని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక అహ్మదాబాద్‌లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కోవిడ్‌-19 రోగుల కోసం 50 శాతం పడకలను కేటాయించాల్సిందిగా రాష్ట్రంలోని 42 ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వం కోరింది.
  • రాజస్థాన్: రాష్ట్రంలో ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు 163 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 6657కు పెరిగింది. ఇప్పటిదాకా 3695 మంది రోగులు కోలుకోగా, వారిలో 3260 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాజస్థాన్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇవాళ 55 ప్రధాన మార్గాల్లో బస్సులు నడపడం ప్రారంభించడంతో ప్రజలకు ఎంతో ఉపశమనం లభించింది.
  • మధ్యప్రదేశ్‌: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 189 కొత్త కేసులు నమోదవగా, 246 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. రాష్ట్రంలోని అత్యంత అధికంగా కేసులు నమోదవుతున్న ఇండోర్‌ జిల్లాలో కేసుల సంఖ్య 2,850కి చేరగా 109 మరణాలు నమోదయ్యాయి. కాగా, భోపాల్‌లో ప్రస్తుతం 1,153, ఉజ్జయినిలో 504, బుర్హాన్‌పూర్‌లో 209, జబల్పూర్‌లో 194 వంతున యాక్టివ్‌ కేసులున్నాయి.
  • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో 40 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 173కు చేరింది. వలస కార్మికులు, విద్యార్థులు తదితరులు రాష్ట్రానికి తిరిగి రావడంవల్ల కేసులు అకస్మాత్తుగా పెరిగినట్లు భావిస్తున్నారు.
  • గోవా: రాష్ట్రంలో రెండు కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 54కు చేరింది. ఇక ఈఎస్‌ఐసీ ఆస్పత్రిలో 9 మంది రోగులు కోలుకోవడంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 38కి తగ్గింది.

PIB FACTCHECK

 

*****

 



(Release ID: 1626509) Visitor Counter : 331