మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

జెఇఇ (మెయిన్స్), నీట్ పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల్లో ప్రాచుర్యం పొందిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రూపొందించిన జాతీయ పరీక్షల యాప్ అభ్యాస్

Posted On: 22 MAY 2020 7:45PM by PIB Hyderabad

జెయియి (మెయిన్స్), నీట్ పరీక్షలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రూపొందించిన నేషనల్ టెస్ట్ అభ్యాస్ యాప్ విద్యార్థుల్లో బహుళ ప్రాచుర్యం పొందిందని, ఆ యాప్ ఆవిష్కరించిన 72 గంటల్లోనే రెండు లక్షల మంది విద్యార్థులు యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్ “నిశాంక్” చెప్పారు. 80 వేల మందికి పైగా విద్యార్థులకు జెయియి (మెయిన్స్), నీట్  టెస్ట్ నిర్వహించినట్టు ఆయన తెలిపారు. విద్యార్థులకు ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య కాలంలో గరిష్ఠంగా  మాక్ టెస్ట్ నిర్వహించారని ఆయన చెప్పారు.

ప్రతీ ఏటా భారీ సంఖ్యలో విద్యార్థులు జెయియి (మెయిన్), నీట్  పరీక్షలు, ఇతర పోటీ పరీక్షల్లో పాల్గొంటారని,  కాని వారిలో ఎక్కువ మందికి ప్రయివేటు కోచింగ్ ఇన్ స్టిట్యూట్లకు వెళ్లగల స్తోమత ఉండదని ఆ యాప్ వివరాలు ప్రకటిస్తూ ఆయన చెప్పారు. అలాంటి వారి కోసం వారు పరీక్షలకు సిద్ధం అయ్యేలా చేసేందుకు ఎన్ టిఏ ఈ యాప్ ను ప్రారంభించిందని ఆయన వెల్లడించారు.

ఈ యాప్ ద్వారా పరీక్ష మూడు గంటల వ్యవధిలో పూర్తవుతుందని, యాప్ డౌన్ లోడ్ చేసుకున్న అనంతరం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యేందుకు ఏ సమయం అయినా ఎంచుకోవచ్చునని ఆయన వివరించారు. ఈ టెస్ట్ తీసుకునేందుకు విద్యార్థులకు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.
ఈ యాప్ విడుదల చేయడంతో అత్యంత కీలకమైన పరీక్షలకు విద్యార్థులు తయారుకావడంలో సార్వత్రికత తీసుకురాగలిగిందని కేంద్రమంత్రి అన్నారు. దేశంలో అసాధారణమైన ఆరోగ్య అత్యవసర పరిస్థితి నెలకొన్న వాతావరణంలో విద్యార్థులు పరీక్షలకు తయారు కావడానికి ఈ యాప్ ఎంతో సహాయకారిగా ఉందని ఆయన చెప్పారు. ఈ యాప్ ద్వారా తక్షణం, వాస్తవిక ప్రాతిపదికన, పక్షపాత రహితమైన ఫలితాలు ప్రకటించగల  ప్రపంచంలోనే అతి పెద్దదైన వర్చువల్ టెస్టింగ్ వ్యవస్థను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యం నెరవేరిందని ఆయన తెలిపారు.  

ఈ యాప్ ఆండ్రాయిడ్ ప్లాట్ ఫారంపై అందుబాటులో ఉన్నదని, త్వరలోనే ఐఓఎస్ కు కూడా అందుబాటులోకి వస్తుందని శ్రీ పోఖ్రియాల్ చెప్పారు. విద్యార్థులు గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి ఈ యాప్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చునన్నారు. యాప్ పై అందుబాటులో ఉన్న టెస్ట్ రాసిన అనంతరం విద్యార్థులే తమంత తాముగా తమ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉన్నది పరీక్షించుకోవచ్చునని, ప్రతీ ఒక్క ప్రశ్నకు వివరణతో కూడిన సమాధానాలు కూడా వారికి అందుబాటులోకి వస్తాయని ఆయన వివరించారు. పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియచేశారు.

***



(Release ID: 1626342) Visitor Counter : 203