సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 తర్వాత మరింత ఆత్మవిశ్వాసం గల దేశంగా ప్రపంచదేశాల్లో పేరు ప్రతిష్ఠలు పెరగనున్న భారత్ : డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 22 MAY 2020 8:32PM by PIB Hyderabad

కోవిడ్ అనంతరం భారతదేశంలో మరింత విశ్వాసం తొణికిసలాడుతుందని, ప్రపంచ దేశాల్లో మరింతగా ప్రతిష్ఠ ఏర్పడుతుందని కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఒక టివి చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో భారతదేశంపై వెలువడుతున్న అంచనాలు, ఊహాగానాలకు భిన్నంగా ఆరు నెలల నాటికి ప్రపంచం యావత్తు భారతదేశం వైపు ఆసక్తిగా చూడడంతో పాటు మనతో మైత్రికి తహతహలాడుతుందని ఆయన అన్నారు. అంతేకాదు, వ్యాపార, వాణిజ్యాలకు అత్యంత ఆకర్షణీయ గమ్యంగా భారత్ మారుతుందని ఆయన స్పష్టం చేశారు.  

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఎంతో ముందుచూపుతో చాలా ముందుగానే ప్రకటించిన లాక్ డౌన్ వల్ల కోవిడ్ అనంతర ప్రపంచంలోని కొత్త ధోరణులకు భారత్ సిద్ధం కాగలిగిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

ప్రధానంగా టూరిజం పైనే ఆధారపడే ఈశాన్య రాష్ర్టాల్లో కోవిడ్ మహమ్మారి ప్రభావం గురించిన ప్రశ్నకు స్పందిస్తూ కోవిడ్ అనంతరం ఈశాన్య రాష్ర్టాలు మరింత ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షిస్తాయని, చివరికి యూరప్ దేశాలు, పాశ్చాత్య దేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రధానంగా యూరోపియన్, పాశ్చాత్య దేశాల్లోని పర్యాటక కేంద్రాలు కరోనా ప్రభావానికి తీవ్రంగా ప్రభావితం అయ్యాయని, ఈశాన్య ప్రాంతంలోని పర్యాటక కేంద్రాలు కరోనా వ్యాధి రహితంగా ఉండడం, సిక్కిం వంటి రాష్ర్టాల్లోని పర్యాటక కేంద్రాల్లో ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాకపోవడం కూడా ప్రత్యేక ఆకర్షణ అని ఆయన వివరించారు.

ఇక వ్యాపార, వాణిజ్యాల విషయానికి వస్తే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం మరింత పురోగమించడానికి ఇది చక్కని అవకాశంగా నిలుస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ ఉద్ఘాటించారు.  ఉదాహరణకి వెదురునే తీసుకుంటే దాని వ్యాపార పరిమాణం ఏడాదికి రూ.5 వేల నుంచి 6 వేల కోట్ల మేరకుంటుందని, ఇప్పటివరకు అధిక పరిమాణంలో అగర్ బత్తి, వెదురు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని ఆయన చెప్పారు. అలాగే మన ఫార్మా పరిశ్రమ కోవిడ్-19 నేపథ్యంలో మంచి ఉత్తేజం పొందిందని, రానున్న కాలంలో ఔషధాలు, వాక్సిన్లను ప్రపంచానికి తేలిగ్గా ఎగుమతి చేయగల సామర్థ్యం పొందుతుందని ఆయన అన్నారు.  

జమ్ము, కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి ఇటీవల ఇచ్చిన డొమిసైల్ నోటిఫికేషన్ గురించి ప్రస్తావించగా 2019 ఆగస్టు 5వ తేదీన ప్రారంభించిన ప్రక్రియకు కొనసాగింపుగానే అది జారీ అయిందని, ఇప్పుడది తార్కికమైన ముగింపు దశకు వచ్చిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ నిర్ణయం సానుకూల ఫలితాన్ని రాబోయే తరాలు గుర్తిస్తాయని ఆయన చెప్పారు.
 



(Release ID: 1626344) Visitor Counter : 172