సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

కమ్యూనిటీ రేడియోలలో ప్రకటనల పరిమితిని గంటకు 12 నిమిషాలకు పెంచటంపై సమాలోచనలు : శ్రీ ప్రకాశ్ జవడేకర్

కమ్యూనిటీ రేడియోలలో న్యూస్ బులిటెన్స్ పై ప్రతిపాదనల పరిశీలన, త్వరలో మరిన్ని కమ్యూనిటీ రేడియోలు: శ్రీ జవడేకర్

Posted On: 22 MAY 2020 7:44PM by PIB Hyderabad

 కమ్యూనిటీ రేడియోలలో ప్రకటనల సమయం పరిమితి ఇప్పుడు గంటకు 7 నిమిషాలు ఉండగా దాన్ని 12 నిమిషాలకి పెంచటానికి ప్రయత్నిస్తున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్ వెల్లడించారు. ఇలా చేయటం వల్ల ఈ పరిమితి టీవీ చానల్స్ తో సమానమవుతుందన్నారు.  ఏకకాలంలో ప్రసారమయ్యేలా కమ్యూనిటీ రేడియో కేంద్రాల శ్రోతలందరినీ ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. రాత్రి 7 నుంచి 7:30 గంట్యల మధ్య రెండు సమానమైన స్లాట్స్ లో ఈ ప్రసారం జరిగింది.

కమ్యూనిటీ రేడియో కేంద్రాల ఏర్పాటుకు అయ్యే ఖర్చులో  75% భరించటం వలన అత్యధికశాతం ఖర్చు  మంత్రిత్వశాఖ మీదనే  పడుతున్నదన్నారు. రోజువారీ నిర్వహన ఖర్చులు మాత్రం ఆయా కేంద్రాలే భరిస్తున్నాయన్నారు. ప్రస్తుతం కమ్యూనిటీ రేడియోలు గంటకు 7నిమిషాల మేర ప్రకటనలు ప్రసారం చేసుకునే వెసులుబాటు ఉండగా టీవీ చానల్స్ కు మాత్రం 12 నిమిషాలు అనుమతిస్తున్నామన్నారు.  అయితే కమ్యూనిటీ రేదియోలకు కూడా సమానంగా ప్రకటనలకు అవకాశ కల్పించటం ద్వారా అవి నిధులు అడగాల్సిన అవసరం లేకుండా స్థానిక ప్రకటనలమీద ఆధారపడే పరిస్థితి కల్పించాలని ఆలోచిస్తున్నట్టు చెప్పారు.

కమ్యూనిటీ రేడియో అనేది స్థానికంగా అక్కడి ప్రాంతం వారికే పరిమితమని మంత్రి తన ప్రసంగం ప్రారంభంలో పేర్కొన్నారు. కమ్యూనిటీ రేడియోలను సమాజంలో మార్పుకు వారధులుగా అభివర్ణిస్తూ, అవి రోజూ లక్షలాది మంది ప్రజలకు చేరుతున్నాయన్నారు. త్వరలో ఈ కేంద్రాల సంఖ్యను పెంచేందుకు మంత్రిత్వశాఖ ఒక పథక రచన చేస్తోందని చెప్పారు.

ప్రజలు కరోనావైరస్ మీద జరుపుతున్న పోరాటాన్ని అభినందిస్తూ, ఇతర వ్యాధుల తరహాలోనే దీన్ని కూడా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా సాధ్యమైనంతవరకు ఇంటి పట్టున ఉండటం, తరచూ చేతులు కడుక్కోవటం, ముఖానికి మాస్క్ ధరించటం, బహిరంగ ప్రదేశాలలో ఒకరికొకరు ఎడంగా ఉండటం అనే నాలుగు సూత్రాలూ పాటించాలని కోరారు.

భౌతిక దూరం పాటించటానికి, ఆర్థిక కార్యకలాపాలకూ మధ్య ఉన్న సవాళ్ళను ప్రస్తావిస్తూ ప్రాణాలుంటే అంతా ఉన్నట్టే ( జాన్ భీ జహాన్ భీ) నన్న నినాదాన్ని పునరుద్ఘాటించారు. కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయని గుర్తు చేస్తూ, గ్రీన్ జోన్స్ లో మాత్రం  ఆర్థిక కార్యకలాపాలు ఆరంభమవుతున్నాయన్నారు.

తమ చానల్స్ లో వార్తలు ప్రసారం చేసేందుకు అనుమతించాలన్న కమ్యూనిటీ రేడియో కేంద్రాల డిమాండ్ ను కూడా మంత్రి ప్రస్తావించారు.  ఎఫ్ ఎం చానల్స్ తరహాలోనే కమ్యూనిటీ రేడియోలలో కూడా వార్తల ప్రసారానికి అనుమతించే విషయం పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చారు. స్థానికంగా నిజానిజాలు తనిఖీ చేసుకునే అవకాశం ఉంది గనుక  తప్పుడు వార్తల మీద యుద్ధం చేయటంలో  ఇవి కీలకపాత్ర పోషించాలన్నారు. వాస్తవ సమాచారాన్ని ఆకాశవాణికి కూడా తెలియజేయటం ద్వారా ప్రజలకు నిజాలు అందేలా చూడాలని సూచించారు. తమ మంత్రిత్వశాఖ  ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కింద ఒక ఫాక్ట్ చెక్ సెల్ ఏర్పాటుచేసిందని చెబుతూ, కమ్యూనిటీ రేడియో ఇలాంటి విభాగానికి తోడుగా ఉండగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇటీవల కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖామంత్రి ప్రకటించిన  ఆత్మనిర్భర్ పాకేజ్ గురించి మాట్లాడుతూ,  అది సమగ్రమైన పాకేజ్ అని శ్రీ జావడేకర్ అభివర్ణించారు. వ్యవసాయం, పరిశ్రమలు సహా వివిధ రంగాలలో సంస్కరణలను ఈ పాకేజ్ లో చేర్చారని, దీనివలన దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరుగుతాయన్నారు. అమ్దరూ ఈ పాకేజ్ ని స్వాగతించారని ఉద్దీపన పట్ల ప్రజలు ఆనందంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు.

 

                                                                   Official Photo of HMIB.jpeg                                                      

నేపథ్యం:

Ø  బ్రాడ్ కాస్టింగ్ రంగంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆకాశవాణి. ప్రైవేటు రంగంలో ఎఫ్ ఎం రేడియో  ఉండగా మూడో అంచె కింద కమ్యూనిటీ రేడియో ఏర్పాటైంది. ఇది 10-15 కిలోమీటర్ల వ్యాసార్థంలో  స్థానిక అంశాలమీద, స్థానికుల కోసం  స్థానికులే స్వయంగా నిర్వహించుకునే తక్కువ శక్తిగల ఎఫ్ ఎం స్టేషన్ లాంటిది.

Ø  2002 లో మొదటి కమ్యూనిటీ రేడియో విధానాన్ని ప్రకటించిన తరువాత భారతదేశంలో కమ్యూనిటీ రేడియోలు ప్రాంభమయ్యాయి. ఈ విధానం కింద విద్యాసంస్థలు మాత్రమే కమ్యూనిటీ రేడియో కేంద్రాలు ఏర్పాటు చేసుకోవటానికి వీలుంది.  అయితే 2006 ఈ విధానాన్ని విస్తరించిన ఫలితంగా క్షేత్ర స్థాయిలో పని చేసే స్వచ్ఛంద సంస్థలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, లాభాపేక్ష లేని ఇతర సంస్థలు కూడా అనుమతించబడ్డాయి. ఈరోజు దేశవ్యాప్తంగా 290  కేంద్రాలు పనిచేస్తున్నాయి.  ఇతర మాధ్యమాలు నామమాత్రంగా ఉండటం వలన వీటి పరిధిలో దాదాపు 9 కోట్ల మంది ప్రజలున్నారు. స్థానిక భాషలో, యాసలో ప్రసారాలందించే ఈ కమ్యూనిటీ రేడియో కేంద్రాల ప్రభావం స్థానిక ప్రజల మీద చాలా ఎక్కువగా ఉంది.

Ø  సంస్థలవారీగా విభజన ఈ విధంగా ఉంది:

సంఖ్య

సంస్థ తరహా

కమ్యూనిటీ రేడియోల సంఖ్య

1

విద్యా సంస్థలు

130

2

స్వచ్ఛంద సంస్థలు

143

3

కృషి విజ్ఞాన కేంద్రాలు

17

 

మొత్తం

290

 

కమ్యూనిటీ రేడియో కు ఆలంబనగా ప్రస్తుతం రూ.25 కోట్ల కేటాయింపుతో  " భారత్ లో కమ్యూనిటీ రేడియోకు మద్దతు" పేరిట ప్రభుత్వం ఒక పథకాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుత సంవత్సరం ఈ పథకం కింద రూ.  4.50 కోట్లు కేటాయించబడ్దాయి.

***

 


(Release ID: 1626221) Visitor Counter : 279