PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
19 MAY 2020 6:34PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాధి నయమైనవారు 39,174మంది; ఈ మేరకు కోలుకునేవారి సంఖ్య మెరుగుపడుతూ 38.73 శాతానికి చేరింది.
- దేశంలో ప్రస్తుతం కోవిడ్-19 యాక్టివ్ కేసుల సంఖ్య 58,802గా ఉంది.
- ప్రపంచంలో ప్రతి లక్ష జనాభాకు మరణాలు 4.1కాగా, భారత్‌లో ప్రతి లక్ష జనాభాకు 0.2 మాత్రమే.
- వలస కార్మికుల దుస్థితి తొలగించండి- రాష్ట్ర సరిహద్దుల మధ్య, అంతర్గతంగా మరిన్ని బస్సులు నడపండి: రాష్ట్రాలకు దేశీయాంగ శాఖ సూచన.
- వివిధ ప్రాంతాల్లోని వలస కార్మికులను రైళ్లలో పంపడంపై సవరించిన ప్రామాణిక ప్రక్రియ విధివిధానాలను జారీచేసిన దేశీయాంగ మంత్రిత్వ శాఖ.
భారత్‌లో కోవిడ్-19 మరణాలు ప్రతి లక్ష జనాభాకు సుమారు 0.2కాగా, ప్రపంచ స్థాయిలో ప్రతి లక్ష జనాభాకు 4.1; దేశంలో 24 లక్షలకుపైగా నమూనాల పరీక్ష
దేశంలో గడచిన 24 గంటల్లో 2,350 మంది కోవిడ్-19 రోగులు కోలుకున్నారు. దీంతో ఇప్పటిదాకా వ్యాధి నయమైనవారి సంఖ్య 39,174కు చేరింది. ఆ మేరకు కోలుకునేవారి శాతం నిరంతరం మెరుగుపడుతూ 38.73కు చేరింది. భారత్‌లో ప్రస్తుతం యాక్టివ్ రోగుల సంఖ్య 58,802కుగాను అందరూ సంపూర్ణ వైద్యసంరక్షణలో ఉండగా వీరిలో సుమారు 2.9 శాతం మాత్రమే ఐసీయూలో ఉన్నారు. ఇక ప్రపంచస్థాయిలో ప్రతి లక్షకు మరణాల సంఖ్య 4.1 కాగా, మన దేశంలో ప్రతి లక్ష జనాభాకు కేవలం 0.2 మాత్రమే కావడం గమనార్హం. ఇక నిన్నటిదాకా దేశంలో 24,25,742 నమూనాలను పరీక్షించారు. జనవరి నెలలో కోవిడ్-19 పరీక్షలు నిర్వహించే ప్రయోగశాల దేశంలో ఒక్కటి మాత్రమే ఉండగా, నేడు 385 ప్రభుత్వ, 158 ప్రైవేటు ప్రయోగశాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కోవిడ్-19 పరీక్షలపై సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనికి సంబంధించి మునుపటి అంశాలకు అదనంగా మరికొన్నిటిని చేర్చింది. ఈ మేరకు కోవిడ్-19 నియంత్రణ, ఉపశమన చర్యల్లో ఉన్న ముందువరుస కార్యకర్తలు, ఆస్పత్రుల్లోగల ఐఎల్‌ఐ లక్షణాలున్న రోగులు, తిరిగివచ్చిన వలస కార్మికులలో 7 రోజుల్లోగా ఐఎల్‌ఐ లక్షణాలు కనిపించినవారికి కూడా పరీక్షలు నిర్వహించేలా మార్పులు చేశారు. అలాగే పనిప్రదేశ పరిస్థితుల నడుమ ఒకవేళ అనుమానిత లేదా నిర్ధారిత కేసు ఉన్నట్లు తేలితే కోవిడ్-19 వ్యాప్తి నిరోధం, నియంత్రణ సంబంధిత చర్యలతోపాటు దంతవైద్యులు, సహాయకులు, దంతరోగులలో వ్యాధి వ్యాప్తి ముప్పు అధికంగా ఉంటుంది కాబట్టి సంబంధిత మార్గదర్శకాలను జారీచేసింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1625235
వలస కార్మికుల సాఫీ రవాణాకు మరిన్ని రైళ్లకోసం రాష్ట్రాలు-రైల్వేమధ్య చురుకైన సమన్వయం అవశ్యం; జిల్లా యంత్రాంగాలు తమ అవసరాలను రైల్వేలకు తెలపాలి
కోవిడ్-19 సంక్రమణ భయం, జీవనోపాధి కోల్పోతామన్న ఆందోళనలే వలస కార్మికులు తమ స్వస్థలాలకు తరలడానికి ప్రధాన కారణాలని రాష్ట్రాలకు పంపిన సమాచార లేఖలో దేశీయాంగ వ్యవహారాల శాఖ (MHA) వివరించింది. వారి దుస్థితిని తొలగించేందుకు కేంద్రంతో చురుకైన సమన్వయంతో రాష్ట్రాలు తీసుకోవాల్సిన చర్యలను అందులో స్పష్టంగా వివరించింది. ఈ మేరకు మరిన్ని బస్సులు నడపడంద్వారా రాష్ట్రాల్లో అంతర్గతంగా, అంతర్రాష్ట్ర సరిహద్దుల మధ్య వారి ప్రయాణం సాఫీగా సాగిపోయేలా చూడాలని సూచించింది. అలాగే పాదచారులైన కార్మికులు బస్సు/రైలు స్టేషన్లకు చేరేదాకా మార్గమధ్యంలో ప్రాథమిక సదుపాయాలతో వారికి తగినన్ని విశ్రాంతి ప్రదేశాలను ఏర్పాటు చేయాలని కోరింది. వదంతుల వ్యాప్తిని అరికడుతూ రైలు/బస్సు బయలుదేరే సమయంపై స్పష్టత ఇవ్వాలని దేశీయాంగ శాఖ స్పష్టం చేసింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1625153
వలస కార్మికులను రైళ్లలో తరలించడంపై ప్రామాణిక ప్రక్రియ విధివిధానాలు
దిగ్బంధంపై 17.05.2020నాటి సవరించిన ఏకీకృత మార్గదర్శకాలకు కొనసాగింపుగా- వలస కార్మికులను రైళ్లద్వారా తరలించడంపై దేశీయాంగ శాఖ సవరించిన ప్రామాణిక ప్రక్రియ విధివిధానాలను (SOPs) జారీచేసింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1625160
దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా 73వ ప్రపంచ ఆరోగ్య మహాసభలో పాల్గొన్న డాక్టర్ హర్షవర్ధన్
కోవిడ్-19 నియంత్రణ, నిర్వహణలో భారత ప్రభుత్వం సకాలంలో తీసుకున్న చురుకైన, క్రమానుగత చర్యల గురించి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఈ మేరకు ప్రవేశమార్గాలవద్ద నిశిత నిఘా, విదేశాల్లో చిక్కుకున్న భారతీయు తరలింపు, వ్యాధిపై సమర్థ నిఘా చట్రంద్వారా భారీ సామాజిక పర్యవేక్షణ, ఆరోగ్య మౌలిక సదుపాయాల బలోపేతం, ముందువరుస మానవ వనరుల శ్రేణిలోగల 20 లక్షలమందికిపైగా కార్యకర్తలకు సామర్థ్య వికాసం, ముప్పు వర్తమాన వ్యాప్తి-సామాజిక భాగస్వామ్యం తదితరాల గురించి విశదీకరించారు. “మా వంతుగా మేము అత్యుత్తమంగా, సజావుగా వ్యవహరించామని భావిస్తున్నాను. అదే సమయంలో మా అనుభవాల నుంచి నేర్చుకుంటూ రాబోయే నెలల్లో మరింత మెరుగ్గా వ్యవహరించగలమన్న విశ్వాసం మాకుంది” అని పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1625025
కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రి సూచన మేరకు జేఈఈ-2020(మెయిన్) ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు తుది అవకాశమిచ్చిన ఎన్‌టీఏ
విదేశీ విద్యాభ్యాసంపై ఆసక్తి కలిగి, దేశంలో ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా పునరాలోచనతో జేఈఈ-2020(మెయిన్) రాసి స్వదేశంలోనే చదువు కొనసాగించాలని భావిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ మేరకు అటువంటి విద్యార్థుల అభ్యర్థన నేపథ్యంలో జేఈఈ (మెయిన్) దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించడం కోసం చివరి అవకాశం ఇవ్వాల్సిందిగా జాతీయ పరీక్షల ప్రాధికార సంస్థ (ఎన్‌ఏటీ)కు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిషాంక్’ సూచించారు. ఈ మేరకు మరే ఇతర కారణాలతో దరఖాస్తు సమర్పించలేకపోయిన ఇతర విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1625161
ఈశాన్య భారతం, జమ్ముకశ్మీర్‌లలో కోవిడ్ సంబంధ సేవలందించిన సైన్యానికి కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంస
కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఈశాన్య భారతం, జమ్ముకశ్మీర్‌లలో సైన్యం సహకారాన్ని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కొనియాడారు. ప్రత్యేకించి సైనిక బలగం వైద్యసేవల విభాగం (AFMS) ప్రపంచ మహమ్మారి ఆరంభ సమయంలోనే రంగంలో దిగి తొలిదశ సన్నద్ధత కింద అనుబంధ రోగనిర్ధారణ, చికిత్స సదుపాయాలను సమకూర్చిందని ఆయన ప్రశంసించారు.
చెత్తరహిత నగరాలకు నక్షత్ర గుర్తింపు ఫలితాలను ప్రకటించిన కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల శాఖ
దేశంలోని 6 నగరాలకు 2019-2020 పరిగణన సంవత్సరానికిగాను ‘పంచ నక్షత్ర’ (5-స్టార్) గుర్తింపు లభించినట్లు కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాలశాఖ (MoHUA)మంత్రి శ్రీ హర్దీప్ ఎస్.పూరి ప్రకటించారు. ఈ మేరకు అంబికాపూర్, రాజ్‌కోట్, సూరత్, మైసూరు, ఇండోర్, నవీముంబై అగ్రస్థానంలో ఉన్నాయి. ఇక 65 నగరాలకు ‘త్రినక్షత్ర’ గుర్తింపు లభించగా, 70 నగరాలు మాత్రం ‘ఏక నక్షత్ర’ గుర్తింపు పొందినట్లు వివరించారు. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో బహిరంగ ప్రదేశాలను ప్రత్యేకంగా శుభ్రపరచడం, నిర్బంధవైద్య పర్యవేక్షణ కేంద్రాలనుంచి జీవ వ్యర్థాల సేకరణ-విసర్జన తదితరాలపై అన్ని రాష్ట్రాలు/నగరాలకు సమగ్ర మార్గదర్శకాలను మంత్రిత్వశాఖ జారీచేసింది. అంతేకాకుండా పౌరులు తమ కోవిడ్ సంబంధిత సమస్యలను పట్టణ స్థానిక సంస్థలద్వారా పరిష్కరించుకునే బహుళ ప్రజాదరణగల పరిష్కార వేదిక ‘స్వచ్ఛత’ యాప్‌ను ఏప్రిల్ తొలివారంలో నవీకరించింది.
దిగ్బంధంలో విదర్భ, మరఠ్వాడా ప్రాంతాన పాడి సరఫరా గొలుసు స్థిరీకరణలో ‘మదర్ డెయిరీ’ ప్రశంసనీయ పాత్ర
దేశంలో కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి నిరోధం దిశగా విధించిన దిగ్బంధం ఆంక్షల నడుమ ప్రజలకు ఆహారం, ఆరోగ్యసేవలవంటి నిత్యావసరాల నిరంతర లభ్యత చాలా కీలకం. ఒకవైపు వినియోగదారులకు అవసరమైన వస్తుసరఫరా నిర్వహణ ముఖ్యం కాగా, మరోవైపు రైతులతో మొదలయ్యే విలువ శృంఖలం సజావుగా ఉత్పత్తులు మార్కెట్‌కు చేరేలా కొనసాగడం వారికీ అవసరం; ఈ నేపథ్యంలో విదర్భ, మరఠ్వాడా ప్రాంతాల్లో దిగ్బంధం నడుమ పాడి సరఫరా గొలుసు స్థిరీకరణలో జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని ‘మదర్ డెయిరీ’ తనవంతు సహకారం అందించింది. ఈ మేరకు నాగ్‌పూర్ నగరంలో సివిల్‌లైన్స్ ప్రాంతంలోని మదర్ డెయిరీ రైతులకు సాధ్యమైనంత చేయూతనిస్తూ విదర్భ, మరఠ్వాడా ప్రాంతం నుంచి రోజుకు సగటున 2.55 లక్షల లీటర్ల పాలను సేకరిస్తోంది.
‘అంతర్జాతీయ ప్రదర్శనశాల దినోత్సవం’లో భాగంగా కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వశాఖలోని ‘మ్యూజియంలు-సాంస్కృతిక ప్రదేశాల అభివృద్ధి విభాగంద్వారా “రీవైటలైజింగ్ మ్యూజియమ్స్ అండ్ కల్చరల్ ప్లేసెస్” పేరిట వెబినార్ నిర్వహణ
దేశంలోని సాంస్కృతిక-సృజనాత్మక పరిశ్రమలపై కోవిడ్-19 మహమ్మారి ఆర్థిక-సామాజిక పరిణామాల ప్రభావం గణనీయంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ భారత-ప్రపంచ సాంస్కృతిక సంస్థలు, సృజనాత్మక వ్యాపారాలు, అంకురసంస్థలు, విధాన రూపకర్తలు, మాధ్యమ ప్రతినిధులు, నిపుణుల కోసం కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ వెబినార్ నిర్వహించింది. ఈ సందర్భంగా సాంస్కృతిక- సృజనాత్మక పరిశ్రమ ముందుకెళ్లే మార్గాలపై వారు లోతుగా చర్చించారు.
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- చండీగఢ్: దేశవ్యాప్త దిగ్బంధం నేపథ్యంలో కొందరు వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు తదితరులు నగరంలో చిక్కుకుపోయారు. ఈ వ్యక్తులంతా సౌకర్యవంతంగా, సురక్షితంగా, సాఫీగా ప్రయాణించడం కోసం నగరపాలక యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా 18.05.2020న- అ) ఉత్తర ప్రదేశ్‌లోని అమేఠీకి సాయంత్రం 5.00గంటలకు శ్రామిక్ స్పెషల్ రైలులో 1296 మంది; ఆ) పంజాబ్‌లోని సిర్హింద్ నుంచి శ్రామిక్ స్పెషల్ రైలులో పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌కు 10 మంది వెళ్లారు. కాగా, వీరిని చండీగఢ్ నుంచి పంజాబ్‌లోని సిర్హింద్‌కు సీటీయూ ప్రత్యేక బస్సుద్వారా పంపారు.
- పంజాబ్: రాష్ట్రంలోని లూధియానాలోగల క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, IMAS హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య వినూత్న భాగస్వామ్యం కింద టెలిమెడిసిన్ పథకాన్ని ముఖ్యమంత్రి ఇవాళ ప్రారంభించారు. కాగా, భారత్‌లోగల క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ (అమెరికా) కోసం కోవిడ్-19సహా వివిధ వైద్య సమస్యలపై వైద్యుల మధ్య వీడియో సంప్రదింపులకు IMAS హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అధికార సంధానకర్తగానూ పనిచేస్తోంది. ఇక రాష్ట్రంలో ప్రజా రవాణాపై విధించిన ఆంక్షలను సడలించాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. తదనుగుణంగా బుధవారంనుంచి రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ పరిధిలోని బస్సులు రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, జిల్లా ప్రధాన కేంద్రాల మధ్య ప్రారంభ-గమ్యస్థానాల మధ్య ఎంపిక చేసిన మార్గాల్లో నడుస్తాయి. ఇవి బస్ స్టాండ్ల నుంచి మాత్రమే బయల్దేరనుండగా, ముందుగా పరీక్షలు నిర్వహించాకే ప్రయాణికులను అనుమతిస్తారు. అలాగే అందరూ తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకుని, మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటిస్తూ ప్రయాణించాల్సి ఉంటుంది.
- హర్యానా: రాష్ట్రంలోని ప్రైవేటు వైద్యుల అవసరాలకు తగినట్లుగా అత్యంత నాణ్యమైన వ్యక్తిగత రక్షణ సామగ్రి కిట్లు, ఎన్-95 మాస్కులు, హస్త పరిశుభ్రత ద్రవాలను ప్రభుత్వ ధరల ప్రకారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ప్రైవేట్ వైద్యులెవరైనా కోవిడ్-19 బారినపడితే, వారికీ ప్రభుత్వ వ్యయంతోనే చికిత్స లభిస్తుంది. కరోనా అనంతరం కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య సేవలు, ప్రజారోగ్యం, వ్యాధులపై పరిశోధన తదితర రంగాల్లో పెట్టుబడులు పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రభుత్వ స్కూళ్లలో అత్యవసర, అనివార్య కార్యకలాపాలు పూర్తిచేసేందుకు వీలుగా ప్రభుత్వ పాఠశాలల కార్యాలయాలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే, కోవిడ్-19 నియంత్రణ కోసం కేంద్ర దేశీయాంగ మంత్రిత్వశాఖ జారీచేసిన నిబంధనలను కఠినంగా పాటించాలని నిర్దేశించింది. కాగా, రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలను కూడా ఇదే వ్యవహారాల కొనసాగింపు నిమిత్తం ప్రభుత్వం ఇప్పటికే అనుమతించడం గమనార్హం.
- హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రానికి ఒక బల్క్ డ్రగ్ పార్కును కేటాయించాలని కేంద్ర రసాయనాలు-ఎరువులశాఖ మంత్రి డి.వి.సదానంద గౌడకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ విజ్ఞప్తి చేశారు. కాగా, కీలకమైన ఆరంభ ఔషధ పదార్థాలు/డ్రగ్ ఇంటర్మీడియట్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఎపిఐ) దేశీయంగా ఉత్పత్తిచేసేలా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రయోజనకర పథకాన్ని ప్రకటించిందని ఆయన చెప్పారు.
- కేరళ: రాష్ట్రంలో కేఎస్ఆర్టీసీ రేపటినుంచి అన్ని జిల్లాల్లో బస్సులను నడపనుంది. కన్నూర్‌లో రైలుపట్టాల మీదుగా ఉత్తరప్రదేశ్‌కు నడిచివెళ్తున్న సుమారు 100 మంది వలస కార్మికులను పోలీసులు ఆపివేశారు. కాగా, కోళికోడ్‌లోని పెరంబ్రాలో నిరసనకు దిగిన వలస కార్మికులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇక గల్ఫ్ దేశాలనుంచి నిన్న రాత్రి కేరళకు చేరుకున్నవారిలో ఏడుగురు ప్రవాసులకు కోవిడ్ లక్షణాలు కనిపించడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న 700 మందికిపైగా ప్రవాసులను మరో 4 విమానాలు స్వదేశం తీసుకురానున్నాయి. రాష్ట్రంలో నిన్న నమోదైన 29 కేసులకుగాను దాదాపు అందరూ రాష్ట్రానికి తిరిగివచ్చిన వలస కార్మికులు/ప్రవాస కేరళీయులే కావడం గమనార్హం.
- తమిళనాడు: పుదుచ్చేరిలో మద్యం దుకాణాలను తెరవడానికి ప్రభుత్వం అనుమతించింది. అయితే, మద్యం కొనుగోలుకు ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది. మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో తిరిగివస్తున్న తమిళనాడు వలస కార్మికులలో అధికశాతానికి కోవిడ్ వ్యాధి నిర్ధారణ అవుతోంది. ఇక తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ్టినుంచి క్షౌరశాలలు తెరవడానికి ప్రభుత్వం అనుమతించింది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జూన్ 15 నుండి 25 వరకు జరగనున్నాయి. నిన్నటి వరకు మొత్తం కేసులు: 11,760, యాక్టివ్ కేసులు: 7270, మరణాలు: 81, చెన్నైలో యాక్టివ్ కేసులు 5460గా ఉన్నాయి.
- కర్ణాటక: రాష్ట్రంలో ఇవాళ ఒకేరోజు అత్యధికంగా 127 కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 1373కు చేరగా; వీటిలో యాక్టివ్: 802, కోలుకున్నవారు: 530మంది, మరణాలు: 40గా ఉన్నాయి. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి వచ్చేవారి ప్రవేశంపై ప్రభుత్వం నిషేధం విదించడంతో ప్రవాస కన్నడిగులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో చివరగా నమోదైన కోవిడ్ కేసులలో 50 శాతం ఇతర రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చేవారే కావడం గమనార్హం. ఇక ఇంటర్‌సిటీ ప్రత్యేక రైళ్లు నడిపేందుకు అనుమతించాలని కర్ణాటక ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
- ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్-19 నియంత్రణపై శ్రద్ధ వహించడంతోపాటు ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కోలుకునేవారి శాతం అత్యధికంగా 53.44గా ఉంది. ఇది దేశవ్యాప్త సగటు 32.9 శాతంతో పోలిస్తే అధికం కావడం విశేషం. ఇక గడచిన 24 గంటల్లో 9,739 నమూనాలను పరీక్షించిన నేపథ్యంలో 57 కొత్త కేసులు రాగా, 69 మంది డిశ్చార్జి అయ్యారు... ఇద్దరు మరణించారు. ఇతర రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చినవారిలో నిర్ధారిత కేసులు 150 కాగా, మొత్తం కేసులు: 2339. యాక్టివ్: 691, రికవరీ: 1596, మరణాలు: 52గా ఉన్నాయి.
- తెలంగాణ: రాష్ట్రంలో దిగ్బంధం ఆంక్షలు తొలగించడంతో సికిందరాబాద్‌నుంచి ఇవాళ ఆర్టీసీ బస్సులు వివిధ జిల్లాలవైపు కదిలాయి. కాగా, జీహెచ్ఎంసీ పరిధిసహా అన్ని మండలాల్లో ఇళ్లలో పనిచేసే సహయకులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిన్నటిదాకా మొత్తం కేసులు 1,592; హైదరాబాద్‌లో నిన్న 26 కొత్త కేసులు రావడంతో అధికారులు ఆందోళన పడుతున్నారు. కాగా, రాష్ట్రంలోని ఆస్పత్రులలో కోవిడ్ రోగుల కోసం 5,000 పడకలు అందుబాటులో ఉన్నాయి.
- అసోం: రాష్ట్రంలోని బార్‌పేట జిల్లాలో ప్రాంతీయ ఆరోగ్య పరీక్షల కేంద్రం నిర్వహణ, తద్వారా కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు పెంపు, రోగుల సంరక్షణ తదితరాలపై ఆరోగ్యశాఖ మంత్రి ఇవాళ డిప్యూటీ కమిషనర్లు, పోలీసు సూపరింటెండెంట్‌తో చర్చించారు.
- మణిపూర్: ఢిల్లీ నుంచి మణిపూర్ తిరిగివచ్చినవారిలో ఒక 64 ఏళ్ల మహిళ, ఆమె 23 ఏళ్ల కుమార్తెలకు కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయింది. కాగా, రాష్ట్రంలోని మొత్తం 9 కేసుల్లో ఇద్దరు కోలుకోగా, మిగిలినవారు చికిత్స పొందుతున్నారు.
- మిజోరం: మిజోరంలోని ప్రభుత్వ కోలాసిబ్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు కోలాసిబ్‌లోని కూరగాయల విక్రేతలకు, పోలీసు సిబ్బందికి 150 చేతితో తయారు చేసిన మాస్కులు పంపిణీ చేశారు. కాగా, రాష్ట్రంలో ఒక కోవిడ్ యాక్టివ్ కేసు గురించి సామాజిక మాధ్యమాల్లో అవాస్తవ సమాచారం ప్రచారం చేసిన ఆరోపణపై ఐజాల్ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు.
- నాగాలాండ్: దేశవ్యాప్త దిగ్బంధం నేపథ్యంలో పవిత్ర రంజాన్ మాసాన్ని ఇళ్లలోనే పాటిస్తున్న నాగాలాండ్‌లోని ముస్లింలు, పండుగ వేడుకలను కూడా అదేవిధంగా నిర్వహించుకునేందుకు సిద్ధమవుతున్నారు. దిమాపూర్ జిల్లాలోని గ్రామీణ పాలక మండళ్లు తమ ప్రాంతాలలో ప్రభుత్వం గుర్తించిన నిర్బంధవైద్య పర్యవేక్షణ కేంద్రాలను ప్రభుత్వం ఉపయోగించుకునేందుకు అంగీకారం తెలిపాయి.
- సిక్కిం: బెంగుళూరులో చిక్కుకుపోయిన తమ రాష్ట్రవాసులు 1054 మందిని కర్ణాటక ప్రభుత్వ సమన్వయంతో సిక్కిం ప్రభుత్వం తిరిగి వెనక్కు తీసుకొచ్చింది.
- మహారాష్ట్ర: రాష్ట్రంలో మరో 2033 కొత్త కోవిడ్-19 కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 35,058కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 25,392 కాగా, తాజా సమాచారం మేరకు నేటిదాకా 8437 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు ఎగువనగల 3.08 కోట్లమంది ఆరెంజ్ కార్డుదారులకు మే, జూన్ నెలలకుగాను తలా 5 కిలోలల వంతున రాయితీ ధరతో ఆహార ధాన్యాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక కోవిడ్-19 మహమ్మారి ప్రస్తుత పరిస్థితుల నడుమ రాష్ట్రంలోని 52,422 రేషన్ దుకాణాలద్వారా ప్రభుత్వం ఆహార ధాన్యాల పంపిణీని ప్రారంభించింది.
- గుజరాత్: రాష్ట్రంలో 366 కొత్త కేసులు, 35 మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మొత్తం కేసుల సంఖ్య 11,746కు చేరగా ఇప్పటిదాకా 4,804 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,248 కాగా, 38 మందికి వెంటిలేటర్ మద్దతుతో చికిత్స కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంలో దాదాపు 50 రోజుల తర్వాత నియంత్రణేతర జోన్ల పరిధిలోని దుకాణాలు, కార్యాలయాలు, రవాణా-మార్కెట్లు సరి-బేసి ప్రాతిపదికన తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది.
- రాజస్థాన్: రాష్ట్రంలో ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు 250 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం రోగుల సంఖ్య 5,757కు పెరిగింది. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 3,232 గా ఉంది.
- మధ్యప్రదేశ్: రాష్ట్రంలో 259 కొత్త కోవిడ్-19 కేసులు రావడంతో మొత్తం కేసులు 5,326కు చేరుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం 2,549 యాక్టివ్ కేసులున్నాయి.
- గోవా: గోవాలోఇవాళ 9 కొత్త కేసులు నమోదు కాగా, కరోనావైరస్ సోకిన రోగుల సంఖ్య 31కి పెరిగింది.
PIB FACTCHECK


*******
(Release ID: 1625236)
Visitor Counter : 226
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam