ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై)-విజయవంతంగా పదేళ్లు పూర్తి చేసుకున్న ఆర్థిక సమ్మిళిత జాతీయ కార్యక్రమం

ఆర్థిక ప్రధాన స్రవంతిలోకి పేదలు:

అణగారిన వర్గాల అభివృద్ధిలో కీలక పాత్ర: కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్


‘జన్ ధన్-మొబైల్-ఆధార్’ అనుసంధానం ద్వారా అనుమతి ఆధారిత వ్యవస్థ ఆర్థిక సమ్మిళిత్వానికి మూలాధారం — ప్రభుత్వ సంక్షేమ పథకాలను త్వరితగతిన, నిరంతరాయంగా, పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులకు చేరవేసే అవకాశం; డిజిటల్ చెల్లింపులకు దన్ను: శ్రీమతి సీతారామన్


పీఎంజేడీవై ఒక ఉద్యమ తరహా పథకం మాత్రమే కాదు; సంక్షేమానికి కట్టుబడిన ప్రభుత్వానికి ఉదాహరణ!: ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి


మొత్తంగా 53.14 కోట్ల మందికి బ్యాంకు అక్కౌంట్లు


పీఎంజేడీవై ఖాతాల్లో... రూ.2,31,236 కోట్లు


2015 మార్చిలో 15.67 కోట్ల నుంచి ఈ నెల 14 నాటికి 53.14 కోట్లకు పెరిగిన పీఎంజేడీవై ఖాతాలు


జన్ ధన్ ఖాతాదారుల్లో 55.6 శాతం మంది మహిళలు;

గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో 66.6 శాతం మంది జన్ ధన్ ఖాతాదారులు


పీఎంజేడీవై ఖాతాదారులకు 36.14 కోట్ల రూపే కార్డులు

Posted On: 28 AUG 2024 7:45AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2014 ఆగస్టు 28న ప్రారంభించిన ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) విజయవంతంగా అమలు చేసి నేటికి దశాబ్ద కాలం పూర్తి అయింది.

ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత కార్యక్రమం పీఎంజేడీవై. అట్టడుగున మిగిలిపోయిన, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చేయూతను అందించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నిరంతరం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా వర్గాలను ఆర్థిక స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు అనేక చర్యలు తీసుకున్నది.

“ఆర్థిక సమ్మిళిత్వం, సాధికారతలను సాధించడానికి మార్గం ఒకటే. అది సార్వజనీనంగా ఉండాలి. ఖర్చు తక్కువ ఉండటంతోపాటు, అందుబాటులో ఉండాలి. అప్పుడే పేదలను ఆర్థిక స్రవంతిలోకి తీసుకు రావడం సాధ్యం అవుతుంది.  ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన - అణగారిన వర్గాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది  కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఒక సందేశంలో పేర్కొన్నారు. 

“గతంలో బ్యాంకింగ్ సేవలు పొందని వారికి బ్యాంకు ఖాతాలు, చిన్న పొదుపు పథకాలు, బీమా, రుణం సహా సార్వత్రిక, తక్కువ వ్యయంతో కూడిన ఆర్థిక సేవలను అందించడం ద్వారా ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన గత దశాబ్దంలో దేశ బ్యాంకింగ్, ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చింది అని ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు.

“జన్ ధన్ ఖాతాలను తెరవడం ద్వారా 53 కోట్ల మందిని అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడం ఈ కార్యక్రమం సాధించిన విజయానికి నిదర్శనం. ఈ బ్యాంకు ఖాతాల్లో రూ.2.3 లక్షల కోట్ల నిల్వలు ఉన్నాయి. ఫలితంగా 36 కోట్లకు పైగా ఉచిత రూపే కార్డులు జారీ అయ్యాయి. రూ. 2 లక్షల ప్రమాద బీమా కవరేజీని ఇది అందిస్తోంది. ముఖ్యంగా, ఖాతా తెరవడానికి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు, అలాగే నిర్వహణ చార్జీలుగానీ, కనీస మొత్తం ఖాతాలో ఉండాల్సిన నిబంధన గానీ లేదు” అని శ్రీమతి సీతారామన్ తెలిపారు.

“గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో 67 శాతం ఖాతాలు తెరవగా, వారిలో 55 శాతం మహిళలే కావడం హర్షణీయం అని కేంద్ర ఆర్థిక మంత్రి అన్నారు.  

“జన్ ధన్ – మొబైల్ – ఆధార్ అనుసంధానం ద్వారా ఏర్పరిచిన సమ్మతి ఆధారిత వ్యవస్థ- ఈ ఆర్థిక సమ్మిళిత వ్యవస్థకు మూలాధారాల్లో ఒకటి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను త్వరితగతిన, అంతరాయం లేకుండా, పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులకు బదిలీ చేయడానికీ, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికీ ఇది వీలు కల్పించింది” అని శ్రీమతి సీతారామన్ తెలిపారు.  

‘‘పీఎంజేడీవై ఒక పథకం మాత్రమే కాదు, సరికొత్త మార్పును అందించిన ఉద్యమం. ఈ పథకం బ్యాంకింగ్ వ్యవస్థకు బయట ఉన్న ప్రజలకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని అందించడమే కాకుండా, ఆర్థిక భద్రతా భావనను కలిగించింది’’ అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌధరి ఈ సందర్భంగా తన సందేశంలో పేర్కొన్నారు.  

“ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా ఉండాలని; వయోజనులంతా భీమా, పింఛను పరిధిలో ఉండాలని తన 2021 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ దిశగా నిరంతర కృషితో దేశవ్యాప్తంగా చేపట్టిన వివిధ సంపూర్ణమైన కార్యక్రమాల ద్వారా, దాదాపు అందరికీ బ్యాంకు ఖాతాలను సాధించాం; దేశవ్యాప్తంగా బీమా, పింఛను పరిధి పెరుగుతోంది” అని శ్రీ చౌధరి తెలిపారు.

 

“అందరు భాగస్వాములు, బ్యాంకులు, బీమాకంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మరింత ఆర్థిక సమ్మిళిత సమాజం దిశగా అడుగులు వేస్తున్నాం. దేశంలో ఆర్థిక సమ్మిళిత్వానికి దిశానిర్దేశం చేసిన కార్యక్రమంగా పీఎంజేడీవై ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఉద్యమ ప్రాతిపదికన జరిగే పాలనకు ముఖ్యమైన ఉదాహరణ మాత్రమే కాదు, ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంటే ఏం సాధించగలదో కూడా వెల్లడిస్తోంది అని శ్రీ చౌదరి తెలిపారు.

బ్యాంకు సదుపాయానికి దూరంగా ఉన్న యువత అందరికీ పీఎంజేడీవై ప్రాథమిక బ్యాంకు ఖాతా అందిస్తుంది. ఈ ఖాతాలో ఎలాంటి నగదు నిల్వ ఉండాల్సిన అవసరం లేదు, ఈ ఖాతాపై ఫీజూ వసూలు చేయరు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి రూపే డెబిట్ కార్డును ఉచితంగా అందిస్తున్నారు. ఈ కార్డు ద్వారా రూ.2 లక్షల ప్రమాద బీమా కూడా లభిస్తుంది. పీఎంజేడీవై ఖాతాదారులు అత్యవసర పరిస్థితుల్లో రూ.10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ పొందడానికి కూడా అర్హులు.

గత దశాబ్ధ కాలంలో పీఎంజేడీవైను అమలు చేయడం ద్వారా అనేక కార్యక్రమాలు పరివర్తనాత్మక, నిర్దేశాత్మక మార్పులను అందించాయి. తద్వారా సమాజంలోని చివరి వ్యక్తి వరకూ అంటే, నిరుపేదలకు ఆర్థిక సేవలను సమర్థవంతంగా అందించగలిగేలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలను తీర్చిదిద్దింది కూడా ఇదే పథకం.  

 

ప్రత్యక్ష ప్రయోజన బదిలీలను పొందడంలో పీఎంజేడీవై కీలకం. అంతేకాకుండా, ఎటువంటి మధ్యవర్తులు లేకుండా ఉద్దేశిత లబ్ధిదారునికి ప్రభుత్వం ద్వారా లభించాల్సిన సబ్సిడీలు/ చెల్లింపులను ఇబ్బందులు లేకుండా అందించడానికీ, అంతరాయం లేని లావాదేవీల కోసం, పొదుపు సమీకరణ వేదికగానూ ఉపయోగపడుతున్నది. పైగా, జన సురక్ష పథకాల (సూక్ష్మ బీమా పథకాలు) ద్వారా లక్షలాది మంది అసంఘటిత రంగ కార్మికులకు జీవిత, ప్రమాద బీమా కల్పించడంలో ఈ బ్యాంకు అక్కౌంట్లు కీలకంగా నిలిచాయి.

 

పీఎంజేడీవై మూలస్తంభాల్లో ఒకటైన జన్ ధన్, ఆధార్, మొబైల్ (జేఏఎం) త్రయం సబ్సిడీలను దారి మళ్లకుండా అందించే యంత్రాంగంగా నిరూపించుకున్నది. జేఏఎం ద్వారా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ కింద సబ్సిడీలు, సామాజిక ప్రయోజనాలను నేరుగా నిరుపేదల బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం విజయవంతంగా బదిలీ చేసింది.

గత పదేళ్లలో పీఎంజేడీవైని అమలు చేయడం ద్వారా అది గణనీయమైన విజయాలను అందుకున్నది. పీఎంజేడీవైకి సంబంధించి ప్రధాన అంశాలు, చేరుకున్న మైలురాళ్లు కింది విధంగా ఉన్నాయి.

a.     పీఎంజేడీవై ఖాతాలు: 53.13 కోట్లు (ఈ ఏడాది ఆగష్టు 14 నాటికి)

ఆగష్టు 14 నాటికి మొత్తం పీఎంజేడీవై ఖాతాల సంఖ్య: 53.13 కోట్లు; 55.6% (29.56 కోట్లు) జన్ ధన్ ఖాతాదారులు మహిళలే,  66.6% (35.37 కోట్లు) జన్ ధన్ ఖాతాదారులు గ్రామీణ, సెమి-అర్బన్ ప్రాంతాలకు చెందినవారు.

b.     పీఎంజేడీవై ఖాతాల్లో డిపాజిట్లు – 2.31 లక్షల కోట్లు (ఈ ఏడాది ఆగష్టు 14 నాటికి)

పీఎంజేడీవై ఖాతాల కింద జమ అయిన మొత్తం నిల్వ రూ.2,31,236 కోట్లుగా ఉంది. ఖాతాలు 3.6 రెట్లు పెరగడంతో పాటు డిపాజిట్లు 15 రెట్లు పెరిగాయి.

 

c.  పీఎంజేడీవై ఖాతాల్లో సగటు డిపాజిట్  రూ. 4352 (ఈ ఏడాది ఆగష్టు 14 నాటికి)

ఈ ఏడాది ఆగష్టు 14 నాటికి ప్రతి ఖాతాలో సగటు డిపాజిట్ రూ.4,352గా ఉంది. 2015 ఆగస్టుతో పోలిస్తే ఒక్కో ఖాతాలో సగటు డిపాజిట్ 4 రెట్లు పెరిగింది. సగటు డిపాజిట్ పెరగడమన్నది ఖాతాల వినియోగం, ఖాతాదారుల్లో పొదుపు అలవాటు పెరిగాయనడానికి సూచన.

d. పీఎంజేడీవై ఖాతాదారులకు 36.14 కోట్ల రూపే కార్డుల జారీ (ఈ ఏడాది ఆగష్టు 14 నాటికి)

పీఎంజేడీవై ఖాతాదారులకు 36.14 కోట్ల రూపే కార్డులు జారీ అయ్యాయి: రూపే కార్డుల సంఖ్య, వాటి వినియోగం క్రమంగా పెరిగింది.

పీఎంజేడీవై కింద 36.06 కోట్లకు పైగా రూపే డెబిట్ కార్డుల జారీ, 89.67 లక్షల పీవోఎస్/ఎంపీవోఎస్ యంత్రాల ఏర్పాటు, యూపీఐ వంటి మొబైల్ ఆధారిత చెల్లింపు వ్యవస్థలను ప్రవేశపెట్టడం ద్వారా మొత్తం డిజిటల్ లావాదేవీల సంఖ్య 2018-19 ఆర్థిక సంవత్సరంలో 2,338 కోట్ల నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 16,443 కోట్లకు పెరిగింది. మొత్తం యూపీఐ ఆర్థిక లావాదేవీల సంఖ్య 2018-19 ఆర్థిక సంవత్సరంలో 535 కోట్ల నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 13,113 కోట్లకు పెరిగింది. అదేవిధంగా పీవోఎస్, ఈ-కామర్స్ లో రూపే కార్డు లావాదేవీల మొత్తం సంఖ్య 2017-18 ఆర్థిక సంవత్సరంలో 67 కోట్ల నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 96.78 కోట్లకు పెరిగింది.

పీఎంజేడీవై విజయం... ఈ పథక నిర్దేశక విధానాన్ని, నియంత్రణ సహకారాన్ని, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలను, బయోమెట్రిక్ గుర్తింపు కోసం ఆధార్ వంటి డిజిటల్ ప్రజా సదుపాయాల ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తోంది.

గతంలో అధికారిక ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం కాని వారికి రుణ సదుపాయం కల్పిస్తూనే, పొదుపు చేయడానికీ పీఎంజేడీవై అవకాశం కల్పించింది. దాంతో, ఖాతాదారులు తమ పొదుపు విధానాలను చూపించి, బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా రుణాలు పొందడానికి అర్హత సాధిస్తారు. ముద్ర రుణాల మంజూరు దీనికి మంచి ఉదాహరణ. అవి 2019 ఆర్థిక సంవత్సరం నుంచి 2024 ఆర్థిక సంవత్సరాల మధ్య 9.8 శాతం సమ్మిళిత వార్షిక రేటుతో పెరిగాయి. వ్యక్తుల్లో తమ ఆదాయాలను పెంచుకునే సాధికారతను పెంచడం ద్వారా, ఈ రుణ లభ్యత పరివర్తనాత్మకంగా నిలిచింది.

పీఎంజేడీవై ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత పథకం. దాని పరివర్తన శక్తి, డిజిటల్ ఆవిష్కరణలతో దేశ ఆర్థిక సమ్మిళితిలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.

 

***


(Release ID: 2049240) Visitor Counter : 250