PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 29 SEP 2020 6:02PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • భారత్‌లో 83 శాతం దాటిన కోలుకునేవారి సగ‌టు.
  • ప్రస్తుత కేసులుకన్నా కోలుకున్న కేసులు 41.5 లక్షలు అధికం.
  • గత 24 గంటల్లో 84,877 మంది కోలుకోగా తాజాగా నమోదైన కేసుల సంఖ్య 70,589గా ఉంది.
  • దేశంలో నమోదైన మొత్తం కేసులలో ప్రస్తుతం చురుకైన కేసులు కేవలం 15.42 శాతమే.
  • కోవిడ్‌-19 అనంతరం పౌరుల అవసరాలకు తగిన సురక్షిత, పరిశుభ్ర, సుదృఢ, స్పందనాత్మక ఇంధన వ్యవస్థ పునర్నిర్మాణానికి దృఢ సంకల్పం పూనాం: శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌.
  • ‘పరిశ్రమల్లో కోవిడ్‌-19 సురక్షిత పని ప్రదేశం మార్గదర్శకాలు’ కరదీపిక ఆవిష్కరణ.

భారత్‌లో 83 శాతం దాటిన కోలుకునేవారి సగ‌టు; ప‌్ర‌స్తుత కేసుల‌క‌న్నా కోలుకున్న కేసులు 41.5 లక్షలు అధికం

దేశంలో కోవిడ్ మ‌హ‌మ్మారినుంచి కోలుకునే‌వారి సంఖ్య శ‌ర‌వేగంగా పెరుగుతూ గ‌త 24 గంట‌ల్లో కొత్త కేసుల (70,589)‌తో పోలిస్తే  న‌యమైన కేసులు (84,877) అధికంగా ఉన్నాయి. ఆ మేర‌కు కోలుకునేవారి జాతీయ స‌గ‌టు 83 శాతం దాట‌గా ఇప్ప‌టిదాకా వ్యాధి న‌య‌మైన‌వారి సంఖ్య 51,01,397కు చేరింది. కొత్త కోలుకున్న‌వారిలో 73 శాతం 10 రాష్ట్రాలకు చెందినవారు కాగా- మహారాష్ట్ర, కర్ణాట‌క, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఒడిషా, కేరళ, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ ఈ జాబితాలో ఉన్నాయి. ఒకేరోజు 20,000 మంది కోలుకోవ‌డంతో మ‌హారాష్ట్ర అగ్ర‌స్థానంలో నిల‌వ‌గా- చెరో 7,000కుపైగా కోలుకున్న‌వారితో కర్ణాట‌క‌, ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అలాగే ప్ర‌స్తుత (9.47.576)‌, కోలుకున్న కేసుల మ‌ధ్య తేడా 41.53.831గా... అంటే- 5.38 రెట్లు ఎక్కువగా న‌మోదైంది. మొత్తంమీద దేశంలో న‌మోదైన మొత్తం నిర్ధారిత కేసుల‌లో ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్న కేసులు కేవ‌లం 15.24 శాత‌మే. అంతేగాక ఆస్ప‌త్రుల‌లో ఉన్న‌వారి సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఇక గ‌త 24 గంటల్లో న‌మోదైన 70,589 కేసుల‌లో 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వాటా 73 శాతం కాగా, మహారాష్ట్రలో అత్యధికంగా 11,000కుపైగా ఉన్నాయి. క‌ర్ణాట‌క రాష్ట్రం 6,000 కేసుల‌తో రెండో స్థానంలో ఉంది. దేశ‌వ్యాప్తంగా గత 24 గంటల్లో సంభ‌వించిన 776 మరణాలకుగాను 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వాటా 78 శాతం కాగా, మహారాష్ట్రలో అత్యధికంగా 23 శాతానికిపైగా (180), తమిళనాడులో 70 వంతున కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1660007

‘పరిశ్రమల్లో కోవిడ్-19 సురక్షిత పని ప్రదేశం మార్గదర్శకాలు’ కరదీపికను ఆవిష్కరించిన డాక్టర్‌ హర్షవర్ధన్‌, శ్రీ సంతోష్‌కుమార్‌ గంగ్వార్‌

‘పరిశ్రమల్లో కోవిడ్-19 సురక్షిత పని ప్రదేశం మార్గదర్శకాలు’ కరదీపికను కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమం, శాస్త్ర-సాంకేతిక, భూవిజ్ఞానశాస్త్ర శాఖల మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌, కార్మిక-ఉపాధి శాఖ (ఇన్‌చార్జి) మంత్రి శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్ ఇవాళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ- “ఈ మార్గదర్శకాలు సమయానుకూలం మాత్రమేగాక ప్రశంసనీయంగా రూపొందాయి. ఈ కరదీపిక పరిశ్రమల్లోని కార్మికుల  సంక్షేమానికి తోడ్పడుతుంది. పని ప్రదేశాల నడుమ కోవిడ్‌-19 ముప్పు స్థాయిని గుర్తించి తగు నియంత్రణ ప్రణాళికలను రూపొందించుకోవడంలో యాజమాన్యాలతోపాటు కార్మికులకు కూడా ఈ మార్గదర్శకాలు తగురీతిలో ఉపయోగపడతాయి” అని పేర్కొన్నారు. శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్ మాట్లాడుతూ- “పరిశ్రమల్లోని కార్మికుల భద్రత దిశగా ఈ మార్గదర్శకాలు అందరికీ ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులకు మనను మనం మానసికంగా సిద్ధం చేసుకోవడంతోపాటు కోవిడ్‌ సమయంలో సముచిత ప్రవర్తనపై అవగాహన కల్పించడం చాలా ముఖ్యం” అన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1660187

గాంధీ జయంతి నేపథ్యంలో ప్రకృతి వైద్యవిధానంపై వరుస వెబినార్ల నిర్వహణకు సన్నాహాలు

మహాత్మాగాంధీ 150వ జయంతి నేపథ్యంలో ఆయుష్‌ మంత్రిత్వశాఖ పరిధిలోగల పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నేచురోపతి (NIN) 2020 అక్టోబరు 2 నుంచి నవంబరు 18వ తేదీనాటి జాతీయ ప్రకృతి వైద్యవిధాన దినోత్సవం వరకూ వెబినార్‌లు నిర్వహించనుంది. గాంధీ ప్రబోధిత ‘ఆరోగ్య స్వావలంబన ద్వారా స్వయం సమృద్ధి’ ప్రధాన ఇతివృత్తంగా ఈ వెబినార్లు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా సాధారణ ప్రకృతివైద్య నమూనాలో స్వీయ ఆరోగ్య రక్షణ బాధ్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఈ సహజ విధానాలన్నీ అందరికీ అందుబాటులోనివే అయినప్పటికీ వీటిని ప్రదర్శనపూర్వకంగా సూచిస్తారు. అనంతరం ఆన్‌లైన్‌ ప్రత్యక్ష సంభాషణ ప్రక్రియ వంటి వాటిద్వారా అభిప్రాయ సేకరణ చేపడతారు.  

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1660041

గంగానది ప్రక్షాళన-నిరంతర వాహినిగా రూపొందించే దిశగా ఉత్తరాఖండ్‌లో 6 ప్రధాన పథకాలను ప్రారంభించిన ప్రధానమంత్రి

‘నమామి గంగే’ కార్యక్రమం కింద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరాఖండ్‌లో 6 భారీ పథకాలను దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ప్రారంభించారు. దీంతోపాటు హరిద్వార్‌లో తొలి ‘గంగా అవలోకన ప్రదర్శనశాల’కు కూడా ఆయన శ్రీకారం చుట్టారు. అనంతరం “రోయింగ్‌ డౌన్‌ ది గ్యాంజెస్‌” పుస్తకాన్ని, జల్‌జీవన్‌ మిషన్‌ కొత్త లోగోను కూడా ప్రధానమంత్రి ఆవిష్కరించారు. అలాగే జల్‌ జీవన్‌ మిషన్‌ కింద ‘పంచాయతీలు, జల సమితులకు మార్గదర్శకాల’ కరదీపికను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- దేశంలోని ప్రజలందరికీ కొళాయి కనెక్షన్లద్వారా మంచినీటిని సరఫరా చేయడం జల్‌జీవన్‌ మిషన్‌ లక్ష్యమని గుర్తుచేశారు. ప్రతి నీటిచుక్కనూ సంరక్షించడంలో ఈ మిషన్‌ కోసం రూపొందించిన కొత్త లోగో స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌ నుంచి పశ్చిమబెంగాల్‌ దాకా నివసించే దేశంలోని దాదాపు 50 శాతం జనాభా సుస్థిర జీవనంలో ప్రధాన పాత్ర పోషించే గంగానదిని పరిశుభ్రంగా ఉంచడంలోగల ప్రాముఖ్యాన్ని శ్రీ మోదీ నొక్కిచెప్పారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1660045

ఉత్తరాఖండ్‌లో ‘నమామి గంగే’ కింద 6 ప్రధాన పథకాల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1659994

భారత-డెన్మార్క్‌ వ్యూహాత్మక హరిత భాగస్వామ్యంపై సంయుక్త ప్రకటన

భారత-డెన్మార్క్‌ నిన్న సంయుక్తంగా నిర్వహించిన ఆన్‌లైన్‌ సదస్సుకు రెండు దేశాల ప్రధానమంత్రులు గౌరవనీయ మెట్టీ ఫ్రెడరిక్‌సన్‌, శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలు, కోవిడ్‌-19 మహమ్మారిపై ఉభయపక్షాలకూ సంబంధించిన జాతీయ-అంతర్జాతీయ పరిణామాలపై వారిద్దరూ సౌహార్ద వాతావరణం నడుమ లోతుగా చర్చించారు. దీంతోపాటు వాతావరణ మార్పు, హరిత పరివర్తన అంశాలపైనా మాట్లాడుకోవడంతోపాటు సుస్థిర ఆర్థిక వ్యవస్థలు వేగం పుంజుకునేలా అనుసరించాల్సిన విధానాలపై ఉమ్మడి అవగాహనకు వచ్చారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1659976

దేశంలో సమగ్ర ఇంధన భద్రత వ్యవస్థ రూపకల్పనలో ‘స్వయం సమృద్ధ భారతం’ మా ప్రయత్నాలకు చోదకశక్తి: శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌

దేశంలో సమగ్ర ఇంధన భద్రత వ్యవస్థను రూపొందించడంలో గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘స్వయం సమృద్ధ భారతం’ తమకు చోదకశక్తి కాగలదని కేంద్ర పెట్రోలియం-సహజవాయువు-ఉక్కు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ‘జీసీటీసీ ఇంధన భద్రత సదస్సు-2020’లో ఆయన ఇవాళ ప్రధానోపన్యాసం ఇచ్చారు. గడచిన ఆరేళ్లుగా అమల్లోకి వచ్చిన బలమైన ఇంధన విధానాల కొనసాగింపు, కోవిడ్-19 విసిరిన సవాళ్లను పరిష్కరించే దిశగా వాటిలో మార్పు ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. “కోవిడ్ అనంతరం పౌరుల అవసరాలకు తగిన సురక్షిత, పరిశుభ్ర, సుదృఢ, స్పందనాత్మక ఇంధన వ్యవస్థ పునర్నిర్మాణానికి దృఢ సంకల్పం పూనామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1659993

తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, హర్యానాల్లో కేఎంఎస్ 2020-21 కింద 13.77 లక్షల టన్నుల పప్పులు, నూనె గింజల సేకరణకు ఆమోదం

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020-21 ఇప్పుడిప్పుడే మొదలైంది. ఈ నేపథ్యంలో మునుపటి సీజన్ల తరహాలోనే ప్రస్తుత కనీస మద్దతుధర పథకాల మేరకు ప్రభుత్వం రైతుల నుంచి ఖరీఫ్ 2020-21 పంటల సేకరణను కొనసాగించింది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, హర్యానా రాష్ట్రాల నుంచి అందిన ప్రతిపాదనలకు అనుగుణంగా ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌ 2020-21 కింద 13.77 లక్షల టన్నుల పప్పుదినుసులు, నూనె గింజల సేకరణకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి కూడా ప్రతిపాదనలు అందితే ఆమోదం తెలిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. కాగా, 24.09.2020 వరకూ ప్రభుత్వం తన నోడల్ ఏజెన్సీల ద్వారా తమిళనాడులో రూ.25 లక్షల కనీస మద్దతు ధరగల 34.20 టన్నుల పెసరపప్పును కొనుగోలు చేయగా, 40 మంది రైతులకు ప్రయోజనం కలిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి 95.75 లక్షల టన్నుల ఎండుకొబ్బరి (నిరంతరం పంట) సేకరణకు అనుమతి ఇవ్వగా, అందులో తమిళనాడు, కర్ణాటకల నుంచి రూ.52.40 కోట్ల కనీస మద్దతు ధరగల 5089 టన్నుల పంటను కొనుగోలు చేసింది. తద్వారా 3961 మంది రైతులు లబ్ధి పొందారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1659921

‘పీఎం కేర్స్‌ నిధి’కి కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ద్వారా రూ.2.11 కోట్ల విరాళం అందజేసిన బీవీపీ

లాభాపేక్షరహిత స్వచ్ఛంద సంస్థ ‘భారత వికాస పరిషత్‌’ (బీవీపీ) కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్రసింగ్‌ ద్వారా రూ.2.11 కోట్ల విరాళం అందజేసింది. ఈ సందర్భంగా మంత్రి బీవీపీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రజలకు అత్యంత విశ్వసనీయత ఉందని గుర్తుచేశారు. కాబట్టే ఆయన ఏదైనా సత్కార్యం కోసం పిలుపునిచ్చినప్పుడల్లా అది ఒక స్వచ్ఛంద ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. స్వచ్ఛ భారత్ మిషన్, మరుగుదొడ్ల నిర్మాణం లేదా గ్యాస్ సబ్సిడీ త్యజించడం లేదా కోవిడ్‌ దిగ్బంధంసహా ఇతర మార్గదర్శకాలను పాటించడం తదితరాలపై ఆయన పిలుపునిచ్చిన సందర్భాల్లో ప్రధానిపై  ప్రజల్లోగల విశ్వాసం రుజువైందని గుర్తుచేశారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1659684

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • పంజాబ్: రాష్ట్రంలోని కోవిడ్‌ రోగులకు అత్యుత్తమ  చికిత్స అందించే దిశగా ఏర్పాట్లపై సమీక్ష కోసం వివిధ జిల్లాల్లోని ఆస్పత్రులన్నిటినీ సందర్శించాల్సిందిగా డిప్యూటీ కమిషనర్లను పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. కాగా, రోగుల అన్వేషణ, సత్వర గుర్తింపు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జిల్లాస్థాయి కోవిడ్ పేషెంట్ ట్రాకింగ్ ఆఫీసర్ల (సీపీటీవో)ను  నియమించింది.
  • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలలు, జోనల్‌ ఆస్పత్రులలో వార్డుల పరిశుభ్రత, రోగులకు చికిత్స, ఆహార నాణ్యత, మరుగుదొడ్ల స్థితిగతులను పరిశీలించడం కోసం రోజుకు కనీసం రెండుసార్లు తనిఖీ చేయాలని మెడికల్‌ సూపరింటెండెంట్లను హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదేశించారు. రోగులకు అవసరమైతే లేదనకుండా ఆక్సిజన్ సిలిండర్లు అందించేలా చూడాలని స్పష్టం చేశారు. కోవిడ్-19 రోగులు, వారి కుటుంబసభ్యుల మధ్య సమాచార సంబంధాల కోసం ఒక యంత్రాంగాన్ని రూపొందించాలని సూచించారు. వేడినీరు, కషాయం, పోషకాహారం వంటివి కూడా రోగులకు అందుబాటులో ఉంచాలన్నారు.
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో నిన్న 329 కొత్త కేసుల నమోదుతో ఒకేరోజు అత్యధిక కేసులు నిర్ధారణ అయ్యాయి. వీటిలో ఇటానగర్ రాజధాని ప్రాంతంలోనే 117 కేసులు నమోదయ్యాయి. మరోవైపు పరీక్షల్లో వ్యాధి నిర్ధారణ కానప్పటికీ, రోగ లక్షణాలున్న వారందరికీ ఆర్టీ-పీసీఆర్ పరీక్ష నిర్వహించాలని, ఈ ఖర్చును తానే భరించాలని అరుణాచల్ ప్రభుత్వం నిర్ణయించింది.
  • అసోం: రాష్ట్రంలో గత 24 గంటల్లో 2320 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఇక ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య 1,73,629 కాగా, వీటిలో 1,42,297 మందికి వ్యాధి నయమైంది. ప్రస్తుతం 30662 క్రియాశీల కేసులున్నాయి.
  • మణిపూర్: రాష్ట్రంలో 178 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 10,477కు చేరాయి. మణిపూర్‌లో 76 శాతం రికవరీ రేటుతో ప్రస్తుతం 2431 క్రియాశీల కేసులున్నాయి.
  • మేఘాలయ: రాష్ట్రంలో ఇవాళ 89మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం క్రియాశీల కేసులు 1448కి చేరగా వీరిలో 92 మంది బీఎస్‌ఎఫ్, సాయుధ దళాల సిబ్బంది ఉన్నారు.
  • మిజోరం: రాష్ట్రంలో నిన్న 50 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 1958కి చేరగా, ప్రస్తుతం 499 క్రియాశీల కేసులున్నాయి.
  • నాగాలాండ్: రాష్ట్రంలోని 5957 నిర్ధారిత కేసులకుగాను సాయుధ దళాల సిబ్బంది 2801 మంది ఉన్నారు. అలాగే నాగాలాండ్‌కు తిరిగి వచ్చినవారు 1482 మంది, పరిచయాలతో వ్యాధిగ్రస్థులు 1334మంది, ముందు వరుస పోరాట యోధులు 340 మంది ఉన్నారు.
  • కేరళ: రాష్ట్రంలో కోవిడ్ కేసులు ఇటీవల భారీగా పెరిగినందువల్ల ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేరళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గత 28 రోజుల్లో లక్ష కేసులు నమోదవగా, వీరిలో ఆరోగ్య కార్యకర్తలు, సామాన్యులు కూడా ఉన్నారని ఐఎంఏ ప్రతినిధులు పేర్కొన్నారు. కాగా, ఇవాళ పాలక ఎల్‌డిఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం సందర్భంగా రెండు వారాల తర్వాత తిరిగి దిగ్బంధం విధించడంపై తుది నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది. కేరళలో నిన్న 4,538 కొత్త కేసులు నమోదవగా ప్రస్తుతం, 57,879 మంది చికిత్సలో ఉన్నారు. మరోవైపు 2.32 లక్షలమంది నిర్బంధవైద్య పర్యవేక్షణలో ఉండగా తాజాగా ఐదు మరణాలతో మృతుల సంఖ్య 702కు పెరిగింది.
  • తమిళనాడు: రాష్ట్రంలో 10, 11, 12 తరగతుల విద్యార్థులకు అక్టోబర్ 1 నుంచి విద్యాసంస్థలు తిరిగి తెరవడంపై ప్రభుత్వ-ప్రైవేట్‌ యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాయి. కాగా, రాష్ట్రానికి రావాల్సిన రూ.23,763 కోట్ల జీఎస్టీ బకాయిలను విడుదల చేయాలని, కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నిరోధం, నియంత్రణ, ఇతర సంబంధిత పనుల కోసం తగినన్ని నిధులు కేటాయించాలని ఏఐఏడీఎంకే కేంద్రాన్ని కోరింది. కాగా, రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభంపై ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి, పాఠశాల విద్యాశాఖ మంత్రి కె.ఎ.సెంగోట్టయ్యన్‌లతో ఉన్నతస్థాయి కమిటీ సమావేశం నేపథ్యంలో త్వరలోనే తుది నిర్ణయం వెలువడవచ్చునని భావిస్తున్నారు. ఇక ఇటీవల కోవిడ్ బారినపడిన డీఎండీకే వ్యవస్థాపక అధ్యక్షుడు విజయకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని ‘మియాట్’ ఆస్పత్రి మెడికల్ బులెటిన్ తెలిపింది.
  • కర్ణాటక: రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నడుమ పాఠశాలల పునఃప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని కర్ణాటక విద్యాశాఖ మంత్రి ఎస్.సురేష్ కుమార్ చెప్పారు. మైసూరులోని జె.ఎస్.ఎస్. ఆస్పత్రిలో కోవిడ్-19 టీకా ‘నోవావాక్స్’ 2, 3 దశల ప్రయోగ పరీక్షలను ప్రారంభించే అవకాశం ఉంది. కాగా, రాష్ట్రంలోని గ్రామీణ-పట్టణ ప్రాంతాల ఆస్పత్రులలో కోవిడ్ రోగులకు ఆక్సిజన్ లభ్యతపై నివేదిక సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో పాఠశాలలను అక్టోబర్ 5న తెరవాలన్న తన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం సందర్భంగా ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితి దృష్ట్యా నవంబర్ 2 వరకు వాయిదా వేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రోజులుగా కోవిడ్-19 మరణాలు, కొత్త కేసులు, చురుకైన కేసులు గణనీయంగా తగ్గినట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఆరోగ్యం-కుటుంబ సంక్షేమం) డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి చెప్పారు. జూలైలో కేసుల నిర్ధారణ సగటు 12.07 శాతంకాగా, ఇప్పుడు 8.3శాతానికి తగ్గిందని చెప్పారు. అయితే, రాష్ట్రంలో కోవిడ్-19 పునరుత్పత్తి సగటు 0.94 శాతంగా ఉందని, వాస్తవానికి ఇది 0.5 లేదా 0.6గా ఉండాలని పేర్కొన్నారు.
  • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 2072 కొత్త కేసులు, 9 మరణాలు నమోదవగా 2259 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 283 జీహెచ్‌ఎంసీ నుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు: 1,89,283; క్రియాశీల కేసులు: 29,477; మరణాలు: 1116; డిశ్చార్జి: 1,58,690గా ఉన్నాయి. కాగా, నిజామాబాద్ స్థానిక అధికారుల నియోజకవర్గం (ఎంఎల్‌సి) ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేయాలంటే కోవిడ్-19 నిర్ధారణ పరీక్ష తప్పనిసరి. ఇక దుబ్బాక శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక నవంబర్ 3న జరగనుంది; ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం నామినేషన్లను ఆహ్వానిస్తూ అక్టోబర్ 9న నోటిఫికేషన్ జారీకానుంది.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య కొన్ని రోజులుగా స్థిరంగా తగ్గుతోంది. ఈ మేరకు చురుకైన కేసుల సంఖ్య సోమవారంనాటికి 2,65,033కు దిగివచ్చింది. మొత్తంమీద 11 రోజులుగా తగ్గిన కేసుల సంఖ్య 36,719గా నమోదైంది. ఏడు నెలల కిందట దేశంలో అత్యంత తీవ్ర ప్రభావితమైన మహారాష్ట్రలో ఇదొక రికార్డు.
  • గుజరాత్: రాష్ట్రంలోని అహ్మదాబాద్ పురపాలక సంస్థ (ఎఎంసి) నగరంలోని 27 ప్రాంతాల్లో రాత్రివేళ కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. కొత్త కేసులు క్రమంగా పెరగడంతోపాటు కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నిబంధనలను ఉల్లంఘిస్తున్న దృష్ట్యా నగరంలోని 27 రద్దీ రహదారులలో రాత్రి 10 గంటల తర్వాత దుకాణాలన్నీ మూసివేయాలని స్పష్టం చేసింది. ఇక మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ (92) కోవిడ్‌ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
  • రాజస్థాన్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 2,112 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.30 లక్షలు దాటింది. కాగా, సోమవారం జైపూర్‌లో గరిష్ఠంగా (444), జోథ్‌పూర్‌ (361), పాలి (127) వంతున కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఇప్పటిదాకా 1.08 లక్షలమంది కోలుకున్న నేపథ్యంలో ప్రస్తుతం 20,043 క్రియాశీల కేసులున్నాయి.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలోని ఇండోర్‌లో కోవిడ్-19తో మరణిస్తున్న ప్రతి మూడో వ్యక్తి ‘ఉత్పాదక వయోవర్గం’ లోనివారని వయస్సులవారీ మరణాలపై అధ్యయనం పేర్కొంది. ఈ జిల్లాలో సెప్టెంబరు 24దాకా మరణించిన రోగులలో 34.83 శాతం 41-60 ఏళ్ల మధ్య వయస్కులున్నారు. ఆ మేరకు ఈ వయోవర్గంలో మృతుల సంఖ్య 185గా నమోదైంది. ఇక జిల్లాలో దాదాపు ఆరు నెలల తర్వాత మతపరమైన ప్రదేశాలు తిరిగి తెరిచిన నేపథ్యంలో కోవిడ్‌ మార్గదర్శకాలను భక్తులు తప్పక పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, మధ్యప్రదేశ్‌లో సోమవారం 1,957 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 1.24 లక్షలకు చేరింది. ప్రస్తుతం 21,912 క్రియాశీల కేసులున్నాయి.
  • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలోని రాయ్‌పూర్, బిలాస్‌పూర్, సర్గుజా, జష్పూర్ జిల్లాల్లో సోమవారం రాత్రి దిగ్బంధం ముగిసింది. దీంతో దుకాణాలు, వ్యాపార సంస్థలు ఇకపై రాత్రి 8 గంటలదాకా తెరిచి ఉంటాయి. ఏదేమైనా, రాష్ట్రంలో 3,725 కొత్త కేసుల నమోదుతోపాటు 13 మరణాలు సంభవించిన రోజున దిగ్బంధం తొలగించడం గమనార్హం. ఛత్తీస్‌గఢ్‌లో నమోదైన మొత్తం కేసులు 1,08,458కిగాను ఇప్పటిదాకా 877 మంది మరణించారు. ప్రస్తుతం చురుకైన కేసులు 33,000 దాటగా, కొత్త కేసులలో 65 శాతం ఒక్క సెప్టెంబరు నెలలోనే నమోదైనవి కావడం గమనార్హం.

FACT CHECK

 

 

*******



(Release ID: 1660192) Visitor Counter : 168