వ్యవసాయ మంత్రిత్వ శాఖ

ఈ ఖరీఫ్‌లో, 13.77 ల.మె.ట. పప్పుధాన్యాలు, నూనె గింజల సేకరణకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, హర్యానాకు కేంద్రం అనుమతి

ఆదివారం వరకు, హర్యానా, పంజాబ్‌ రైతుల నుంచి క్వింటాలుకు రూ.1868 కనీస మద్దతు ధరతో, 5637 మె.ట. ధాన్యం సేకరణ; మిగిలిన రాష్ట్రాల్లో సోమవారం నుంచి ప్రారంభమైన సేకరణ
పత్తి సేకరణ అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ప్రారంభం

Posted On: 28 SEP 2020 4:54PM by PIB Hyderabad

2020-21 ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌ (కేఎంఎస్‌) ప్రారంభమైంది. ప్రస్తుత కనీస మద్దతు ధర పథకాల ప్రకారం, రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను కేంద్రం సేకరిస్తోంది.

    రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు, 13.77 ల.మె.ట. పప్పుధాన్యాలు, నూనె గింజల సేకరణకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, హర్యానాకు అనుమతి లభించింది. మిగిలిన రాష్ట్రాలు/యూటీల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వాటికి కూడా సేకరణ అనుమతి లభిస్తుంది. ఒకవేళ మార్కెట్‌ రేటు కనీస మద్దతు ధర కంటే తక్కువగా ఉంటే, మద్దతు ధర పథకాలను (పీఎస్‌ఎస్‌) అనుసరించి సేకరణ ఉంటుంది.

    ఈ నెల24వ తేదీ వరకు, 40 మంది తమిళ రైతులకు ప్రయోజనం చేకూరుస్తూ, రూ.25 లక్షల కనీస మద్దతు ధరతో, 34.20 మె.ట. పెసలను నోడల్‌ ఏజెన్సీల ద్వారా కేంద్రం సేకరించింది. అదేవిధంగా, 5089 మె.ట. ఎండు కొబ్బరిచిప్పలను రూ.52.4 కోట్ల కనీస మద్దతు ధరతో సేకరించింది. తమిళనాడు, కర్ణాటకలోని 3961 మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, కేరళలో మొత్తం 95.75 ల.మె.ట. ఎండు కొబ్బరిచిప్పల సేకరణకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

    గత శనివారం నుంచి ఖరీఫ్‌ ధాన్యం సేకరణ ప్రారంభమైంది. క్వింటాలుకు రూ.1868 కనీస మద్దతు ధరతో ఆదివారం వరకు, 5637 మె.ట. ధాన్యాన్ని కేంద్రం సేకరించింది. హర్యానా, పంజాబ్‌ రైతుల వద్ద ఈ సేకరణ జరిగింది. ధాన్యం విలువ రూ.10.53 కోట్లు. మిగిలిన రాష్ట్రాల్లో సోమవారం నుంచి సేకరణ ప్రారంభమైంది.

    ఈ ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌లో పత్తి సేకరణ అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఎఫ్‌ఏక్యూ రకం పత్తిని, కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) అక్టోబర్‌ 1వ తేదీ నుంచి సేకరిస్తుంది.

***



(Release ID: 1659921) Visitor Counter : 200