ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

పరిశ్రమ పని ప్రదేశాల్లో కోవిడ్-19 సురక్షిత మార్గదర్శకాల పుస్తకావిష్కరణ

Posted On: 29 SEP 2020 5:37PM by PIB Hyderabad

పరిశ్రమ పని ప్రదేశాలలో కోవిడ్-19 సురక్షిత మార్గదర్శకాలమీద రూపొందించిన పుస్తకాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్తర్ వికె పాల్ సమక్షంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, శాస్త్ర, సాంకేతిక, భూవిజ్ఞాన శాస్త్రాల శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్, కార్మిక, ఉపాధి శాఖ సహాయమంత్రి (స్వతంత్ర ప్రతిపత్తి) శ్రీ సంతోష్ కుమార్ గాంగ్వార్ ఈ రోజు వర్చువల్ వేదికమీదనుంచి ఆవిష్కరించారు.

పరిశ్రమకోసం ఇలాంటి మార్గదర్శకాలను విడుదలచేయటం పట్ల డాక్టర్ హర్షవర్ధన్ హర్షం వ్యక్తం చేశారు. సకాలంలో వెలువడిన అభినందనీయమైన మార్గదర్శకాలుగా  వీటిని అభివర్ణించారు. పారిశ్రామిక కార్మికుల సంక్షేమానికి ఇవి ఎంతగానో ఉపయోగపదతాయన్నారు. సమగ్రమైన, ప్రణాళికాబద్ధమైన ఈ మార్గదర్శకాల ద్వారా కార్మికులు తమ పనిప్రదేశాలలో రిస్క్ స్థాయిని అంచనావేసుకోవటానికి, తగిన జాగ్రత్తలు తీసుకోవటానికి దోహదం చేస్తాయన్నారు. అన్ని ముఖ్యమైన జాగ్రత్తలనూ ఒకచోట చేర్చి ఇలా అందించటం ద్వారా ఎప్పటికప్పుడు చుసుకోవటానికి ఇది వీలుకల్పిస్తుందన్నారు. ఊపిరితిత్తుల ఆరోగ్యం, తరచు చేతులు శుభ్రపరచుకోవటం, భౌతిక దూరం పాటించటం, తరచు శానిటైజ్ చేసుకోవటం లాంటి జాగ్రత్తలను ప్రతిసారీ గుర్తు చేస్తుందన్నారు.

గౌరవ ప్రధానమంత్రి సారధ్యంలో భారత ప్రభుత్వం కార్మికుల శ్రేయస్సుకు కట్టుబడి ఉందని ఆరోగ్యమంత్రి చెప్పారు. ఆర్థిక కార్యక్రమాల అన్ లాకింగ్ ప్రక్రియవైపు దేశం అడుగులేస్తుండగా పరిశ్రమల ఆవరణలలో ఈ మార్గదర్శకాలు పాటించటం ఎంతో అవసరమన్నారు.  శాస్త్రీయంగా వ్యాధి నిరోధం, ముందు జాగ్రత్తలు, సానుకూల దృక్పథం ద్వారా కోవిడ్ మీద పోరాడటం సత్ఫలితాలనిస్తుందన్నారు. వ్యాధి లక్షణాలను, తీవ్రతను అంచనా వేయటానికి, వర్గీకరించ టానికి, రిస్క్ తగ్గించటానికి, తక్షణ ప్రణాళిక రూపొందించుకోవటానికి ఈ మార్గదర్శకాలు సాయపడతాయన్నారు.

భారత్ లో కోవిడ్ మహమ్మారి మీద జరుగుతున్న పోరు గురించి డాక్తర్ హర్ష వర్ధన్  ప్రస్తావిస్తూ, అనేక అభివృద్ధి చెందిన దేశాలకంటే భారత్ అన్ని విధాలా మెరుగైన స్థితిలో ఉందన్నారు. కోలుకుంటున్నవారి శాతం  అదే పనిగా పెరుగుతూ ఉండటం, మరణాలశాతం క్రమంగా తగ్గుతూ రావటం మనం అనుసరిస్తున్న వ్యూహం విజయవంతమైందని అనటానికి నిదర్శనమన్నారు. ఇది వివిధ సంస్థలు, పౌరుల ఉమ్మడి కృషిగా మంత్రి అభివర్ణించారు. కోవిడ్ బాధితులకు చికిత్స అందించటంలో ఇ ఎస్ ఐ ఆస్పత్రుల పాత్రను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

కోవిడ్ సంబంధమైన నియమాలను పాటించటంలో ప్రజలు నిర్లక్ష్యం వహించవద్దని దాక్టర్ హర్శ్జవర్ధన్ విజ్ఞప్తి చేశారు. వ్యాధిమీద పోరు చేయటానికి వాక్సిన్ అందుబాటులోకి వచ్చేదాకా మాస్క్ ధరించటం, చేతుల్కు శుభ్రపరచ్చుకోవటం, భౌతిక దూరం పాటించటమే సామాజిక వాక్సిన్ అవుతుందని గుర్తించాలని పిలుపునిచ్చారు.

శ్రీ సంతోష్ కుమార్ గాంగ్వార్ మాట్లాడుతూ, పారిశ్రామిక ప్రదేశాల కోసం రూపొందించిన ఈ  సురక్షిత మార్గదర్శకాలు ప్రజలందరికీ ప్రోత్సాహకరంగా ఉంటాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనకి మనం మానసికంగా సిద్ధమై ఉండటం, కోవిడ్ విషయంలో తగిన విధంగా ప్రవర్తించేలా అందరికీ అవగాహన కల్పించటం ఎంతో అవసరమన్నారు.

ఈ మార్గదర్శకాలు దీపస్తంభంలా నిలిచి పారిశ్రామిక కార్మికులకు దారి చూపుతాయని డాక్టర్ పాల్ అభివర్ణించారు. ఇవి అందవలసినవారందరికీ అంది వారిలో చైతన్యం నింపాలని ఆకాంక్షించారు. కార్మిక, ఉపాధి శాఖ కార్యదర్శి శ్రీ హీరాలాల్ సమారియా, ఇ ఎస్ ఐ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ శ్రీమతి అనూరాధాప్రసాద్, వైద్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ సునిల్ కుమార్. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి కుమారి ఆర్తి అహుజా, పలువురు సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 ***



(Release ID: 1660187) Visitor Counter : 171