ప్రధాన మంత్రి కార్యాలయం
గంగా నది ని నిర్మలమైందిగా, సాంద్రమైందిగా తీర్చిదిద్దడం కోసం ఉత్తరాఖండ్ లో ఆరు వివిధ భారీ ప్రాజెక్టుల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
‘నమామి గంగే మిషన్’ వల్ల గత ఆరేళ్ళ లో ఉత్తరాఖండ్ మురుగుశుద్ధి సామర్ధ్యం నాలుగు రెట్లు పెరిగింది
గంగానది లోకి వచ్చి కలుస్తున్న 130కి పైగా మురుగునీటి కాలవలను గత 6 సంవత్సరాల్లో మూసివేయడమైంది.
గంగా నది కి సంబంధించిన మొట్టమొదటి మ్యూజియమ్ ‘‘గంగా అవలోకన్’’ ను కూడా ప్రారంభించిన ప్రధాన మంత్రి
దేశం లో ప్రతి ఒక్క పాఠశాల కు, ఆంగన్‌వాడీ కి తాగునీటి కనెక్షన్ ను అందించేందుకు 100 రోజులపాటు సాగే ఒక ప్రత్యేక ప్రచార ఉద్యమాన్ని అక్టోబరు 2 నుంచి చేపట్టనున్నట్లు ప్రకటన
కరోనా సమయం లో సైతం 50 వేలకు పైగా కుటుంబాలకు తాగునీటి కనెక్షన్ లను అందించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి ప్రశంసలు
Posted On:
29 SEP 2020 2:51PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ లో 6 పెద్ద అభివృద్ధి పథకాల ను ఈ రోజు ‘నమామి గంగే మిషన్’ లో భాగం గా వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించిరు.
శ్రీ మోదీ ‘గంగా అవలోకన్ మ్యూజియమ్’ ను కూడా ప్రారంభించారు. గంగా నది కి సంబంధించిన విశేషాల తో కూడిన మొట్టమొదటిది అయిన ఈ మ్యూజియమ్ ను హరిద్వార్ లో ఏర్పాటు చేయడమైంది. ఆయన “రోయింగ్ డౌన్ ద గంగా” పేరుతో వచ్చిన ఒక పుస్తకాన్ని, అలాగే జల్ జీవన్ మిషన్ ఆధికారిక చిహ్నాన్ని కూడా ఆవిష్కరించారు. ప్రధాన మంత్రి ఈ సందర్భం లో జల్ జీవన్ మిషన్ లో భాగం గా ‘గ్రామ పంచాయతీ ని, పానీ సమితీ లకు ఉద్దేశించిన ఒక మార్గదర్శక సూత్రావళి’ ని కూడా ఆవిష్కరించారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, దేశం లో గ్రామీణ ప్రాంతాల లో నివసిస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి నల్లా నీటిని అందించాలన్నదే ‘జల్ జీవన్ మిషన్’ ధ్యేయం అని స్పష్టం చేశారు. ఈ మిషన్ కు చెందిన కొత్త లోగో ప్రతి ఒక్క నీటి చుక్కను ఆదా చేయవలసిన అవసరం ఉందనే ప్రేరణ ను ఇస్తుందని శ్రీ మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి మార్గదర్శక సూత్రావళి ని గురించి మాట్లాడుతూ, అవి గ్రామ పంచాయతీలు, పల్లె ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల కు, అలాగే ప్రభుత్వ యంత్రాంగాని కి ఎంతో ముఖ్యమైందని అన్నారు.
“రోయింగ్ డౌన్ ద గంగా” గ్రంథం గంగా నది మన సంస్కృతి కి, విశ్వాసాని కి, వారసత్వాని కి ఒక ఉజ్వల ప్రతీకగా ఎలా ఉంటోందీ సమగ్రంగా వివరిస్తుందని ఆయన అభివర్ణించారు.
గంగా నది ఉత్తరాఖండ్ లోని తన మూల స్థానం మొదలుకొని, పశ్చిమ బెంగాల్ లో సముద్రం లో కలిసే వరకు దేశ జనాభా లో దాదాపుగా 50 శాతం మంది ప్రాణాల ను నిలబెట్టడం లో ఒక ప్రముఖ పాత్రను పోషిస్తున్న కారణంగా ఈ నదికి గొప్ప ప్రాముఖ్యం ఉందని శ్రీ మోదీ ప్రముఖం గా ప్రస్తావించారు.
‘నమామీ గంగే మిషన్’ అతిపెద్దదైన సమీకృత నదీ పరిరక్షణ మిషన్ అని ఆయన అభివర్ణించారు. ఈ మిషన్ గంగా నదిని పరిశుభ్రపరచాలన్న ఒక లక్ష్యానికి అదనంగా, ఆ నదిని సంపూర్ణంగా మెరుగు పరచాలన్న అంశం పైన కూడా దృష్టి ని సారిస్తుందని ప్రధాన మంత్రి వివరించారు. ఈ సరికొత్త ఆలోచన సరళి, ఈ నూతన దృక్పథం గంగా నదికి జవజీవాలను మళ్ళీ ప్రసాదించిందని ఆయన అన్నారు. పాత పద్ధతులనే అనుసరిస్తూ వెళ్ళి ఉంటే గనుక పరిస్థితి ప్రస్తుతం మరింత అధ్వాన్నంగా మారేదని ఆయన అన్నారు. ఇదివరకు అవలంభించిన పద్ధతుల లో ముందుచూపు, ప్రజల భాగస్వామ్యం లోపించాయని చెప్పారు.
ప్రభుత్వం తన లక్ష్యాన్ని సాధించడానికి చతుర్ముఖ వ్యూహం తో ముందడుగు వేసిందని ప్రధాన మంత్రి అన్నారు. ఆ నాలుగు విధాలైన వ్యూహాల ను గురించి ఆయన ఒక్కటొక్కటిగా వివరించారు.
వాటిలో మొదటిది - గంగానది లోకి వ్యర్థ జలాలు పారకుండా అడ్డుకోవడానికిగాను మురుగుశుద్ధి ప్లాంటుల ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం కాగా,
రెండోది - ఆ ఎస్‌టిపి లను రాబోయే 10-15 ఏళ్ళ కాలంలో వచ్చే అవసరాలను దృష్టి లో పెట్టుకొని నిర్మించడం జరుగుతోంది.
ఇక మూడోది - గంగా నది తీర ప్రాంతాల లోని సుమారు వంద పెద్ద పట్టణాలు/ నగరాలను, అయిదు వేల పల్లెలను ఆరు బయలు ప్రాంతాల లో మలమూత్రాదుల విసర్జన (ఒడిఎఫ్) అభ్యాసం బారి నుండి విముక్తం చేయడం.
నాలుగోది - గంగానది ఉప నదుల లోకి ప్రవహిస్తున్న కలుషిత జలాల ను ఆపేందుకు సకల ప్రయత్నాలు చేయడం అని ఆయన అన్నారు.
నమామి గంగే లో భాగంగా 30,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టుల నిర్మాణ పనులు అయితే పూర్తి కావడం గానీ, లేదా ఆయా పనులు పురోగతిలో ఉండడం గానీ జరుగుతోందని శ్రీ మోదీ ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టుల తో ఉత్తరాఖండ్ మురుగుశుద్ధి సామర్ధ్యం గడచిన ఆరు సంవత్సరాల లో నాలుగింతలు పెరిగిందని ఆయన తెలిపారు.
ఉత్తరాఖండ్ లో 130కి పైగా మురుగునీటి కాలవలను గంగా నది లోకి ప్రవహించకుండా మూసివేసేందుకు చేపట్టిన ప్రయత్నాల ను గురించి ప్రధాన మంత్రి వివరించారు. ప్రత్యేకించి చంద్రేశ్వర్ నగర్ మురుగునీటి కాలవ, రుషికేష్ లోని మునీ కీ రేతీ ప్రాంతం లో బల్లకట్టులను నడిపేవారికి, సందర్శకుల కు పెద్ద ఇబ్బందిగా తయారయిందని ఆయన అన్నారు. ఈ మురుగు కాలవను మూసివేసి, మునీ కీ రేతీ లో ఒక నాలుగు అంతస్తుల మురుగుశుద్ధి ప్లాంటును నిర్మించడాన్ని ఆయన ప్రశంసించారు.
ప్రయాగ్‌రాజ్ కుంభ్ యాత్రికుల మాదిరిగానే హరిద్వార్ కుంభ్ సందర్శకులు సైతం ఉత్తరాఖండ్ లో గంగా నది శుద్ధత ను, స్వచ్ఛత ను చూసి సంతోషిస్తారని ప్రధాన మంత్రి అన్నారు. గంగా నది తీర ప్రాంతాల లో వందలాది స్నానఘట్టాల సుందరీకరణ పనుల ను గురించి, అలాగే హరిద్వార్ లో ఒక ఆధునిక రహదారిని అభివృద్ధి చేయడం గురించి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
‘గంగా అవలోకన్ మ్యూజియమ్’ యాత్రికుల కు ఒక ప్రత్యేక ఆకర్షణ అవుతుందని, ఆ మ్యూజియమ్ గంగా నది తో ముడిపడ్డ వారసత్వం పట్ల అవగాహన ను మరింతగా పెంచుతుందని ప్రధాన మంత్రి అన్నారు.
గంగా నది పరిశుభ్రత కు తోడుగా యావత్తు గంగా నది ప్రవహించే యావత్తు ప్రాంతాలన్నింటిలో ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం.. ఈ రెంటిని అభివృద్ధి చేయడం పై నమామి గంగే దృష్టిని కేంద్రీకరిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. ఆయుర్వేదిక వ్యవసాయాన్ని, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశ లో ప్రభుత్వం సమగ్ర ప్రణాళికల ను సిద్ధం చేసిందని ఆయన అన్నారు.
ఈ ఏడాది ఆగస్టు 15న ప్రకటించిన ‘మిషన్ డాల్ఫిన్’ ను పటిష్ట పరచడం పైన కూడా ఈ పథకం శ్రద్ధ వహిస్తుందని ప్రధాన మంత్రి అన్నారు.
జలం వంటి ఒక ముఖ్యమైన అంశానికి సంబంధించిన పనుల ను వేరు వేరు మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య ముక్కలు ముక్కలు చేసి అప్పగించడం వల్ల స్పష్టమైన మార్గదర్శకాలు, సమన్వయం లోపించాయని ప్రధాన మంత్రి అన్నారు. దీని ఫలితంగా తాగునీటికి, సాగునీటికి సంబంధించిన సమస్యలు అలాగే ఉన్నాయని ఆయన చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ దేశం లో 15 కోట్లకు పైగా కుటుంబాల కు నల్లా లో తాగునీరు ఇంకా అందనే లేదని ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు.
ఈ సవాళ్ళను పరిష్కరించడానికి జలశక్తి శాఖ ను ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీ మోదీ అన్నారు. ఈ మంత్రిత్వ శాఖ దేశం లోని ప్రతి ఇంటికీ తాగునీటిని నల్లా ద్వారా అందుబాటులోకి తెచ్చేటట్లు చూడటంలో తలమునకలైందన్నారు.
ప్రస్తుతం ఇంచుమించుగా ఒక లక్ష కుటుంబాల కు ప్రతి రోజూ నల్లా నీటిని అందించడం జరుగుతోందన్నారు. కేవలం ఒక సంవత్సర కాలం లోనే దేశం లో రెండు కోట్ల కుటుంబాలకు తాగునీటి కనెక్షన్లను అందించినట్లు ఆయన చెప్పారు.
కరోనా కాలం లో కూడా గత నాలుగైదు నెలల్లో 50 వేలకు పైగా కుటుంబాల కు తాగునీటి కనెక్షన్లను సమకూర్చినందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు.
మునుపటి కార్యక్రమాల కు భిన్నంగా జల్ జీవన్ మిషన్ అట్టడుగు స్థాయి నుంచి, పై స్థాయి వరకు అదే దృక్పథాన్ని అనుసరిస్తోందని, దీనిలో భాగం గా ఒక ప్రాజెక్టు ను దాని అమలు మొదలుకొని, నిర్వహణ, మరమ్మత్తు దశల వరకు అన్ని పనుల ను గ్రామాల్లోని నీటి సంఘాలు (పానీ సమితులు) మరియు వినియోగదారులే నిర్ధారిస్తారని ప్రధాన మంత్రి వివరించారు. నీటి సంఘం లోని సభ్యుల లో కనీసం సగం మంది సభ్యులు మహిళలే అయి ఉండేటట్లు ఈ మిషన్ తగిన జాగ్రత్తలు తీసుకొందన్నారు. ఈ రోజు విడుదల చేసిన మార్గదర్శక సూత్రావళి సరైన నిర్ణయాల ను తీసుకోవడం లో గ్రామ పంచాయతీల కు, నీటి సంఘం సభ్యుల కు దిశా నిర్దేశం చేస్తుందని ఆయన అన్నారు.
దేశం లో ప్రతి పాఠశాల కు, ఆంగన్ వాడీ కి తాగునీటి కనెక్షన్ ను అందించేందుకు ఈ ఏడాది అక్టోబరు 2న 100 రోజుల ప్రత్యేక ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రధాన మంత్రి తెలిపారు.
రైతులు, పరిశ్రమల్లోని కార్మికులతో పాటు, ఆరోగ్య రంగం లో కూడా ప్రభుత్వం ప్రధాన సంస్కరణల ను ఇటీవల ప్రవేశపెట్టిందని ప్రధాన మంత్రి అన్నారు.
ఈ సంస్కరణల ను వ్యతిరేకిస్తున్నవారు వాటిని వ్యతిరేకించడం కోసమే వ్యతిరేకించడం శోచనీయమని శ్రీ మోదీ అన్నారు. దేశాన్ని దశాబ్దాల తరబడి ఏలినవారు దేశం లో శ్రామికులు, యువత, రైతులు మరియు మహిళల కు సాధికారత ను కల్పించడం పట్ల ఎన్నడూ శ్రద్ధ వహించలేదని, ఈ వ్యక్తులు రైతులు వారు పండించిన పంటల ను ఒక లాభసాటి ధరకు దేశం లో ఎవరికైనా, ఎక్కడైనా విక్రయించడకూడని కోరుకుంటున్నారని ప్రధాన మంత్రి అన్నారు.
జన్ ధన్ బ్యాంకు ఖాతాలు, డిజిటల్ ఇండియా ప్రచారోద్యమం, అంతర్జాతీయ యోగ దినం.. వంటి ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు ప్రజల కు విస్తృత ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ కూడా ఆయా కార్యక్రమాల ను ప్రతిపక్షం వ్యతిరేకిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు.
ఇదే వ్యక్తులు వాయుసేన ఆధునీకరణ ను, వాయుసేన కు అధునాతన యుద్ధ విమానాలను అందించడాన్ని కూడా వ్యతిరేకించారని ఆయన అన్నారు. ఇదే వ్యక్తులు ప్రభుత్వ ‘ఒక ర్యాంకు, ఒక పింఛన్’ విధానాన్ని సైతం వ్యతిరేకించారని, అయితే, ప్రభుత్వం సాయుధ దళాల పింఛనుదారుల కు బకాయిల రూపంలో 11,000 కోట్ల రూపాయల కు పైగా ఇప్పటికే చెల్లించిందని ఆయన చెప్పారు.
ఇదే వ్యక్తులు సర్జికల్ స్ట్రయిక్ ను విమర్శించారని, సర్జికల్ స్ట్రయిక్ జరిగినట్లు రుజువు చేయాలని సైనికుల ను అడిగారని ఆయన అన్నారు. ఇది వారి వాస్తవ ఉద్దేశ్యాలు ఏమిటో యావత్తు దేశానికి తేటతెల్లం చేసిందని శ్రీ మోదీ అన్నారు.
కాలం గడిచే కొద్దీ వ్యతిరేకించే వారు మరియు నిరసన తెలిపేవారు అసంబద్ధంగా మారిపోతున్నారని ఆయన అన్నారు.
***
(Release ID: 1660045)
Visitor Counter : 302
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam