ప్రధాన మంత్రి కార్యాలయం
ఇండియా- డెన్మార్క్ హరిత వ్యూహ భాగస్వామ్య ఉమ్మడి ప్రకటన
Posted On:
28 SEP 2020 7:28PM by PIB Hyderabad
1. భారతదేశం, డెన్మార్క్ దేశాల మధ్యన డెన్మార్క్ ప్రధాన మంత్రి హర్ ఎక్స్ లెన్సీ మిస్ మెట్టె ఫ్రెడరిక్సన్, భారత ప్రధాన మంత్రి హిస్ ఎక్స్ లెన్సీ శ్రీ నరేంద్ర మోదీ సంయుక్తంగా అధ్యక్షత వహించిన విర్చువల్ సమావేశాన్ని సెప్టెంబర్ 28, 2020న నిర్వహించారు.
2. ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన సమగ్రమైన అభిప్రాయాలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి ఫ్రెడరిక్సన్ పంచుకున్నారు. ఈ సమావేశం స్నేహపూర్వకంగా కొనసాగింది. ఇరు దేశాల్లోగల కోవిడ్ -19 మహమ్మారి గురించి, ఇరు దేశాల్లో ప్రాధాన్యతగల పలుఅంశాల గురించి ఇరువురు ప్రధానులు ఈ సమావేశంలో మాట్లాడుకోవడం జరిగింది. వాతావరణ మార్పులు, పర్యావరణ అనుకూల అంశాల గురించి చర్చలు చేసి ఇరు దేశాల్లో సుస్థిరమైన ఆర్ధిక వ్యవస్థలను, సమాజాలను రూపొందించుకోవడంపైన ఒక ఉమ్మడి అవగాహనకు వచ్చారు.
3. ఇరుదేశాల మధ్యన గల చారిత్రాత్మక బంధాలు, ఉమ్మడి ప్రజాస్వామ్య సంప్రదాయాల ఆధారంగా ద్వైపాక్షిక సంబంధాలను అభివృద్ధి చేసుకోవడం, కొనసాగడం పట్ల ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాంతీయ మరియు అంతర్జాతీయ శాంతి, సుస్థిరతలకోసం కృషి చేయాలని నిర్ణయించారు.
4. పరస్పరం నమ్మకం కలిగిన భాగస్వాములుగా కొనసాగాలనే ఆకాంక్ష నేపథ్యంలో ఇరు దేశాల మధ్యన గల హరిత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని ఇరువురు ప్రధానులు అంగీకరించారు. ఇరు దేశాల మధ్యన సహకారంకోసం ఉమ్మడి కమిషన్ ఏర్పాటు చేయాలని 2009 ఫిబ్రవరి 6న సంతకాలతో కూడిన ఒప్పందం జరిగింది. దీన్ని స్థిరీకరిస్తూ భాగస్వామ్యాన్ని నిర్మించడం జరుగుతుంది. ఈ కమిషన్ ద్వారా ఇరు దేశాల మధ్యన రాజకీయ రంగంలోను, ఆర్ధిక, వాణిజ్య రంగాల్లోను, శాస్త్ర సాంకేతిక రంగాల్లోను, పర్యావరణ రంగంలోను, ఇంధన రంగంలోను, విద్య, సాంస్కృతిక రంగాల్లోను సహకారం ఆకాంక్షించడం జరిగింది. దీనికి తోడుగా ఈ కమిషన్ ఇప్పటికే అమలులో వున్న వర్కింగ్ గ్రూపులమీద ఆధారపడి నిర్మాణమవుతుంది. ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. ఈ గ్రూపులు పున: వినియోగ ఇంధనం, పట్టణాభివృద్ధి, పర్యావరణం, వ్యవసాయం, పశుసంవర్ధకశాఖ, ఆహార తయారీ పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక రంగాలు, నౌకారంగం, కార్మిక శక్తి అందుబాటు, డిజిటలీకరణ రంగాలకు చెంది వున్నాయి.
5. ఇరు దేశాల మధ్యన హరిత వ్యూహాత్మక భాగస్వామ్యమనేది పరస్పరం లబ్ధి చేకూర్చే ఏర్పాటు. దీని ద్వారా రాజకీయ సహకారం వుంటుంది. ఆర్ధిక సంబంధాలు విస్తరిస్తాయి. పర్యావరణ రంగంలో అభివృద్ధి వుంటుంది. ఉద్యోగాల కల్పన వుంటుంది. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారంలోను, అవకాశాలను అందిపుచ్చుకోవడంలోను సహకారాన్ని బలోపేతం చేయడం జరుగుతుంది. అంతే కాదు పారిస్ ఒప్పందం అమలుపైన, ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అందుకోవడంపైన ప్రత్యేక దృష్టి వుంటుంది.
6. ఇరు దేశాల మధ్యన హరిత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవడమనేదాని ప్రాధాన్యతను ఇరు దేశాల ప్రధానులు అంగీకరించారు.దీనివల్ల ఆయా మంత్రిత్వశాఖలు, సంస్థలు, సంబంధిత వ్యక్తుల ద్వారా ఇరు దేశాలు సహకరించుకోవడం జరుగుతుంది.
శక్తి వనరులు మరియు వాతావరణ మార్పులు
7. అంతర్జాతీయ సవాళ్ల పరిష్కారంలోను, హరిత శక్తి పరివర్తన, వాతావరణ మార్పులకు సంబంధించిన పరిష్కారాల సాధనలోను ఇరు దేశాలు దృఢమైన భాగస్వామ్యం వుండాలనే అంశానికి ఇరు దేశాల ప్రధానులు ఆమోదం తెలిపారు. ఇరు దేశాల మధ్యన పున: వినియోగ ఇంధన రంగంలో సహకారం, సామర్థ్య నిర్మాణాల్లో ఇండియా డెన్మార్క్ ఇంధన శక్తి భాగస్వామ్యం ( ఇండెప్ ) , పవన విద్యుత్ కు సంబంధించి విజ్ఞాన , సాంకేతిక అంశాల బదిలీ, ఇంధనశక్తి రూపకల్పన మరియు పున: వినియోగ ఇంధన అనుసంధానం అనేవి ఇరు దేశాల మధ్యన ఉమ్మడిగావున్న నిబద్ధతను చాటుతున్నాయి. తద్వారా ప్రపంచవ్యాప్తంగా వున్న ఉమ్మడి సవాళ్లను పరిష్కరించుకోవడమనేది అంతర్జాతీయ ఇంధన పరివర్తన మార్గంద్వారా జరుగుతుంది. హరిత అభివృద్ది, సుస్థిర అభివృద్ధి ద్వారా జరుగుతుంది. ఇరు దేశాల మధ్యనగల ఇంధన భాగస్వామ్యమనేది రాబోయే రోజుల్లో మరింత బలోపేతమవుతుందని ఇరు దేశాలు ఆకాంక్షించాయి.
8. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా జరుగుతున్న అంతర్జాతీయ పోరాటంలో భారతదేశం, డెన్మార్క్ ముందు వరసలో వుండాలని ఇరు దేశాలు అంగీకరించాయి. పారిస్ ఒప్పందాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడానికిగాను వాతావరణ, ఇంధన రంగాల్లో ప్రతిష్టాత్మకమైన జాతీయ లక్ష్యాలను ఇరు దేశాలు రూపొందించుకున్నాయి. ప్రతిష్టాత్మకమైన వాతావరణ, సుస్థిర ఇంధన లక్ష్యాలను అందుకోవడమనేది సాధ్యమేననే విషయాన్ని ఇరు దేశాలు కలిసికట్టుగా వుండి ప్రపంచానికి చాటబోతున్నాయి.
9. వాతావరణ మార్పులు, పున: వినియోగ ఇంధన రంగంలో క్రమం తప్పకుండా వివిధ స్థాయిల్లో సంప్రదింపులు జరపాలని ఇరు దేశాలు అంగీకరించాయి.
పర్యావరణ / నీరు మరియు వృత్తాకార ఆర్ధికరంగం
10. పర్యావరణం / నీరు మరియు వృత్తాకార ఆర్ధికరంగం అంశాల్లో ప్రస్తుతం ఇరు దేశ ప్రభుత్వాల మధ్యన కొనసాగుతున్న సహకారాన్ని విస్తరించడానికి, బలోపేతం చేయడానికి కృషి చేయాలని ఇరు దేశాల ప్రధానులు నిర్ణయించారు. జల సామర్థ్యం, జల నష్టం అంశాల్లో సహకరించుకోవాలని రెండు దేశాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో భారతదేశానికి చెందిన జలశక్తి మంత్రిత్వశాఖ, డెన్మార్క్ కు చెందిన పర్యావరణ సంరక్షణ సంస్థ, పర్యావరణ మరియు ఆహార మంత్రిత్వశాఖలు కలిసి రాబోయే మూడు సంవత్సరాలకు గాను కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించడం జరిగింది.
11. ఇండో డేనిష్ వాటర్ టెక్నాలజీ అలియాన్స్ ద్వారా జల రంగంలో నీటి సరఫరా, నీటి పంపిణీ, వ్యర్థ జలాల నిర్వహణ, మురికి నీటి పారుదల వ్యవస్థలు, శుద్ధి చేసిన జలాల పునర్ వినియోగం, నీటినిర్వహణ, ఇంధన శక్తిని సమర్థవంతంగా వినియోగించుకోవండం అంశాల్లో ఇరు దేశాలు సహకారాన్ని పెంపొందించుకోవాలనే ఉమ్మడి ఆకాంక్షను ఇరువురు ప్రధానులు వ్యక్తం చేశారు.
ఆకర్షణీయ నగరాలతోబాటు సుస్థిర పట్టణాభివృద్ధి
12. సుస్థిర పట్టణాభివృద్ధి అంశంపై ఈ ఏడాది జూన్ 26న రెండో ఇండియా డెన్మార్క్ జెడబ్ల్యుజి విర్చువల్ గా నిర్వహించారు. ఈ విషయాన్ని ఇరు దేశాలు ప్రస్తావించాయి. సుస్థిర పట్టణాభివృద్ధిలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. గోవాలోని అర్బన్ లివింగ్ ల్యాబ్ ద్వారా ఆకర్షణీయ నగరాల అభివృద్ధి విషయంలో కూడా ఈ సహకారం తీసుకోవాలని నిర్ణయించాయి.
13. ఉదయపూర్, అర్హుస్ నగరాల మధ్యన, తుమ్ కూరు, ఆల్ బోర్గ్ నగరాల మధ్యన ప్రస్తుతం కొనసాగుతున్న సిటీ టు సిటీ సహకారాన్ని బలోపేతం చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
14. భారతదేశంలో డిజైనింగ్ కు సంబంధించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయంలో డేనిష్ కంపెనీలు కృషి చేస్తున్నాయని ఇరు దేశాలు గుర్తించాయి. సుస్థిరమైన పట్టణాభివృద్ధి రంగాల్లో అత్యధికస్థాయిలో డేనిష్ సహకారాన్ని భారతదేశం ఆహ్వానించింది.
వ్యాపార, వాణిజ్య, నౌకా రవాణా రంగాలు
15. పర్యావరణ హిత, వాతావరణ హిత సాంకేతికతలపైన ప్రత్యేక దృష్టితో ఇరు దేశాల మధ్యన ప్రభుత్వాల స్థాయిలో,సంస్థల స్థాయిలో, వ్యాపారాల స్థాయిలో భాగస్వామ్యాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనను ఇరు దేశాల ప్రధానులు ఆహ్వానించారు. పర్యావరణ హిత ఇంధన రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులకు మద్దతు ఇచ్చేలా నిబంధనల వ్యవస్థ ప్రాధాన్యతను ఇరు దేశాల ప్రధానులు గుర్తించారు.
16. ఇరు దేశాల మధ్యన సముద్ర సంబంధిత వ్యవహారాల్లో సహకారం దృఢంగా వుండడాన్ని ఇరు దేశాల నేతలు ప్రశంసించారు. నౌకల నిర్మాణం, డిజైన్, సముద్ర సంబంధిత సేవలు, పర్యావరణ హిత నౌకారవాణా, ఓడరేవుల అభివృద్ధి అంశాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని ఇరువురు నేతలు అంగీకరించారు.
17. చిన్న మధ్య తరహా పరిశ్రమలకోసం మార్కెట్ అందుబాటులో వుంచే కార్యకలాపాలను, వ్యాపార ప్రాతినిధ్యాలను ప్రోత్సహించాలని ఇరువు ప్రధానులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. తద్వారా సులభతర రీతిలో వ్యాపారం జరిగేలా చూడాలని నిర్ణయించారు.
18. మేధో పరమైన ఆస్తి హక్కుల విషయంలో ఉద్భవిస్తున్న సహకారాన్ని ఇరు దేశాలు ఆమోదించాయి. ఈ సహకారం కారణంగా ఇరు దేశాల్లోని జాతీయ మేధో హక్కుల వ్యవస్థలు ఆధునీకరణ చెందుతాయి. బలోపేతమవుతాయి. తద్వారా ఆవిష్కరణలు, సృజనాత్మకత, సాంకేతికాభివృద్ధికి ప్రోత్సాహం లభిస్తుంది.
శాస్త్ర, సాంకేతి, ఆవిష్కరణ మరియు డిజిటలీకరణ
19. బలమైన ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలద్వారా శాస్త్ర సాంకేతిక, పరిశోధన రంగాల్లో ( ఎస్ టి ఐ) పెట్టుబడులను ప్రోత్సాహించాల్సిన ఆవశ్యకతను ఇండియా, డెన్మార్క్ దేశాలు గుర్తించాయి. ఇది చాలా ముఖ్యమైన మార్గమని దీని ద్వారా సాంకేతిక అభివృద్ధి, నూతన పరిష్కారాల అమలు వేగవంతమవుతాయని ఇరు దేశాలు గుర్తించాయి. భారతదేశం, డెన్మార్క్ దేశాల్లోని అధికార వ్యవస్థల మధ్యన, చిన్న పెద్ద తరహా కంపెనీల మధ్యన, పరిశోధన, ఉన్నత విద్యా సంస్థల మధ్యన సంబంధాలను ప్రోత్సహించి, బలోపేతం చేయడంద్వారా హరిత వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఎస్ టిఐ లోని సహకారం మద్దతుగా నిలుస్తుంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్యన కొనసాగుతున్న దృఢమైన ద్వైపాక్షిక ఎస్ టి ఐ భాగస్వామ్యాల మీద ఆధారపడి ఇరు దేశాల మధ్యన ఇంధన, జల, జీవ వనరులు, ఐసిటి రంగాల్లో ప్రాజెక్టులను నిర్మించాలని ఇరు దేశాలు అంగీకరించాయి.
20. డిజిటలీకరణ, డిజిటల్ పరిష్కారాలు, హరిత పరివర్తనలోని మోడల్స్ విషయంలో ఇరు దేశాల ఉమ్మడి ప్రాధాన్యతలను నేతలు గుర్తించారు. అభివృద్ధి, పరిశోధన రంగాల్లో కలిసికట్టుగా సాగాలని నిర్ణయించారు. డిజిటల్ సాంకేతికతల రంగంలో సమర్థత చూపడంద్వారా హరిత సుస్థిర వృద్ధికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు.
ఆహరం మరియు వ్యవసాయం
21. వ్యవసాయ రంగంలో సహకారించుకోవడానికి అత్యధిక అవకాశాలున్న తరుణంలో ఆహార తయారీ రంగం, ఆహార భద్రత, పశుగణాభివృద్ధి, పాడి పరిశ్రమ రంగాల్లో ఇరు దేశాల్లోని అధికారిక వ్యవస్థలు, వ్యాపార వర్గాలు, పరిశోధనా సంస్థల మధ్యన దృఢమైన సహకారం పెరగడానికి వీలుగా ప్రోత్సాహం వుండాలని ఇరు దేశాల నేతలు అంగీకరించారు.
ఆరోగ్యం, జీవశాస్త్రం
22. ఆరోగ్య రంగంలో ఇరు దేశా మధ్యన కొనసాగుతున్న చర్చలను, సహకారాన్ని బలోపేతం చేసుకునే అంశంపై ఇరు దేశాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ఈ రంగంలో కొనసాగుతున్న చర్చలను విస్తరించాలనే ఇరు దేశాల ఆసక్తిని ఇరు దేశాల ప్రధానులు అంగీకరించారు. ఆరోగ్య విధాన సమస్యల విషయంలో ముఖ్యంగా అంటువ్యాధులు, వ్యాక్సిన్లు, కోవిడ్ -19పై పోరాటం, భవిష్యత్తులో రాబోయే మహమ్మారి జబ్బులు మొదలైన వాటి విషయంలో చేపట్టే ముఖ్యమైన చర్యలను పంచుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. పరిశోధనా భాగస్వామ్యాలతోపాటు జీవ శాస్త్ర రంగంలో ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని తయారు చేసుకోవడంద్వారా ఆయా వ్యాపార సంస్థలకుగల వాణిజ్య అవకాశాలను విస్తరింపచేయాలని ఇరు దేశాల ప్రధానులు అంగీకరించారు.
సాంస్కృతిక సహకారం, ప్రజలకు ప్రజలకు మధ్యన సంబంధాలు, కార్మికుల అందుబాటు
23. చాలా కాలంగా ఇరు దేశాల ప్రజలకు మధ్యన వున్న సంబంధ బాంధవ్యాల కారణంగా ఇండియా, డెన్మార్క్ దేశాల మధ్యన సంబంధాలు ఉన్నత స్థాయిలో వున్నాయనే విషయాన్ని ఇరు దేశాల ప్రధానులు అంగీకరించారు. ఇరు దేశాల మధ్యన సాంస్కృతిక సహకారం ద్వారా ప్రజల మధ్యన పరస్పర అవగాహనను, చైతన్యాన్ని మరింతగా పెంపొందింప చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
24. ఇరు దేశాల మధ్యన కార్మికుల ప్రయాణానికి సంబంధించి అవకాశాలను పరిశీలించాలని ఇరు దేశాలు అంగీకరించాయి. ఇరు దేశాల మధ్యన ప్రయాణానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించి సులభతరం చేయాలని ప్రజల మధ్యన సంప్రదింపులు విస్తృతంగా వుండేలా చేయాలని, పర్యాటక రంగంలో సహకారాన్ని బలోపేతం చేయాలని ఇరు దేశాల ప్రధానులు నిర్ణయించారు.
బహుళపక్ష సహకారం
25. నిబంధన ఆధారిత బహుళపక్ష వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి, ప్రోత్సహించడానికి ఉమ్మడిగా కృషి చేయాలని ఇరు దేశాల ప్రధానులు అంగీకరించారు. ఇంధన రంగం, వాతావరణ మార్పు రంగాల్లో వస్తున్న సవాళ్లపై అంతర్జాతీయంగా పోరాటం చేయాల్సిన అవసరం వుంది. ఈ విషయంలో బలమైన బహుళపక్ష సహకారంపైన ఇరు దేశాల నేతలు అంగీకరించారు. అలాగే అంతర్జాతీయ ఇంధన సంస్థ, అంతర్జాతీయ పున: వినియోగ ఇంధన సంస్థ, అంతర్జాతీయ సౌర వేదికల విషయంలో అందరికీ ఉమ్మడిగా వుండే నిబద్దతకు మద్దతుగా వుండాలని ఇరు దేశాల నేతలు అంగీకరించారు.
26. ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యు టి వో కింద పారదర్శకమైన, అందరినీ కలుపుకొని పోయే, నిబంధన ఆధారిత బహుళపక్ష వాణిజ్య వ్యవస్థను ప్రోత్సహించడానికి అవసరమైన సహకార ఆవశ్యకతకు ఇరు దేశాల నేతలు తమ మద్దతు తెలిపారు. డబ్ల్యు టి వో తన పూర్తి స్థాయిలో అంతర్జాతీయ వృద్ధిని, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించేలా ఈ పని చేయాలని ఇరు దేశాల నేతలు భావించారు.
27. డబ్ల్యుటివోలో సంస్కరణలు చేపట్టడానికిగాను కొనసాగుతున్న చర్చలకు ఇరు దేశాల నేతలు తమ మద్దతు తెలిపారు. డబ్ల్యుటివోలో సమగ్రమైన సంస్కరణలు రావాలని, అందుకోస ఇరు దేశాలు తమవంతుగా కృషి చేస్తాయని, ఈ విషయంలో సహకారాన్ని బలోపేతం చేయడానికిగాను ఇరు దేశాల నేతలు తమ సంకల్పాన్ని మరోసారి స్పష్టం చేశారు. డబ్ల్యుటివోలో చేపట్టే సంస్కరణలు అందరినీకలుపుకుపోయేలా వుండాలని, పారదర్శకంగా వుండాలని ఇరు దేశాలు అంగీకరించాయి. డబ్ల్యు టివో వున్న అప్పిలేట్ బాడీ పూర్తిస్థాయిలో బలంగా వుండేలా పునరుద్దరించాలని, ఇది రెండు అంచెల వివాద పరిష్కార వ్యవస్థలో భాగంగా వుండేలా చూడడానికి ఇరు దేశాలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించాయి.
28. యూరోపియన్ యూనియన్, భారతదేశం మధ్యన ప్రతిష్టాత్మకమైన, సరైన, పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య మరియు పెట్టుబడుల ఒప్పందంకోసం కృషిచేయడానికిగాను ఇరు దేశాల నేతలు తమ నిబద్దతను చాటారు. ఈ ఒప్పందంవల్ల యూరోపియన్ యూనియన్, భారతదేశం మధ్యన సంబంధాలు మరింత బలోపేతమవుతాయి.
29. ఆర్కిటిక్ మండలి పరిధిలోని ఆర్కిటిక్ సహకారమనేది అంతర్జాతీయ దృక్పథం కలిగి వుందని, పర్యావరణ సంరక్షణ ఆవశ్యకత కారణంగాను, వాతావరణ మార్పులను ఎదుర్కోవడం విషయంలోగానీ ఇది చాలా అవసరం అని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఈ స్ఫూర్తిని చాటుతూ వాతావరణ మార్పుల రంగంలో ఆర్కిటిక్ మండలి పరిధిలో ఇరు దేశాలు సహకరించుకోవాలని ఇరు దేశాలు తమ సముఖతను వ్యక్తం చేశాయి.
30. మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, చట్టబద్దమైన పాలనలకు సంబంధించిన విలువల ప్రాధాన్యతను ఇరు దేశాల నేతలు అంగీకరించాయి. బహుళ పక్ష వేదికల మీద ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను బలపరచడంలో సహకరించుకోవాలని ఇరు దేశాల నేతలు అంగీకరించారు.
ముగింపు
31. ఇరు దేశాలు కలిసి హరిత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించాయి. ఇరు దేశాల మద్యన స్నేహపూర్వక, సహకార సంబంధాల్లో నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించిందనే నమ్మకాన్ని ఇరు దేశాల నేతలు తెలియజేశారు.
32. ఆయా రంగాల్లో ప్రతిష్టాత్మక లక్ష్యాలను, చర్యలను గుర్తించడం జరుగుతుంది. వాటిని భవిష్యత్తులో తయారు చేసి కార్యాచరణ ప్రణాళికలో పొందుపరిచి వాటికి ఆమోదం తెలపడం ఎంతవీలైతే అంత తొందరగా జరుగుతుంది.
****
(Release ID: 1659976)
Visitor Counter : 321
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam