PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 23 SEP 2020 6:43PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 • దేశంలో వరుసగా ఐదో రోజు కొత్త కేసులకన్నా కోలుకున్న కేసులు అత్యధికంగా నమోదు.
 • వ్యాధి నయమైనవారి సంఖ్య 45,87,613; కోలుకునే సగటు నేడు 81.25 శాతానికి చేరిక.
 • భారత్‌లో రోజువారీ పరీక్షల సగటు 12 లక్షలకుపైగా నమోదు; దేశవ్యాప్తంగా 6.6 కోట్ల నమూనాల పరీక్ష.
 • ఆయుష్మాన్‌ భారత్‌-పీఎంజేఏవై కింద 23,000 ఆస్పత్రుల గుర్తింపు; 12.5 కోట్ల ఈ-కార్డులు జారీ.
 • మూడు కార్మిక స్మృతి బిల్లులకు పార్లమెంటు ఆమోదం; కోవిడ్‌-19 నేపథ్యంలో వలస కార్మికుల హక్కులు బలోపేతం చేసే ప్రత్యేక నిబంధనలు

దేశంలో కోలుకునేవారి సంఖ్య స్థిరంగా పెరుగుదల; వరుసగా ఐదో రోజు కొత్త కేసులకన్నా నయమైన కేసులు అత్యధికం; 81 శాతం దాటిన కోలుకునే సగటు

భారత్‌ అనుసరిస్తున్న పటిష్ఠ, సమర్థ, సమన్వయ వ్యూహాలు, చురుకైన చర్యల ఫలితంగా  దేశంలో కోవిడ్‌ నుంచి కోలుకునేవారి సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ఈ మేరకు వరుసగా ఐదో రోజు కొత్త కేసులకన్నా కోలుకున్నవే అత్యధికంగా నమోదయ్యాయి. తదనుగుణంగా గత 24 గంటల్లో 89,746 మంది కోలుకోగా ఇవాళ నమోదైన కేసుల సంఖ్య 83,347గా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా మొత్తం వ్యాధి నయమైనవారి సంఖ్య  నేడు 45,87,613కు చేరి, కోలుకునేవారి జాతీయ సగటు 81.25 శాతానికి పెరిగింది. ఆ మేరకు ప్రపంచంలో నమోదైన కేసులలో 19.5 శాతం కోలుకున్న కేసులతో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడుస్తుండగా- 17 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ కొత్త కేసులకన్నా కోలుకున్నవే ఎక్కువగా ఉన్నాయి. ఇక తాజాగా కోలుకున్న కేసులలో 75శాతం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు... మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, ఒడిషా, ఢిల్లీ, కేరళ, పశ్చిమబెంగాల్‌, హర్యానాలలో నమోదయ్యాయి. మరోవైపు మహారాష్ట్రలో 20,000 మందికిపైగా కోలుకోగా జాతీయస్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒకేరోజు 10,000 మంది కోలుకున్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658162

దేశంలోని 14 రాష్ట్రాలు/ యూటీలలో ప్ర‌తి 10 ల‌క్ష‌ల జ‌నాభాకు పరీక్షలు అత్యధికం- కేసులు స్వ‌ల్పం; 10 రాష్ట్రాలు/యూటీలలో 74 శాతం కేసులు

భారత్‌లో రోజువారీ కోవిడ్ ప‌రీక్ష‌ల సామ‌ర్థ్యం 12 లక్షలకుపైగా పెరిగింది. ఆ మేర‌కు ఇప్ప‌టిదాకా మొత్తం 6.6 కోట్లక‌న్నా అధికంగా న‌మూనాల‌ను ప‌రీక్షించారు. అధిక‌స్థాయిలో పరీక్షలద్వారా రోగుల స‌త్వ‌ర గుర్తింపు, త‌ద్వారా నిర్ధారిత కేసుల తగ్గుద‌ల సాధ్య‌మ‌ని మన అనుభ‌వం స్ప‌ష్టం చేస్తోంది. ఇక దేశ‌వ్యాప్తంగా ముమ్మ‌ర ప‌రీక్ష‌ల నేప‌థ్యంలో 14 రాష్ట్రాలు/యూటీల‌లో ప్ర‌తి 10 ల‌క్ష‌ల జ‌నాభాకు ప‌రీక్షల‌ స‌గ‌టు అత్య‌ధికంగా న‌మోద‌వుతోంది. అంతేకాకుండా నిర్ధారిత కేసులు స్వ‌ల్పగానే ఉంటున్నాయి. ఆ మేర‌కు జాతీయ‌స్థాయిలో నిర్ధారిత కేసుల స‌గ‌టు 8.52 శాతం కాగా, ప‌రీక్ష‌ల స‌గ‌టు 48,028గా ఉంది. దేశంలో గత 24 గంటల్లో 83,347 కొత్త కేసులు నమోదవ‌గా వీటిలో 74 శాతం 10 రాష్ట్రాలు/యూటీలలోనే  కేంద్రీకృతమ‌య్యాయి. ఒక్క‌ మహారాష్ట్రలోనే 18,000కన్నా ఎక్కువ  కేసులుండ‌గా- ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల‌లో  7,000, 6,000 వంతున నమోదయ్యాయి. అలాగే గత 24 గంటల్లో న‌మోదైన 1,085 మరణాలకుగాను 83 శాతం 10 రాష్ట్రాలు/యూటీలలోనే సంభ‌వించాయి. ఒక్క మహారాష్ట్రలోనే 392 మరణాలు న‌మోద‌వ‌గా- కర్ణాటక (83), ఉత్తరప్రదేశ్ (77) త‌ర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658183

ఆయుష్మాన్‌ భారత్‌-ప్రధానమంత్రి జనారోగ్య యోజన 2వ వార్షికోత్సవం సందర్భంగా ‘ఆరోగ్య మంథన్‌’కు అధ్యక్షత వహించిన డాక్టర్‌ హర్షవర్ధన్‌

ఆయుష్మాన్ భారత్- ప్రధానమంత్రి జనారోగ్య యోజన (AB-PMJAY) 2వ వార్షికోత్సం నేపథ్యంలో నిన్న నిర్వహించిన ‘ఆరోగ్యమంథన్’ 2.0కు కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ- “ఏబీ-పీఎంజేఏవై ఏర్పాటు ఒక చారిత్రక కార్యాచరణ. ఇది ప్రపంచంలోనే ప్రజల-మద్దతుగల అత్యంత భారీ ఆరోగ్య హామీ పథకం. దేశంలో సామాజికంగా-ఆర్థికంగా వెనుకబడిన దాదాపు 53కోట్ల మందికిపైగా ప్రజలకు ఆరోగ్య రక్షణ దీని లక్ష్యం. తద్వారా ప్రతి కుటుంబానికీ ఆస్పత్రులలో రూ.5 లక్షల విలువైన నగదు రహిత చికిత్స లభిస్తుంది” అని వివరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1657981

దేశంలోని సంస్థల స్థాయిలో కోవిడ్-19 నమూనాలను పరీక్ష ప్రక్రియను సగటున అతి తక్కువ సమయంలో పూర్తిచేసిన లక్నో ప్రయోగశాల

కోవిడ్‌-19 రోగుల సంఖ్యల పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని వివిధ సంస్థల స్థాయిలో లక్నోలోని “బీర్బల్‌ సాహి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాలియో సైన్సెస్‌” (BSIP) ప్రయోగశాల నమూనాల పరీక్ష ప్రక్రియను సగటున అతి తక్కువ సమయంలో పూర్తిచేసింది. తద్వారా  కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ పరిధిలోగల ఈ స్వయంప్రతిపత్తిగల ఈ సంస్థ రాష్ట్రాల స్థాయిలోనేగాక ఏకంగా జాతీయస్థాయిలో అగ్రస్థానానికి చేరింది. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాల నుంచి అందే నమూనాలను పరీక్షించేందుకు 8 మంది సభ్యుల బృందం ఈ సంస్థలోని ప్రయోగశాలను 24 గంటలూ నడుపుతోంది. తదనుగుణంగా పరీక్ష ప్రక్రియను అతి తక్కువ సమయంలో పూర్తిచేసి, కేవలం 24 గంటల రికార్డు సమయంలో ఫలితాన్ని అందజేస్తుండటం విశేషం.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1657714   

“పొరుగు దేశల్లో వైద్యపరీక్షల ప్రయోగ పరిశోధన బలోపేతం” చేసే కార్యక్రమానికి బయోటెక్నాలజీ శాఖ శ్రీకారం

దేశంలో సంభావ్య అంటువ్యాధులు, సంబంధిత వ్యాధులకు టీకాలు, అనుబంధ సామర్థ్యాలు/సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధిని బలోపేతం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలోని “ఇండి-సెపి మిషన్‌ ఫర్‌ ర్యాపిడ్‌ వ్యాక్సిన్‌ డెవలప్‌మెంట్‌” విభాగం పొరుగుదేశాలకూ చేయూతనందించనుంది. ఇందులో భాగంగా ఇరుగుపొరుగునగల (స్వల్ప-మధ్యాదాయవర్గ) దేశాలలో ఈ సామర్థ్యాలను పెంచడం, మద్దతివ్వనుంది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో “పొరుగు దేశాల వైద్య పరీక్షల ప్రయోగ పరిశోధన సామర్థ్యం బలోపేతం కోసం శిక్షణ కార్యక్రమం”లో తొలిదశను ప్రారంభించింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658349

కోవిడ్‌-19 నేపథ్యంలో దేశీయంగా ద్రవ ఆక్సిజన్‌ రవాణా కోసం ‘ఐఎస్‌ఓ’ టాంక్‌ కంటెయినర్ల వాడకంపై పెట్రోలియం-పేలుడు పదార్థాల భద్రత సంస్థకు అనుమతి

కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులన నడుమ దేశీయంగా మిగులు ప్రాంతాలనుంచి కొరతగల చోట్లకు ద్రవ ఆక్సిజన్‌ను తగు పరిమాణంలో, అతి తక్కువ వ్యవధిలో తరలించాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు ద్రవ ఆక్సిజన్‌ తరలింపు నిమిత్తం ‘ఐఎస్‌ఓ’  ట్యాంక్‌ కంటెయినర్లను అనుమతించాల్సిన పరిస్థితిని ప్రభుత్వం గుర్తించింది. తదనుగుణంగా కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ పరిధిలోని “పారిశ్రామిక ప్రోత్సాహం-అంతర్గత వాణిజ్యం (డీపీఐఐటీ) విభాగం పెట్రోలియం-పేలుడు పదార్థాల భద్రత సంస్థకు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ కంటెయినర్ల ద్వారా రోడ్డుమార్గంలో సురక్షితంగా, వేగంగా  ఆక్సిజన్ రవాణా అవుతుంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658066

పారిశ్రామిక వృద్ధికి ఉత్తేజేమిచ్చేందుకు ప్రభుత్వ చర్యలు

దేశంలో పారిశ్రామిక వృద్ధికి నిర్మాణ, బాహ్య, ఆర్థిక-పారిశ్రామిక అంశాలతోపాటు అనేక ఇతర కారకాలు దోహదం చేస్తాయి. ఆ మేరకు అంతర్జాతీయ ఉత్పాదకత మందగమనంతో భారత పారిశ్రామిక ప్రగతి కూడా ముడిపడి ఉంటుంది. కోవిడ్‌-19 మహమ్మారి ఆకస్మికంగా విరుచుకుపడటం వల్ల ప్రపంచంలోని కొన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ నేపథ్యంలో పారిశ్రామిక మందగమనం సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. సదరు చర్యలన్నిటి గురించి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఇవాళ రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వివరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658136

జి20 కూటమి వాణిజ్య-పెట్టుబడి శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న శ్రీ పీయూష్‌ గోయల్‌

కేంద్ర రైల్వే, వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌ నిన్న ఆన్‌లైన్‌ మాధ్యమంద్వారా జి20 కూటమి వాణిజ్య-పెట్టుబడి శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ- కోవిడ్‌ ప్రతికూల ప్రభావం నుంచి ప్రపంచం కోలుకోవడంలో జి20 కూటమి నాయకత్వ పాత్ర పోషించాలని ఆయన కోరారు. అంతర్గత-బహిర్గత ఆర్థిక విధానాల మధ్య సమతూకం అవసరం ఎంతటిదో అన్ని దేశాలకూ విశదమైందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1657874

ధరల నియంత్రణ యంత్రాంగం పరిధిలోకి 871 షెడ్యూల్డు ఔషధ సమ్మేళనాలు, నిత్యావసర మందులు

నిత్యావసర మందుల జాతీయ జాబితా-2015 (NLEM)లోని 871 షెడ్యూల్డు ఔషధ సమ్మేళనాలు, నిత్యావసర మందులకు ధరల పరిమితిని జాతీయ ఔషధ ధరల నియంత్రణ ప్రాధికార సంస్థ (NPPA) నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు  కేంద్ర రసాయనాలు-ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి.సదానంద గౌడ ఇవాళ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఈ జాబితాలో గుండె జబ్బులలో వాడే స్టెంట్లతోపాటు మోకాలి ఇంప్లాంట్లు, 106 మధుమేహ, హృదయకోశ వ్యాధుల మందులతోపాటు 42 షెడ్యూలేతర కేన్సర్‌ నిరోధక మందులు కూడా ఉన్నాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658160

దిగ్బంధం సమయంలో నిత్యావసర వస్తువుల సరఫరా నిర్వహణ

కోవిడ్-19 మహమ్మారి దిగ్బంధం సందర్భంగా ఆర్థిక ప్రతిస్పందనలో భాగంగా ప్రభుత్వం జాతీయ ఆహారభద్రత పథకం-2013 కింద అర్హులైన లబ్ధిదారులందరికీ నెలకు 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలతోపాటు కిలో పప్పుదినుసులను ఉచితంగా పంపిణీ చేసింది. ఈ మేరకు 2020 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 8 నెలల కాలానికిగాను ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) అమలు బాధ్యతను కేంద్ర వినియోగదారు వ్యవహారాల శాఖకు అప్పగించింది. ఈ పథకం తొలిదశలో మొత్తం 5,48,172.44 టన్నుల పప్పుదినుసులను ఏప్రిల్ నుంచి జూన్ వరకు 18.27 కోట్ల లబ్ధిదారు కుటుంబాలకు పంపిణీ చేయబడ్డాయి. అలాగే రెండో దశను 2020 నవంబరుదాకా పొడిగించింది. ఈ మేరకు కేంద్ర వినియోగదారు వ్యవహారాలు-ఆహార-ప్రజాపంపిణీ శాఖ సహాయమంత్రి శ్రీ దాన్వే రావుసాహెబ్ దాదారావ్‌ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658363

కార్మిక చట్టాల్లో ‘చారిత్రక మలుపు’ దిశగా మూడు కార్మిక స్మృతి బిల్లులకు పార్లమెంటు ఆమోదం

రాజ్యసభ ఇవాళ్టి సమావేశంలో “(i) పారిశ్రామిక సంబంధాల స్మృతి-2020 (ii) వృత్తి భద్రత-ఆరోగ్యం-పని పరిస్థితుల స్మృతి-2020, (iii) సామాజిక భద్రత స్మృతి-2020” బిల్లలుకు ఆమోదం తెలిపింది. లోక్‌సభ ఈ బిల్లులను నిన్ననే ఆమోదించిన నేపథ్యంలో ఇవి చట్టాలుగా రూపొందడానికి మార్గం సుగమమైంది. ఇది కార్మిక చట్టాల్లో “చారిత్రక మలుపు”గా ఈ బిల్లులపై చర్చలో శ్రీ గంగ్వార్ అభివర్ణించారు. కార్మికులు-పరిశ్రమలు- ఇతర సంబంధిత భాగస్వాముల అవసరాల మధ్య సమన్వయానికి ఇవి దోహదం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658197

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 • చండీగఢ్‌: కేంద్రపాలిత ప్రాంతంలో ఏకాంత గృహవాసంలోగల రోగుల కోసం అంబులెన్స్‌లను తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచాలని నగర పాలన యంత్రాంగాధిపతి ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. అలాగే నగరంలోని మూడు వైద్య సంస్థలు, త్రి-నగరంలోని ఇతర సంస్థలతో సమన్వయం చేసుకోవాలని ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శిని కూడా ఆదేశించారు.
 • పంజాబ్: రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతుండగా, రాబోయే వారాల్లో మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక పంజాబ్‌లోని గరిష్ఠ మరణాలు నమోదవుతున్న 13 జిల్లాల్లో వైద్య సౌకర్యాలతోపాటు వైద్యపరమైన ఆక్సిజన్ సరఫరాను పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది.
 • అసోం: రాష్ట్రంలో నిన్న 2073 కొత్త కేసులు నమోదవగా, 1817 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య  1,30,947కు చేరింది. ప్రస్తుతం 29857 క్రియాశీల కేసులున్నాయి. మొత్తం కేసులు 161393, క్రియాశీల కేసులు 31674, మరణాలు 586గా ఉన్నాయి.
 • మిజోరం: రాష్ట్రంలో నిన్న 22 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 1713కు చేరాయి. ప్రస్తుతం 690 క్రియాశీల కేసులున్నాయి.
 • నాగాలాండ్: రాష్ట్రంలో మంగళవారం 60 కొత్త కేసులు నమోదవగా దిమాపూర్‌లో 35, కొహిమాలో 22, మోన్‌లో 2, సునాంగ్‌లో 1 వంతున ఉన్నాయి.
 • సిక్కిం: రాష్ట్రంలో 35 కొత్త కేసులు నమోదవగా, ఒక మరణం సంభవించింది. ఇప్పటిదాకా 1932 మంది కోలుకోగా మృతుల సంఖ్య 30గా ఉంది. ప్రస్తుత క్రియాశీల కేసులు 675గా ఉన్నాయి.
 • మహారాష్ట్ర: రాష్ట్రంలో వరుసగా నాలుగోరోజు కొత్త కేసులకన్నా కోలుకున్నవి అధికంగా ఉన్నాయి. ఆ మేరకు మంగళవారం 18,390 కొత్త కేసులు నమోదవగా, మొత్తం 20,206 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ముంబైలో కూడా 1,628 కొత్త కేసులు రాగా, 1,669 మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. మహారాష్ట్రలో చురుకైన కేసులు తగ్గుతూ ప్రస్తుతం 2.72 లక్షల మంది చికిత్స పొందుతుండగా, ముంబైలో క్రియాశీల కేసుల సంఖ్య 26,764గా ఉంది. మరోవైపు మహారాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి శ్రీమతి వర్షా గైక్వాడ్‌కు కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది.
 • గుజరాత్: రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతోపాటు ఆస్పత్రులలో సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ విద్యార్థులుసహా గుజరాత్ వైద్యవిద్య పరిశోధనతో సంబంధంగల వారిని కూడా ఆస్పత్రి విధుల్లో నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్‌లో ప్రస్తుతం 16,402 క్రియాశీల కేసులుండగా- నిత్యం 1,200-1,500 కొత్త కేసులు నమోదవుతున్నాయి.
 • రాజస్థాన్: రాష్ట్రంలో ఒకేరోజు అత్యధికంగా మంగళవారం 1,912 కేసులు నమోదయ్యాయి. దీంతో రాజస్థాన్‌లో చురుకైన రోగుల సంఖ్య 18,614కు చేరింది. వీటిలో గరిష్టంగా 6,730 జైపూర్‌లో నమోదైనవే. ఇక జోధ్‌పూర్‌, కోటా జిల్లాలు కూడా తీవ్రంగా కోవిడ్‌ ప్రభావానికి గురవుతున్నాయి. రాజస్థాన్‌లోని మొత్తం క్రియాశీల కేసులలో 66 శాతం ఈ 3 జిల్లాల్లోనే ఉండటం గమనార్హం.
 • మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్ మంత్రిమండలిలో మరో ఇద్దరు బీజేపీ మంత్రులకు కోవిడ్‌ నిర్ధారణ అయింది. ఈ మేరకు మహేంద్ర సింగ్ సిసోడియా, హర్దీప్ సింగ్ డాంగ్ కరోనా బారినపడ్డారు. కాగా, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌సహా మొత్తం 12 మంది మంత్రులు ఇప్పటిదాకా వ్యాధి బారినపడ్డారు.
 •  ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో ఒకవైపు కోవిడ్-19 కేసులు పెరుగుతుండగా, మరోవైపు జాతీయ ఆరోగ్య కార్యక్రమం కింద పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె కొనసాగుతున్న కారణంగా ఛత్తీసగఢ్‌లో ఆరోగ్య సేవలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. తమ సేవలను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రంలోని 13వేలమంది ఆరోగ్య కార్యకర్తలు ఈ నెల 19 నుంచి ఆందోళన ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రెండు రోజులకిందట హెచ్చరిక జారీచేసినా వారు ఖాతరు చేయలేదు.
 • కేరళ: రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో కనిపించిన కోవిడ్‌ సామాజిక వ్యాప్తి క్రమంగా రాష్ట్రమంతా విస్తరిస్తున్నదని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. కేరళలో పరీక్షలతో నిర్ధారణ అవుతున్న కేసుల సగటు జాతీయ సగటుకన్నా అధికంగా ఉండటం ఇందుకు నిదర్శనం. ఇక దిగ్బంధ విముక్తి-4.0 తర్వాత రాష్ట్రంలో ఆంక్షలను మరింత సడలించడమే కేసుల విజృంభణకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యవసాయ మంత్రి వి.ఎస్.సునీల్ కుమార్‌కు ఇవాళ కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మంత్రిమండలిలో కరోనా బారినపడిన మంత్రులు జాబితాలో ఆయన మూడోవారుగా నిలిచారు. కాగా, ఇతర రాష్ట్రాలనుంచి వచ్చేవారికి నిర్బంధ కాలాన్ని 7 రోజులకు తగ్గించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కేరళలో నిన్న 4125 కొత్త కేసులు నమోదవగా ప్రస్తుతం 40,382మంది చికిత్స పొందుతున్నారు. మరో 2,20,270 మంది పరిశీలనలో ఉన్నారు. అలప్పుళ మరో మరణంతో, మృతుల సంఖ్య 573కు చేరింది.
 • తమిళనాడు: రాష్ట్రంలో సిలబస్‌ తగ్గింపుపై ప్రభుత్వం నుంచి పాఠశాలలకు ఇంకా ఎలాంటి ఆదేశాలూ అందలేదు. కాగా,  ప్రభుత్వం ఈ మేరకు ముందస్తుగా ప్రకటిస్తే వచ్చే ఏడాది బోర్డు పరీక్షలకు పాఠశాలల సన్నాహాలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. రాష్ట్రంలో మంగళవారం 5,334 కొత్త కేసులు, 76 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,52,674కు, మృతుల సంఖ్య 8,947కు పెరిగాయి. కొత్త కేసులలో 989 చెన్నైకి చెందినవి కాగా, పొరుగునగల చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరులలో వరుసగా 231, 209, 230 వంతున కేసులు నమోదయ్యాయి. మొత్తంమీద 595 కేసులతో కోయంబత్తూర్ జిల్లా అగ్రస్థానంలో ఉంది.
 • కర్ణాటక: రాష్ట్రంలో అదనపు ఎక్సైజ్ సుంకం ఆ శాఖ ఆదాయాన్ని పెద్దగా పెంచలేదు. ఈ మేరకు పబ్బులు, బ్రూవరీలు 30 శాతం వ్యాపారమే సాగినట్లు పేర్కొంటున్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం ఆబ్కారీశాఖ ఆదాయంలో 12.3శాతం ప్రతికూల వృద్ధి నమోదైంది. కలబురగిలో కోవిడ్-19 వ్యాప్తిలో అసాధారణ ధోరణి ప్రస్ఫుటమైంది. అధికారిక గణాంకాల ప్రకారం, మార్చి 10 నుంచి జిల్లాలో 15,730 కేసులు (వీటిలో 13,042 మంది కోలుకున్నారు) నమోదవగా వీటిలో 11 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి 6,547 కేసులు నమోదయ్యాయి.
 • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాల్లో కోవిడ్ కేసులు తగ్గుతున్నాయి. ఈ మేరకు తూర్పు గోదావరిలో రోజుకు 1.5 శాతం వంతున తగ్గుతూ మొత్తంమీద 16 శాతం తగ్గుదల నమోదైంది. ఇక విజయనగరం జిల్లాలో ఆగస్టులో రోజుకు 4 నుంచి 6 వంతున మరణాలు సంభవించగా సెప్టెంబరులో పరిస్థితి పూర్తి నియంత్రణలోకి వచ్చింది. రాష్ట్రంలో దిగ్బంధ విముక్తి-4.0 కింద 9,10, ఇంటర్‌ విద్యార్థుల కోసం ఈ నెల 21న పాఠశాలలు తిరిగి తెరిచినప్పటికీ హాజరు పలుచగానే ఉంది. కాగా, ఇంటర్‌ తరగతుల పునఃప్రారంభం ఆలస్యమైనందున ముఖ్యమైన పాఠ్యాంశాలను విడిచిపెట్టకుండా సిలబస్‌ను సీబీఎస్‌ఈతో సమానంగా తగ్గిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చెప్పారు. ఇక 9, 10, ఇంటర్‌ విద్యార్థులకు సాధారణ తరగతులను అక్టోబర్ 5 నుంచి ప్రారంభించాలని నిర్ణయించినా కేంద్రం సూచనల మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
 • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 2296 కొత్త కేసులు, 10 మరణాలు నమోదవగా 2062 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 321 జీహెచ్‌ఎంసీ నుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు: 1,77,070; క్రియాశీల కేసులు: 29,873; మరణాలు: 1062; డిశ్చార్జి: 1,46,135గా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన టీకాల సంస్థ ‘భారత్ బయోటెక్’ సెయింట్ లూయీలోని ‘వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌’తో ఒక నవ్య  ‘షింప్-అడెనోవైరస్, కోవిడ్-19’ కోసం సింగిల్ డోస్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ (ముక్కులో వేసే) కోసం లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం... అమెరికా, జపాన్, యూరప్ మినహా అన్ని ఇతర దేశాల మార్కెట్లలో వ్యాక్సిన్ పంపిణీ హక్కు భారత్ బయోటెక్‌కు లభిస్తుంది.

FACT CHECK

*****(Release ID: 1658411) Visitor Counter : 9