PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 10 SEP 2020 6:18PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • భారత్ కోవిడ్ కేసుల్లో 60 శాతం ఐదు తీవ్ర ప్రభావిత రాష్ట్రాల్లోనే
  • దేశవ్యాప్తంగా ఇవాళ్టికి ప్రస్తుత చురుకైన కేసుల సంఖ్య 9,19,018
  • రాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షల్లో వ్యాధి నిర్ధారణకాని కేసులలో ఆర్టీ-పీసీఆర్‌ విధానం ద్వారా తాజా పరీక్షలు నిర్వహించాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను కోరిన కేంద్ర ఆరోగ్య శాఖ.
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా 73వ సదస్సులో కోవిడ్‌-19 ప్రతిస్పందనపై ఉమ్మడి తీర్మానం చేసిన సభ్యదేశాలు. 
  • పౌష్టికాహార మాసం కార్యక్రమంలో భాగంగా ఆయుష్‌ ఆధారిత పౌష్టికాహార పరిష్కారాలకు ప్రాధాన్యం.

భారత్‌లో కొత్తగా నమోదైన కేసులలో 60 శాతం ఐదు తీవ్ర ప్రభావిత రాష్ట్రాల్లోనివే

భారతదేశంలో దేశంలో గత 24 గంటల్లో 95,35 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 60శాతం ఐదు తీవ్ర ప్రభావిత రాష్ట్రాలకు చెందినవే కావడం గమనార్హం. ఈ మేరకు మహారాష్ట్రలో 23,000పైగా, ఆంధ్రప్రదేశ్‌లో 10,000కుపైగా నమోదయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా ప్రస్తుతం చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య ఇవాళ 9,19,018కి చేరింది. కాగా, ఈ కేసుల విషయంలో 74 శాతానికిపైగా 9 తీవ్ర ప్రభావిత రాష్ట్రాల్లో నమోదైనవి కాగా, ఈ జాబితాలోగల మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోనే 49 శాతం కేసులున్నాయి. తదనుగుణంగా మహారాష్ట్రలో 2,50,000 మంది, కర్ణాటకతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో చెరో 97,000 మందికిపైగా చికిత్స పొందుతున్నారు. ఇక గత 24 గంటల్లో 1,172  మరణాలు నమోదు కాగా, నిన్న 32 శాతం అంటే 380 మరణాలు ఒక్క మహారాష్ట్రలోనే సంభవించాయి. అటుపైన 128 మరణాలతో కర్ణాటక రెండో స్థానంలో ఉండగా 78 మరణాలతో తమిళనాడు మూడో స్థానంలో ఉంది. ఈ విధంగా మొత్తం మృతులలో 69 శాతం కేవలం 5 రాష్ట్రాల్లో- మహారాష్ట, తమిళనాడు, కర్నాటక, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌లలో నమోదైనవే కావడం గమనార్హం.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1652921

రాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షల్లో వ్యాధి నిర్ధారణకాని కేసులలో ఆర్టీ-పీసీఆర్‌ ద్వారా తాజా పరీక్షలు నిర్వహణపై రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచన

దేశంలోని కొన్ని పెద్ద రాష్ట్రాల్లో రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (RAT) ద్వారా వ్యాధి లక్షణాలుండి, రోగ నిర్ధారణకాని వారందరికీ ఆర్టీ-పీసీఆర్‌ విధానంలో (RT-PCR) పరీక్షలు నిర్వహించక పోవడాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గమనించింది. కానీ, ఐసీఎంఆర్  మార్గదర్శకాలు,  ఆరోగ్య మంత్రిత్వశాఖ నిర్దేశించిన ప్రకారం రోగలక్షణాలు (జ్వరం లేదా దగ్గు లేదా శ్వాసలో ఇబ్బంది)అన్నీ కనిపిస్తున్నప్పటికీ 'ర్యాట్‌' పరీక్షలో రోగ నిర్ధారణ కానివారికి, లక్షణరహిత అనుమానితులకు తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్‌ విధానంలో తిరిగి పరీక్షలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. 'ర్యాట్‌' పరీక్షలో వ్యాధి నిర్ధారణ కానప్పటికీ ఆ తర్వాత2-3 రోజుల్లోగా వ్యాధి లక్షణాల తీవ్రత పెరుగుతుందని ఈ సందర్భంగా పేర్కొంది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖతోపాటు ఐసీఎంఆర్ సంయుక్తంగా అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు లేఖలు రాశాయి. ఈ రెండు రకాల వ్యక్తులవల్ల వారి పరిచయస్థులకు వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆ లేఖల్లో స్పష్టం చేశాయి. క్షేత్రస్థాయిలో పరీక్షల సంఖ్యను పెంచడం కోసం 'ర్యాట్‌' పరీక్షకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ  ఆర్టీ-పీసీఆర్‌ పద్ధతి మాత్రమే సంపూర్ణంగా ప్రామాణికమని ఉమ్మడి లేఖ నొక్కిచెప్పింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1652973

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా మంత్రులస్థాయి 73వ ప్రాంతీయ సదస్సులో కోవిడ్‌-19 అత్యవసర సన్నద్ధతపై ప్రసంగించిన మంత్రి హర్షవర్ధన్‌

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఇవాళ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా 73వ ప్రాంతీయ సదస్సులో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్ కోవిడ్‌-19 అత్యవసర సన్నద్ధతపై మంత్రులస్థాయి రౌండ్ టేబుల్ భేటీలో రెండు పరిష్కారాలను ప్రతిపాదించారు. అంతకుముందు కోవిడ్‌ మహమ్మారి నిర్వహణతోపాటు కోవిడేతర అత్యవసర ఆరోగ్య సేవల నిర్వహణకు  సంబంధించి భారత్‌ అనుసరించిన మూడు ముఖ్యమైన వినూత్న పద్ధతులను ఆయన వివరించారు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా తలెత్తే మహమ్మారులను ఎదుర్కొనే సంసిద్ధత గురించి కూడా ఆయన మాట్లాడారు. ఈ మేరకు ఆరోగ్య, ఆరోగ్య అత్యవసర సంసిద్ధత-ప్రతిస్పందన రంగాలలో దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ ఆరోగ్య నియంత్రణ ప్రధాన సామర్థ్యాల పెంపు దిశగా అనుసరించాల్సిన వ్యూహాల గురించి నొక్కిచెప్పారు. తదనుగుణంగా రెండో దఫా చర్యల కింద ఆయా రంగాల్లో పెట్టుబడుల పెంపు అవసరాన్ని డాక్టర్‌ హర్షవర్ధన్‌ విశదీకరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1653056

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా 73వ సదస్సులో కోవిడ్‌-19 ప్రతిస్పందనపై ఉమ్మడి తీర్మానానికి సభ్యదేశాల ఆమోదం

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా 73వ సదస్సు ముగింపు సమావేశం థాయ్‌లాండ్‌ ఉప ప్రధాని, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ అనుతిన్ చార్న్‌విరాకుల్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆగ్నేయాసియా ప్రాంతంలో కోవిడ్‌-19పై సమష్టి ప్రతిస్పందనకు సంబంధించి చేసిన ఉమ్మడి తీర్మానానికి సభ్యదేశాలు ఆమోదం తెలిపాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1653104

భారత ప్రధానమంత్రి -గౌరవనీయులైన సౌదీ అరేబియా రాజు మధ్య టెలిఫోన్‌ సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గౌరవనీయులైన సౌదీ అరేబియా రాజు సల్ఆన్‌ బిన్‌ అబ్దులజీజ్‌ సౌద్‌తో టెలిఫోన్‌ ద్వారా సంభాషించారు. కోవిడ్‌-19 మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎదురైన సవాళ్లపై దేశాధినేతలిద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కాగా, జి20 కూటమి అధ్యక్ష హోదాలో సౌదీ అరేబియా నాయకత్వ పటిమను ప్రధానమంత్రి ప్రశంసించారు. జి20 కూటమి స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు కోవిడ్‌ మహమ్మారిపై సమన్వయంతో కూడిన నియంత్రణలో ఎంతగానో ఫలితమిచ్చినట్లు అధినేతలు అంగీకరించారు. రెండు దేశాలమధ్య ద్వైపాక్షిక సంబంధాలపై వారిద్దరూ సంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. కోవిడ్‌-19 పరిస్థితులలో ప్రవాస భారతీయులకు సౌదీ అరేబియా ఎనలేని మద్దతు ఇచ్చినందుకుగాను రాజు సల్మాన్‌కు ప్రధానమంత్రి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.   

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1652828

పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కార్యకలాపాలు సజావుగా సాగేలా నమూనా సమావేశం నిర్వహించిన రాజ్యసభాధ్యక్షుడు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సంబంధిత ప్రత్యేక ఏర్పాట్లపై రాజ్యసభ అధ్యక్షుడి హోదాలో ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు నిన్న సమీక్షించారు. ఇందులో భాగంగా తన అధ్యక్షతన రాజ్యసభ నమూనా సమావేశం నిర్వహించారు. సామాజిక దూరం నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే  పూర్తిచేసిన సీట్ల కేటాయింపునకు అనుగుణంగా ఈ సమావేశం నిర్వహించారు. ఆయనతోపాటు సభా మందిరం, నాలుగు గేలరీలలో రాజ్యసభ సచివాలయ సిబ్బంది కూర్చున్నారు. అనంతరం ఈ ఏర్పాట్లపై చైర్మన్ శ్రీ నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. దేశీయాంగ, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలు జారీచేసిన అన్ని మార్గదర్శకాలనూ తూచా తప్పకుండా పాటించేలా చూడాలని సచివాలయ సీనియర్ అధికారులను శ్రీ నాయుడు ఆదేశించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1652861

ఇంటిముంగిట బ్యాంకు సేవలకు ఆర్థికశాఖ మంత్రి శ్రీకారం; 'ఈజ్‌' 2.0 సూచీ ఫలితాల ప్రకటన

ప్రభుత్వరంగ బ్యాంకులద్వారా ఇంటిముంగిట బ్యాంకు సేవలందించే కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక-కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ నిన్న శ్రీకారం చుట్టారు. దీంతోపాటు 'ఈజ్‌ (EASE) బ్యాంకింగ్‌ రిఫార్మ్స్‌ ఇండెక్స్‌'కు సంబంధించి అత్యుత్తమ పనితీరు కనబరచిన బ్యాంకులకు పురస్కార ప్రదానం కార్యక్రమంలో ఆమె  పాల్గొన్నారు. ఇందులో భాగంగా చేపట్టిన ఇంటిముంగిటకు బ్యాంకు సేవలను సార్వత్రిక కూడళ్లయిన కాల్‌ సెంటర్‌, వెబ్‌ పోర్టల్‌, మొబైల్‌ యాప్‌, తదితరాల ద్వారా బ్యాంకులు ప్రజలకు అందిస్తాయి. ఈ మేరకు దేశంలో ఎంపిక చేసిన 100 కేంద్రాల్లో సేవాప్రదాతలు ఇంటిముంగిట బ్యాంకు సేవలందించే ప్రతినిధులను నియమిస్తారు. కాగా, ప్రస్తుతం బ్యాంకింగేతర సేవలను ఇంటిముంగిట అందిస్తుండగా, ఇకపై బ్యాంకింగ్‌ సేవలు కూడా ప్రజలకు ఇళ్లవద్దనే అందుబాటులోకి రానున్నాయి.

మరిన్ని వివరాలకు:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1652861

పౌష్టికాహార మాసం కార్యక్రమంలో భాగంగా ఆయుష్‌ ఆధారిత పౌష్టికాహార పరిష్కారాలకు ప్రాధాన్యం

ప్రభుత్వం 2020 సెప్టెంబరులో నిర్వహించే పౌష్టికాహార మాసం కార్యక్రమానికి సంప్రదాయ ఆరోగ్య సంరక్షణ పరిజ్ఞానం ప్రాతిపదికగా ఉంటుంది. తద్వారా పౌష్టికాహార కార్యక్రమం కింద వివిధ కార్యకలాపాలు వేగవంతమవుతాయి. అయితే, ఇది కోవిడ్‌-19 విధివిధానాలకు అనుగుణంగా సాగుతుంది. అందరికీ సంపూర్ణ పోషకాహారం అందించాలనే  ప్రధానమంత్రి ఆలోచన నుంచి పుట్టిన పథకం 'జాతీయ పౌష్టికాహార కార్యక్రమం' (NNM).  దీన్ని ఆయన 2018 మార్చి 8వ తేదీన ప్రారంభించారు. ఈ దిశగా చక్కని పోషకాహారానికి సంబంధించి ఆయుర్వేద, సిద్ధ, యునాని దేశీయ వైద్యవ్యవస్థల నిపుణులు మార్గనిర్దేశం చేస్తారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1653170

ఆవిష్కరణ, వ్యవస్థాపకత-ఇంక్యుబేషన్ లకు ఉత్ప్రేరకంగా డీఎస్టీ ప్రస్థానంపై నివేదిక విడుదల

ఆవిష్కరణ, వ్యవస్థాపకత మరియు ఇంక్యుబేషన్‌లకు ఉత్ప్రేరకంగా 'నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌ఎస్‌టిఇడిబి)' ప్రస్థానంపై నివేదికను శాస్త్ర-సాంకేతిక శాఖ కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ ఇటీవల ఆన్‌లైన్ కార్యక్రమంద్వారా విడుదల చేశారు. మొత్తంమీద 'ఎన్‌ఎస్‌టిఇడిబి' విధానం ఉన్నత విద్యా సంస్థల సాంకేతిక శక్తికి అంకుర సంస్థల బలాన్ని జోడించింది. తద్వారా అది  సమర్థ ఇంక్యుబేషన్ మద్దతు వ్యవస్థకు దారితీసింది. తద్వారా అంకుర సంస్థల విజయానికి బాటలు వేసింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1652988

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో 147 కొత్త కేసులు నమోదు కాగా, 183 కోలుకొని ఇళ్లకు వెళ్లారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో ప్రస్తుతం1,630 క్రియాశీల కేసులున్నాయి.
  • అసోం: రాష్ట్రంలో నిన్న 2,265 మంది కోలుకోగా, ఇప్పటిదాకా వ్యాధి నయమైనవారి సంఖ్య 1,03,504కు చేరింది. ప్రస్తుతం 29,163 మంది క్రియాశీల రోగులున్నారని అసోం ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.
  • మణిపూర్: రాష్ట్రంలో 160 మందికి కోవిడ్‌ నిర్ధారణ అయింది. కాగా, మణిపూర్‌లో 75 శాతం కోలుకునే సగటుతో 64 మందికి వ్యాధి నయమైంది. ప్రస్తుతం 1,774 క్రియాశీల కేసులున్నాయి.
  • మేఘాలయ: రాష్ట్రంలో నిన్న 107 మంది కరోనావైరస్ బారినుంచి బయటపడ్డారు. ప్రస్తుతం  1,355 క్రియాశీల కేసులుండగా, వీరిలో బీఎస్ఎఫ్, సాయుధ బలగాల సిబ్బంది 280 మంది, ఇతరులు 1,075 మంది ఉన్నారు. ఇక ఇప్పటిదాకా 1,823 మంది కోలుకున్నారు.
  • మిజోరం: రాష్ట్రంలో నిన్న 141 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 1,333కు చేరింది. క్రియాశీల కేసుల సంఖ్య 583గా ఉంది.
  • నాగాలాండ్: రాష్ట్రానికి తిరిగివచ్చిన వారితోపాటు ఇతర ప్రయాణికుల కోసం నాగాలాండ్‌ ప్రభుత్వం మునుపటి అన్ని ప్రామాణిక విధాన ప్రక్రియలను రద్దుచేస్తూ కొత్తవి జారీచేసింది. ఆ మేరకు రాష్ట్రంలోకి ప్రవేశ మార్గాలను నిర్దేశించింది. కాగా, రాష్ట్రంలో నమోదైన 130 కొత్త కేసులకుగాను 64 కొహిమాలో, 63 దిమాపూర్‌లో, 2 మోన్‌లో, 1 మోకోక్‌చుంగ్‌లో ఉన్నాయి.
  • సిక్కిం: రాష్ట్రంలో 31 కొత్త కోవిడ్‌ కేసులు నమోదవగా, ప్రస్తుత చురుకైన కేసుల సంఖ్య 527కు చేరింది. ఇక సిక్కింలో ఇప్పటిదాకా 1,470 మంది కోలుకున్నారు. సిక్కింలో మొత్తం కేసుల సంఖ్య 1,989గా ఉంది.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో బుధవారం అత్యధికంగా 23,816 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసులు 9,67,349కి చేరాయి. అలాగే, మహారాష్ట్ర ఆరోగ్యశాఖ తాజా సమాచారం ప్రకారం 325 మంది మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 27,732కు చేరింది. అలాగే క్రియాశీల కేసుల సంఖ్య 2,52,734గా తేలింది. ముంబైలో బుధవారం 2,227 కొత్త కేసుల నమోదుతో నగరంలో కేసుల సంఖ్య 1,60,744 కు చేరింది. అలాగే 43 మంది మరణించడంతో మృతుల సంఖ్య 7,982కు పెరిగింది. ఇక ఇప్పటిదాకా 1,26,745 మంది కోలుకోగా, నగరంలో ప్రస్తుత క్రియాశీల రోగుల సంఖ్య 25,659గా ఉంది.
  • గుజరాత్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, నవసారి ఎంపీ సి.ఆర్.పాటిల్‌కు కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. గుజరాత్‌లో బుధవారం 1,329 కొత్త కేసులు నమోదవగా రాష్ట్రంలో ప్రస్తుతం 16,296 క్రియాశీల కేసులున్నాయి.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్‌ నుంచి కోలుకునేవారి సగటు 76 శాతానికి పెరిగింది. మరోవైపు  మరణాల సగటు 2.4 శాతం నుంచి 1.4 శాతానికి పతనమైంది. మరోవైపు గత 24 గంటల్లో 1,869 కొత్త కేసులు నమోదవడంతో మధ్యప్రదేశ్‌లో మొత్తం కేసుల సంఖ్య 79,192కు చేరింది. రాష్ట్రంలో ఇప్పుడు 17,702 క్రియాశీల కేసులున్నాయి.
  • గోవా: దక్షిణ గోవా జిల్లా ఆస్పత్రిలో 250 పడకల కోవిడ్ సంరక్షణ సదుపాయం శుక్రవారం నుంచి అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రంలో కరోనావైరస్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో మజ్‌గావ్‌లోని ఆస్ప్రత్రిలోగల 500 పడకలలో 250 కోవిడ్‌ పడకలుగా మార్చాలని గోవా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం మజ్‌గావ్‌లోని ఇఎస్‌ఐ ఆస్పత్రి పణజి సమీపంలోని బాంబోలిమ్‌లోగల గోవా వైద్య కళాశాల ఆస్పత్రి, పోండాలోని సబ్ డిస్ట్రిక్ట్ ఆస్పత్రులలో 4,833 మంది కోవిడ్‌ రోగులు చికిత్స పొందుతున్నారు.
  • కేరళ: రాష్ట్రంలో ఆంక్షలను తొలగిస్తే కోవిడ్ మరణాలు పెరిగిపోయే ప్రమాదం ఉందని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కె.కె.శైలాజ హెచ్చరించారు. వ్యాధి మరింత వ్యాప్తి చెందితే ఇప్పటికే పరికరాల కొరత ఉన్నందున వెంటిలేటర్లు తగినన్ని అందుబాటులో ఉండవని ఆమె పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక రద్దుపై ఏకాభిప్రాయం దిశగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ రేపు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు కేరళలో మరో ముగ్గురు వ్యక్తులు కోవిడ్‌కు బలయ్యారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య387కు చేరింది. ఇక రాష్ట్రంలో నిన్న 3,402 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 24,549 మంది చికిత్స పొందుతుండగా 2.02 లక్షల మంది పరిశీలనలో ఉన్నారు.
  • తమిళనాడు: రాష్ట్రంలోని విద్యార్థుల తల్లిదండ్రుల సంసిద్ధతను పరిగణనలోకి తీసుకుని పాఠశాలలను తిరిగి తెరవడంపై నిర్ణయం తీసుకుంటామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి చెప్పారు. ఇక సెప్టెంబర్ 21 నుంచి 25దాకా రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు ఉండవు. విద్యార్థులలో మానసిక ఒత్తిడికి ఉపశమనంగా ఈ సెలవులు ప్రకటించినట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి కె.ఎ.సెంగోట్టయ్యన్ తెలిపారు. తమిళనాడులో నిన్న 5,584 మందికి వ్యాధి నిర్ధారణ కాగా, 78 మంది మరణించారు. మరోవైపు 6,516 మంది వ్యాధినుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. రాష్ట్రంలో మృతుల సంఖ్య 8,090కి పెరిగింది.
  • కర్ణాటక: రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రభు చవాన్‌కు కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది.  కాగా, కర్ణాటకలోని ప్రైవేట్ ఆస్పత్రులు, కోవిడ్ రక్షణ కేంద్రాల్లో సౌకర్యాలపై ఒక నివేదికను సమర్పించాలని హైకోర్టు బుధవారం రాష్ట్రస్థాయి కోవిడ్‌ నిపుణుల కమిటీని ఆదేశించింది. మరోవైపు బ్రిటన్‌లో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం చేపట్టిన కరోనా వైరస్‌ టీకా ప్రయోగాలు ఆగినప్పటికీ మైసూరులోని జేఎస్‌ఎస్‌ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో విజయవంతంగా సాగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో కొనసాగింపునకు సంబంధించి సమాచారం కోసం అక్కడి నిపుణులు ఎదురుచూస్తున్నారు.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ ఆసుపత్రులలో సదుపాయాలపై నిర్వహించిన సర్వేలో విశాఖపట్నం జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్ర వైద్య-ఆరోగ్యశాఖ ప్రభుత్వ-ప్రైవేటు ఆస్పత్రులలో ఈ అధ్యయనం నిర్వహించింది. ఐసీయూలలోని వైద్యులు, ఆక్సిజన్ పడకలు, డిశ్చార్జిలు, ఆహారం-పారిశుధ్యం, మౌలిక వసతులు, పడకలు తదితరాలను ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకుంది. కాగా, నెల్లూరు జిల్లా యంత్రాంగం శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంవద్ద కోవిడ్‌ పరీక్షల సంఖ్యను పెంచడం కోసం 'సంజీవిని' బస్సును ఏర్పాటు చేసింది. కాగా, సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో బుధవారం 47 కొత్త కేసులు నమోదయ్యాయి.
  • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 2534 కొత్త కేసులు,11 మరణాలు నమోదవగా 2071 మంది కోలుకున్నారు. దీంతో తెలంగాణలో కోవిడ్-19 కేసులు 1.5 లక్షల స్థాయిని దాటాయి.  కొత్త కేసులలో 327 జీహెచ్‌ఎంసీ నుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు: 1,50,176; క్రియాశీల కేసులు: 32,106; మరణాలు: 927; డిశ్చార్జి: 1,17,143గా ఉంది. దేశంలో కోవిడ్ -19 యోధుల కోసం తొలి ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం మరికొన్ని నెలలు కొనసాగించే అవకాశం ఉంది. రాష్ట్రంలో కోవిడ్-19 రోగులను పీల్చిపిప్పి చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులను అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేస్తుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇవాళ శాసనసభలో ప్రకటించారు.

FACTCHECK

***


(Release ID: 1653174) Visitor Counter : 208