ఆర్థిక మంత్రిత్వ శాఖ
గడప వద్దకే బ్యాంకుల సేవల్ని ప్రారంభించిన ఆర్ధిక శాఖ మంత్రి ఈజ్ 2.0 సూచిక ఫలితాలను ప్రకటించిన ఆర్ధిక శాఖ మంత్రి
Posted On:
09 SEP 2020 7:13PM by PIB Hyderabad
ప్రభుత్వ రంగ బ్యాంకులు గడపవద్దకే బ్యాంకుల సేవల్ని అందించే నూతన కార్యక్రమాన్ని కేంద్ర ఆర్ధిక మరియు కార్పొరేట్ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. తదనంతరం జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఉత్తమ సేవలందించిన బ్యాంకులకు అవార్డులను ప్రదానం చేశారు. సులభతర బ్యాంకు సంస్కరణల సూచిక ఆధారంగా వీటిని ఎంపిక చేశారు.
విర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్ధిక సేవల విభాగ కార్యదర్శి శ్రీ దేవాషిష్ పాండా, ఐబిఐ ఛైర్మన్ శ్రీ రజినీష్ కుమార్ పాల్గొన్నారు.
గడపవద్దనే ప్రభుత్వ రంగబ్యాంకుల సేవలు
బ్యాంకుల రంగంలో చేపట్టిన సులభతర సంస్కరణల్లో భాగంగా ప్రజలకు వారి ఇంటివద్దనే బ్యాంకులు సేవలందించబోతున్నాయి. కాల్‌సెంటర్లు, వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ ల ద్వారా వారు ఈ పని చేయబోతున్నారు. ఈ ఛానెళ్ల ద్వారా వినియోగదారులు తమ సేవలకు సంబంధించిన విజ్ఞప్తులు ఎంతవరకు వచ్చాయో తెలుసుకోగలుగుతారు.
దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వంద కేంద్రాల్లో డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఏజెంట్లను నియమిస్తారు. వీరిని ఎంపిక చేసిన సర్వీస్ ప్రొవైడర్లు నియమిస్తారు. ఈ ఏజెంట్లే గడపవద్దకు వచ్చి సేవలనందిస్తారు.
ఇంటివద్దకే బ్యాంకుల సేవలకు సంబంధించి ప్రస్తుతం ఆర్ధికేతర సేవలనుమాత్రమే అందించడం జరుగుతోంది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఆర్ధిక సేవలను కూడా అందజేయడం జరుగుతోంది.
గడపవద్దకే అందించబోతున్న సేవలను ఉపయోగించుకునే వినియోగదారులు తమ తమ బ్యాంకులకు నామమాత్రపు రుసుంలు చెల్లించాల్సి వుంటుంది. ఈ సేవలు బ్యాంకుల వినియోగదారులకు చాలా ప్రయోజనాలు చేకూరుస్తాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు ఈ నూతన సేవలవల్ల చాలా మేలు జరుగుతుంది.
ఈజ్ 2.0 సూచిక ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల సామర్థ్యం
ప్రభుత్వ రంగ బ్యాంకులన్నిటికీ ఉమ్మడిగా నిర్దేశించిన సంస్కరణ ఈజ్ ఎజెండా. దీని ద్వారా బ్యాంకులు ఎలాంటి ఒడిదుడుకులు లేని, ఉన్నత స్థాయి సేవలందించేలా తీర్చిదిద్దడాలని సంకల్పించారు. దీన్ని 2018లో ప్రారంభించారు. ఈజ్ 1.0 మీద ఆధారపడి ఈజ్ 2.0ను నిర్మించి బ్యాంకుల్లో సంస్కరణల్ని వేగవంతం చేశారు. ఈజ్ 2.0 సంస్కరణలు ప్రారంభమైన తర్వాత నాలుగు త్రైమాసికాల ఫలితాలను తీసుకుంటే బ్యాంకుల సమర్థత పెరిగింది. ఆరు అంశాల్లో గణనీయమైన ప్రగతిని సాధించాయి. బాధ్యతాయుతమైన బ్యాంకుల సేవలు, పాలన మరియు మానవ వనరులు, ఎంఎస్ ఎంఇలకోసం సేవలు, క్రెడిట్ ఆఫ్ టేక్.. అంశాల్లోనైతే మరింత అత్యధిక ప్రగతి కనిపించింది.
సంస్కరణలు మొదలైన తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ సాంకేతిక వ్యవస్థల్ని బలోపేతం చేసుకున్నాయి. తక్కువ సమయంలోనే రుణాలను ఇచ్చే విధానాల్ని అమలు చేయగలుగుతున్నాయి. వినియోగదారుల రుణాల విజ్ఞప్తులు ఏ స్థాయిలో వున్నాయనేది కూడా వెంటనే తెలియజేయగలుగుతున్నారు. ప్రాంతీయ భాషల్లో కూడా సేవలందిస్తున్నాయి.
ఈజ్ 2.0 సూచిక ఫలితాల ప్రకారం బరోడా బ్యాంక్ , ఎస్ బిఐ, మొన్నటివరకు మనుగడలో వున్న ఓరియెంటల్ బ్యాంకు..ఈ మూడు వరుసగా ఉత్తమ బ్యాంకులుగా నిలిచాయి. ప్రగతి సాధించిన ఉత్తమ బ్యాంకులుగా వరుసగా మహారాష్ట్ర బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు నిలిచాయి. విశిష్టమైన పనితీరు కనబరిచిన ఉత్తమ బ్యాంకులుగా పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, కెనరాబ్యాంకు వరుసగా నిలిచాయి.
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో అత్యధిక బ్యాంకులు 35కు పైగా సేవలందిస్తున్నాయి. ఇవి అందించే సేవల సంఖ్య గత 24 నెలల్లో రెండింతలయ్యాయి.
ప్రస్తుతం దేశంలో మొబైల్ , ఇంటర్ నెట్ బ్యాంక్ సేవలు అనూహ్యంగా పెరిగాయి. ఈ విషయంలో 140 శాతం పెరుగుదల కనిపించింది. యాభై శాతం లావాదేవీలు డిజిటల్ ఛానెళ్లద్వారా జరుగుతున్నాయి.
ప్రస్తుతం బ్యాంకులకు సంబంధించిన కాల్ సెంటర్లు 13 ప్రాంతీయ భాషల్లో సేవలందిస్తున్నాయి. తెలుగు, మరాఠీ, కన్నడ, తమిళ్, మలయాళం, గుజరాతీ, బెంగాలీ, ఒడియా భాషల్లో ఇవి లభ్యమవుతున్నాయి.
ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి బ్యాంకులు తీసుకునే సమయం తగ్గింది. దీని సరాసరి తీసుకున్నప్పుడు 9 రోజులనుంచి 5 రోజులకు తగ్గింది. బ్యాంకు మిత్రల ద్వారా 23 రకాల బ్యాంకు సేవలనందిస్తున్నారు. దేశంలో 23 కోట్ల రుపే క్రెడిట్ కార్డులను వినియోగదారులకు అందించారు. బ్యాంకుల మార్కెటింగ్ విభాగ ఉద్యోగుల సంఖ్య 8, 920 నుంచి 18 వేలకు పెరిగింది.
ఇక బ్యాంకుల్లో కార్యనిర్వహణకు సంబంధించిన పాలనా సంస్కరణలు అనేకం చేశారు. సిబ్బంది ఎంపికలో అనేక మార్పులు చేర్పులు చేశారు. కిందిస్థాయినుంచి పై స్థాయివరకూ బ్యాంకులకు సంబంధించి పని చేసేవారి ఎంపికలో అనేక జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. తద్వారా బ్యాంకుల సేవలు బలోపేతమయ్యాయి.
ఆరు అంశాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితనాన్ని లెక్కిస్తున్నారు. పారదర్శకమైన మార్కుల విధానంద్వారా పనితనాన్ని లెక్కగడుతున్నారు. దీనివల్ల బ్యాంకుల బలాలు బలహీనతలు తెలుస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల మధ్య పోటీని పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
కోవిడ్ -19 మహమ్మారిని కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు చక్కటి సేవలందించాయి.
కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికిగాను ప్రభుత్వరంగ బ్యాంకులు విశిష్టమైన సేవలందిస్తున్నాయి. 80 వేలకు పైగా బ్యాంకుల బ్రాంచులు పని చేశాయి. 75వేలమందికిపైగా బ్యాంకు మిత్రలద్వారా ఇంటివద్దనే సేవలందించారు. సాంకేతికతను బాగా ఉపయోగించుకోవడం జరిగింది. అంతే కాదు కాల్ సెంటర్లద్వారా అందిస్తున్న సేవల సంఖ్యను 11నుంచి 23కు పెంచారు.
ఆకర్షణీయమైన, సాంకేతికత ఆధారంగా ఇచ్చే బ్యాంకుల సేవలకు సంబంధించి సమగ్రమైన ప్రణాళికను అమలు చేస్తున్నారు. దీని ద్వారా రుణాల ప్రక్రియను త్వరితంగా పూర్తి చేసి సూక్ష్మ తరహా పరిశ్రమలను ఆదుకుంటున్నారు. డిజిటల్ ద్వారా కూడా వ్యక్తిగత రుణాలను అందిస్తున్నారు.
ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రాధాన్యతా క్రమంలో సంస్కరణలు చేపడుతున్నాయి. అవి సాధిస్తున్న ఫలితాలను త్రైమాసిక ఇండెక్స్ లో ప్రచురిస్తున్నారు.
సులభతర సంస్కరణల ప్రయాణం మొదలైన తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్ధికంగా పుంజుకుంటున్నాయి. నిరర్ధక ఆస్తులకు సంబంధించిన ఒత్తిడి తగ్గింది. లాభాలు పొందుతున్నాయి. గతంలో ఇబ్బందిపెట్టిన బలహీనతలు తిరిగి రాకుండా చూస్తున్నారు. ప్రభుత్వ బ్యాంకులు సాధించిన ఆర్ధిక మెరుగుదలను పలు అంశాల్లో చూడవచ్చు.
2018 మార్చి నాటికి బ్యాంకుల దగ్గర వున్న నిరర్ధక ఆస్తుల విలువ 8.96 లక్షల కోట్లు. అది ఈ ఏడాది మార్చి నాటికి 6.78 లక్షల కోట్లకు తగ్గిపోయింది. మోసాల శాతం కూడా గణనీయంగా తగ్గింది. బ్యాంకుల్లో సంస్కరణల కారణంగా పలు అంశాల్లో బ్యాంకుల తీరు గణనీయంగా మెరుగుపడింది.
గడపవద్దకే బ్యాంకుల సేవలకు సంబంధించిన వివరాలును, ఈజ్ 2.0 సూచిక కు సంబంధించిన ఫలితాలను తెలుసుకోవాలంటే
https://www.iba.org.in/events/past-events/launch-of-dsb-and-declaration-of-ease-2-0-index-results_972.html లింకును క్లిక్ చేయండి. లేదా https://www.iba.org.in లోకి వెళ్లి చూడగలరు.
***
(Release ID: 1652861)
Visitor Counter : 354