ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంత 73వ సదస్సు
కోవిడ్-19 అత్యవసర సంసిద్ధతపై మంత్రులస్థాయి సమావేశంలో డాక్టర్ హర్ష వర్ధన్ ప్రసంగం

దేశంలో ఆరోగ్య రంగాన్ని పటిష్టపరచే " ప్రధాన మంత్రి ఆత్మ నిర్భర్ స్వస్థ్య భారత్ యోజన"

Posted On: 10 SEP 2020 4:56PM by PIB Hyderabad

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంత 73వ సదస్సుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతీయ కార్యాలయ డైరెక్టర్ డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్, భారత ప్రతినిధి, ప్రాంతీయ ఎమర్జెన్సీ డైరెక్టర్  డాక్టర్ రోడెరికో ఆఫ్రిన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మంత్రిత్వస్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్నుద్దేశించి భారత్ తరఫున మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ కోవిడ్-19 అత్యవసర పరిస్థితికి సమాయత్తత గురించి వివరించారు. భారత్ లో కోవిడేతర ఆరోగ్య సేవలకు లోటు రాకుండా చూడటం కోసం అనుసరించిన మూడు ముఖ్యమైన వ్యూహాలను ఆయన వివరించారు. ఆ తరువాత ఆరోగ్యానికి, అత్యవసర ఆరోగ్యానికి పెట్టుబడుల పెంపుద్వారా సంసిద్ధంగా ఉంటూ స్పందించటం మీద కూడా మాట్లాడారు. భవిష్యత్ లో ఎదురయ్యే ఆరోగ్య సంబంధ ఉపద్రవాలను ఎలా ఎదుర్కోవాలి, అందుకు అనుసరించాల్సిన అంతర్జాతీయ ఆరోగ్య నియంత్రణ నియమాలను కూడా ప్రస్తావించారు.

2020 జనవరి మొదలుకొని కోవిడ్ నియంత్రణకు, వ్యాప్తి నిరోధానికి భారత ప్రభుత్వం తీసుకున్న ఆరోగ్య చర్యల గురించి ఆయన సోదాహరణంగా వివరించారు. ప్రయాణాలమీద సూచనలు జారీచేయటం,  కరోనా సోకిన దేశాలనుంచి వచ్చేవారి క్వారంటైన్ కు సౌకర్యాలు కల్పించటం,  స్థానికంగా ప్రజలలో నిఘాకు అవసరమైన మార్గదర్శకాల జారీ, పరీక్షలకు వసతుల కల్పన, అనుమానితుల ఆచూకీ కనుక్కొని పరీక్షలు చేయించటం, కోవిడ్ కేర్ ఆస్పత్రులు, కోవిడ్ ఆరోగ్య కేంద్రాలు, ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులు అనే మూడంచెల ఆరోగ్య మౌలిక సదుపాయాలు కల్పించటం లాంటి చర్యలు అందులో భాగమన్నారు. ఈ మూడంచెల ఆస్పత్రులవలన లక్షణాలు కనబరచని లేదా స్వల్ప లక్షణాలున్నవారిని, ఒక మోస్తరు నుంచి తీవ్రమైన లక్షణాలున్న వారిని గుర్తించి తగిన ఆస్పత్రులకు తరలించటం సాధ్యమైంది.

ఆరోగ్య రంగంలో అవసరానికి తగినట్టు స్పందిస్తూ కోవిడ్ చికిత్సకోసం అవసరమయ్యే పిపిఇ కిట్లు, వెంటిలేటర్లు తదితర వైద్యసామగ్రి  స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవటం గురించి డాక్టర్ హర్ష వర్ధన్ ప్రస్తావించారు. ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా నియంత్రించటానికి అనుసరించాల్సిన మార్గదర్శకాలను, చికిత్సావిధానాన్ని, జీవవైద్య వ్యర్థాల నియంత్రణ తదితర అంశాలన్నిటికీ మార్గదర్శకాలను భారత్ రూపొందించిందన్నారు. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు వెబ్ ఆధారిత పోర్టల్ రూపొందించి పరీక్షలు, ఆస్పత్రి చేరికలు, డిశ్చార్జ్ అయిన బాధితుల వివరాలు, మరణాలు నమోదు చేసి సమాచారం ఎప్పటికప్పుడు అందేలా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. దీనివలన భవిష్యత్ అవసరాల మీద కూడా ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడిందని, కోవిడేతర వైద్య సేవల అందుబాటుకు కూడా ప్రభుత్వం తగిఉన చర్యలు కొనసాగించిందని చెప్పారు.

కోవిడ్ నియంత్రణలో భాగంగా భారత ప్రభుత్వం తీసుకున్న మూడు ముఖ్యమైన నిర్ణయాల గురించి మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ సందర్భంగా వివరించారు.

ఎ) జనవరిలో కేవలం ఒకే ఒక్క లాబ్ లో పరీక్షలకు వీలుండగా ఇప్పుడు రోజుకు పది లక్షల పరీక్షలు చేయగలిగే సామర్థ్యంతో  మొత్తం 1678 లాబ్ లు ఉండటం

బి) మూడంచెల ఆస్పత్రుల ద్వారా సమర్థవంతంగా చికిత్స అందించే వీలు, అందులో లక్షణాలు కనబడనివారు, స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నవారు, ఒక మోస్తరు నుంచి తీవ్రమైన లక్షణాలున్నవారిని గుర్తించి వాళ్లను ఎడతెరపి లేకుండా పర్యవేక్షించటం, ఎప్పటికప్పుడు వైద్యులకు కూడా సమాచారాన్ని అందించి చికిత్సకు తోడ్పడటం లాంటి చర్యల గురించి చెప్పారు. 

c) ఒకవైపు కరోనా బాధితుల గురించి జాగ్రత్తలు తీసుకుంటూనే మరోవైపు ఇతర వ్యాధి గ్రస్తుల చికిత్స పట్ల కూడా దృష్టిపెట్టటం, తీవ్రమైన వ్యాధులతో బాధపడేవారిని, రక్తసంబంధమైన వ్యాధులున్నవారిని, గర్భిణులను, ఇతరత్రా అత్యవసర చికిత్స అవసరమైనవారిని పట్టించుకొని చికిత్స అందించటం ఇందులో భాగాలయ్యాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థవారి అంతర్జాతీయ ఆరోగ్య నియంత్రణల కింద మధ్యకాలిక, దీర్ఘకాలిక వ్యూహాల అమలు ద్వారా కీలకమైన సామర్థ్యాలను బలోపేతం చేసుకోవటం గురించి గుర్తు చేశారు. ఆరోగ్యపరమైన అత్యవసరాలకు సంసిద్ధత తెలియజేస్తూ, భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులకు తగినట్టుగా ఎలా ఉండాలో నేర్చుకున్నామన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన భారతదేశపు కీలక పథకం ప్రధాన్ మంత్రి ఆత్మ నిర్భర్ స్వస్థ్య భారత్ యోజన గురించి ఆయన మాట్లాడారు. దీని కింద ఆరోగ్య రంగ బడ్జెట్ కేటాయింపులు పెంచటం ద్వారా ఆరోగ్య పరిరక్షణ సేవలు పెరిగాయన్నారు. ప్రజారోగ్య మౌలిక సదుపాయాల పెంపుకు, వ్యాధులమీద నిఘా పెంపుకు, మహమ్మారి జబ్బులకు స్పందించే వేగం పెంచుకోవటానికి ఈ బడ్జెట్ ఉపయోగపడుతోందన్నారు.

ఈ కృషి మొత్తం భారత్ ను స్వయం సమృద్ధ భారత గా మార్చాలన్న లక్ష్యానికి చేరువ చేస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఒక ఉమ్మడి లక్ష్యం కోసం సమన్వయంతో కృషి చేసే వెసులుబాటు కల్పిస్తుందన్నారు. జీవ వైద్య పరిశోధన, జీవ రక్షణ విధానాలు, ఆహార, ఔషధ భద్రత పెంపుదలకోసం తీసుకునే చర్యల గురించి చెప్పారు. పిపిఇ కిట్లు, ఎన్ 95 మాస్కులు తదితర వైద్య వస్తువుల స్వదేశీ ఉత్పత్తి సాధించటంలో భారత్ స్వయం సమృద్ధతని ప్రస్తావించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సహకార వల్లనే ఇది సాధ్యమైందని, ఆర్థికమంత్రిత్వశాఖతో కలిసి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ  మేకిన్ ఇండియా కింద స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించటంలో అవరోధాలు తొలగించటానికి కృషిచేస్తున్నాయన్నారు.

****(Release ID: 1653104) Visitor Counter : 123