PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 04 SEP 2020 6:08PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • భారత్‌లో 30 లక్షల స్థాయిని అధిగమించిన కోలుకునే రోగుల సంఖ్య.
  • ప్రస్తుతం వెంటిలేటర్లపై 0.5 శాతంలోపు, ఐసీయూలలో 2 శాతం దిగువన, ఆక్సిజన్ మద్దతుతో 3.5 శాతంకన్నా తక్కువ సంఖ్యలో రోగులు.
  • కోవిడ్‌-19 బాధితులలో కోలుకునేవారి సగటు 77.15 శాతం.
  • ప్రస్తుత క్రియాశీల కేసులు (8,31,124) తగ్గడంతోపాటు నమోదిత మొత్తం కేసులలో 21.11 శాతానికి మాత్రమే పరిమితం.
  • దేశంలో వరుసగా రెండోరోజు 11.70 లక్షలకుపైగా నమూనాల పరీక్ష.
  • రోజువారీ నిర్ధారిత కేసులు 7.5 శాతంలోపు... మొత్తం నిర్ధారిత కేసులు 8.5 శాతంకన్నా తక్కువ.

దేశంలో కోలుకునే కోవిడ్‌ బాధితుల సంఖ్యలో పెరుగుదలతో వ్యాధి నయమైన వారి సంఖ్య 30 లక్షలకు మించి నమోదు

భారత్‌లో కోవిడ్‌ మరణాల సగటు ప్రపంచ సగటుకన్నా తక్కువగా ఉండటమేగాక రోజురోజుకూ తగ్గటంతోపాటు (ప్రస్తుతం 1.74 శాతమే) ప్రస్తుతం చికిత్స పొందే కేసులలోనూ వెంటిలేటర్లపై ఉన్నవి 0.5 శాతంకన్నా తక్కువ కావడం విశేషం. అంతేకాకుండా తాజా గణాంకాల ప్రకారం ఐసీయూలలో ఉన్న రోగులు 2 శాతం కాగా, మరో 3.5 శాతం మాత్రమే ప్రాణవాయు మద్దతుతో చికిత్స పొందుతున్నారు. పటిష్ఠ చర్యల ఫలితంగా భారతదేశంలో కోలుకునేవారి సంఖ్య నిత్యం పెరుగుతూ వరుసగా 8వ రోజు 60వేల స్థాయినిదాటి గత 24 గంటల్లో 66,659గా నమోదైంది. తద్వారా వ్యాధి నయమయ్యేవారి జాతీయ సగటు 77.15 శాతానికి దూసుకెళ్లింది. దీంతో ప్రస్తుత, కోలుకునే కేసుల మధ్య అంతరం బాగా పెరుగుతూ నేడు 22 లక్షల స్థాయిని దాటింది. దీంతో ప్రస్తుతం దేశంలో క్రియాశీల (8,31,124 చురుకైన వైద్య పర్యవేక్షణ) కేసులు పరిమిత స్థాయిలో ఉండగా, మొత్తం నమోదైన కేసులలో కేవలం 21.11 శాతానికి పరిమితమయ్యాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1651299

కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో భారత్‌ ఉన్నత శిఖరారోహణ; వరుసగా రెండోరోజు 11.7 లక్షలకు మించి నమూనాల పరీక్ష; అత్యధిక పరీక్షలు జరిగినా నిర్ధారిత కేసులు 7.5 శాతంకన్నా... మొత్తం కేసుల సగటు 8.5 శాతంకన్నా తక్కువ.

భారత్‌లో రోజువారీ 10 లక్షల పరీక్షల సామర్థ్య సాధన సంకల్పాన్ని అధిగమించిన నేపథ్యంలో వరుసగా రెండోరోజు సరికొత్త శిఖరాలను అధిరోహించింది. ఈ మేరకు రెండు రోజులలో 11.7 లక్షల స్థాయిని అధిగమించిన నేపథ్యంలో గత 24 గంటల్లో 11,69,765కు చేరింది. రోజువారీ పరీక్షలను ఇంత భారీస్థాయికి పెంచిన దేశం ప్రపంచంలో మరేదీ లేదు. దీంతో ఇవాళ్టిదాకా పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 4.7 కోట్లు (4,66,79,145) దాటింది. దేశంలో కోవిడ్‌ పరీక్షల సంఖ్య ఇంత భారీస్థాయికి పెరిగినప్పటికీ నిర్ధారిత కేసుల సగటు 7.5 శాతంకన్నా తక్కువగానూ, ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సగటు 8.5 శాతంకన్నా తక్కువగానే ఉండటం విశేషం. ఇక దేశంలో కోవిడ్‌ మరణాల సగటును 1 శాతంకన్నా దిగువకు తగ్గించే కృషిలో భాగంగా ఇవాళ మరింత పతనమై 1.74 శాతానికి పరిమితం కావడంతోపాటు వేగంగా దిగివస్తోంది. దేశంలో పరీక్ష సదుపాయాలు కూడా వేగంగా పెరుగుతూ ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 1025, ప్రైవేటు రంగంలో 606 వంతున మొత్తం 1631 ప్రయోగశాలలు ప్రజలకు అందుబాటులోఉన్నాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1651229

ఐపీఎస్‌ ప్రొబేషనర్లతో ప్రధానమంత్రి సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ‘సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు అకాడమీ’లో “శిక్షణ సమాపన కవాతు” సందర్భంగా ఐపీఎస్‌ ప్రొబేషనర్లతో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సంభాషించారు. అకాడమీ నుంచి ఉత్తీర్ణులైన యువ ఐపీఎస్ అధికారులతో తాను క్రమం తప్పకుండా సంభాషించేవాడినని, అయితే ఈ ఏడాది కరోనావైరస్ కారణంగా కలవలేకపోయానని ప్రధానమంత్రి చెప్పారు. “కానీ, నా పదవీకాలం పూర్తయ్యేలోగా నేను కచ్చితంగా మిమ్మల్నందర్నీ ఏదో ఒక సమయంలో కలుస్తాను” అన్నారు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన ఐపీఎస్ ప్రొబేషనర్లను ఆయన అభినందించారు. ముఖ్యంగా ఖాకీ యూనిఫాం ఇచ్చిన అధికారంతో దర్పం ప్రదర్శించకుండా దాన్ని ధరించినందుకు గర్వించాలని సూచించారు. మీ ఖాకీ యూనిఫాంపై ఎన్నడూ గౌరవాన్ని వీడకండి. ఈ కోవిడ్-19 సమయంలో పోలీసుల సేవాభావంవల్ల ఖాకీ యూనిఫాంలోని మానవీయ కోణం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1651326

యూఎస్-ఐఎస్‌పీఎఫ్‌ భారత-అమెరికా సదస్సు-2020లో ప్రధానమంత్రి ప్రత్యేక కీలకోపన్యాసం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న భారత-అమెరికా సదస్సు-2020లో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ప్రత్యేక కీలకోపన్యాసం చేశారు. కోవిడ్‌ ప్రపంచ మహమ్మారి ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసిందని, తద్వారా మన సహనశీలతకు, ప్రజారోగ్య-ఆర్థిక వ్యవస్థలకు పరీక్ష పెట్టిందని ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ నేపథ్యంలో సరికొత్త ఆలోచనా ధోరణివైపు మళ్లాల్సిన అవసరాన్ని ప్రస్తుత పరిస్థితి సూచిస్తోందని పేర్కొన్నారు. ఆ మేరకు మానవ కేంద్రక ప్రగతి సంబంధిత విధానం దిశగా మన ఆలోచనలు పయనించాల్సి ఉందన్నారు. తదనుగుణంగా అందరి మధ్యా సహకార స్ఫూర్తి వెల్లివిరియాలని చెప్పారు. ప్రగతివైపు పయనించే మార్గం గురించి ప్రస్తావిస్తూ- సామర్థ్య వికాసం, పేదలకు భద్రత కల్పన, పౌరులకు భవిష్యత్‌పై భరోసా ఇవ్వడంపై దృష్టి సారించాలని ప్రధాని స్పష్టం చేశారు. కోవిడ్‌పై పోరు దిశగా పౌరులలో అవగాహన పెంచేందుకు తీసుకున్న చర్యలను వివరించారు. అటువంటి ముందస్తు చర్యల ఫలితంగా 130 కోట్ల జనాభాతోపాటు పరిమిత వనరులుగల మన దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు మరణాల సగటు అత్యల్పంగా ఉందని గుర్తుచేశారు. భారత వాణిజ్య సమాజం- ముఖ్యంగా చిన్న వ్యాపారాలు చురుగ్గా ఉండటంపై ఆయన హర్షం ప్రకటించారు. దాదాపు శూన్య స్థితి నుంచి ప్రపంచంలో రెండో అతిపెద్ద పీపీఈ కిట్ల తయారీదారు స్థాయికి దేశాన్ని తీసుకెళ్లారని ప్రశంసించారు. వివిధ సంస్కరణలను ప్రస్తావిస్తూ- 130 కోట్లమంది భారతీయుల ఆకాంక్షలను, ఆశయాలను మహమ్మారి ఏమీ చేయలేకపోయిందని చెప్పారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1651219

యూఎస్-ఐఎస్పీఎఫ్‌ భారత-అమెరికా సదస్సు-2020లో ప్రధానమంత్రి ప్రత్యేక కీలకోపన్యాసం పాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1651221

దేశ ఎగుమతి-దిగుమతులలో సానుకూల ధోరణి కనిపిస్తోంది; వాణిజ్య లోటు తగ్గుతోంది: శ్రీ పీయూష్‌ గోయల్‌

కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఇవాళ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (EPC) కార్యనిర్వాహకవర్గ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశానికి సంబంధించి ప్రపంచ వాణిజ్యం, క్షేత్రస్థాయి పరిస్థితులు, ఎగుమతిదారుల సమస్యలపై వారితో చర్చించారు. భారత ఎగుమతి-దిగుమతులలో సానుకూల ధోరణి కనిపిస్తున్నదని తన ప్రసంగం ప్రారంభిస్తూ పేర్కొన్నారు. కోవిడ్‌ మహమ్మారివల్ల ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎగుమతులు బాగా తగ్గినప్పటికీ ఇప్పుడు నిరుటి స్థాయికి కోలుకుంటున్నాయని చెప్పారు. ఇక దిగుమతులకు సంబంధించి మూలధన వస్తు దిగుమతులు తగ్గలేదు. అయితే, ప్రధానంగా ముడిచమురు, బంగారం, ఎరువుల దిగుమతులు బాగా తగ్గుదల కనిపిస్తోందని చెప్పారు. అలాగే వాణిజ్యలోటు బాగా తగ్గుతూ ప్రపంచ వాణిజ్యంలో భారత్‌ వాటా మెరుగవుతోందని పేర్కొన్నారు. ఇందులో మన సరఫరా గొలుసుల పటిష్ఠత, ఎగుమతిదారుల పట్టుదల, కృషి ప్రధాన పాత్ర పోషించినట్లు ఆయన వివరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1651292

దేశంలో ఖరీఫ్‌ కింద 04.09.2020నాటికి రికార్డు స్థాయిలో 1095.38 లక్షల హెక్టార్లలో పంటల సాగు

దేశంలో ప్రస్తుత ఖరీఫ్‌ కాలానికిగాను రికార్డు స్థాయిలో 1095.38 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటల సాగు నమోదైంది. ఈ మేరకు పప్పు దినుసులు, ముతక ధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు వేయడం ఇప్పటికే పూర్తికాగా, వరినాట్లు ఇంకా కొనసాగుతున్నాయి. కోవిడ్‌-19 ప్రభావం నేపథ్యంలో నేటిదాకా ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం పెరుగుదలకు ఎలాంటి ఆటంకాలూ ఏర్పడలేదు. విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు, యంత్రాలు, రుణపరపతి తదితరాలను కేంద్ర ప్రభుత్వం సకాలంలో అందుబాటులో ఉంచడంవల్ల దిగ్బంధ పరిస్థితుల నడుమ కూడా సాగు విస్తీర్ణం భారీగా పెరగడం సాధ్యమైందని కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమశాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. మరోవైపు ప్రధాన పథకాలను విజయవంతంగా అమలు చేయడంలో కేంద్ర వ్యవసాయ శాఖతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేశాయని శ్రీ తోమర్ పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1651296

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • హర్యానా: కోవిడ్‌-19 మహమ్మారి దిగ్బంధ విముక్తి-4వ దశ మార్గదర్శకాలు వెలువడిన నేపథ్యంలో రాష్ట్రంలో సినిమాల చిత్రీకరణపై హర్యానా ప్రభుత్వం ప్రామాణిక విధాన ప్రక్రియ(SOP)లను జారీ చేసింది. చిత్రీకరణ వ్యవధిని సాధ్యమైనంత కనిష్ఠ సమయానికి పరిమితం చేయాలని ఇందులో స్పష్టం చేసింది. అలాగే 50 మందికి మించి మానవ వనరులను వినియోగించరాదని, పాల్గొనే వారందరికీ థర్మల్ స్కానింగ్‌ నిర్వహించి, లక్షణరహిత వ్యక్తులతో మాత్రమే చిత్రీకరణను అనుమతించాలని పేర్కొంది. చిత్రీకరణ ప్రదేశాలు నియంత్రణ మండళ్ల పరిధిలో, వాటి సమీపంలో ఉండరాదని, సురక్షిత మండలాల్లో మాత్రమే అనుమతులు-ఆమోదాలు ఇస్తామని స్పష్టంచేసింది.
  • పంజాబ్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, సంచార ప్రయోగశాలల్లో ఉచిత ప్రత్యక్ష పరీక్షలను అనుమతించాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ప్రైవేటు వైద్యులు, ఆసుపత్రులలో రూ.250 మించని నామమాత్రపు రుసుము, కనీస మానవ వనరులతో ఇలాంటి పరీక్షలు నిర్వహించడంద్వారా కేసుల పెరుగుదలను నిరోధించాలని సూచించింది. పరీక్ష ఫలితాన్ని తక్షణం కోరేవారు రాపిడ్ యాంటిజెన్ పరీక్షను ఎంచుకోవచ్చు. దీంతోపాటు ఆర్టీ-పీసీఆర్‌ పరీక్ష కూడా అందుబాటులో ఉంటుంది.
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో 214 కొత్త కేసులు, ఒక మరణం నమోదయ్యాయి. దీంతో అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఇప్పటిదాకా మరణించినవారి సంఖ్య 8కి చేరింది.
  • అసోం: రాష్ట్రంలో నిన్న 3054 కొత్త కేసులు నమోదవగా, 1971 మంది కోలుకున్నారు. మొత్తం కేసులు 1,18,333 కాగా, వీటిలో క్రియాశీల కేసులు 27303, మరణాలు 330గా ఉన్నాయి.
  • మణిపూర్: రాష్ట్రంలో 102 కొత్త కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. మణిపూర్‌లో 72శాతం కోలుకునే సగటుతో 167మందికి వ్యాధి నయంకాగా, 1803 మంది చికిత్స పొందుతున్నారు.
  • మిజోరం: రాష్ట్రంలో నిన్న 6 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1046కు చేరింది. అసోం, త్రిపుర సరిహద్దులలో తప్పనిసరి రాపిడ్ యాంటిజెన్ పరీక్షల నిర్వహణను నిలిపివేయాలని మిజోరం ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఇకపై మిజోరంలో ప్రవేశించేవారికి థర్మల్ స్క్రీనింగ్, ఇతర ప్రాథమిక పరీక్ష పద్ధతులు మాత్రమే అమలులో ఉంటాయి.
  • నాగాలాండ్: నాగాలాండ్‌ నుంచి ఆర్టీ-పీసీఆర్ కింద పరీక్ష కోసం మొత్తం 39,769 నమూనాలను, ట్రూనాట్‌ యంత్రాలతో సేకరించిన 23,638 నమూనాలను సేకరించి పరీక్ష కోసం పంపారు.
  • కేరళ: రాష్ట్రంలో నిధి కోసం ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలన్న నిర్ణయాన్ని కేరళ ప్రభుత్వం ఉపసంహరించకపోతే సెప్టెంబర్‌ 10 నుంచి విధులు బహిష్కరిస్తామని జూనియర్ వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు కోవిడ్ ప్రత్యేక చికిత్స కేంద్రాలు, ఇతర ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే 868 మంది ముఖ్యమంత్రికి విజ్ఞాపన పత్రం అందజేశారు. అయితే, జీతం కోత నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోబోదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రంలో నిన్న 1,553 కొత్త కేసులు నమోదవగా ప్రస్తుతం 21,516 మంది చికిత్స పొందుతున్నారు, వివిధ జిల్లాల్లో 1.92 లక్షల మంది నిర్బంధవైద్య పర్యవేక్షణలో ఉండగా ఇప్పటిదాకా మరణించినవారి సంఖ్య 315గా ఉంది.
  • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఇవాళ ఒకేరోజు అత్యధికంగా 20 మరణాలు నమోదయ్యాయి. కాగా, శుక్రవారం ఉదయం 10 గంటలకు ముగిసిన చివరి 24గంటల్లో 591మందికి కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. కాగా, సెప్టెంబర్ 21 నుంచి పదో తరగతి ప్రైవేట్ పరీక్షలకు హాజరయ్యే శారీరక-మానసిక వికలాంగ అభ్యర్థులతోపాటు వారి సహాయకులకు కోవిడ్-19 పరీక్షలు నిర్వహించాలని మద్రాస్ హైకోర్టు పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది. ఇక ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ‘కోవిషీల్డ్ టీకా’ రెండోదశ ప్రయోగ పరీక్షల కోసం చెన్నైకి చేరింది. భారత్‌లో బహుళ-కేంద్రక అధ్యయనంలో భాగంగా ఇక్కడి రాజీవ్‌గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, పోరూర్‌లోని శ్రీ రామచంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చిలో 18 ఏళ్లు పైబడిన 300 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఈ టీకాను ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు.
  • కర్ణాటక: కర్ణాటకలో గురువారం 104 కోవిడ్-19 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 6054కు చేరింది. ఇక బెంగళూరులో మెట్రో రైలు సేవలు సెప్టెంబర్ 7న తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రయాణికులు తమ స్మార్ట్ కార్డులను తిరిగి నింపేందుకు మెట్రో రైల్ కార్పొరేషన్ ఒక అనువర్తనాన్ని ప్రవేశపెట్టనుంది. ఇక రాష్ట్రంలోని జైళ్లలో ఎంతమంది ఖైదీలకు కరోనా సోకిందీ తెలియజేస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. ఇక కోవిడ్‌ నమూనాల పరీక్షను ఆలస్యం చేసే ప్రైవేట్ ప్రయోగశాలలకు జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు. ఆరోగ్యశ్రీ జాబితాలోని అన్ని ఆస్పత్రులలో ‘కోవిడ్ హెల్ప్ డెస్కులు ఏర్పాటుచేయాలని అధికారులకు సూచించారు. కాగా, విశాఖపట్నంలో కోవిడ్  కేసుల సంఖ్య 39,000 స్థాయిని అధిగమించింది. ఇక గుంటూరు జిల్లాలో 40,044 మంది కోవిడ్‌ రోగుల వివరాల నమోదు ఇంకా పూర్తికాకపోవడంపై కలెక్టర్‌ దృష్టి సారించారు. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని నోడల్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 9,583 మంది రోగులు ఇంకా లక్షణ వర్గీకరణ చేయించుకోకపోవడం గమనార్హం.
  • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 2478 కొత్త కేసులు, 10 మరణాలు నమోదవగా, 2011 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 267 జీహెచ్‌ఎంసీ నుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు: 1,35,884; క్రియాశీల కేసులు: 32,994; మరణాలు: 866; డిశ్చార్జి: 1,02,024గా ఉన్నాయి. తెలంగాణలోని ఆరోగ్య సంరక్షణ సిబ్బందిలో కోవిడ్‌ నిర్ధారిత కేసులు 18 శాతంతో అత్యధిక స్థాయిలో ఉన్నాయి. రాష్ట్రంలో 20-50 ఏళ్ల మధ్య వయస్కులలో కోవిడ్‌ వ్యాప్తి అధికంగా ఉన్నందువల్ల అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ఇక తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలకు హాజరయ్యే ఎమ్మెల్యేలతోపాటు పాత్రికేయులకూ తప్పనిసరిగా కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో కాంగ్రెస్ నేత, పశుసంవర్ధక-పాడి అభివృద్ధిశాఖ మంత్రి సునీల్ కేదార్ (59)కు కోవిడ్‌ సోకినట్లు తేలింది. దీంతో మహరాష్ట్ర ప్రగతిశీల సంకీర్ణ ప్రభుత్వంలో ఆరో మంత్రి వ్యాధి సోకినవారి జాబితాలో చేరారు. రాష్ట్రంలో గురువారం 18,105 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 8.43 లక్షలకు చేరాయి. అలాగే ముంబైలో కేసుల సంఖ్య 1.50 లక్షలకు పెరిగింది. కాగా, ఆన్‌లైన్‌ విధానంలో వార్షిక పరీక్షల నిర్వహణకు మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను విశ్వవిద్యాలయాల కులపతి హోదాలో గవర్నర్ భగత్ సింగ్ కోషియారి ఆమోదించారు.
  • గుజరాత్: రాష్ట్రంలో గురువారం 1,325 కొత్త కేసులు నమోదవగా, దేశంలో మొత్తం కేసులు లక్ష దాటిన రాష్ట్రాల జాబితాలో గుజరాత్‌ 11వ స్థానంలో నిలిచింది. ఈ సాయంత్రం 5 గంటలకు ముగిసిన గత 24 గంటల వ్యవధిలో మునుపెన్నడూ లేనంత అధికంగా ఇవాళ కేసులు నమోదయ్యాయి. ఆ మేరకు గుజరాత్‌లో మొత్తం కేసుల సంఖ్య 1,00,375 కాగా, తొలి 25వేల కేసులు 90 రోజుల్లో నమోదైతే కేవలం 23 రోజుల్లో చివరి 25 వేల కేసులు నమోదైనట్లు ఒక విశ్లేషణ పేర్కొంది.
  • రాజస్థాన్: రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులలో కరోనావైరస్ చికిత్సకు రుసుములను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రోజుకు రూ.5,000 నుంచి 9,900కు మించరాదని రాజస్థాన్‌ సర్కారు నిర్దేశించింది. ప్రైవేటు ఆస్పత్రులు అధిక రుసుము వసూలు చేస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, చికిత్స ఖర్చులో ఒక పీపీఈ కిట్‌ వ్యయం రూ.1,200గా నిర్ణయించింది. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 16,067 క్రియాశీల కేసులున్నాయి.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో ఇవాళ ఒకేరోజు అత్యధికంగా 1,672 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 68,586కు చేరింది. ఈ మేరకు ఇండోర్‌ 259, గ్వాలియర్‌ 246, భోపాల్‌ 198, జబల్‌పూర్‌ 129 కేసుల వంతున నమోదయ్యాయి. కాగా, ఇండోర్‌లో మొత్తం కేసుల సంఖ్య 13,752కు చేరింది.


(Release ID: 1651445) Visitor Counter : 182