ప్రధాన మంత్రి కార్యాలయం
యుఎస్-ఐఎస్ పిఎఫ్ అమెరికా ఇండియా శిఖరాగ్ర సమావేశం -2020నుద్దేశించి ప్రధాని కీలక ఉపన్యాసం
Posted On:
03 SEP 2020 9:29PM by PIB Hyderabad
భారతదేశానికి, అమెరికాకు చెందిన అతిథులందరికీ నమస్తే
స్నేహితులారా,
అమెరికా, భారతదేశ శిఖరాగ్ర సమావేశం -2020కోసం యుఎస్ -ఐఎస్ పిఎఫ్ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి విభిన్న రంగాల అతిథులు రావడం చాలా సంతోషంగా వుంది. భారతదేశం, అమెరికా దేశాల మధ్యన సాన్నిహిత్యాన్ని మరింత పెంపొందించడానికిగాను యుఎస్ - ఐఎస్ పి ఎఫ్ చేస్తున్న కృషి అభినందనీయం.
నాకు చాలా సంవత్సరాలుగా జాన్ ఛాంబర్స్ తెలుసు. భారతదేశంపై ఆయనకున్న ఆప్యాయత చాలా బలమైనది. కొన్ని సంవత్సరాల క్రితం మన దేశం ఆయనకు పద్మశ్రీ అవార్డునిచ్చి సత్కరించింది.
స్నేహితులారా,
ఈ ఏడాది ఏర్పాటు చేసుకున్న ప్రధాన అంశం చాలా సముచితమైంది. నూతన సవాళ్ల మధ్యన ప్రయాణం అనేది ఈ ఏడాది ప్రధాన అంశం. ఇప్పుడున్న సవాళ్లు వస్తాయని.... ఈ ఏడాది ప్రారంభంలో ఎవరైనా ఊహించారా? ప‌్రపంచవ్యాప్తంగా మహమ్మారి వైరస్ అందరిమీదా ప్రభావం చూపింది. ఇది మన ఓపికను, ప్రజా ఆరోగ్య వ్యవస్థలను, ఆర్ధిక వ్యవస్థలను పరీక్షిస్తోంది.
ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ పరిస్థితినుంచి బైటడడానికిగాను సరికొత్త ఆలోచనా విధానం కావాలి. ఈ విధానమనేది ఎలా వుండాలంటే మనం సాధించే అభివృద్ధి మానవీయత కేంద్రంగా వుండాలి. అందరి మధ్యనా సహకార స్ఫూర్తి వెల్లివిరియాలి.
స్నేహితులారా,
మన ముందున్న మార్గంవైపు చూసినప్పుడు మన సామర్థ్యాలను పెంచుకుంటూనే దేశంలోని పేద ప్రజలకు భద్రత కల్పిస్తూ మన పౌరుల భవిష్యత్తు దృఢంగా వుండేలా చూసుకోవాలి. ఇదే మార్గంలో ఇప్పుడు భారతదేశం ప్రయాణం చేస్తోంది. లాక్ డౌన్లకు సంబంధించి బాధ్యతాయుతమైన వ్యవస్థను తయారు చేసిన దేశాల్లో ఇండియా మొదటి వరసలో వుంది. ప్రజారోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మాస్కులు, ముఖాన్ని కప్పి వుంచే కవరింగుల గురించి భారతదేశం మొదటగా ప్రచారం చేసింది. భౌతిక దూరం గురించి ప్రారంభంలోనే తగిన చైతన్యం పెంచిన దేశాల్లో భారతదేశం ఒకటి. రికార్డు సమయంలోనే దేశంలోని వైద్య ఆరోగ్య మౌలిక వసతులను పెంచుకోవడం జరిగింది. కోవిడ్ ఆసుపత్రులు, ఐసియు సామర్థ్యాలు ఇంకా అనేకం తక్కువ సమయంలోనే కావాల్సినన్ని ఏర్పాటు చేసుకున్నాం. జనవరి నెలలో దేశంలో ఒక పరీక్షా కేంద్రం మాత్రమే వుండేది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 1600 ల్యాబులను ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ఈ కృషి కారణంగా భారతదేశంలో ప్రతి పది లక్షల మంది జనాభాను తీసుకున్నప్పుడు తక్కువ మరణాలు నమోదు అవుతున్నాయి. 1.3 బిలియన్ జనాభా కలిగిన దేశంలో తక్కువ వనరుల సాయంతో ఈ ఫలితాలు పొందడం జరిగింది. ఇక రికవరీ రేటుకూడా స్థిరంగా పెరుగుతోంది. మా వ్యాపార వర్గాలు ముఖ్యంగా చిరు వ్యాపారాలకు చెందినవారు ఉత్సాహంతో పని చేస్తున్నారు. దాదాపుగా ఏమీ లేని స్థితినుంచి ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1 పిపిఇ కిట్ల తయారీదారులుగా వారు అవతరించారు.
సవాళ్లకే సవాళ్లు విసిరి బలమైన శక్తిగా అవతరించాలనే భారతదేశ స్ఫూర్తికి అనుగుణంగా ఇదంతా జరుగుతోంది. గత కొన్ని నెలలుగా భారతదేశం కోవిడ్ తో పోరాటం చేస్తోంది. ఇంకా ఈ మధ్యకాలంలో వరదలు వచ్చాయి. తుఫాన్లు వచ్చాయి. మిడతల దండు దాడి చేసింది. అయితే ఈ సమస్యలనేవి ప్రజలను మరింత బలోపేతం చేశాయి.
స్నేహితులారా,
భారతదేశంలో కోవిడ్ -19 ప్రభావం మొదలైనప్పటినుంచీ, లాక్ డౌన్ విధించినప్పటినుంచీ ఈ సమయమంతా తీసుకుంటే ఒక విషయంలో మేం చాలా స్పష్టంగా వున్నాం. అందేంటంటే పేదలకు తగిన భద్రత కల్పించడం. ప్రపంచంలోనే మొదటిసారిగా భారతదేశంలో అమలు చేసిన అతి పెద్ద సహాయక కార్యక్రమం గరీబ్ కళ్యాణ్ యోజన. ఈ పథకం ద్వారా 800 మిలియన్ ప్రజలకు ఆహారధాన్యాలు అందించగలిగాం. ఇది ఎనిమిది నెలలపాటు విస్తరించిన పథకం. 800 మిలియన్ ప్రజలంటే అమెరికా జనాభాతో పోలిస్తే రెండింతలకంటే ఎక్కువ. 80 మిలియన్ కుటుంబాలకు ఉచితంగా వంట గ్యాస్ అందించడం జరుగుతోంది. 345 మిలియన్ల రైతులు, పేదలకు నగదు సాయం చేయడం జరిగింది. ఈ పథకం దేశంలోని వలస కార్మికులకు అవసరమైన ఉపాధిని అందించింది. దాదాపు 200 మిలియన్ పని దినాలను కల్పించడంద్వారా వారికి ఉపాధిని అందించాం.
స్నేహితులారా,
కోవిడ్ మహమ్మారి వైరస్ అనేక రంగాలను ప్రభావితం చేసింది. అయితే ఇది 1.3 బిలియన్ భారతీయుల ఆకాంక్షలను, లక్ష్యాలను ప్రభావితం చేయలేదు. ఈ మధ్యకాలంలో మేం అనేక సంస్కరణలు చేశాం. వ్యాపార నిర్వహణ సులువుగా జరిగేలా చూడడానికి, రెడ్ టేపిజం లేకుండా చేయడానికి సంబంధించిన సంస్కరణలివి. దేశంలోనే అత్యంత పెద్దదైన గృహనిర్మాణ కార్యక్రమానికి సంబంధించిన పని చాలా వేగంగా కొనసాగుతోంది. పున: వినియోగ ఇంధన శక్తి కలిగిన మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నాం. రైలు, రోడ్డు, విమానమార్గాలను బలోపేతం చేస్తున్నాం. జాతీయ డిజిటల్ ఆరోగ్య కార్యక్రమాన్ని నిర్మించడంకోసం భారత దేశం ఒక ప్రత్యేకమైన డిజిటల్ మోడల్ ను తయారు చేస్తోంది.ఆర్ధికరంగంలో ఉత్తమమైన సాంకేతికతను ఉపయోగిస్తూ బ్యాంకుల సేవలనందిస్తున్నాం. క్రెడిట్, డిజిటల్ చెల్లింపులు, బీమా సౌకర్యాలను, సేవలను లక్షలాదిమందికి అందిస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నిటినీ అంతర్జాతీయ స్థాయి సాంకేతికత, విధానాల సాయంతో నిర్వహిస్తున్నాం.
స్నేహితులారా,
ప్రపంచ సరఫరా వ్యవస్థలను అభివృద్ధి చేయాలనే నిర్ణయం కేవలం ధరల మీద ఆధారపడి తీసుకోవద్దని ఈ మహమ్మారి సమస్య ప్రపంచానికి తెలియజేసింది. ఈ నిర్ణయాలు నమ్మకం మీద కూడా ఆధారపడి తీసుకోవాలి. భౌగోళికమైన అందుబాటుతోపాటు, విశ్వసనీయత, విధానపరమైన సుస్థిరతలకోసంకూడా నేడు కంపెనీలు చూస్తున్నాయి. ఈ అన్ని గుణాలను కలిగిన దేశం భారతదేశం.
ఈ ప్రత్యేకతల కారణంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో భారతదేశం ముందు వరసలో వుంది. అలాంటి దేశాల్లో ప్రధానమైన దేశంగా నిలిచింది. అమెరికా కావచ్చు, గల్ఫ్ దేశాలు కావచ్చు, యూరప్ లేదా ఆస్ట్రేలియా కావచ్చు..మొత్తం ప్రపంచమే భారతదేశంపట్ల నమ్మకం కలిగి వుంది. ఈ ఏడాది భారతదేశానికి 20 బిలియన డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. గూగల్, అమెజాన్, ముబదలలాంటి ప్రతిష్టాత్మక కంపెనీలు దీర్ఘకాలిక ప్రణాళికలతో భారతదేశంలో పని చేస్తున్నాయి.
స్నేహితులారా,
పారదర్శకమైన, అంచనావేయగలిగే పన్ను వ్యవస్థను భారతదేశం అందిస్తోంది. నిజాయితీపరులైన పన్ను చెల్లింపుదారులను మా దేశ పన్ను వ్యవస్థ ప్రోత్సహిస్తోంది. మద్దతు ఇస్తోంది. మా జిఎస్ టి ఏకీకృతంగా వుంది. ఇది ఐటీతో కూడిన పరోక్ష పన్ను వ్యవస్థ. వ్యాపార దివాలాకు సంబంధించిన కోడ్ అనేది మొత్తం ఆర్ధిక వ్యవస్థకు వచ్చే ప్రమాదాన్ని తగ్గించింది. ఇక మేం తీసుకొచ్చిన సమగ్రమైన కార్మిక సంస్కరణలు..ఈ అంశంలో కంపెనీలకు వచ్చే కష్టాలను తొలగించాయి. అంతే కాదు ఈ సంస్కరణలు కార్మికులకు తగిన సామాజిక భద్రతను అందిస్తున్నాయి.
స్నేహితులారా,
వృద్ధిని ముందుకు తీసుకుపోవడంలో పెట్టుబడికి వున్న ప్రాధాన్యతను తప్పుగా అర్థం చేసుకోవద్దు. దీనికి సంబంధించిన డిమాండ్, సప్లయి ఈ రెండు పార్శ్వాలను మేం పరిగణలోకి తీసుకొని ముందుకు వెలుతున్నాం. పన్నుల విషయంలో భారతదేశం ప్రపంచంలోనే అతి తక్కువ పన్నుల దేశంగా గుర్తింపు పొందింది. అంతే కాదు నూతనంగా వచ్చే తయారీ సంస్థలకు మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. వ్యక్తుల ముఖాముఖితో పని లేకుండా పన్ను మదింపు చేసే ఎలక్ట్రానిక్ ప్లాట్ ఫామ్ విధానాన్ని తప్పనిసరి చేశాం. ఇది దీర్ఘకాలికంగా దేశ పౌరులకు మేలు చేస్తుంది. అంతే కాదు పన్ను చెల్లింపుదారుల ఛార్టర్ ఏర్పాటు చేశాం. బాండ్ల మార్కెట్లో నియంత్రణ సంన్కరణలు కొనసాగుతున్నాయి. తద్వారా ఈ రంగంలో పెట్టుబడిదారులకు మెరుగైన అందుబాటు అనేది లభిస్తుంది. మౌలిక సదుపాయాల పెట్టుబడి కొరకు సావరిన్ వెల్త్ ఫండ్స్, పెన్షన్ ఫండ్లకు పన్ను మినహాయింపులు ఇచ్చాం. 2019లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 20 శాతం పెరిగాయి. అంతర్జాతీయంగా ఎఫ్ డి ఐలు 1 శాతం పడిపోయిన సమయంలోనే ఇది జరిగింది. ఇది భారదేశంలోని ఎఫ్ డిఐ వ్యవస్థ విజయాన్ని సూచిస్తోంది. భారతదేశం తీసుకున్న పలు చర్యల కారణంగా దేశానికి మరింత మెరుగైన భవిష్యత్తు వుండబోతున్నది. భారతదేశం చేస్తున్న ఈ కృషి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి కూడా దోహదం చేస్తుంది.
స్నేహితులారా,
ఆత్మనిర్భర్ భారత్ లేదా స్వయం సమృద్ధి భారతదేశ సాధన కోసం 1.3 బిలియన్ భారతీయులు పని చేస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమమనేది స్థానిక ప్రతిభను అంత్జాతీయం చేస్తోంది. భారతదేశానికి వున్న బలాలతో... అంతర్జాతీయంగా ప్రబలశక్తిగా దేశాన్ని తీర్చిదిద్దడానికిగాను ఆత్మనిర్భర్ పని చేస్తోంది. భారతదేశ లక్ష్యం ప్రపంచ సంక్షేమాన్ని కోరుకోవడమే అనే విషయాన్ని పలు సందర్భాల్లో భారతదేశం నిరూపించింది. స్థానికంగా మాకు భారీ స్థాయిలో అవసరాలు వున్నప్పటికీ ప్రపంచ బాధ్యతలను భారతదేశం ఏనాడూ విస్మరించలేదు. జెనరిక్ మందుల ఉత్పత్తికి సంబంధించి ప్రపంచంలోనే ముందువరసలో వుండే దేశంగా బారతదేశం నిలిచింది. ఈ పని చేయడంద్వారా ప్రపంచానికి కావలసిన మందులను క్రమం తప్పకుండా సరఫరా చేస్తున్నాం. కోవిడ్ -19 టీకా తయారు చేసే పరిశోధనల్లో కూడా భారతదేశం ముందు వరసలో వుంది. స్వయం సమృద్ధి, శాంతియుత భారతదేశం.. మెరుగైన ప్రపంచసాధనకోసం పని చేస్తుంది.
ప్రపంచ స్థాయి వ్యవస్థలను తీసుకుంటే వీటిలో భారతదేశం ప్రధానంగా వుండడానికిగాను ఆత్మనిర్భర్ భారత్ దోహదం చేస్తోంది. ఇది స్తబ్దుగా వున్న భారతీయ మార్కెట్లను క్రియాశీలకమైన తయారీ కేంద్రంగా మార్చడానికి సంబంధించినది.
స్నేహితులారా,
ముందు ముందు మన ముందున్న మార్గంలో అనేక అవకాశాలున్నాయి. ఇవి ప్రభుత్వ,ప్రైవేటు రంగాల్లో వున్నాయి. ఈ అవకాశాలు ప్రధానమైన ఆర్ధిక రంగాలనుంచి, సామాజిక రంగాలనుంచి రాబోతున్నాయి. ఈ మధ్యకాలంలో అందుబాటులోకి వచ్చిన రంగాలు బొగ్గు, గనులు, రైల్వేలు, రక్షణ, అంతరిక్షం, అణుశక్తి.
మొబైల్, ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాలు, ఫార్మా రంగాల్లో ఉత్పత్తి సంబంద ప్రోత్సాహక పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. వాటికి చక్కటి ఆదరణ లభించింది. ఇతర ప్రధానమైన రంగాలకోసం కూడా అలాంటి పథకాలను తయారు చేయడం జరుగుతోంది. వ్యవసాయరంగ మార్కెట్ రంగంలో సంస్కరణలు, వ్యవసాయరంగంలో ఆర్ధిక సాయానికి సంబంధించిన 14 బిలియన్ అమెరికా డాలర్ల కేటాయింపులు అనేక అవకాశాలను తీసుకురాబోతున్నాయి.
స్నేహితులారా,
భారతదేశంలోని సవాళ్లకు సంబంధించి తీసుకుంటే, పని చేసి ఫలితాలను సాధించడాన్ని నమ్మే ప్రభుత్వం ఈ దేశంలో వుంది. సులువుగా వ్యాపార నిర్వహణ ఎంత ముఖ్యమో సులువుగా జీవనం కొనసాగించడం కూడా అంతే ముఖ్యమని ప్రభుత్వం భావిస్తోంది. 35 సంవత్సరాలకంటే తక్కువ వయస్సుగల జనాభా దేశంలో 65శాతం వుంది. దేశాన్ని నూతన శిఖరాలకు తీసుకుపోయే ఆకాంక్షలతో కూడిన భారతదేశాన్ని మీరు చూస్తున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భమిది. నేడు దేశంలో రాజకీయ సుస్థిరత వుంది. అవరోధాలు లేకుండా విధానాలు కొనసాగుతున్నాయి. ప్రజాస్వామ్యం, భిన్నత్వం కలిగి నిబద్దతతో పని చేసే దేశం ఇప్పుడు మీ ముందు కనిపిస్తోంది.
ఈ ప్రయాణంలో భాగస్వాములు కావడానికి మీకు ఇదే ఆహ్వానం.
అందరికీ కృతజ్ఙతలు తెలియజేసుకుంటూ...
******
(Release ID: 1651221)
Visitor Counter : 224
Read this release in:
Tamil
,
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam