ప్రధాన మంత్రి కార్యాలయం

యుఎస్-ఐఎస్ పిఎఫ్ కు చెందిన యుఎస్-ఇండియా 2020 శిఖర సమ్మేళనం లో కీలకోపన్యాసం చేసిన ప్రధాన మంత్రి

విదేశీ పెట్టుబడికి భారతదేశం ఒక ఆకర్షణీయ గమ్యంగా మారిందన్న ప్రధాన మంత్రి; ఈ ఏడాది 20 బిలియన్ డాలర్లకు పైగా విదేశీ పెట్టుబడులు భారత్ కు వచ్చినట్లు తెలిపిన ప్రధాన మంత్రి

భౌగోళిక సామర్థ్యాన్ని, విశ్వసనీయత ను, రాజకీయ స్థిరత్వాలను అందిస్తున్న భారతదేశం: ప్రధాన మంత్రి

భారతదేశం పారదర్శకమైన, ఊహలకు అందగల పన్ను వ్యవస్థను అందిస్తోంది; నిజాయతీపరులైన పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించి, అవసరమైన మద్దతును అందిస్తోంది: ప్రధాన మంత్రి

కొత్త తయారీ యూనిట్లకు మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తూ భారతదేశాన్ని ప్రపంచంలో అతి తక్కువ పన్నులు గల దేశంగా తీర్చిదిద్దుతున్నాం: ప్రధాన మంత్రి

ఇటీవలి కాలం లో ప్రవేశపెట్టిన దూరగామి సంస్కరణలు వ్యాపారాన్ని సరళతరంగా చేయడంతో పాటు పనిలో జాప్యాన్ని తగ్గించడానికి దోహదపడ్డాయి: ప్రధాన మంత్రి

ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు రెండింటికీ భారతదేశం అపార అవకాశాలు ఉన్నాయి: ప్రధాన మంత్రిPosted On: 03 SEP 2020 9:31PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజున యుఎస్-ఇండియా 2020 శిఖ‌ర సమ్మేళనాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్యమం ద్వారా కీల‌కోప‌న్యాసం చేశారు. 

యుఎస్-ఇండియా వ్యూహాత్మక భాగ‌స్వామ్య వేదిక (యుఎస్ఐఎస్ పిఎఫ్) అమెరికా, భార‌త్  ల మధ్య భాగ‌స్వామ్యాల ఏర్పాటు కు కృషి చేస్తోంది. ఈ సంస్థ లాభాపేక్ష‌ర‌హితంగా పనిచేస్తున్న సంస్థ. 

ఆగ‌స్టు 31న మొదలై 5 రోజుల పాటు సాగుతున్న ఈ శిఖ‌ర సమ్మేళనం లో ‘‘అమెరికా, భార‌త్ ల‌ ముందున్న కొత్త స‌వాళ్లు’’ అనే అంశం ప్ర‌ధాన ఇతివృత్తంగా ఉంది. 

ప్ర‌స్తుతం న‌డుస్తున్న ప్ర‌పంచ స్థాయి మ‌హ‌మ్మారి ప్ర‌తి ఒక్క‌రిని ప్ర‌భావితం చేసింద‌ని, ప్ర‌తికూల‌త‌ల‌ను త‌ట్టుకోగల మన దృఢత్వానికి,  ఆరోగ్య వ్య‌వ‌స్థ‌లు, ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌కు ప‌రీక్ష‌గా నిలిచింద‌ని శ్రీ న‌రేంద్ర‌ మోదీ అన్నారు. ప్ర‌తి ఒక్క‌రి ఆలోచ‌న సరళి మార‌వ‌ల‌సిన అవ‌స‌రాన్ని ఈ ప‌రిస్థితి ఎలుగెత్తి చాటుతోంద‌ని, మానవ కేంద్రీకృత అభివృద్ధి, ప్ర‌తి ఒక్క‌రి లో స‌హ‌కార స్ఫూర్తి నిండవలసిన అవ‌స‌రాన్ని చాటుతోంద‌ని ఆయన అన్నారు.

ప్రస్తుత పరిస్థితిలో దేశం ప్రయాణించే భవిష్యత్ బాట ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, సామర్థ్యాలను పెంచుకోవడం, పేదలకు రక్షణ కల్పించడం, పౌరులను భవిష్యత్కాలానికి సన్నద్ధులను చేయడం మీద భారతదేశం దృష్టి సారించిందన్నారు. 

కోవిడ్ పై పోరాటంలో సామర్థ్యాలను విస్తరించుకునేందుకు, ప్రజలలో చైతన్యాన్ని పెంచడానికి చేపట్టిన చర్యలను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ప్రభుత్వం తొలి దశలోనే తీసుకొన్న అనేక చర్యల వల్ల 130 కోట్ల భారీ జనాభా, పరిమిత వనరులు ఉన్న భారతదేశం లో మృతుల సంఖ్య ప్రపంచంలోనే కనిష్ఠ సంఖ్యలో ఉందన్నారు.

వ్యాపార వర్గాలు, ప్రత్యేకించి చిన్న వ్యాపారాలు, క్రియాశీలంగా వ్యవహరించడం పట్ల ఆయన ఆనందం ప్రకటించారు. ఒక్కటి కూడా తయారుచేయలేని స్థితి నుంచి వారు ఈ రోజున పిపిఇ కిట్ల తయారీలో భారతదేశం రెండో స్థానంలో ఉండేలా చేయగలిగారని అన్నారు. 

ప్రస్తుత సంక్లిష్ట దశలో ప్రభుత్వం చేపట్టిన వివిధ సంస్కరణల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, 130 కోట్ల మంది భారతీయుల ఆశలను, వారి ఆకాంక్షలపై ఈ మహమ్మారి ఏ మాత్రం వ్యతిరేక ప్రభావాన్ని చూపలేకపోయిందన్నారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన దూరగామి సంస్కరణలు వ్యాపార నిర్వహణ ను సరళం చేయడంతో పాటు పనిలో జాప్యాన్ని తగ్గించివేశాయని ఆయన అన్నారు. 

ప్రపంచంలోనే అతి పెద్ద గృహనిర్మాణ కార్యక్రమం, నవీకరణయోగ్య శక్తి సంబంధ మౌలిక సదుపాయాల విస్తరణ పనులు చురుకుగా సాగుతున్నాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. 

రైలు, రోడ్డు, వాయు సంధానాన్ని పెంచుతున్న సంగతి ని కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. 

జాతీయ డిజిటల్ స్వాస్థ్య కార్యక్రమానికి ఒక విశిష్ట డిజిటల్ నమూనాను భారతదేశం రూపొందిస్తోందని ఆయన చెప్పారు.

కోట్లాది మందికి బ్యాంకింగ్, రుణాలు, డిజిటల్ చెల్లింపులు, బీమా సౌకర్యాలను అందించే అత్యుత్తమ ఫిన్- టెక్ నమూనా ను మనం ఉపయోగిస్తున్నామని ఆయన అన్నారు. ప్రపంచ శ్రేణి సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ శ్రేణి అత్యుత్తమ ప్రమాణాలను ఆచరించడం ద్వారానే ఈ చొరవలన్నీ తీసుకోగలిగామని ఆయన చెప్పారు. 

ప్రపంచ సరఫరా వ్యవస్థల నిర్మాణం కేవలం వ్యయాల ఆధారంగానే ఉండకూడదని ఈ మహమ్మారి నిరూపించిందని శ్రీ మోదీ అన్నారు. నమ్మకం కూడా ఈ వ్యవస్థకు ఉండవలసిన ప్రధాన లక్షణమని ఆయన చెప్పారు. భౌగోళికంగా అందరికీ అందుబాటు వ్యయాల పరిధిలో ఉండడంతో పాటు విశ్వసనీయతపైన, విధానాల కొనసాగింపు పైన దృష్టి పెట్టినట్టు ఆయన తెలిపారు. ఈ లక్షణాలన్నింటిలో సగానికి పైగా ఉన్న లక్షణాలు భారతదేశానికి ఉన్నాయని ఆయన వివరించారు.

అమెరికా కావచ్చు, యూరోప్, ఆస్ట్రేలియా, గల్ఫ్ ప్రాంతం కావచ్చు.. ప్రపంచం యావత్తు భారతదేశాన్ని నమ్ముతోందని ప్రధాన మంత్రి చెప్పారు. ఈ ఏడాది ఇప్పటివరకు 20 బిలియన్ డాలర్లకు పైగా విదేశీ పెట్టుబడులను మనం అందుకున్నామన్నారు.  భారతదేశంలో దీర్ఘకాలిక వ్యాపార ప్రణాళికలను అమలులోకి తీసుకురానున్నట్లు గూగల్, అమెజన్, ముబాడాలా ఇన్వెస్ట్ మెంట్స్ వంటి సంస్థలు ప్రకటించాయని చెప్పారు. 

భారతదేశం పారదర్శకమైన, అందరి ఊహలకు అందుబాటులోనే ఉండే పన్ను వ్యవస్థను కలిగి ఉన్నదని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ నిజాయతీపరులైన పన్ను చెల్లింపుదారులను వ్యవస్థ ఎలా ప్రోత్సహించి, మద్దతు ఇస్తున్నదీ ప్రధాన మంత్రి ప్రస్తావించారు. భారతదేశంలో అమలవుతున్న జిఎస్ టి ఏకీకృత‌మైన, పూర్తిగా సమర్థవంతమైన పరోక్ష పన్నుల వ్యవస్థ అని ఆయన చెప్పారు. 

భారతదేశం అనుసరిస్తున్న ఇన్ సాల్వెన్సీ, దివాలా నియమావళి  యావత్తు ఆర్థిక వ్యవస్థకు రిస్క్ ను తగ్గించిందని శ్రీ మోదీ చెప్పారు. అలాగే యాజమాన్యాలపై కట్టుబాటు భారాన్ని తగ్గిస్తూనే, కార్మికులకు సామాజిక భద్రతను అందించే సమగ్ర కార్మిక సంస్కరణలను గురించి కూడా ఆయన సవివరంగా ప్రస్తావించారు.

వృద్ధిని ఉద్దీపింపచేయడంలో, డిమాండు, సరఫరా వ్యవస్థ సమర్థ నిర్వహణలో పెట్టుబడుల ప్రాధాన్యాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ప్రపంచంలో పన్నులు తక్కువగా ఉన్న దేశాలలో భారతదేశాన్ని కూడా ఒక దేశంగా నిలపడంతో పాటు కొత్త తయారీ యూనిట్లకు ప్రోత్సాహకాలను అందించడం ద్వారానే దీనిని సాధించగలిగినట్లు ఆయన చెప్పారు. 

ఇ-ప్లాట్ ఫార్మ్ (e- platform) పునాదిగా రూపొందించిన ఫేస్ లెస్ అసెస్ మెంట్ విధానాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, పౌరులకు, పన్ను చెల్లింపుదారులకు సహాయకారిగా ఉండడంలో దీర్ఘ కాలం పాటు అది ఆధారపడదగిందిగా ఉంటుందన్నారు. బాండ్ మార్కెట్ లలో నిరంతరాయంగా చేస్తున్న సంస్కరణల వల్ల పెట్టుబడిదారులందరికీ వాటి లభ్యత ఎంతగానో మెరుగుపడిందని ఆయన అన్నారు. 

ప్రపంచవ్యాప్తంగా ఎఫ్ డిఐలు ఒక శాతం క్షీణించిన దశలో సైతం 2019 సంవత్సరంలో భారతదేశంలోకి ఎఫ్ డిఐల రాక 20 శాతం వృద్ధి చెందిందని, మన ఎఫ్ డిఐ వ్యవస్థ విజయాన్ని ఇది సూచిస్తోందని ప్రధాన మంత్రి వివరించారు. 

రేపటి భవిష్యత్తు ఉజ్వలంగా, అత్యంత సుసంపన్నంగా ఉండేందుకు పై చర్యలన్నీ దోహదపడతాయని శ్రీ మోదీ చెప్పారు. అదే సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠతకు కూడా అవి దోహదపడతాయని ఆయన చెప్పారు.

130 కోట్ల మంది భారతీయులు ఆత్మనిర్భర్ భారత్ లేదా స్వయం సమృద్ధియుత భారత్ దిశగా పయనించేందుకు చేపట్టిన ప్రయాణాన్ని గురించి ప్రస్తావించిన ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం స్థానిక తయారీని ప్రపంచ శ్రేణి ఉత్పత్తులతో విలీనం చేస్తుందని, ఫలితంగా భారతదేశం బలాలు ప్రపంచ శక్తిని రెండింతలు చేస్తాయని చెప్పారు. 

చలనరహిత స్థితి నుంచి క్రియాశీల మార్కెట్ గా పరివర్తన చెందడం వల్ల ప్రపంచ విలువ ఆధారిత వ్యవస్థలకు తయారీ కేంద్రంగా భారతదేశం మారడానికి అవి దోహదపడ్డాయని ఆయన అన్నారు. రాబోయే కాలం లో ప్రభుత్వ రంగానికి, ప్రైవేటు రంగానికి  పరిపూర్ణమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ప్రధాన మంత్రి చెప్పారు. ప్రధానంగా బొగ్గు, గనుల తవ్వకం, రైల్వేలు, రక్షణ, అంతరిక్షం, అణు శక్తి రంగాలను పెట్టుబడుల కోసం సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు.

వ్యవసాయ రంగంలో సంస్కరణలతో పాటు మొబైల్, ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాలు, ఔషధాల తయారీ రంగాల కోసం ప్రకటించిన ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు.

ఫలితాలు అందించడంపై నమ్మకం గల, ప్రత్యేకించి వ్యాపార సరళీకరణతో పాటు జీవన సరళీకరణపై విశ్వాసం గల ప్రభుత్వం భారతదేశంలో ఉందని ప్రధాన మంత్రి ఈ శిఖర సమ్మేళనం దృష్టికి తీసుకువచ్చారు. 

భారతదేశం ఆకాంక్షలతో నిండిన, జాతిని కొత్త శిఖరాలకు నడిపించాలన్న సంకల్పం ఉన్న 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన 65 శాతం మంది యువ జనాభా కు నిలయం అయిన దేశం అని ఆయన అభివర్ణించారు. అలాగే రాజకీయ స్థిరత్వం, రాజకీయ కొనసాగింపు గల, ప్రజాస్వామ్యానికి, భిన్నత్వానికి కట్టుబడ్డ దేశం భారతదేశం అని ఆయన చెప్పారు.


***(Release ID: 1651219) Visitor Counter : 235