PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 31 JUL 2020 6:27PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • డాక్టర్‌ హర్షవర్ధన్‌ అధ్యక్షతన కోవిడ్‌-19పై మంత్రుల బృందం 19వ సమావేశం.
  • భారత్‌లో కోవిడ్‌ నుంచి కోలుకునేవారి జాతీయ సగటు 64.54 శాతానికి పెరుగుదల.
  • గత 24 గంటల్లో 6,42,588 పరీక్షలతో సరికొత్త రికార్డు; దేశంలో ఇప్పటిదాకా 1.88 కోట్లకుపైగా నమూనాల పరీక్ష.
  • మరణాలు స్థిరంగా తగ్గుతూ 2.18 శాతానికి పతనం; ప్రపంచంలో అత్యల్ప మరణశాతంగల  దేశాల జాబితాలో కొనసాగుతున్న భారత్‌.
  • పరిశ్రమలకు రుణ పునర్వ్యవస్థీకరణ అవసరంపై రిజర్వు బ్యాంకుతో కలసి కేంద్ర ప్రభుత్వ చర్యలు.
  • కోవిడ్‌ కారణంగా కోల్‌ ఇండియా ఉద్యోగులు మరణిస్తే- ప్రమాద మృతిగా పరిగణన.

డాక్టర్‌ హర్షవర్ధన్‌ అధ్యక్షతన కోవిడ్‌-19పై మంత్రుల బృందం 19వ సమావేశం; గత 24 గంటల్లో 6,42,588 నమూనాల పరీక్షతో సరికొత్త రికార్డు

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా కోవిడ్‌-19పై ఉన్నత స్థాయి మంత్రుల బృందం (GoM) 19వ సమావేశానికి అధ్యక్షత వహించారు. దేశంలో కోవిడ్‌-19 నుంచి కోలుకున్నవారి సంఖ్య 10 లక్షల మైలురాయిని అధిగ‌మించిందని, ఆ మేర‌కు కోలుకునేవారి జాతీయ స‌గ‌టు 64.54 శాతంగా న‌మోదైనట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తదనుగుణంగా ప్రస్తుతం వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న కేసుల సంఖ్య ప్రస్తుతం 33.27 శాతం లేదా మొత్తం కేసులలో కేవలం మూడింట ఒకవంతు మాత్రమేనని చెప్పారు. మరోవైపు మరణాలు స్థిరంగా తగ్గుతూ 2.18 శాతానికి పతనం కావడంతో ప్రపంచంలో అత్యల్ప మరణశాతంగల  దేశాల జాబితాలో భారత్ కొనసాగుతున్నదని వివరించారు. “చికిత్స పొందుతున్న మొత్తం రోగులలో వెంటిలేటర్లపై ఉన్నవారు కేవలం 0.28 శాతమే. అలాగే ఐసీయూ మద్దతుతో చికిత్స పొందేవారు 1.61 శాతం, ప్రాణవాయు సరఫరా పొందేవారు 2.32 శాతంగా ఉన్నారు” అని డాక్టర్‌ హర్షవర్ధన్‌ వివరించారు. దేశంలో రోగ నిర్ధారణ పరీక్ష సదుపాయాలు వేగంగా పెరుగుతుండటాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ మేరకు ప్రస్తుతం (ప్రభుత్వ రంగంలో 911, ప్రైవేటు రంగంలో 420) మొత్తం ప్రయోగశాలల సంఖ్య 1,331కి చేరిందన్నారు. దీంతో రోజువారీ నిర్వహించే పరీక్షల సంఖ్య వేగంగా పెరుగుతూ గడచిన 24 గంటల్లో 6,42,588 నమూనాలను పరీక్షించినట్లు తెలిపారు. తద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా మొత్తం 1.88 కోట్ల రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలకు సంబంధించి, కేంద్ర-రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకూ మొత్తం 268.25 లక్షల N95 మాస్కులు, 120.44 లక్షల పీపీఈలు, 1083.77 లక్షల హెచ్‌సీక్యూ (HCQ) మాత్రలు పంపిణీ చేసినట్లు వివరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1642722

పరిశ్రమలకు రుణ పునర్వ్యవస్థీకరణ అవసరంపై రిజర్వు బ్యాంకుతో కలసి కేంద్ర ప్రభుత్వ చర్యలు: ఆర్థికశాఖ మంత్రి

కోవిడ్‌-19 ప్రభావం నేపథ్యంలో పరిశ్రమలకు రుణ పునర్వ్యవస్థీకరణ అవసరంపై రిజర్వు బ్యాంకుతో కలసి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని కేంద్ర ఆర్థిక-కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఇవాళ భారత వాణిజ్య-పారిశ్రామిక సంఘాల సమాఖ్య (FICCI) జాతీయ కార్యవర్గ సమావేశం (NECM)లో ఆమె ప్రసంగించారు. “పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించాం. ఈ అంశంపై రిజర్వు బ్యాంకుతో ఆర్థికశాఖ సంప్రదిస్తోంది. పునర్వ్యవస్థీకరణ అవసరం ఉందన్న ఆలోచనకు సూత్రప్రాయ ఆమోదం లభించినట్లే”నని శ్రీమతి సీతారామన్‌ తెలిపారు. వాణిజ్య ఒప్పందాల్లో పరస్పర ప్రతిస్పందన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఈ మేరకు శ్రీమతి సీతారామన్ మాట్లాడుతూ-  “మేం మా విపణిలోకి అనుమతించిన దేశాలతో మాత్రమే పరస్పర ఏర్పాట్ల గురించి అడుగుతున్నాం. మా వాణిజ్య సంప్రదింపులలో పరస్పర స్పందనే చాల కీలకాంశం” అని పేర్కొన్నారు. ఇక ఆరోగ్య సంరక్షణ, తదితర ఉత్పత్తులపై జీఎస్టీ రేట్ల తగ్గింపుపై వస్తుసేవల పన్ను మండలి నిర్ణయం తీసుకుంటుందని ఆర్థికమంత్రి చెప్పారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1642701

కోవిడ్‌ కారణంగా కోల్‌ ఇండియా ఉద్యోగులు మరణిస్తే- ప్రమాద మృతిగా పరిగణన

కోల్ ఇండియా ఉద్యోగులెవ‌రైనా క‌రోనా మ‌హ‌మ్మారివల్ల మ‌ర‌ణిస్తే ప్రమాద మృతిగా పరిగణించనున్నట్లు కేంద్ర బొగ్గు-గ‌నులశాఖ మంత్రి శ్రీ ప్ర‌హ్లాద్ జోషి తెలిపారు. తదనుగుణంగా విధినిర్వ‌హ‌ణ‌లో ఉండగా ప్ర‌మాదంలో మ‌ర‌ణిస్తే వారి కుటుంబసభ్యులకు వర్తింపజేసే అన్నిర‌కాల ఆర్థిక ప్ర‌యోజ‌నాలను వ‌ర్తింప‌చేస్తామని చెప్పారు. జార్ఖండ్‌లో ఒక‌రోజు ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. తాజా నిర్ణ‌యం వ‌ల్ల కోల్ ఇండియాలో ప‌నిచేస్తున్న 4 ల‌క్ష‌ల‌మంది రెగ్యుల‌ర్ ఉద్యోగులు, కాంట్రాక్టు వ‌ర్క‌ర్ల‌కు ప్రయోజ‌నం క‌లుగుతుంద‌ని ఈ సందర్భంగా తెలిపారు. అదేవిధంగా ఇప్ప‌టిదాకా కోవిడ్ కారణంగా మ‌ర‌ణించిన ఉద్యోగుల కుటుంబస‌భ్యుల‌కూ ఇది వ‌ర్తిస్తుంద‌ని వివరించారు. “కోవిడ్‌ మ‌హమ్మారి స‌మ‌యంలో కోల్ ఇండియా సిబ్బంది ప్రాణాలు ప‌ణంగా పెట్టి అద్భుతమైన ప‌నితీరు క‌న‌బ‌రిచారు. వారు అలుపెర‌గ‌కుండా అద్భుతంగా కృషి చేస్తున్నారు. అందుకే వారిని నేను సగర్వంగా ‘బొగ్గు యోధులు’గా అభివర్ణిస్తాను. దేశానికి అమూల్య సేవలు చేస్తున్నందుకుగాను ఈ ప్రయోజనాన్ని ప్రకటించాం” అని శ్రీ జోషి తెలిపారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1642501

ఎంఈఐఎస్‌ సమస్యకు సత్వర పరిష్కారం కోసం వాణిజ్య మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది: శ్రీ గోయల్

దేశంలో పారిశ్రామిక ఆమోదాల కోసం ఏకగవాక్ష వ్యవస్థ త్వరలోనే అమలులోకి రానుందని కేంద్ర మంత్రి శ్రీ గోయల్‌ చెప్పారు. స్వయం సమృద్ధ భారతం కోసం వాణిజ్య సౌలభ్యంపై భారత పరిశ్రమల సమాఖ్య (CII) జాతీయ డిజిటల్‌ సదస్సును ఆయన ఇవాళ ప్రారంభించారు. పరిశ్రమలు-ప్రభుత్వం రెండూ భాగస్వాములుగా ముందుకు సాగాలని కోరారు. పన్ను ఎగవేతదారులను, చట్టాలను ఉల్లంఘించేవారిని గుర్తించడంలో ప్రభుత్వానికి తోడ్పడే దిశగా పరిశ్రమ చురుకైన పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ పరిస్థితులపై మాట్లాడుతూ- దేశంలో ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటున్నదని, ఆంక్షలు తాత్కాలికమే కాబట్టి ప్రస్తుతం సడలింపు ఇవ్వబడుతున్నదని మంత్రి చెప్పారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1642353

సీఎస్ఐఆర్ రూపొందించిన‌ కోవిడ్-19 సాంకేతిక ప‌రిజ్ఞానాలు-ఉత్ప‌త్తుల స‌మాహారాన్ని ఆవిష్క‌రించిన డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్

డీబీటీ, సీఎస్‌ఐఆర్‌లకు చెందిన భారత శాస్త్రవేత్తలు వెయ్యికిపైగా సార్స్-కోవ్‌-2 వైర‌స్‌ (SARS-CoV-2) జన్యుక్రమాన్ని సూత్రీకరించినట్లు కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమం, శాస్త్ర-సాంకేతిక‌త‌ శాఖల మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ప్ర‌క‌టించారు. దేశంలోనే ఇది అత్యంత భారీ కృషిగా ఆయ‌న అభివర్ణించారు. “దేశంలో వ్యాప్తిలోగల కోవిడ్-19 వైర‌స్‌ సంబంధిత వివిధ రకాల‌ను, వాటి జన్యుక్రమంలో మార్పుల పట్టికను అర్థం చేసుకోవ‌డానికి వారి కృషి ఉప‌యోగ‌ప‌డుతుంది... తద్వారా రోగనిర్ధారణ, ఔషధాలు, టీకాల రూపకల్పనకు తోడ్పడుతుంది”  అని వివ‌రించారు. సీఎస్ఐఆర్ అభివృద్ధి చేసిన కోవిడ్-19 సాంకేతిక‌ పరిజ్ఞానాలు-ఉత్ప‌త్తుల సంక‌ల‌నాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. సంక్షోభ స‌మ‌యంలో సీఎస్ఐఆర్ స‌మ‌ర్థ‌ంగా ప‌నిచేస్తున్నదని, విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో అతి త‌క్కువ స‌మ‌యంలోనే శాస్త్ర‌వేత్త‌లు, విద్యార్థులు, సిబ్బంది ఈ సాంకేతిక‌త‌లను, ఉత్ప‌త్తులను అందుబాటులోకి తెచ్చారని డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ కొనియాడారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1642499

నిరుటితో పోలిస్తే ఈసారి 13.92 శాతం పెరిగిన ఖరీఫ్‌ పంటల సాగు విస్తీర్ణం

కోవిడ్-19 మహమ్మారి వేళ క్షేత్రస్థాయిలో రైతుల, వ్యవసాయ కార్యకలాపాలకు వెసులుబాటు దిశగా కేంద్ర వ్యవసాయ-సహకార-రైతు సంక్షేమశాఖ అనేక చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్ పంటకాలంలో సాగు విస్తీర్ణంలో సంతృప్తికరమైన ప్రగతి కనిపిస్తోంది. ఈ మేరకు 31.07.2020 నాటికి ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 882.18 లక్షల హెక్టార్లుగా నమోదైంది. నిరుడు ఇదే తేదీనాటికి ఇది కేవలం 774.38 లక్షల హెక్టార్లు మాత్రమే కాగా, ఈ ఏడాది 13.92 శాతం అధిక విస్తీర్ణంలో పంటలు వేశారు. మొత్తంమీద ఖరీఫ్ పంటల సాగుపై కోవిడ్‌-19 ప్రభావం ఏమాత్రం పడలేదు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1642693

కోవిడ్‌-19పై కేరళ ప్రభుత్వ పోరాటంలో ‘ఫ్యాక్ట్‌’ మద్దతు

కేంద్ర రసాయనాలు-ఎరువుల మంత్రిత్వశాఖ పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థ ‘ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెంకోర్‌ లిమిటెడ్‌ (FACT) కేరళలో కోవిడ్‌-19పై పోరాటానికి అండగా నిలిచింది. ఈ మేరకు తమ ప్రధాన ఆడిటోరియం ‘ఎం.కె.కె.నాయర్‌ హాల్‌’ను కోవిడ్‌ తొలి అంచె చికిత్స కేంద్రం (CFLTC)గా వినియోగించుకునేందుకు వీలుగా ఎలూర్‌ పురపాలికకు అప్పగించింది. అంతేగాక అక్కడ 100 పడకలతో చికిత్స కేంద్రం ఏర్పాటు కోసం కార్పొరేట్‌ సామాజిక బాధ్యతకింద మంచాలు, పడకలు తదితర మౌలిక వసతులను సమకూర్చింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1642585

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • కేరళ: రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రులలో కోవిడ్ చికిత్సపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. కేరళలో ‘కారుణ్య’ పథకంలో సభ్యత్వం లేనివారితోపాటు ఇతర ఆరోగ్య బీమా పరిధిలో లేనివారు ఆస్పత్రి ఖర్చులను తామే భరించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని కాసరగోడ్, ఎర్నాకుళం జిల్లాల్లో ఇవాళ చెరొక మరణం సంభవించింది. రాష్ట్రంనుంచి నియంత్రణ జోన్ల వెలుపల దూరప్రాంత బస్సులను కేఎస్‌ఆర్టీసీ రేపటి నుంచి నడుపుతుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి ఎ.కె.శశీంద్రన్ తెలిపారు. ఆ మేరకు పాత టికెట్ ధరతో 206 బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్రంలో నిన్న కొత్తగా 506 కేసులు నమోదవగా, ప్రస్తుతం వివిధ జిల్లా పరిధిలోని ఆస్పత్రులలో 10,056మంది, మరో 1.4 లక్షల మంది పరిశీలనలో ఉన్నారు.
  • తమిళనాడు: రాష్ట్రంలో ఆగస్టు 31 వరకు దిగ్బంధం పొడిగించినప్పటికీ ఆంక్షలను సడలించింది. గ్రామాలు/గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,000కులోపు వార్షికాదాయంగల 20,204 చిన్న ఆలయాలను ప్రజల కోసం తెరవడానికి ప్రభుత్వం అనుమతించింది. కాగా, ఆగస్టు 1 నుంచి ప్రైవేట్ సంస్థలు, ఇతర పరిశ్రమలు 75 శాతం సిబ్బందితో పనిచేసేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే ప్రజా రవాణా సదుపాయాల్లో రోజుకూలీలు, చిన్న వ్యాపారులు, వీధి వర్తకులపైగల నిషేధాన్ని తొలగించింది. కాగా, రాష్ట్రంలో అత్యధికంగా ఒకేరోజు కోవిడ్‌కు బలైనవారి సంఖ్య 97గా నమోదైంది. నిన్న 5864 కొత్త కేసులు నమోదవగా 5295మంది కోలుకున్నారు. ఇప్పటిదాకా మొత్తం కేసులు: 2,39,978; క్రియాశీల కేసులు: 57,962; మరణాలు: 3838; చెన్నైలో యాక్టివ్ కేసులు: 12,735గా ఉన్నాయి.
  • కర్ణాటక: రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి ఇవాళ గవర్నర్‌ను కలుసుకుని, కర్ణాటకలో ప్రస్తుత కోవిడ్-19 స్థితిగతులను వివరించారు. కోవిడ్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. పరీక్షలు వేగవంతం చేయడానికి ఏర్పాట్లు చేయాలని, కోవిడ్‌ నియంత్రణకు ఆయుర్వేదం, హోమియో ఔషధాలను కూడా వాడాలని ముఖ్యమంత్రికి గవర్నర్ సూచించారు. గణేశ ఉత్సవానికి బీబీఎంపీ మార్గదర్శకాలను జారీచేస్తుంది. దిగ్బంధ విముక్తి-3పై కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ఆధారంగా రాష్ట్రం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది, ఇది ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుంది. కాగా, కోవిడ్ రోగులకు 50 శాతం పడకలు కేటాయించిన నగరంలోని 19 ఆసుపత్రుల లైసెన్స్‌లను BBMP రద్దుచేసింది. రాష్ట్రంలో నిన్న 6,128 కొత్త కేసులు, 83 మరణాలు నమోదవగా మరో 3793మంది కోలుకున్నారు. కొత్త కేసులలో బెంగళూరు నగర వాటా 2233గా ఉంది. మొత్తం కేసులు: 1,18,632; క్రియాశీల కేసులు: 69,700; మరణాలు: 2230గా ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్: రహదారి మార్గంలో ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాలనుకునే వారికోసం ఆగస్టు 1నుంచి స్వయంచలితంగా ఇ-పాస్‌ల జారీకి రాష్ట్రం యోచిస్తోంది. రోగులను ఆసుపత్రులు, దిగ్బంధ కేంద్రాలకు మార్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న 108 అంబులెన్స్ సిబ్బందిలో 61 మంది (డ్రైవర్లు, అత్యవసర వైద్య-సాంకేతిక నిపుణులు) కోవిడ్‌ వ్యాధి బారినపడ్డారు. రాష్ట్రంలో నిన్న 10,167 కొత్త కేసులు, 68 మరణాలు నమోదయ్యాయి. మరో 4618 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. మొత్తం కేసులు: 1,30,557; యాక్టివ్‌: 69,252; మరణాలు: 1281; డిశ్చార్జి: 60,024గా ఉన్నాయి.
  • తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రోజువారీ వైద్య సమాచార పత్రం ప్రకారం రాష్ట్రంలోనే అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో 191 నియంత్రణ జోన్లున్నాయి. అయితే, అత్యధికంగా కేసులు నమోదవుతున్న గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 92 జోన్లు మాత్రమే ఉన్నట్లు అధికారికంగా ప్రకటించింది. తెలంగాణలో గత 24 గంటల్లో 1986 కొత్త కేసులు, 14 మరణాలు నమోదవగా 816 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 586 జీహెచ్‌ఎంసీనుంచి నమోదయ్యాయి. ఇప్పటిదాకా  మొత్తం కేసులు: 62,703; యాక్టివ్‌: 16,796; మరణాలు 519; డిశ్చార్జి: 45,388గా ఉన్నాయి.
  • పంజాబ్: రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి, మరణాల నేపథ్యంలో ప్రస్తుత రోగులలో అవసరమైనవారికి ప్లాస్మాను ఉచితంగా అందిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు. ఈ మేరకు కోవిడ్ రోగులకు ప్లాస్మా చికిత్స కోసం ఛార్జీలు వసూలు చేయబడవని, అలాగే ప్లాస్మా కొనుగోలు/విక్రయాలకు ఎవరినీ అనుమతించవద్దని ఆరోగ్యశాఖను ఆయన ఆదేశించారు, కరోనా వైరస్‌కు చికిత్స పనిచేయని పరిస్థితిలో ప్లాస్మాతో చికిత్స ద్వారా ఎంతోమందికి ప్రయోజనం కలిగినట్లు ఆయన గుర్తుచేశారు.
  • హర్యానా: కోవిడ్‌-19 నేపథ్యంలో హర్యానా మహిళా-శిశు అభివృద్ధి విభాగం రాష్ట్రంలోని సహాయ శిబిరాల్లోగల వలస కార్మికులకోసం క్రమం తప్పకుండా కౌన్సెలింగ్, ధ్యానం, యోగా వర్క్‌ షాప్‌లు నిర్వహించింది. అలాగే ఆయా శిబిరాల్లోని పిల్లల కోసం వినోద కార్యక్రమాలు కూడా నిర్వహించాయి. అంతేకాకుండా మాస్కులు, పేపర్ న్యాప్‌కిన్లు, శానిటైజర్లు, శానిటరీ న్యాప్‌కిన్లు, డైపర్లు, సబ్బులతోపాటు 7572 మంది వలస కార్మికులు, 5628 మంది మహిళలు, 11184 మంది పిల్లలకు పంజిరి’, పాలు, పండ్లు, బిస్కెట్లుసహా భోజనం అందిస్తోంది.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో గురువారం 11,147 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4.11 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 8,860 మంది కోలుకోగా, ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1.48 లక్షలుగా ఉంది. తాజాగా 1,208 కేసులతో ముంబై మళ్లీ 1,000 స్థాయిని దాటింది. నగరంలో 20,158 క్రియాశీల కేసులున్నాయి. పుణె పురపాలిక, పుణె పరిసరాల్లో 1,889 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో చెన్నై, బెంగళూరుసహా ఐదు తీవ్ర ప్రభావిత నగరాల్లో మూడు- (ముంబై, థానె, నవీ ముంబై) మహారాష్ట్రలోనే ఉన్నాయి.
  • గుజరాత్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,159 కేసులు నమోదవగా ఒక్కరోజులో ఇదే అత్యధికం కావడం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 60,000 స్థాయిని అధిగమించింది. ఇక 22 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 2,418కి పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 879 మంది కోలుకోగా ఇప్పటిదాకా వ్యాధి నమైనవారి సంఖ్య 44,074కు పెరిగింది. ప్రస్తుతం 13,793 యాక్టివ్‌ కేసులుండగా రాష్ట్రంలో కోలుకునేవారి శాతం నేడు 73.11 శాతంగా నమోదైంది. రాష్ట్రంలోని 100పడకల ఆసుపత్రిలో 5, వందకు మించి పడకలున్న ఆస్ప్రతులలో 10 వంతున పడకలను కోవిడ్ సంరక్షణ సేవలందించే వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇవి ఖాళీగా ఉన్నట్లయితే అప్పుడు వాటిని సాధారణ ప్రజలకు కేటాయించవచ్చు.
  • రాజస్థాన్: రాష్ట్రంలోని అన్ని మత ప్రదేశాలను సెప్టెంబర్ 1 నుంచి తిరిగి తెరుస్తామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ ప్రకటించారు. దీనికి సంబంధించి హోంశాఖ అవసరమైన సూచనలు జారీ చేయనుంది. రాష్ట్రంలో నిన్న 362 కొత్త కేసులతో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 11,319గా ఉంది.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో గురువారం 834 కేసులు నమోదవగా మొత్తం కేసులు 30,968కి చేరాయి. ఇందులో భోపాల్ (233) నుంచి గరిష్ఠంగా నమోదవగా, ఇండోర్ (84), బార్వానీ (73) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
  • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో 256 కొత్త కేసులతో మొత్తం కేసులు 8,856కు చేరగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 2884గా ఉంది.

Image

Image

*****



(Release ID: 1642745) Visitor Counter : 209