PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
29 JUL 2020 6:26PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- కోవిడ్ మరణాలు 2020 ఏప్రిల్ 1నాటితో పోలిస్తే అత్యల్పంగా 2.23 శాతానికి పతనం.
- గత 24 గంటల్లో 35,000 దాటిన కోవిడ్ వ్యాధి నయమైనవారి సంఖ్య; కోలుకునే కేసుల వేగం పెరుగుతూ 10 లక్షల స్థాయికి చేరనున్న సంఖ్య.
- జాతీయ స్థాయిలో కోలుకుంటున్న కోవిడ్ రోగుల సగటు మరింత పెరిగి 64.51 శాతానికి చేరిక.
- ప్రస్తుతం చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న కేసుల సంఖ్య 5,09,447.
- దేశంలో గడచిన 24 గంటల్లో 4.08 లక్షల రోగ నిర్ధారణ పరీక్షలు; ప్రతి పది లక్షల జనాభాకు రోజువారీ పరీక్షల సగటు 12,858కి పెరుగుదల; ఇప్పటిదాకా మొత్తం 1.77 కోట్లకుపైగా నమూనాల పరీక్ష.

భారత్‌లో మరణాలు 2020 ఏప్రిల్ 1తో పోలిస్తే అత్యల్పంగా 2.23 శాతం; 24 గంటల్లో 35,000 మందికి నయం; 10లక్షలకు చేరువగా కోలుకునేవారి సంఖ్య
కోవిడ్-19పై భారత పోరాటంలో “పరీక్ష, అన్వేషణ, చికిత్స” వ్యూహానికి తగినట్లుగా కేంద్ర, రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల సంయుక్త, సమన్వయ కృషి ఫలితంగా ప్రపంచంలో అతిస్వల్ప మరణశాతంగల దేశాల్లో ఒకటిగా భారత్ కొనసాగుతోంది. అంతేగాక మరణాల సంఖ్య వేగంగా తగ్గుతూ ఇవాళ 2.23 శాతానికి పతనం కావడంతో 2020 ఏప్రిల్ 1నాటితో పోలిస్తే అత్యల్పస్థాయి నమోదైంది. ఆ మేరకు కోలుకునేవారి సంఖ్య స్థిరంగా పెరుగుతూ వరుసగా ఆరో రోజు కూడా 30వేల స్థాయినిదాటి, గడచిన 24 గంటల్లో 35,286 మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య వేగంగా 10 లక్షలవైపు పయనిస్తూ నేడు 9,88,029గా నమోదైంది. తదనుగుణంగా కోలుకునేవారి జాతీయ సగటు 64.51 శాతంతో కొత్త రికార్డు నమోదు చేసింది. వ్యాధి నయమయ్యేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నందువల్ల ప్రస్తుతం చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న (5,09,447) కేసులు, కోలుకునే కేసుల వ్యత్యాసం 4,78,582 మేర అధికంగా నమోదైంది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1642153
దేశంలో మొత్తం 1.77 కోట్లకుపైగా నమూనాల పరీక్ష; ప్రతి 10 లక్షల జనాభాకు రోగ నిర్ధారణ పరీక్షల సగటు 12,858కి చేరిక
దేశంలో గడచిన 24 గంటల్లో 4,08,855 రోగ నిర్ధారణ పరీక్షల నిర్వహణతో ప్రస్తుతం ప్రతి పది లక్షల జనాభాకు రోజువారీ పరీక్షల సగటు 12,858కి చేరగా, ఇప్పటిదాకా పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 1.77 కోట్లు దాటింది. దేశంలో ప్రయోగశాలల సంఖ్య కూడా విస్తరిస్తూ నేడు 1,316కు చేరగా ప్రభుత్వ రంగంలో 906, ప్రైవేటు రంగంలో 410 వంతున సేవలందిస్తున్నాయి. కాగా, “కోవిడ్-19 మహమ్మారి – భారత్‌లో పొగాకు వినియోగం” పేరిట కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ ఒక పత్రం విడుదల చేసింది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1642134
మాదకద్రవ్య వినియోగ రుగ్మతలు-ప్రవర్తన వ్యసనాల నిర్వహణ కోసం ప్రామాణిక చికిత్స మార్గదర్శకాలపై పుస్తకాన్ని ఆవిష్కరించిన డాక్టర్ హర్షవర్ధన్
దేశంలో మాదకద్రవ్య దుర్వినియోగం-ప్రవర్తన వ్యసనాల పరిష్కారం లక్ష్యంగా “మాదకద్రవ్య వినియోగ రుగ్మతలు-ప్రవర్తన వ్యసనాల నిర్వహణకు ప్రామాణిక చికిత్స మార్గదర్శకాలు” పేరిట రూపొందించిన ఎలక్ట్రానిక్ పుస్తకాన్ని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ విడుదల చేశారు. కోవిడ్-19 కాలంలో వ్యసనం విసిరే సవాళ్లను పరిష్కరించాల్సిన ప్రాముఖ్యంపై ‘ప్రపంచ ఔషధ నివేదిక-2020’ హెచ్చరిక గురించి ఈ సందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్ వివరించారు. “మునుపటి ఆర్థిక సంక్షోభాల తరహాలోనే కోవిడ్-19 కూడా దుష్ఫలితాలు చూపుతుంది. మాదక ద్రవ్యాలు వాడేవారు చౌకగా లభించే సింథటిక్ పదార్థాలను వాడుతుంటారు; ఆర్థిక మాంద్యంవల్ల పేదలు, వెనుకబడిన వర్గాలవారు మాదకద్రవ్యాల వాడకానికి మారి దుష్ఫలితాలకు లోనవుతారు” అని ఆ నివేదిక పేర్కొంటున్నట్లు తెలిపారుర. అలాగే ధూమపానం కూడా కోవిడ్-19 ముప్పును పెంచుతుందని ఆధారసహితంగా ఉదాహరించారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1642039
ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు బోర్డు గవర్నర్ల 5వ వార్షిక సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (AIIB) బోర్డు గవర్నర్ల 5వ వార్షిక సమావేశంలో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎఐఐబీ అధ్యక్షుడి ఎన్నికతోపాటు ‘ఎఐఐబి-2030... రాబోయే దశాబ్దంలో ఆసియా ప్రగతికి మద్దతు’ ప్రధానాంశంగా రౌండ్ టేబుల్ చర్చ, ఇతర అధికారిక కార్యకలాపాలు సాగాయి. కోవిడ్-19 మహమ్మారిపై పోరు కోసం భారత్‌సహా సభ్యదేశాలకు 10 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక సహాయాన్ని వేగిరం చేయడంలో ఏఐఐబీ కృషిని శ్రీమతి సీతారామన్ ప్రశంసించారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1641861
ఏఐఐఏ కోవిడ్ కేంద్రంలో ఏర్పాట్లపై ‘ఆయుష్’ శాఖ మంత్రి సమీక్ష
న్యూఢిల్లీలోని అఖిలభారత ఆయుర్వేద సంస్థ (AIIA) ప్రాంగణంలోగల కోవిడ్-19 ఆరోగ్య కేంద్రాన్ని (CHC) కేంద్ర ఆయుష్ శాఖ (ఇన్‌చార్జి) సహాయమంత్రి శ్రీ శ్రీపాద యశోనాయక్ నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ కోవిడ్-19 రోగుల కోసం చేస్తున్న ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు. అలాగే అక్కడి డాక్టర్లతో రోగుల శ్రేయస్సు గురించి చర్చించారు. ఈ కేంద్రంలో లభిస్తున్న సౌకర్యాల గురించి, వినియోగిస్తున్న ఆయుర్వేద ఔషధాల ఫలితాల గురించి వారి అనుభవాలను, అభిప్రాయాలను స్వీకరించారు. మొత్తంమీద ఈ కేంద్రంలో ఏఐఐఏ కోవిడ్-19 రోగులకు అందిస్తున్న సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1641809
‘ఇండియా రిపోర్ట్- డిజిటల్ ఎడ్యుకేషన్ జూన్ 2020’ని ఆవిష్కరించిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ‘నిషాంక్’
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిషాంక్’ నిన్న “ఇండియా రిపోర్ట్ ఆన్ డిజిటల్ ఎడ్యుకేషన్-2020”ని ఆవిష్కరించారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఇళ్లలోనే ఉండిపోవాల్సి వచ్చిన పిల్లలకు సార్వజనీన విద్యా సౌకర్యం లభ్యత, అభ్యసన అంతరం తొలగింపు తదితరాల దిశగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖతోపాటు వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు చేపట్టిన వినూత్న చర్యల గురించి ఈ నివేదిక విశదీకరిస్తుంది. కాగా, దేశవ్యాప్తంగాగల ఉపాధ్యాయులు, మేధావుల కోసమేగాక విద్యార్థుల అభ్యాసం కోసం ఉద్దేశించిన ‘దీక్ష’ వేదికసహా మానవ వనరుల అభివృద్ధిశాఖ పలు పథకాలను రూపొందించింది. ఈ జాబితాలో “స్వయం ప్రభ టివి ఛానల్, ఆన్‌లైన్ మూక్ (MOOC) కోర్సులు, రేడియోలో శిక్షా వాణి ప్రసారాలు, దివ్యాంగుల కోసం ఎన్‌ఐఒఎస్ (NIOS) ద్వారా డెయిసీ (DAISY) కార్యక్రమం, ఈ-పాఠశాల” ఇతర డిజిటల్ కార్యకలాపాల వంటివి ఉన్నాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1642096
పీఎంజీకేఏవై-2 ప్రారంభం; ఇప్పటిదాకా 33.40 లక్షల టన్నుల ఆహారధాన్యాలు తీసుకున్న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (PMGKAY) 2020 ఏప్రిల్ నుంచి జూన్ వరకూ విజయవంతంగా అమలైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని 2020 జూలై నుంచి నవంబరుదాకా మరో 5 నెలలపాటు పొడిగించింది. జాతీయ ఆహార భద్రత చట్టం (NFSA) పరిధిలోనేగాక అంత్యోదయ అన్న యోజన కింద దేశవ్యాప్తంగా సుమారు 81 కోట్లమంది లబ్ధిదారులకు తలా 5 కిలోల వంతున గోధుమ/బియ్యం ఉచితంగా పంపిణీ చేయబడ్డాయి. ఇక పీఎంజీకేఏవై-2 కింద 2020 జూలై నుంచి నవంబరువరకూ పంపిణీ కోసం (గోధుమ 91.33 లక్షల టన్నులు, బియ్యం 109.96 లక్షల టన్నులు) మొత్తం 200.19 లక్షల టన్నుల ఆహారధాన్యాలను ప్రభుత్వం కేటాయించింది. ఈ పథకం రెండోదశ 08.07.20 నుంచి ప్రారంభం కాగా, 27.07.20 వరకు (గోధుమలు 13.42 లక్షల టన్నులు, బియ్యం 19.98 లక్షల టన్నులు) మొత్తం 33.40 లక్షల టన్నుల ఆహారధాన్యాలను దేశంలోని అన్ని రాష్ట్రాలకు అప్పగించగా ఇది జూలై నెల కేటాయింపులో దాదాపు 83 శాతం కావడం గమనార్హం. ఇక పీఎంజీకేఏవై-2 కోసం అదనంగా కేటాయించిన 200.19 లక్షల టన్నులుసహా కేంద్ర ప్రభుత్వం 5 నెలలకుగాను దేశంలోని నిరుపేదలకు పంపిణీ చేసే ఆహారధాన్యాల పరిమాణం మొత్తం 455 లక్షల టన్నులకు చేరుతుంది. ఇక ప్రస్తుతం ముగిసిన పంటకాలంలో ధాన్యం సేకరణను భారత ఆహార సంస్థ (FCI) అటు గోధుమలు, ఇటు ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డులతో పూర్తిచేసింది. ఈ మేరకు మొత్తంమీద 389.76 లక్షల టన్నుల గోధుమలు, 504.91 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1641925
‘పీఎం కేర్స్’ నిధి కోసం కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్రసింగ్‌కు న్యూఢిల్లీలో డిమాండ్ డ్రాఫ్ట్, చెక్కు అందజేసిన ‘భారతీయ యోగ్ సంస్థాన్’
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చొరవతో ఐక్యరాజ్య సమితి ‘తర్జాతీయ యోగా దినోత్సవం’ ప్రకటన చేసిన నేపథ్యంలో యోగా ఇప్పటికే ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం పొందిందని కేంద్ర సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ రోజుల్లో యోగా ప్రజల జీవితాలతో వేగంగా మమేకం అవుతున్నదని, దాదాపు 12 వారాల వ్యవధిలో ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన అకస్మాత్తుగా అనేక రెట్లు పెరిగిందని ఆయన గుర్తుచేశారు. ‘పీఎం కేర్స్’ నిధికి భారతీయ యోగ్ సంస్థాన్ విరాళంగా ఇచ్చిన డిమాండ్ డ్రాఫ్ట్, చెక్కును స్వీకరించిన సందర్భంగా ఆయన ఈ మేరకు ప్రసంగించారు. కరోనా ఆరోగ్య సంక్షోభ సమయంలో హాలీవుడ్ నుంచి హరిద్వార్ వరకు ప్రజలకు యోగాపై శ్రద్ధ పెరిగిందన్న ప్రధానమంత్రి వ్యాఖ్యలను మంత్రి గుర్తుచేశారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1641730
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- చండీగఢ్: కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌లో ‘ఎల్‌ఈడీ’ అమర్చిన ‘కోవిడ్ అవగాహన వ్యాన్’ను నగరపాలనాధిపతి ప్రారంభించారు. కోవిడ్-19కు సంబంధించి ప్రజారోగ్యంపై అవగాహన కల్పన కోసం ఈ వాహనాన్ని వినియోగిస్తారు. నగరంలో కరోనా కేసులు పెరుగుతుండటంపై ఆందోళన చెందిన చండీగఢ్ పౌరసంబంధాల శాఖ ప్రజల్లో అవగాహన పెంపు దిశగా ఈ ప్రణాళిక రూపొందించింది.
- పంజాబ్: రాష్ట్రంలో కోవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో రెండు ప్రభుత్వ వైద్య కళాశాలల ఆస్పత్రులలో కేసుల సమర్థ నిర్వహణతోపాటు తృతీయ స్థాయి సంరక్షణ సేవల లభ్యతదిశగా ప్రైవేటు ఆస్పత్రులతో సమన్వయం కోసం పంజాబ్ ప్రభుత్వం అమృతసర్, పాటియాలా నగరాల్లో యువ ఐఏఎస్‌లను నోడల్ అధికారులుగా నియమించింది. ప్రతి కోవిడ్ రోగిని గుర్తించడానికి, వారికి చికిత్స-సంరక్షణల సమన్వయం కోసమేగాక సకాలంలో సమర్థ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల నిర్ధారణకు జిల్లాల్లోని ఉత్సాహవంతులైన యువ అధికారులను గుర్తించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అందరు డీసీలను ఆదేశించారు.
- కేరళ: రాష్ట్రంలో ఇవాళ మూడు మరణాలు నమోదవడంతో మొత్తం మృతుల సంఖ్య 70కి చేరింది. మరోవైపు రాష్ట్ర రాజధానిలో దిగ్బంధం కొన్ని సడలింపులతో కొనసాగుతుంది. అయితే, ఇది సంక్లిష్ఠ నియంత్రణ జోన్లలో వర్తించదు. కోవిడ్ గణాంకాల ప్రకారం- తిరువనంతపురంలో ప్రతి 18 నమూనాల పరీక్షకు ఒక కేసు నిర్ధారణ అవుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కోవిడ్ నియంత్రణ చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో కోవిడ్-19 విధివిధానాలను ఉల్లంఘించేవారు ఇవాళ్టినుంచి అక్కడికక్కడే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,093 మంది చికిత్స పొందుతుండగా వివిధ జిల్లాల్లో 1.5 లక్షల మంది నిఘాలో ఉన్నారు.
- తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఇవాళ అత్యధికంగా 166 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక లక్షణరహిత కోవిడ్ బాధితులకు ఏకాంత గృహవాసం అనుమతిస్తారు. కాగా, తమిళనాడు రాజ్‌భవన్‌లో మరో ముగ్గురికి కోవిడ్ నిర్ధారణ కావడంతో రాష్ట్ర గవర్నర్ వారంపాటు స్వీయ దిగ్బంధంలోకి వెళ్లారు. రాణిపేట్ జిల్లాలో ఆగస్టు 4 నాటికి కోవిడ్ కేసుల సంఖ్య 8,000కు చేరగలదని అంచనా వేసిన పరిపాలన యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన నియంత్రణ చర్యలు చేపట్టింది. కాగా, రాష్ట్రంలో నిన్న 6972 కొత్త కేసులు, 88 మరణాలు నమోదవగా 4707 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో చెన్నై నుంచి 1107 నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 2,27,688; యాక్టివ్ కేసులు: 57,073; మరణాలు: 3659; డిశ్చార్జి అయినవి: 1,66,956; చెన్నైలో యాక్టివ్ కేసులు: 12,852గా ఉన్నాయి.
- కర్ణాటక: రాష్ట్రంలో కోవిడ్ సంక్షోభం ఉన్నప్పటికీ సీఈటీ పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలూ తీసుకున్నందున విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి చెప్పారు. ఇక లక్షణరహిత, లక్షణసహిత, స్వల్ప లక్షణాలున్న వ్యక్తుల వర్గీకరణకు అనుగుణంగా కేసుల తీవ్రతనుబట్టి చికిత్సకు సిఫారసుచేసే కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటవుతుందని వైద్య విద్యాశాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ వెల్లడించారు. ప్రస్తుతం అమలులోగల వివిధ కోవిడ్ యాప్‌లను సకాల సమాచారం పొందేదిశగా ఒకే వేదికమీదకు తేనున్నారు. ఇది అవసరంలో ఉన్నవారికి ఆస్పత్రులు/ పడకల కేటాయింపును వ్యూహాత్మకంగా అమలు చేయడంలో సహాయపడుతుంది. ఇక నిన్న రాష్ట్రంలో 5536 కొత్త కేసులు, 102 మరణాలు నమోదవగా, 2819 మంది కోలుకున్నారు. కాగా, బెంగళూరు నగరంలో 1898 కేసులుసహా మొత్తం కేసులు: 1,07,001; యాక్టివ్ కేసులు: 64,434; మరణాలు: 2055గా ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో కరోనా బాధితుల ఆర్థిక పరిస్థితితో నిమిత్తం లేకుండా వైద్య సహాయం అందిస్తున్నామని, మహమ్మారి నియంత్రణకు అధిక నిధులు కేటాయిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య-ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు. ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించి, కరోనా రోగులకు చికిత్స నిరాకరించే ప్రైవేటు ఆస్పత్రులపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. సంక్షోభం నుంచి బయటపడటానికి వైద్యులుసహా 17 వేల మంది సిబ్బందిని రాష్ట్రం నియమించనుంది. కోవిడ్-19తో మరణించిన ముస్లింలను ఆ వర్గం శ్మశానవాటికలో ఖననం చేయడాన్ని అడ్డుకోవడం లేదా నిరోధించే అధికారం వక్ఫ్ సంస్థల నిర్వహణ యంత్రాంగాలకు లేదని రాష్ట్ర వక్ఫ్ బోర్డు ప్రకటించింది. రాష్ట్రంలో నిన్న 7948 కొత్త కేసులు, 58 మరణాలు నమోదవగా 3064 మంది కోలుకున్నారు. ప్రస్తుతం మొత్తం కేసులు: 1,10,297; యాక్టివ్ కేసులు: 56,527; మరణాలు: 1148; డిశ్చార్జి అయినవి: 52,622గా ఉన్నాయి.
- తెలంగాణ: రాష్ట్రంలో ఎన్నడూలేని రీతిలో ఇవాళ అత్యధికంగా ఒకేరోజు 18,858 నమూనాలను పరీక్షించగా 1,764 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే ఇప్పటిదాకా పరీక్షించిన నమూనాల సంఖ్య 4 లక్షల స్థాయిని దాటింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వారం రోజులుగా అధికశాతం జిల్లాలో నిత్యం 50కిపైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలు విస్తృతమవుతున్నాయి. ఇక తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1764 కొత్త కేసులు, 12 మరణాలు నమోదవగా, 842 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 509 జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 58,906; యాక్టివ్ కేసులు: 14,663; మరణాలు: 492; డిశ్చార్జి అయినవి: 43,751గా ఉన్నాయి.
- అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో ఇటానగర్ రాజధాని ప్రాంతంసహా వివిధ ప్రాంతాల్లో రాపిడ్ రెస్పాన్స్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా, ఇటానగర్‌లో గత 24గంటల్లో 1664 పరీక్షలు నిర్వహించగా 26 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి.
- మణిపూర్: రాష్ట్రంలో తొలి కోవిడ్ మరణం నమోదైంది. ఈ మేరకు తౌబల్ జిల్లాలో 56 ఏళ్ల రోగిని మూత్రపిండ సమస్యతో ఇంఫాల్‌లోని రిమ్స్ ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
- నాగాలాండ్: రాష్ట్రంలో నమోదైన 53 కొత్త కేసులకుగాను దిమాపూర్‌లో 29, కొహిమాలో 19, సోమలో 5 ఉన్నాయి.
- మహారాష్ట్ర: ముంబైలో నిర్వహించిన ఒక సీరో-సర్వేలో మురికివాడలలోని సగం మందికిపైగా అంటే- 57 శాతం సార్స్-సీవోవీ2 బారినపడగా, వారిలో వైరస్ వ్యతిరేక ‘ప్రతిరోధకాలు’ రూపొందినట్లు గుర్తించారు. అయితే, రెసిడెన్షియల్ సొసైటీలలో నిర్వహించిన పరీక్షలలో కేవలం 16 శాతం వ్యక్తులలో మాత్రమే ప్రతిరోధకాలు కనిపించాయి. కాగా, నివసించే స్థలం ఇరుకు కావడంతో భౌతిక దూరం పాటించలేని పరిస్థితి, ఒకే మరుగుదొడ్డిని అనేకమంది వాడే దుస్థితివంటివే వైరస్ సంక్రమణ అధికంగా ఉండటానికి ప్రధాన కారణాలని తేలింది. ఇక ముంబై నగరంలో జూలై ఆరంభంలో రోజుకు 5,000-6000 పరీక్షలు నిర్వహిస్తే 1,500దాకా కేసులు నిర్ధారణ అయ్యేవి. అయితే, మంగళవారం 8,000 నమూనాలను పరీక్షించినప్పటికీ కొత్త కేసులు 717 స్థాయికి తగ్గాయి. ఇది ఆర్థిక రాజధానిలో కోవిడ్ వ్యాప్తి క్రమంగా మందగించడాన్ని ఈ పరిణామం సూచిస్తోంది. మొత్తంమీద మహారాష్ట్రలో మంగళవారం 7,717 మందికి వ్యాధి నిర్ధారణ కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 1,44,696గా ఉంది.
- గుజరాత్: రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులలో కోవిడ్-19 చికిత్స రుసుము పరిమితిని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై ఫిర్యాదుల నేపథ్యంలో ఈ మేరకు చర్య తీసుకుంది. ఇప్పటికే ఛార్జీలు నిర్ణయించిన అహ్మదాబాద్, వడోదర, రాజ్‌కోట్, సూరత్, భావ్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధులలోగల ఆస్పత్రులు మినహా రాష్ట్రవ్యాప్తంగాగల అన్ని ప్రైవేట్ ఆసుపత్రులకూ కొత్త రేట్లు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఐసీయూయేతర వార్డుల్లో రోజుకు రూ.5,700, ఐసీయూ సదుపాయంతో రూ.6000కు మించి వసూలు చేయరాదని నిర్దేశించింది. గుజరాత్‌లో గత 24 గంటల్లో 1,108 కొత్త కేసులు, 24 మరణాలు నమోదవగా మొత్తం కేసులు 57,982కు పెరిగాయి. ప్రస్తుతం 13,198 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటిదాకా 42,412 మంది కోలుకున్నారు. ఇక మృతుల సంఖ్య 2,372గా ఉంది.
- రాజస్థాన్: రాష్ట్రంలో ఈ ఉదయం 328 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 38,964కు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 27,569కు చేరింది. కొత్త కేసులలో గరిష్ఠంగా 154 ఒక్క అల్వార్ జిల్లాలోనే నమోదవగా జైపూర్ (61), అజ్మీర్ (47) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- మధ్యప్రదేశ్: రాష్ట్రంలో మంగళవారం 628 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 29,217కు పెరిగాయి. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం 8044 మంది యాక్టివ్ కేసులుండగా ఇప్పటిదాకా 20,343 మంది కోలుకున్నారు... మృతుల సంఖ్య 830గా ఉంది.


******
(Release ID: 1642172)
Visitor Counter : 277