వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

పిఎంజికెఎవై రెండోదశ ప్రారంభం: ఇప్పటిదాకా 33.40 లక్షల టన్నుల ధాన్యం తీసుకున్న రాష్ట్రాలు

ముగిసిన సీజన్ లో 389.76 లక్షల టన్నుల గోధుమలు, 504.91 లక్షల టన్నుల బియ్యం సేకరణతో ఎఫ్ సి ఐ కొత్త రికార్డు

Posted On: 28 JUL 2020 7:20PM by PIB Hyderabad

 

2020 ఏప్రిల్ నుంచి జూన్ దాకా ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన ను విజయవంతంగా అమలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఈ పథకాన్ని మరీ ఐదు నెలల పాటు జులై నుంచి నవంబర్ దాకా పొడిగించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కిందికి, అంత్యోదయ అన్న యోజన కిందికి వచ్చే 81 కోట్ల మంది లబ్ధి దారులకు ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల చొప్పున బియ్యం లేదా గోధుమలు ఈ పథకం కింద ఉచితంగా ఇస్తున్నారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన రెండో దశ కింద జులై నుంచి నవంబర్ వరకు 200.19 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించారు. ఇందులో 91.33 లక్షల టన్నులు గోధుమలు కాగా 109.96 లక్షల టన్నులు బియ్యం. రాష్ట్ర ప్రభుత్వాలనుంచి, లబ్ధిదారులనుంచి ఈ పథకానికి అద్భుతమైన స్పందన లభించింది. పథకం ప్రారంభమైన 08.07.20 నుంచి 27.07.20 వరకు మొత్తం 33.40 లక్షల టన్నుల ధాన్యాన్ని దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు అందజేయగా అందులో 13.42 లక్షల టన్నుల గోధుమలు, 19.98 లక్షల టన్నుల బియ్యం ఉన్నాయి. ఈ  జులై నెల కేటాయింపులో దాదాపు 83% ఇప్పటివరకూ పంపిణీ జరిగింది.

పిఎంజికెఎవై రెండోదశ కోసం అదనంగా కేటాయించిన 200.19 లక్షల మెట్రిక్ టన్నులతో సహా భారత ప్రభుత్వం ఐదు నెలల కాలంలో సమాజంలోని నిరుపేదలకు పంచే ధాన్యం మొత్తం 455 లక్షల మెట్రిక్ టన్నులు అవుతుంది. ఆహార భద్రతా చట్టం, అంత్యోదయ అన్న యోజన కిందికి వచ్చే ప్రతి లబ్ధిదారునికీ ఐదు కిలోల గోధుమలు, లేదా బియ్యం పూర్తిగా ఉచితంగా అందుతాయి. ఇది వాళ్ళకు సబ్సిడీ మీద అందే మామూలు కోటాకు అదనం,

ఈ ఐదు నెలల కాలానికి కేటాయించిన ధాన్యం నిల్వలను సకాలంలో  దేశం నలుమూలలా అందించటానికి వీలుగా భారత ఆహార సంస్థ కట్టుదిట్టమైన రవాణా ఏర్పాట్లు చేసింది. ఇది మామూలు కేటాయింపుకు రెట్టింపు కావటం వలన కచ్చితంగా సవాలు విసిరే బృహత్ కార్యక్రమమే కాబట్టి పాత అవసరాలకు తగినట్టు ఉన్న గోదాములు, రవాణా సామర్థ్యాన్ని సక్రమంగా వాడుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ సవాలును స్వీకరించి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూసుకోవటానికి భారత ఆహార సంస్థ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఇప్పటికే కోవిడ్ లాంటి కష్ట కాలంలో తన సంసిద్ధతను రుజువు చేసుకుంది. అప్పుడు కూడా ఎన్నో కొత్త రికార్డులు నెలకొల్పింది. కేటాయింపులకు అనుగుణంగా దేశం  నలుమూలలా పంపిణీ లక్ష్యాలు పూర్తి చేసి ఏ ఒక్క నిరుపేద కూడా ఆకలితో ఉండకుండా చూడటంలో తన పాత్రను రుజువు చేసుకుంది.

తాజాగా ముగిసిన సీజన్ కు ధాన్యం సేకరణను భారత ఆహార సంస్థ పూర్తి చేసింది. అటు గోధుమలు, ఇటు బియ్యం సేకరణలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ పంట సీజన్ లో 389.76 లక్షల టన్నుల గోధుమలు, 504.91 లక్షల టన్నుల బియ్యం సేకరించింది. రుతుపవనాలు సాగుతున్న తీరు చూస్తే ఈ 2020-21  ఖరీఫ్ సీజన్ కూడా చాలా ఆశాజనకంగా ఉండేట్టు కనిపిస్తోంది.

 

****



(Release ID: 1641925) Visitor Counter : 181