మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఇండియా రిపోర్ట్ డిజిటల్ ఎడ్యుకేషన్ జూన్ 2020ను విడుదల చేసిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్
మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ, రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల విద్యాశాఖలు ఇళ్లలో ఉన్న విద్యార్ధులకు అందుబాటులో సమ్మిళిత విద్యను అందించడం, అభ్యసన అంతరాలను తొలగించడంలో అమలు చేస్తున్న వినూత్న పద్ధతులపై ఈ నివేదిక విస్తృతంగా వివరిస్తోంది.
Posted On:
28 JUL 2020 6:34PM by PIB Hyderabad
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఈరోజు ,ఇండియా రిపోర్ట్ ఆన్ డిజిటల్ ఎడ్యుకేషన్- 2020 ని విడుదల చేశారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ, వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కోవిడ్ కారణంగా ఇళ్లలోనే ఉండిపోయిన పిల్లలకు అందుబాటులో సమ్మిళిత విద్యను అందించడం, వారిలో అభ్యసన అంతరాలను తగ్గించడానికి తీసుకున్న వినూత్న చర్యలను ఈ నివేదికలో విస్తృతంగా చర్చించడం జరిగింది. పాఠశాలలను విద్యార్థుల వద్దకు తీసుకువెళ్లడం ద్వారా అందరికీ విద్యను అందించేందుకు, సుదూరంలో ఉండే నేర్చుకునే విధంగా ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యలను తెలుసుకుని, ఈ చర్యలపై అవగాహన పొందేందుకు ప్రతి ఒక్కరూ ఈ నివేదిక చదవాలని ఆయన అందరినీ కోరారు.
ప్రీ నర్సరీ నుంచి ఉన్నత, మాధ్యమిక తరగతుల వరకు విస్తృతస్థాయిలో పాఠశాలల్లో డిజిటల్ విద్యను సార్వత్రికం చేయడానికి కట్టుబడి ఉన్న సమగ్ర , సమ్మిళిత కార్యక్రమంగా పాఠశాల విద్య కు రూపకల్పన చేయడం జరిగింది. ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో డిజిటల్ విద్య నాణ్యత ఇప్పుడు అత్యవసరమైన అంశమైంది. ఉపాధ్యాయులు, స్కాలర్లు, విద్యార్ధులు దీక్షా ప్లాట్‌ఫాంలో నేర్చుకోవడానికి వీలుగా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ పలు ప్రాజెక్టులను రూపొందించింది. అవి స్వయం ప్రభ టివి ఛానల్, ఆన్‌లైన్ మూక్ కోర్సులు, శిక్షా వాణి ప్రసారాలు, దివ్యాంగులకు ఎన్.ఐ.ఒ.ఎస్ వారి డైయిసీ కార్యక్రమం,ఈ -పాఠశాల, ఈ కంటెంట్, మంచి పుస్తకాలు అభివృద్ది చేయడానికి నేషనల్ రిపాజిటరీ ఆఫ్ ఒపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ (ఎన్ ఆర్ ఒ ఇఆర్), టివి ఛానళ్ళ ద్వారా పాఠ్యాంశాల ప్రసారం, ఈ-లెర్నింగ్ పోర్టళ్లు, వెబినార్లు, చాట్ గ్రూప్‌లు, పుస్తకాల పంపిణీ, ఇతర డిజిటల్ కార్యకలాపాల వంటివి. వీటిని రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలసి హెచ్.ఆర్.డి మంత్రిత్వశాఖ చేపడుతున్నది.
ఈ నివేదికలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ కు చెందిన డిపార్టమెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, లిటరసీ కార్యదర్శి
శ్రీమతి అనితా కర్వాల్ ల సందేశాలు ఉన్నాయి. ఈ నివేదికను మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వశాఖ కు చెందిన డిజిటల్ ఎడ్యుకేషన్ విభాగం, వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సంప్రదించి రూపొందించింది.
కేంద్ర ప్రభుత్వ చొరవతోపాటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు కూడా విద్యార్థుల ముంగిటకు డిజిటల్ విద్యను తీసుకువెళ్ళే కీలక లక్ష్యాన్ని చేపడుతున్నాయి. విద్యార్థులను చేరడానికి సామాజిక మాధ్యమాలైన వాట్పప్ గ్రూపులను అన్ని తరగతులకు వాడుతున్నారు. ఆన్‌లైన్ తరగతులను యూ ట్యూబ్ ఛానల్ ద్వారా నిర్వహిస్తున్నారు. గూగుల్ మీట్, స్కైప్ వంటి వాటిని ఉపయోగించుకుంటున్నారు. ఈ -లెర్నింగ్ పోర్టళ్ళు, టివి (దూరదర్శన్, ప్రాంతీయ ఛానళ్ళు), రేడియో (ఎఐఆర్), దీక్షా పోర్టల్‌ను ఉపయోగించడం వంటివి చాలామంది చేస్తున్నారు.
రాష్ట్రప్రభుత్వాలు చేపట్టిన ప్రధాన డిజిటల్ కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. అవి, రాజస్థాన్‌లో ఎస్.ఎం.ఐ.ఎల.ఇ( స్మైల్-సోషల్ మీడియా ఇంటర్‌ఫేస్ ఫర్ లెర్నింగ్ ఎంగేజ్‌మెంట్) కాగా, జమ్ము లో చేపట్టిన ప్రాజెక్ట్ హోమ్ క్లాసెస్, చత్తీస్‌ఘడ్ చేపట్టిన పఢాయి తున్‌హర్ తువార్ (మీ గుమ్మం ముంగిటకు విద్య), బీహారల్‌లో పోర్టల్, మొబైల్ అప్లికేషన్ ద్వారా చేపట్టిన ఉన్నయన్ కార్యక్రమాలు, ఢిల్లీ ఎన్.సి.టి చేపట్టిన మిషన్ బునియాద్, కేరళ స్వంత విద్యా టివి ఛానల్ ( హైటెక్ విద్యా కార్యక్రమం), మేఘాలయలో టీచర్లకు ఉచిత ఆన్‌లైన్ కోర్సుల ఈ-స్కాలర్ పోర్టల్, కోవిడ్ సమయంలో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై తెలంగాణాలో టీచర్లకు ఆన్‌లైన్ సర్టిఫికేట్ కార్యక్రమాలు వంటివి ఉన్నాయి.
కొన్ని రాష్ట్రాలు వినూత్న మొబైల్ యాప్‌లు, పోర్టళ్లను ఇంటిదగ్గరే ఉండి నేర్చుకునేందుకు వీలుగా రూపొందించాయి. మధ్యప్రేదశ్ టాప్ పేరెంట్ యాప్ పేరుతో ఒక ఉచిత మొబైల్ యాప్ ను రూపొందించింది. ఇది 3నుంచి 8 సంవత్సరాల మధ్యవయస్కులైన పిల్లల తల్లిదండ్రులకు , పిల్లల పురోభివృద్ధిపై అవగాహన కల్పిస్తుంది. అలాగే తల్లిదండ్రులు పిల్లలతో అర్థవంతంగా ఎలా గడపాలో తెలియజేస్తుంది. అలాగే కె.హెచ్.ఇ.ఎల్ ( నాలెడ్జ్ హబ్ ఫర్ ఎలక్ట్రానిక్ లెర్నింగ్-ఖేల్) పేరుతో ఆటల ఆధారిత యాప్‌ను ఒక దానికి కూడా మధ్యప్రదేశ్ ప్రారంభించింది. ఇది 1 నుంచి 3 వ తరగతి వారి కోసం రూపొందించినది. అలాగే ఉత్తరాఖండ్ సంపర్క్ బైఠక్ యాప్‌ను ఉపయోగించుకుంటున్నది. దీని ద్వారా ప్రైమరీ పాఠశాల విద్యార్ధులు యానిమేషన్ వీడియోలు, ఆడియోలు,వర్క్‌షీట్లు, పజిల్స్ వంటి వాటిని చూడడానికి వీలు కలుగుతుంది.అస్సాం బిస్వవిద్యా అస్సాం మొబైల్ అప్లికేషన్‌ను 6 నుంచి 10 వ తరగతి విద్యార్థుల కోసం ప్రారంభించింది. బీహార్ ఈ పుస్తకాలతోపాటు విద్యావాహిని యాప్‌ను 1 నుంచి 12 వ తరగతి వారికోసం తీసుకువచ్చింది. ఉన్నయాన్ బీహార్ కార్యక్రమం కింద బీహార్ మేరా మొబైల్, మేరా విద్యాలయను విద్యార్థులకోసం తీసుకువచ్చింది. అలాగే టీచర్ల కోసం ఉన్నయాన్ బీహార్ యాప్ ను తెచ్చింది. చండీఘడ్ 1 వ తరగతి నుంచి 8 వతరగతి విద్యార్థుల వరకువారు ఏం నేర్చుకున్న విషయాల ఫలితాన్ని అంచనా వేసేందుకు ఫోనిక్స్ మొబైల్ అప్లికేషన్ ను తీసుకువచ్చింది. మహారాష్ట్ర స్మార్ట్ క్యూ మోబైల్ యాప్‌ను తెచ్చింది. పంజాబ్ ఐ స్కూయెలా లెర్న్ మొబైల్ అప్లికేషన్‌ను 1 వ తరగతి నుంచి 10 వ తరగతి వారి కోసం తీసుకువచ్చింది. సిక్కిం ఎడ్యుటెక్ యాప్ ను తీసుకువచ్చి రాష్ట్ర విద్యాశాఖ అధీనంలోని అన్ని పాఠశాలలను ఈ యాప్‌తో అనుసంధానం చేసింది. విద్యార్థులతోపాటు తల్లిదండ్రులకు, టీచర్లకు అడ్మినిస్ట్రేటివ్‌యూనిట్‌లకు లాగ్ ఇన్ సదుపాయం కల్పించారు. ఎంపవర్ యు శిక్షా దర్పణ్ పేరుతో త్రిపుర ఒక అప్లికేషన్ తీసుకువచ్చింది. ఉత్తరప్రదేశ్ టాప్ పేరెంట్ యాప్ తీసుకువచ్చింది. దీనిని 3 నుంచి 8 సంవత్సరాల వయసు వారికోసం నిర్దేశించారు. ఈ అప్లికేషన్ ప్రస్తుతం మూడు అత్యంత నాణ్యత గల ఎడ్ టెక్ యాప్‌లను విద్యార్ధుల కోసం అందిస్తోంది. అవి చింప్లీ,మాథ్స్ మస్తి, గూగుల్ బోలో.
రాష్ట్రాలు కూడా విద్యా బోధనకు,టీచర్లు , తల్లిదండ్రులను ప్రోత్సహించడానికి, విద్యార్థులతో అనుసంధానానికి వాట్సప్ ను ఒక మాధ్యమంగా వాడుకుంటున్నాయి. ఒడిషా శిక్షా సనోజ్ అనేది ఒక వాట్సప్ ఆధారిత డిజిటల్ అభ్యసన కార్యక్రమం. దీని ద్వారా ఈ కంటెంట్‌ను తరగతుల వారీగా ఒక క్రమ పద్దతిలో అందిస్తారు. పంజాబా్, పుదుచ్చేరిల లో కూడా వాట్సప్ ద్వారా విద్యను అందిస్తున్నారు. రాజస్థాన్ వినూత్నంగా హవామహల్ కార్యక్రమానికి వాడుతున్నది. దీని ద్వారా ప్రతి శనివారం విద్యార్థులకు కథలు, నాటకాలు వినిపిస్తారు.వాట్సప్ ద్వారా తగిన సూచనలు చేస్తూ ఆటలు ఆడిస్తారు.
ఉత్తరప్రదేశ్ లో మిషన్ ప్రేరణ,ఈ- పాఠశాల అనేది టీచర్‌నుంచి విద్యార్ధికి సమాచారం అందించే వాట్సప్ గ్రూప్. హిమాచల్ ప్రదేశ్ మూడు వాట్సప్ ప్రచారాలను చేపట్టింది. అవి కరోనా, ఉల్లాసవంతమైన విద్యకు తోడీ మస్తి,తోడి పఢి, అలాగే హర్ ఘర్ పాఠశాల అనేవి. వీటి ద్వారా హిమాచల్ ప్రదేశ్ ఈ కంటెంట్ ను అందిస్తుంది. విద్యార్ధులు ఈ ఈ కంటెంటును చదివి వర్క్‌షీట్లలోని ప్రశ్నలకు సమాధానాలు తయారుచేస్తారు. వాటిని ఉపాధ్యాయులు చూసివారి స్పందన తెలియజేస్తారు. ప్రత్యేక అవసరాల విద్యార్థుల కోసం , ప్రచార కార్యక్రమానికి హమ్ కిసి సే కమ్ నహి- మేరా ఘర్ మేరీ పాఠశాల అని పేరుపెట్టారు. ఇందుకు సంబంధించిన కంటెంట్‌ను వాట్సప్ గ్రూప్ ద్వారా పంపుతారు. ఇందుకు ప్రత్యేక నైపుణ్యాలు గల వారికి ఈ బాధ్యతలను అప్పగించారు.
చాలా రాష్ట్రాలు తక్కువ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన బోధన రూపాలు, కొన్ని సందర్భాలలో అసలు ఇంటర్నెట్ అవసరం లేని లేదా తక్కువ స్థాయిలో అవసరమైన విధానాలను అనుసరిస్తున్నాయి. ఉదాహరణకు అరుణాచల్ ప్రదేశ్ లో ప్రైమరీ తరగతి విద్యార్థులు ఆసక్తి కరమైన రేడియో ప్రసంగాలను వారు ఆలిండియా రేడియో ,ఇ టానగర్ ద్వారా వారి మాతృభాషలో వినగలుగుతున్నారు. జార్ఖండ్ లోని పలు జిల్లాలలో ఎక్కడికక్కడ స్థానిక టీచర్లు ప్రాంతీయ దూరదర్శన్, రేడియో స్లాట్ లద్వారా పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. పుదుచ్చేరిలో కూడా ఇలాంటి పద్ధతే అనుసరిస్తున్నారు. స్ధానిక టివి ఛానళ్ళలో వర్చువల్ కంట్రోల్ రూమ్‌ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు.మణిపూర్ 3 నుంచి 5 వ తరగతి విద్యార్ధులకు కామిక్ పుస్తకాలను తయారు చేసి వివిధ అంశాలను ఆనందంగా నేర్చుకునే విధానాన్ని అనుసరిస్తున్నారు. లద్దాక్ బెంగళూరుకు చెందిన ఎన్.జి.ఒ ఇఎంబిఐబిఇ-ఎంబైబ్, 17000ఫీట్ సహకారంతో ఆన్‌లైన్ బోధనను తక్కువ కనెక్టివిటీ ఉన్న చోట కూడా అందిస్తున్నది. ప్రస్తుత సంక్షోభంలో కనిపించనిది కమ్యూనిటీ పాలుపంచుకోవడం. దీనితో స్థానిక, వ్యక్తిగత వనరుల అంశం ముందుకు వచ్చింది. క్విజ్ పోటీల వంటి వాటిని హర్యానా నిర్వహిస్తున్నది.
దూర ప్రాంతంలో ఉండి నేర్చుకోవడంలో వున్న సవాళ్లను తట్టుకోవడానికి ఎన్ఐఒఎస్, స్వయం ప్రభ కంటెంట్ ప్రత్యేకంగా ఇంటర్నెట్ సదుపాయం లేని లేదా రేడియో, టివి అందుబాటు తక్కువగా ఉన్న వారికి ఉపయోగపడేట్టు కూడా రూపొందించారు. వివిధ రాష్ట్రాలు వినూత్న మాధ్యమాల ద్వారా విద్యార్ధులకు కంటెంట్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ టోల్ ఫ్రీ కాల్ సెంటర్, టోల్ ఫ్రీ వీడియో కాల్ సెంటర్ ను విద్యార్ధుల కోసం ఏర్పాటు చేసింది. దీనిద్వారా కీలక అంశాలపై విద్యార్దులకు అర్ధమయ్యేట్టు చేయడానికి లేదా వారికి గల సందేహాలను తీర్చడానికి ఇది ఉపయోగపడుతుంది. మొబైల్ అనుసంధానత సరిగా లేకపోవడం, ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాలకు చత్తీస్‌ఘడ్ మోటార్ ఇస్కూల్‌ను ప్రారంభించింది. ఆ రాష్ట్రం కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ వి.ఎఫ్.ఎస్ - వర్చువల్ ఫీల్డ్ సపోర్ట్ ను ప్రారంభించింది. జార్ఖండ్ రోవింగ్ టీచర్ పద్ధతిని ప్రవేశపెట్టింది. చాలామంది టీచర్లు పిల్లలకు బోధించడానికి వివిధ ప్రాంతాలకు తిరుగుతుంటారు.
గుజరాత్ పఠన ప్రచారాన్ని చేపట్టింది. మౌఖిక పఠనంలో నైపుణ్యం సాధించేందుకు వన్‌చన్ అభియాన్, తదితర కార్యక్రమాల కింద పిల్లలకు మానసిక స్థైర్యాన్ని కల్పిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ కూడా పిల్లలు తమకు వచ్చిన సందేహాలను తీర్చుకునేందుకు ఒక ప్రత్యేక టోల్‌ఫ్రీ హెల్ప లైన్ నంబర్‌ను ఏర్పాటు చేసింది.
ఇంటర్నెట్‌సదుపాయం లేని మారుమూల ప్రాంతాలలోని పేదల సమగ్ర అభ్యసనకు రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు విద్యార్ధుల ఇళ్లవద్దకు పాఠ్యపుస్తకాలు అందజేశాయి. ఇలాంటి చర్యలు తీసుకున్న రాష్ట్రాలలో ఒడిషా, మధ్యప్రదేశ్( దక్షత ఉన్నయన్ కార్యక్రమం కింద) , దాద్రా, నాగర్ హవేలి, డామన్ డయ్యూ తదితరాలు ఉన్నాయి. లక్షద్వీప్ ఈ కంటెంట్ కలిగిన ట్యాబ్‌లను విద్యార్ధులకు అందజేసింది. నాగాలాండ్ డివిడి, ఎన్‌డ్రైవ్‌లద్వారా స్టడీ మెటీరియల్‌ను విద్యార్ధులకు నామమాత్రపు ధరకు అందజేసింది. జమ్ము కాశ్మీర్ విద్యార్ధులకు ఉచితంగా ట్యాబ్ లను , అలాగే చూపు లేని వారికి బ్రెయిలీ టక్టయిల్ రీడర్లను అందజేసింది.
డిజిటల్ విద్యా చర్యలు విద్యార్ధులు పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి కూడా పనికి వస్తున్నాయి. గోవా ఎంబైబ్ భాగస్వామ్యంతో కృత్రిమ మేధ (AI) శక్తితో ఎంట్రన్స్ పరీక్షల కు సిద్ధమయ్యే విద్యార్ధులు నేర్చుకునేందుకుఆన్ లైన్ ప్లాట్‌ఫాంను ఏర్పాటుచేసింది. కర్ణాటక పరీక్షావాణి పేరుతో పరీక్షలకు సిద్ధం కావడంపైన, ఎస్.ఎస్.ఎల్.సి పరీక్షకు సిద్ధం కావడంపైన దూరదర్శన్ ద్వారా కార్యక్రమాలు ప్రసారాలు చేస్తొంది. నీట్ పరీక్షకు సిద్ధమౌతున్న ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ విద్యార్ధులకు తమిళనాడు ఆన్‌లైన్ ప్రాక్టీసు పరీక్షలు నిర్వహిస్తోంది.
రాష్ట్రాలకు గల వివిధ అవసరాలను దృష్టిలో ఉంచుకుని , ఎన్.సి.టి ఢిల్లీ ఉన్నత స్థాయి విద్యార్ధులకు భాషపై మంచి పట్టు కలిగించేందుకు చర్యలు చేపట్టడంపై దృష్టిపెట్టింది. అలాగే లాక్‌డౌన నేపథ్యంలో విద్యార్ధుల మానసిక ఆరోగ్యంపైనా ఎస్.ఎం.ఎస్, ఐవిఆర్ ద్వారా హ్యాపీనెస్ క్లాసులు ప్రైమరీ గ్రేడు విద్యార్ధులకు తీసుకుంటున్నారు. అలాగే ఇతర రాష్ట్రాలు కూడా మానసిక ఆరోగ్యంపై దృష్టిపెడుతున్నాయి. తమిళనాడు, తెలంగాణా, మధ్యప్రదేశ్, గుజరాత్‌లు ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్ధులకు సంబంధించి సమ్మిళిత విద్యపై దృష్టిపెడుతున్నాయి. ఈ విధంగా రాష్ట్రాల విద్యావిభాగాలు సమష్టిగా అభ్యసన సంక్షోభాన్ని అన్నివిధాలుగా ఎదుర్కొనేందుకు దృఢ దీక్షతో ,పట్టుదలతో ఉన్నాయి.
ఇందుకు సంబంధించిన నివేదికను ఇక్కడ చూడవచ్చు:
https://mhrd.gov.in/sites/upload_files/mhrd/files/India_Report_Digital_Education_0.pdf
***
(Release ID: 1642096)
Visitor Counter : 353