PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
28 JUL 2020 6:38PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- దేశంలో మరణాల సగటు తగ్గుముఖం పడుతుండగా ఇవాళ 2.2 శాతానికి పతనం.
- కోవిడ్-19 వ్యాధినుంచి బయటపడుతున్నవారి సంఖ్య స్థిరంగా పెరుగుతూ ఇవాళ 9.5 లక్షలకుపైగా నమోదు.
- నిన్న 35,000 మందికి నయం కాగా, కోలుకునేవారి జాతీయ సగటు 64.2 శాతానికి చేరిక.
- కోల్‌కతా, ముంబై, నోయిడాలలో అత్యంత సత్వర కోవిడ్-19 పరీక్ష సౌకర్యాలను ప్రారంభించిన ప్రధానమంత్రి.
- ప్రస్తుతం చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న కేసుల సంఖ్య 4,96,988.
- దేశంలో వరుసగా రెండోరోజు 5 లక్షలకుపైగా రోగ నిర్ధారణ పరీక్షలు; మొత్తం 1.73 కోట్లకుపైగా నమూనాల పరీక్ష.

దేశంలో మరణాల సగటు మరింత తగ్గుతూ 2.25 శాతానికి పతనం; కోవిడ్-19 నయమైనవారి సంఖ్య 9.5 లక్షలకుపైగానే; నిన్న కోలుకున్నవారి సంఖ్య 35,000గా నమోదు
దేశంలో కోవిడ్ మరణాలు స్థిరంగా తగ్గుతూ, 2.25 శాతానికి పతనమయ్యాయి. దీంతో ప్రపంచంలో అతిస్వల్ప మరణశాతంగల దేశాల్లో ఒకటిగా భారత్ కొనసాగుతోంది. జూన్ నెల మధ్యనాటికి 3.33 శాతంగా ఉన్న మరణాలు ఇవాళ 2.25 శాతానికి దిగివచ్చింది. ఆ మేరకు వరుసగా ఐదో రోజు దేశంలో 30,000 మందికిపైగా కోలుకున్నారు.

అలాగే జూన్ మధ్యలో కోలుకునేవారి సగటు 53 శాతం కాగా, ఇవాళ 64 శాతానికిపైగా పెరిగింది. గడచిన 24 గంటల్లో 35,176 మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లడంతో ఇప్పటిదాకా మొత్తం వ్యాధి నయమైనవారి సంఖ్య 9,52,743కు చేరింది. రోజువారీ కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతున్నందువల్ల చురుకైన కేసుల సంఖ్య, వ్యాధి నయమవుతున్నవారి సంఖ్యల మధ్య వ్యత్యాసం 4,55,755 మేర అధికంగా నమోదైంది. ఆ మేరకు ప్రస్తుతం చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,96,988గా ఉంది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1641837
దేశంలో వరుసగా రెండోరోజు 5 లక్షలకుపైగా రోగ నిర్ధారణ పరీక్షలు; మొత్తం 1.73 కోట్లకుపైగా నమూనాల పరీక్ష
కోవిడ్-19పై భారత పోరాటంలో “పరీక్ష, అన్వేషణ, చికిత్స” వ్యూహానికి తగినట్లుగా నిన్న వరుసగా రెండోరోజు 5 లక్షలకుపైగా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు జూలై 26న 5,15,000 నమూనాలను పరీక్షించగా, జూలై 27వ తేదీన ఈ సంఖ్య 5,28,000గా నమోదైంది. క్రమబద్ధ, ప్రతిస్పందనాత్మక పరీక్షల వ్యూహానికి తగినట్లుగా దేశంలో ప్రయోగశాలల సంఖ్య కూడా విస్తరిస్తూ వస్తోంది. దీని ఫలితంగా ఇప్పటివరకూ 1.73 కోట్లకుపైగా నమూనాలను పరీక్షించగా, ప్రతి పది లక్షల జనాభాకు రోజువారీ పరీక్షల సగటు 12,562కు పెరిగింది. ఈ పరీక్షల నిర్వహణ సామర్థ్య విస్తరణవల్ల నానాటికీ పెరుగుతున్న ప్రయోగశాలల సంఖ్య ప్రస్తుతం 1,310కి చేరగా ప్రభుత్వ రంగంలో 905, ప్రైవేటు రంగంలో 405 వంతున సేవలందిస్తున్నాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1641865
కోల్‌కతా, ముంబై, నోయిడాలలో అత్యంత సత్వర కోవిడ్-19 పరీక్ష సౌకర్యాలను ప్రారంభించిన ప్రధానమంత్రి
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న మూడు ‘అత్యంత సత్వర కోవిడ్-19 నిర్ధారణ’ (High throughput) పరీక్ష సౌకర్యలను దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఇవి కోల్‌కతా, ముంబై, నోయిడా నగరాల్లోని భారత వైద్య పరిశోధన మండలి (ICMR) పరిధిలోగల ‘జాతీయ పరిశోధన సంస్థల’ ప్రాంగణాల్లో ఏర్పాటయ్యాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ- ఈ అత్యాధునిక సదుపాయాలద్వారా మూడు నగరాల్లోనూ రోజుకు 10,000 వంతున పరీక్షల సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు. ఎక్కువ సంఖ్యలో పరీక్షల నిర్వహణవల్ల వ్యాధి సోకినవారిని ముందుగానే గుర్తించి, చికిత్స చేసేందుకు వీలుంటుందని, తద్వారా వైరస్‌పై పోరాటం మరింత సమర్థంగా సాగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రయోగశాలలు కోవిడ్ నిర్ధారణ పరీక్షలకు మాత్రమే పరిమితం కాదని, భవిష్యత్తులో ‘హెపటైటిస్-బి, సి’, హెచ్ఐవి, డెంగ్యూ తదితర అనేక వ్యాధుల నిర్ధారణ పరీక్షలను వీటిలో నిర్వహించవచ్చునని చెప్పారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1641729
దేశంలోని 3 ఐసీఎంఆర్ ప్రయోగశాలల్లో అత్యంత సత్వర కోవిడ్-19 పరీక్ష సౌకర్యాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పూర్తిపాఠం
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1641551
‘ప్రపంచ హెపటైటిస్ దినం’ సందర్భంగా రెండో ‘సహానుభూతి ఈ-సదస్సు’లో పాల్గొన్న డాక్టర్ హర్షవర్ధన్
“ప్రపంచ హెపటైటిస్ దినం” సందర్భంగా న్యూఢిల్లీలో ‘2వ సహానుభూతి ఈ-సదస్సు’ను నిర్వహించారు. లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ముఖ్య అతిథిగా, కేంద్ర న్యాయ, ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రులు శ్రీ రవిశంకర్ ప్రసాద్, డాక్టర్ హర్షవర్ధన్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీం ఓం బిర్లా మాట్లాడుతూ- హెపటైటిస్-సి నిర్మూలన, 2030 నాటికి హెపటైటిస్-బి భారాన్ని తగ్గించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశిత లక్ష్యాలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ఇక డాక్టర్ హర్షవర్ధన్ ఈ సదస్సుకు ఆహ్వానం పలుకుతూ- “కోవిడ్ సమయంలో మీ కాలేయాన్ని సురక్షితంగా ఉంచుకోండి” అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరీక్షా సమయంలో ఇది చాలా సముచితం, అత్యంత ముఖ్యమన్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1641809
కోవిడ్-19 సవాళ్లున్నప్పటికీ ఉద్యమతరహాలో నిరుటి సరుకు రవాణా స్థాయిని అధిగమించిన రైల్వేశాఖ
దేశవ్యాప్తంగా కోవిడ్-19 సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత రైల్వేశాఖ ఉద్యమ తరహాలో నిరుటి సరుకు రవాణా స్థాయిని అధిగమించడంద్వారా కొత్త మైలురాయిని అందుకుంది. ఈ మేరకు 2020 జూలై 27కల్లా 3.13 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయగా, నిరుడు ఇదే తేదీనాటితో పోలిస్తే ఇది ఎక్కువ. అలాగే కోవిడ్ కాలంలో రైల్వేశాఖ దాదాపు 200 మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేసింది. ఇక 2020 27 జూలైనాటికి సరుకు రవాణా రైళ్ల సగటు వేగం 46.16 కిలోమీటర్లు కాగా, నిరుడు ఇదే తేదీ (22.52 కిలోమీటర్లు)నాటితో పోలిస్తే ఇది రెట్టింపు. ఇక ఒక్క జూలై నెలలో ఈ సగటు వేగం 45.03 కిలోమీటర్లు కాగా, నిరుడు ఇదే నెలతో (23.22 కిలోమీటర్లు) పోలిస్తే ఇది రెట్టింపు. ఇక 2020 జూలై 27నాటికి మొత్తం 1039 సరుకు రవాణా రైళ్లు నడపగా వీటిలో 76 రైళ్ల ఆహారధాన్యాలను, 67 రైళ్లు ఎరువులను, 49 రైళ్లు ఉక్కును, 113 రైళ్లు సిమెంటును, 113రైళ్ల ముడి ఇనుమును, 363 రైళ్లు బొగ్గును గమ్యాలకు చేర్చాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1641892
కోవిడ్-19 పీడితుల అన్వేషణ-ముప్పు అంచనా కోసం మొబైల్ యాప్‌ను రూపొందించిన బెంగళూరు అంకుర సంస్థ
కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొనే దిశగా కేంద్ర శాస్త్ర-సాంకేతిక విభాగం (DST) పరిధిలోని ‘సెంటర్ ఫర్ ఆగ్మెంటింగ్ వార్ విత్ కోవిడ్ -19 హెల్త్ క్రైసిస్ (CAWACH), “లైఫాస్ కోవిడ్ స్కోర్” పేరిట కోవిడ్ వ్యాధి ముప్పు అంచనాల రూపకల్పన కోసం బెంగళూరులోని అంకుర సంస్థ ‘అక్యూలీ ల్యాబ్స్’ను ఎంపిక చేసింది. తదనుగుణంగా ఈ సంస్థ వైద్యస్థాయి, గాయరహిత, డిజిటల్ పద్ధతిలో పనిచేసే బయోమార్కర్ స్మార్ట్ ఫోన్ సాధనాన్ని రూపొందించింది. అనుమానితులకు పరీక్ష, ముందస్తుగా గుర్తింపు, మూలకారణ విశ్లేషణ, తీవ్ర ముప్పుపై అంచనా, రోగ నిర్ధారణసహా దీర్ఘకాలిక వ్యాధులపై గృహస్థాయి పర్యవేక్షణ తదితర ప్రత్యేక సదుపాయాలు ఇందులో ఉన్నాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1641814
కోవిడ్ మహమ్మారివేళ రిటైరయ్యే ప్రభుత్వ ఉద్యోగులకు వాస్తవ పింఛన్ ఉత్తర్వు వచ్చేదాకా ‘తాత్కాలిక’ పింఛన్: డాక్టర్ జితేంద్ర సింగ్
కోవిడ్ మహమ్మారి సమయంలో ఉద్యోగ విరమణచేసే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో అధికారిక లాంఛనాలన్నీ ముగిసి, వాస్తవ పెన్షన్ ఉత్తర్వు (PPO) జారీ అయ్యేదాకా వారికి ‘తాత్కాలిక’ పింఛన్ అందుతుంది. దీనిపై కేంద్ర పెన్షన్ల విభాగం జారీచేసిన కార్యాలయ ప్రకటన మేరకు ఈ ‘తాత్కాలిక’ పెన్షన్ ఆరంభంలో ఆరు నెలలదాకా అందుతుంది. ఆ తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితులున్నట్లయితే మరో ఏడాదిపాటు పొడిగించే అవకాశం ఉంటుంది. ఈ సదుపాయం ఉద్యోగకాలం ముగిశాక రిటైరయ్యేవారితోపాటు స్వచ్ఛందంగా లేదా ఎఫ్ఆర్ (FR) 56 వగైరాల కింద ఉద్యోగ విరమణ చేసేవారికీ వర్తిస్తుందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. కోవిడ్ మహమ్మారి పరిస్థితులు, దిగ్బంధం నేపథ్యంలో అధికారిక కార్యకలాపాల్లో అంతరాయం ఏర్పడినందున.. ఈ కాలంలో పదవీ విరమణ చేసిన కొందరు ఉద్యోగులకు పీపీవోల జారీ వీలుకాలేదని, అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1641730
ఈ-బిఐఎస్ ప్రామాణీకరణ, నిర్ధారణ అంచనా, శిక్షణ పోర్టళ్లుసహా బిఐఎస్ మొబైల్ యాప్ ‘బిఐఎస్-కేర్’ను ప్రారంభించిన శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్
కేంద్ర వినియోగదారు వ్యవహారాలు-ఆహారం-ప్రజా పంపిణీశాఖ మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ నిన్న వినియోగదారుల సౌకర్యార్థం ‘భారత ప్రమాణాల మండలి (BIS)కి సంబంధించిన మొబైల్ యాప్ ‘బిఐఎస్-కేర్’ (BIS-Care)తోపాటు ‘ఈ-బిఐఎస్’ పరిధిలోగల “ప్రామాణీకరణ, నిర్ధారణ- అంచనా, శిక్షణ” పేరిట మూడు పోర్టళ్లను ప్రారంభించారు. ప్రస్తుతం ఆంగ్ల, హిందీ భాషల్లో పనిచేసే ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. దీనిద్వారా ‘ఐఎస్ఐ, హాల్‌మార్క్’ వంటి ముద్రగల ఉత్పత్తుల ప్రామాణికతను నిర్ధారించుకోవచ్చు. అవసరమైతే ఫిర్యాదు కూడా దాఖలు చేయవచ్చు. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యల్లో ఇది ఒకటని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. దీంతోపాటు
ప్రమాణాలు, నాణ్యమైన ఉత్పత్తులపై వినియోగదారులకు అవగాహన కల్పనసహా నాణ్యతలేని ఉత్పత్తుల సరఫరాను తొలగించే దిశగా వినియోగదారుల భాగస్వామ్యం కోసం బిఐఎస్ ఒక పోర్టల్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నదని తెలిపారు. ఇది ప్రస్తుతం పరీక్ష స్థాయిలో ఉండగా, త్వరలోనే ప్రారంభించబడుతుందన్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1641733
పారిశ్రామిక ఆమోదాలు-అనుమతులకు త్వరలో ఏకగవాక్ష విధానం
దేశంలో పరిశ్రమలకు సత్వర అనుమతి-ఆమోదాల కోసం ప్రభుత్వం త్వరలో ఏకగవాక్ష విధానాన్ని ప్రవేశపెడుతుందని కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ నిన్న వెల్లడించారు. ఇది స్వచ్ఛమైన ఏకగవాక్షంగా ఉంటుందని, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వశాఖలతో సంప్రదింపులతో దీన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ‘భూ బ్యాంకు’ ఏర్పాటు దిశగానూ కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, దీనిపై ఇప్పటికే ఆరు రాష్ట్రాలు సమ్మతి తెలిపాయని చెప్పారు. తద్వారా సంభావ్య పెట్టుబడిదారులు దూరప్రాంతం నుంచే తగిన భూ బ్యాంకును ఎంపిక చేసుకుని, పరిశ్రమల ఏర్పాటుకు స్థలం నిర్ణయించుకునే వీలుంటుందన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం ప్రజల ప్రాణరక్షణకు ప్రాధాన్యంతో ప్రపంచంలో ఎక్కడాలేని రీతిలో దిగ్బంధాన్ని అమలు చేసిందన్నారు. ఇప్పుడిక దేశం, ప్రజల జీవితాలు-జీవనోపాధి పరిరక్షణకు నడుం బిగించిందని తెలిపారు. ప్రస్తుతం మనం దిగ్బంధ విముక్తి దశలో ఉన్నామని, దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు గౌరవప్రదమైన స్థాయికి చేరాయని పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1641627
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- పంజాబ్: రాష్ట్రంలో కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ‘మిషన్ ఫతే’ కింద ప్రచారాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్లాస్మా బ్యాంకుల నుంచి- ప్రైవేటు ఆస్పత్రులకు ప్లాస్మాను సహేతుక ధరతో అందించాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది.
- హర్యానా: రాష్ట్రంలో కోవిడ్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని హర్యానా ఆరోగ్య మంత్రి శ్రీ అనిల్ విజ్ కోరారు. తద్వారా చికిత్స పొందుతున్న రోగులు త్వరగా కోలుకునే వీలుంటుందని తెలిపారు.
- మహారాష్ట్ర: రాష్ట్రంలో గత వారం రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదైన నేపథ్యంలో నిన్న ఆ సంఖ్య తగ్గుముఖం పట్టింది. అదేవిధంగా కొత్త కేసులకన్నా కోలుకున్న కేసుల సంఖ్య అధికంగా నమోదవడం అరుదైన విశేషం. ఆ మేరకు మహారాష్ట్రలో సోమవారం 7,924 కొత్త కేసులు నమోదవగా గడచిన 13 రోజుల్లో వ్యవధిలో ఇది అత్యల్పం కావడం గమనార్హం. ఈ కేసులలో 1,033 ముంబైకి చెందినవే కాగా, నగరంలో 1,706 మందిసహా రాష్ట్రవ్యాప్తంగా 8,706 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం మొత్తం 3.83 లక్షల కేసులకుగాను యాక్టివ్ కేసుల సంఖ్య 1.47 లక్షలుగా ఉంది. ఇదిలా ఉండగా, కోవిడ్-19 పరీక్షకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ముంబైలోని ఐసిఎంఆర్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ హెల్త్ వద్ద ‘హై త్రూ-పుట్ టెస్టింగ్’ సదుపాయాన్ని ప్రారంభించారు.
- గుజరాత్: రాష్ట్రంలో 1,052 కొత్త కేసులు, 22 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 56,874కు, మృతుల సంఖ్య 2,348కి పెరిగాయి. రాష్ట్రంలో పగటిపూట రికార్డు స్థాయిలో 25,474 నమూనాలను పరీక్షించగా, ఇప్పటిదాకా పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 6.67 లక్షలు దాటింది. రాష్ట్రంలోని మొత్తం కేసులలో నెలకిందట 8 పెద్ద నగరాల వాటా 80 శాతం కాగా, ఇప్పుడది 51 శాతానికి తగ్గింది.
- రాజస్థాన్: రాష్ట్రంలో తొలిసారి యాక్టివ్ కేసుల సంఖ్య వరుసగా మూడోరోజు 10,000 స్థాయిని దాటింది. దీంతో ఒకేరోజులో అత్యధిక యాక్టివ్ కేసుల రికార్డు నమోదైంది. రాష్ట్రంలో 1,134 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 37,564కు, యాక్టివ్ కేసుల సంఖ్య 10,097కు చేరాయి. కేసుల పెరుగుదల దృష్ట్యా బుండి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం 7 రోజుల దిగ్బంధం ప్రకటించింది.
- మధ్యప్రదేశ్: రాష్ట్రంలో సోమవారం 789 మంది కొత్త కేసులతో మొత్తం రోగుల సంఖ్య 28,589కి చేరింది. మరోవైపు 659మంది కోలుకున్నప్పటికీ యాక్టివ్ కేసుల సంఖ్య 7,978గా ఉంది.
- ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలో సోమవారం 362 కొత్త కేసులు నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 7,980కి పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,763గా ఉంది.
- కేరళ: రాజధాని జిల్లాలోని తీరప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి పెరుగుదల కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తిరువనంతపురంలో దిగ్బంధం కొనసాగించడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఎట్టూమనూర్‌లోని కూరగాయల మార్కెట్‌లో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష సందర్భంగా 46 మందికి వ్యాధి నిర్ధారణ కావడంతో కోట్టయంలో తీవ్ర అప్రమత్తత ప్రకటించారు. మరోవైపు రాష్ట్రంలో నేడు మూడు మరణాల నమోదుతో మొత్తం మృతుల సంఖ్య 63కు చేరింది. ఇక వరుసగా ఐదో రోజు నిన్న 6,000కు మించి కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా, నిన్న 702 కొత్త కేసులు నమోదైన నేపథ్యంలో 745 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం వివిధ జిల్లాల్లో 9,609 మంది చికిత్స పొందుతుండగా 1.55 లక్షల మంది పరిశీలనలో ఉన్నారు.
- తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి మాజీ ఎమ్మెల్యే, ఎన్‌ఆర్ కాంగ్రెస్ నేత వి.బాలన్ కోవిడ్-19కు బలయ్యారు. ఇక ముఖ్యమంత్రి, శానససభాపతి, మంత్రులు, ఎమ్మెల్యేలకు వ్యాధి సోకలేదని పరీక్షల్లో తేలింది. అయితే, మరో ఆరుగురికి కోవిడ్ నిర్ధారణ అయింది. ఎన్ఆర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎన్.ఎస్.జయపాల్ కోవిడ్ బారినపడినట్లు తేలడంతో అందరికీ పరీక్షలు నిర్వహించారు. ఇక తమిళనాడులో ప్రజాపంపిణీ వ్యవస్థద్వారా 2.08 కోట్ల కుటుంబ కార్డుదారులలో 6.74 కోట్ల మందికి ఉచిత మాస్కుల పంపిణీని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. మదురైలో కోవిడ్ కేసులు 10,000స్థాయిని దాటాయి; దీంతో చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు తర్వాత ఈ స్థాయిని దాటిన నాలుగో జిల్లాగా మదురై రికార్డులకెక్కింది. రాష్ట్రంలో నిన్న 6993 కొత్త కేసులు, 77 మరణాలు నమోదయ్యాయి. ఇప్పుడు మొత్తం కేసులు: 2,20,716; యాక్టివ్ కేసులు: 54,896; మరణాలు: 3571; చెన్నైలో యాక్టివ్ కేసులు: 13,064గా ఉన్నాయి.
- కర్ణాటక: రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని జూలై 30-31 తేదీలలో ‘సీఈటీ’ (CET) నిర్వహణపై నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కర్ణాటక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 61,819 యాక్టివ్ కేసులుండగా మరింత పెరుగుతున్న నేపథ్యంలో అత్యధిక యాక్టివ్ కేసులరీత్యా కర్ణాటక ఇప్పుడు మహారాష్ట్ర తర్వాత రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో నిన్న 5324 కొత్త కేసులు, 75 మరణాలు నమోదవగా, 1847 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో బెంగళూరు నగరంలోనే 1470 ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 1,01,465; యాక్టివ్ కేసులు: 61,819; మరణాలు: 1953; కోలుకున్నవి: 37,685గా ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 32వేల పడకల సౌకర్యం అందుబాటులోగల 128 జిల్లా ఆసుపత్రులను ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 రోగులను చేర్చుకునే ప్రక్రియను 30 నిమిషాలకు మించకుండా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే వివిధ జిల్లా, 10 రాష్ట్రస్థాయి కోవిడ్ ఆసుపత్రులలో పడకల లభ్యత సమాచారాన్ని ప్రజలకు ప్రదర్శించాలని స్పష్టం చేశారు. రోజువారీ కరోనా పరీక్షలలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, ఈ మేరకు తీవ్రముప్పుగల ప్రాంతాల్లో 90 శాతం పరీక్ష నిర్వహించారని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో కరోనావైరస్ నియంత్రణకు కేంద్ర నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్రంలో నిన్న 6051 కొత్త కేసులు, 49 మరణాలు నమోదవగా, 3234 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం మొత్తం కేసులు: 1,02,349; యాక్టివ్ కేసులు: 51,701; మరణాలు: 1090గా ఉన్నాయి.
- తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలంగాణ హైకోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏకాంత గృహవాసం-దూరవైద్యం (హితం-HITAM) పేరిట రూపొందించిన కొత్త యాప్ గురించి ధర్మాసనానికి నివేదించారు. దీని సాయంతో వైద్యులు కోవిడ్ సోకిన వ్యక్తులకు మందులు సూచిస్తారని పేర్కొన్నారు. అలాగే రోగులు అంబులెన్స్ వాహనం కోసం కాల్ చేయవచ్చునని, పరిస్థితి విషమంగా ఉంటే ఆసుపత్రికి తరలించే వీలుంటుందని తెలిపారు. కాగా, కోవిడ్-19 చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులలో పడకల లభ్యతపై రాష్ట్ర ప్రభుత్వం సమాచారం అందజేస్తుంది; తదనుగుణంగా ప్రస్తుతం ప్రైవేటు కోవిడ్ కేంద్రాలలో 1465, ప్రభుత్వ ఆరోగ్యరక్షణ కేంద్రాల్లో 6204 వంతున అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1610 కొత్త కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి; కొత్త కేసులలో 531 జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నాయి. ఇక ఇప్పటివరకూ 803 మంది కోలుకోగా, ప్రస్తుతం మొత్తం కేసులు 57,142; యాక్టివ్ కేసులు: 13,753; మరణాలు 480గా ఉన్నాయి.
- అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలోని ఇటానగర్ రాజధాని ప్రాంతంలో రెండు రోజులుగా 3126 ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించగా 52 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది.
- అసోం: రాష్ట్రంలో లక్ష్యనిర్దేశిత నిఘా కార్యక్రమం కింద నేటిదాకా 8 లక్షల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు అసోం ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వశర్మ ట్వీట్ చేశారు.
- మణిపూర్: రాష్ట్రంలోని లాంబోయిఖోంగ్నాంగ్‌కాంగ్ వద్ద మణిపూర్ ట్రేడ్ అండ్ ఎక్స్‌పో సెంటర్ ప్రాంగణంలో 300 పడకలతో కోవిడ్ రక్షణ కేంద్రం మరో 3 రోజుల్లో అందుబాటులోకి రానుంది.
- మిజోరం: రాష్ట్రంలో మొత్తం 384 కేసులకుగాను ఇప్పటిదాకా 198 మంది కోలుకోగా, ప్రస్తుతం 186 మంది చికిత్స పొందుతున్నారు.
- నాగాలాండ్: రాష్ట్రంలో 75 కొత్త కేసులకుగాను కోహిమాలో 51, ఫెక్‌లో 10, వోఖాలో 7, మోన్-దిమాపూర్‌లలో 3వంతున, తున్సాంగ్ జిల్లాలో 1 నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 1459కి చేరగా, 885 యాక్టివ్ కేసులున్నాయి. ఇక నాగాలాండ్‌లో ఇప్పటిదాకా 569మంది కోలుకున్నారు.


****
(Release ID: 1641942)
Visitor Counter : 250