వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ఈ-బి.ఎస్. యొక్క ప్రామాణీకరణ, అనుగుణత అంచనా మరియు శిక్షణ పోర్టళ్ళతో సహా, బి.ఐ.ఎస్. మొబైల్ యాప్ "బి.ఐ.ఎస్-కేర్" ను ప్రారంభించిన - శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్.

వినియోగదారుల రక్షణ (ఈ-కామర్సు) నిబంధనలు, 2020 తో సహా వినియోగదారుల రక్షణ చట్టం-2019 లోని అన్ని నిబంధనలు 2020 జూలై 24వ తేదీ నుండి అమల్లోకి వచ్చాయి – శ్రీ పాశ్వాన్.

Posted On: 27 JUL 2020 6:30PM by PIB Hyderabad

కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ ఈ రోజు భారతీయ ప్రమాణాల మండలి (బి.ఐ.ఎస్.) కి చెందిన మొబైల్ యాప్ 'బి.ఐ.ఎస్-కేర్' తో పాటు "ఈ-బి.ఐ.ఎస్." కు చెందిన ప్రామాణికత, అనుగుణత అంచనా మరియు శిక్షణ అనే మూడు పోర్టళ్లను వినియోగదారుల కోసం  www.manakonline.in  అనే వెబ్ సైట్ లో  ప్రారంభించారు.  'బి.ఐ.ఎస్-కేర్' అనే మొబైల్ యాప్ ని ఏ ఆండ్రాయిడ్ ఫోనులో  నుంచైనా ఉపయోగించవచ్చు.  ఈ యాప్ హిందీ మరియు ఆంగ్ల భాషల్లో పనిచేస్తుంది,  గూగుల్ ప్లే స్టోర్ నుండి దీనిని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వినియోగదారులు ఐ.ఎస్.ఐ. మార్కుతో ఉన్న, హాల్‌మార్కు తో ఉన్న ఉత్పత్తుల యొక్క ప్రామాణికతను తనిఖీ చేయవచ్చు మరియు ఈ  యాప్ ఉపయోగించి ఫిర్యాదులను దాఖలు చేయవచ్చు.  వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని మంత్రి చెప్పారు.

ప్రమాణాలను అమలు చేయడానికి ధృవీకరణ మరియు నిఘా బి.ఐ.ఎస్ పనితీరు యొక్క మరో ముఖ్యమైన అంశం అని శ్రీ పాశ్వాన్ అన్నారు.  ఫ్యాక్టరీ మరియు మార్కెట్ పర్యవేక్షణ కోసం బయటి ఏజెన్సీల సేవలను చేర్చుకోవడం, మొబైల్ యాప్ ఆధారిత మరియు ఎ.ఐ-తో కూడిన నిఘా అభివృద్ధి పద్ధతులు వంటి అన్ని విధులను నిర్వహించే సమగ్రమైన "ఈ-బి.ఐ.ఎస్" పోర్టల్ ను అమలు చేయడం ద్వారా బి.ఐ.ఎస్ తన అమలు సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుందని కేంద్రమంత్రి పేర్కొన్నారు.  ప్రమాణాలు మరియు నాణ్యమైన ఉత్పత్తుల గురించి వినియోగదారులకు అవగాహన కలిగించడంతో పాటు, నాణ్యతలేని ఉత్పత్తుల సరఫరాను తొలగించే మా ప్రయత్నాల్లో ఇది ఒక ముఖ్యమైన భాగంగా మారిందని ఆయన పేర్కొన్నారు.  వినియోగదారుల భాగస్వామ్యం కోసం బి.ఐ.ఎస్. ఒక పోర్టల్‌ను అభివృద్ధి చేస్తోందనీ, ఇది వినియోగదారుల సంఘాల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ప్రతిపాదనలు సమర్పించడం, ఆమోదం పొందడం మరియు ఫిర్యాదుల నిర్వహణ వంటి కార్యకలాపాలను సులభతరం చేస్తుందని మంత్రి వివరించారు. 

"వన్ నేషన్, వన్ స్టాండర్డ్" అంటే ఒక దేశం, ఒక ప్రమాణం" అనే విధానాన్ని అమలు చేసే ప్రణాళిక గురించి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ వివరిస్తూ, ప్రామాణిక సూత్రీకరణ యొక్క సామరస్యత లక్ష్యంతో దేశంలోని ఇతర ప్రామాణిక అభివృద్ధి సంస్థల గుర్తింపు కోసం బి.ఐ.ఎస్.  ఒక పథకాన్ని రూపొందించిందని చెప్పారు.  ఇది ప్రస్తుతం పరీక్ష స్థాయిలో ఉంది, త్వరలో ప్రారంభించబడుతుంది. ఎగుమతి, దిగుమతులను నియంత్రించడానికి సుంకంతో సంబంధం లేని అడ్డంకులను ఉపయోగించడంపై ప్రభుత్వ ఆలోచనను మంత్రి తెలియజేస్తూ, ప్రమాణాలను తప్పనిసరి చేయడానికి నాణ్యతా నియంత్రణ విధానం (క్యూ.సి.ఓ) లను రూపొందించడంలో బి.ఐ.ఎస్. పోషిస్తున్న పాత్రను ప్రత్యేకంగా పేర్కొన్నారు.  368 ఉత్పత్తులకు క్యూ.సి.ఓ. లను జారీ చేయడంలో,  బి.ఐ.ఎస్. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలతో చురుకుగా పనిచేసిందనీ, మరో  239 ఉత్పత్తుల కోసం క్యూ.సి.ఓ. లను రూపొందించే పని పురోగతిలో ఉందనీ,  ఆయన చెప్పారు.  ప్రమాణాలు తప్పనిసరి అయిన నేపథ్యంలో,  దేశీయ, విదేశీ తయారీదారులు వాటిని తప్పక పాటించాలి.  బి.ఐ.ఎస్. జారీ చేసిన లైసెన్సుల సంఖ్య ప్రస్తుతం 37,000 గా ఉందని, క్యూ.సి.ఓ. ల కారణంగా ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. 

ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ యొక్క లక్ష్యాలను సాధించడానికి, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, మన ఎగుమతులను పెంచడానికి మరియు చౌక మరియు నాణ్యత లేని ఉత్పత్తుల దిగుమతిని నియంత్రించడానికి, అదేవిధంగా,  ముఖ్యమైన రంగాలలో ప్రమాణాలను రూపొందించడానికీ, బి.ఐ.ఎస్. తన ప్రయత్నాలను మరింత బలోపేతం చేయాల్సి ఉందని శ్రీ పాశ్వాన్ సూచించారు.  వినియోగదారుల వ్యవహారాల విభాగం ప్రామాణిక జాతీయ కార్యాచరణ ప్రణాళికను ఆమోదించిందనీ, ప్రమాణాల అభివృద్ధికి ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్యమైన రంగాలను గుర్తించిందని ఆయన తెలియజేశారు.

ఎమ్.ఎస్.ఎమ్.ఈ. లకు సహాయం చేయవలసిన అవసరాన్ని కూడా శ్రీ పాశ్వాన్ పునరుద్ఘాటించారు, కోవిడ్-19 ను ఎదుర్కోవటానికి వీలుగా ఎమ్.ఎస్.ఎమ్.ఈ. లకు ఇచ్చిన సడలింపులను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.  కనీస మార్కింగ్ ఫీజును 40 శాతం మేర తగ్గించడంతో పాటు, ఆ ఫీజును రెండు వాయిదాలుగా జమ చేసే అవకాశం కూడా వారికి కల్పించినట్లు, ఆయన చెప్పారు.  లైసెన్సు పునరుద్ధరణకు గడువును 2020 సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించారు.

ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి సమయంలో, కవర్-ఆల్ మరియు వెంటిలేటర్ల కోసం కోవిడ్ ప్రమాణాలను బి.ఐ.ఎస్.  రూపొందించింది. ఎన్-95 మాస్కులు, సర్జికల్ మాస్కులు, కళ్ళకు రక్షణనిచ్చే పరికరాల తయారీకి లైసెన్సు మంజూరు చేయడానికి అవసరమైన నిబంధనలను కూడా బి.ఐ.ఎస్. జారీ చేసింది.  దీని ఫలితంగా ఐ.ఎస్.ఐ. గుర్తింపు పొందిన పి.పి.ఈ. వస్తువుల ఉత్పత్తి పెరిగింది.  దేశంలో ఐ.ఎస్.ఐ. గుర్తింపు పొందిన ఎన్-95 మాస్కుల రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం గతంలో రెండు లక్షల కన్నా తక్కువగా ఉండేది, ఇప్పుడు నాలుగు లక్షలకు పైగా పెరిగింది.

బి.ఐ.ఎస్. ప్రయోగశాలల విస్తరణ, ఆధునీకరణ గురించి శ్రీ పాశ్వాన్ మాట్లాడుతూ, తాగునీటి పరీక్షా సౌకర్యాలు, బంగారు ఆభరణాలను పరిశీలించడం వంటి సౌకర్యాలు 8 బి.ఐ.ఎస్. ప్రయోగశాలలతో పాటు, హైదరాబాద్, అహ్మదాబాద్, జమ్మూ, భోపాల్, రాయపూర్రా, లక్నో వంటి వివిధ శాఖా కార్యాలయాలలో కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. 

నోయిడాలోని జాతీయ ప్రామాణీకరణ సంస్థ ద్వారా భారతీయ ప్రమాణాల మండలి వివిధ వాటాదారులకు శిక్షణ ఇస్తోంది, ఎందుకంటే, ప్రమాణాల ప్రాచుర్యం మరియు అమలులో శిక్షణ అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.  దీని ద్వారా ఇప్పుడు సమగ్ర శిక్షణా విధానాన్ని రూపొందించారు. పరిశ్రమలు, వినియోగదారుల సంస్థలు మరియు ప్రభుత్వాధికారుల వద్దకు చేరుకోవడానికి వీలుగా, పెద్ద ఎత్తున ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ కోర్సుల ద్వారా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. దేశంలో వృత్తి విద్య యొక్క పాఠ్యాంశాల్లో ప్రమాణాలను ఏకీకృతం చేసే చర్యల గురించి శ్రీ పాశ్వాన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.  ఇందుకోసం అవసరమైన ఒక విజ్ఞాపన పత్రాన్ని రూపొందించి, ఎమ్.హెచ్.ఆర్.డి., ఏ.ఐ.సిటీ.ఈ. తో పాటు ఇతర వాటాదారులకు అందజేయడం జరిగింది. 

బి.ఐ.ఎస్. డైరెక్టర్ జనరల్ అందజేసిన వివరాల కోసం ఇక్కడ నొక్కండి. 

అనంతరం, శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ మీడియాతో మాట్లాడుతూ, వినియోగదారుల రక్షణ (ఈ-కామర్సు) నిబంధనలు, 2020 తో సహా వినియోగదారుల రక్షణ చట్టం-2019 లోని అన్ని నిబంధనలు 2020 జూలై 24వ తేదీ నుండి అమల్లోకి వచ్చాయని తెలియజేశారు.   కొత్త వినియోగదారుల రక్షణ చట్టం-2019 ని 2020 జులై, 20వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమలు చేశారు.  ఇ-కామర్సులో నెలకొన్న అన్యాయమైన వాణిజ్య పద్ధతులను నివారించడానికి, సకాలంలో, సమర్థవంతమైన పరిపాలన కోసం యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వినియోగదారుల ప్రయోజనాలు, హక్కులను పరిరక్షించేందుకు, వినియోగదారుల వివాదాల పరిష్కారం కోసం కొత్త చట్టం నిబంధనల ద్వారా అనేక చర్యలను అందిస్తోందని శ్రీ పాశ్వాన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.   తదనుగుణంగా, వినియోగదారుల రక్షణ (ఇ-కామర్సు) నిబంధనలు-2020 ని కేంద్ర ప్రభుత్వం జారీచేసిందని ఆయన చెప్పారు.   డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ నెట్‌వర్క్ ద్వారా కొనుగోలు చేసిన లేదా విక్రయించే అన్ని వస్తువులు మరియు సేవలకు, మార్కెట్ స్థలం (అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ వంటివి) మరియు జాబితా మోడళ్లతో సహా (స్వంత సరకు నిల్వ ఉన్న ఈ-కామర్సు సంస్థలకు కూడా) ఈ నియమాలు వర్తిస్తాయని ఆయన అన్నారు.  ఈ నియమాలు ఇ-కామర్సు సంస్థలు (మార్కెట్ ప్లేస్ & ఇన్వెంటరీ మోడల్) మరియు మార్కెట్ ప్లేస్ ఇ-కామర్సు సంస్థలపై అమ్మకందారుల యొక్క విధులు మరియు బాధ్యతలను నిర్దేశిస్తాయి.

ఈ-కామర్సు సంస్థలు వారి వెబ్ సైట్లలో వారి చట్టపరమైన పేరు, ప్రధాన కార్యాలయాలు / అన్ని శాఖల భౌగోళిక చిరునామాలు, వెబ్ ‌సైట్ పేరు, ఈ-మెయిల్ చిరునామా, ఫ్యాక్సు, ల్యాండ్‌ లైన్ ఫోను నెంబరు, కస్టమర్ కేర్  మొబైల్ నంబర్లు, పిర్యాదులు స్వీకరించే అధికారి వివరాలతో పాటు, సంప్రదించడానికి అవసరమైన పూర్తి వివరాలను పొందుపరచవలసి ఉంటుందని, ఆయన తెలిపారు.  వస్తువు తిరిగి తీసుకోవడం, డబ్బు తిరిగి ఇవ్వడం, వస్తువు మార్చి వేరేది ఇవ్వడం, వారంటీ, హామీ, డెలివరీ, రవాణా, చెల్లింపు పద్ధతులు, ఫిర్యాదుల పరిష్కార విధానం, చెల్లింపు పద్ధతులు, చెల్లింపు పద్ధతుల భద్రత, ఛార్జ్-బ్యాక్ ఎంపికలు మొదలైన వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా వారు అందించాలి.  నిబంధనల ప్రకారం, ధృవీకరణ తర్వాత ఆర్డర్లను రద్దు చేసే వినియోగదారులపై ఇ-కామర్సు సంస్థలు రద్దు ఛార్జీలు విధించకూడదు, అయితే, వారే, ఆర్డర్లు ఏకపక్షంగా రద్దు చేసిన సందర్భాల్లో ఇలాంటి ఛార్జీలు వారే భరించాలి.

దిగుమతి చేసుకున్న వస్తువులు లేదా సేవలను విక్రయించడానికి ఈ-కామర్సు సంస్థ అందిస్తే, అది దిగుమతిదారు పేరు, వివరాలను పేర్కొనాలి.  ఒక అమ్మకందారుడు అమ్మకానికి ఇచ్చే వస్తువులు, సేవల గురించి సంబంధిత దేశంతో సహా అన్ని వివరాలను మార్కెట్ స్థలంలో పొందుపరచాలి, ఆ సమాచారం వినియోగదారునికి ఆ వస్తువు కొనుగోలుకు ముందే తగిన నిర్ణయం తీసుకోడానికి ఉపయోగపడుతుంది. 

ప్రతి ఈ-కామర్సు సంస్థ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి, పిర్యాదులు స్వీకరించడానికి ఒక అధికారిని నియమించవలసిన అవసరం ఉందనీ, ఆ అధికారి పేరు, హోదాతో పాటు, సంప్రదించడానికి అవసరమైన వివరాలను ఆ సంస్థ వెబ్ సైట్ ‌లో ప్రదర్శించాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు.  ఏ వినియోగదారుడైనా పిర్యాదు చేస్తే, నలభై ఎనిమిది గంటలలోపు ఆ ఫిర్యాదును స్వీకరించినట్లు వినియోగదారునకు తెలియజేయాలి. ఫిర్యాదు స్వీకరించిన తేదీ నుండి ఒక నెల రోజుల లోపు ఫిర్యాదును పరిష్కరించే విధంగా ఈ-కామర్సు సంస్థలు తగిన చర్యలు తీసుకోవాలి. 

ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే, వినియోగదారుల రక్షణ చట్టం, 2019 లోని నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.  అనుచితమైన వాణిజ్య విధానాలు, తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన పిర్యాదుల విషయంలో, కేంద్ర వినియోగదారుల రక్షణ సాధికార సంస్థ చర్య తీసుకుంటుంది.   ఏదైనా పరిహారం కోసం, వినియోగదారుడు తమ పరిధిలోని వినియోగదారుల కమిషన్ ‌ను సంప్రదించవచ్చు.

*****



(Release ID: 1641733) Visitor Counter : 279