ఉప రాష్ట్రపతి సచివాలయం
విద్యార్థుల్లో మంచి, చెడులను బేరీజు వేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించాలి!: ఉపరాష్ట్రపతి
- సామాజిక మాధ్యమాల ప్రభావం నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండటం నేర్పించాలి
- పిల్లలో పఠనాసక్తి తగ్గిపోతోంది.. దీనిపై దృష్టిపెట్టాలి
- టైమ్స్ స్కాలర్స్ ఈవెంట్‌లో గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు
- శారీరక దృఢత్వంతోపాటు మానసిక సంతులనానికి యోగా చేయండి
- కరోనా కారణంగా విద్యా ప్రణాళికలో వచ్చిన మార్పులపై ఆందోళన వద్దని విద్యార్థులకు సూచన
Posted On:
27 JUL 2020 5:22PM by PIB Hyderabad
సామాజిక మాధ్యమాల ప్రభావం పెరిగిన నేపథ్యంలో.. హంస ఎలాగైతే.. నీటిని, పాలను వేరు చేయగలదో.. అలాగే విద్యార్థుల్లో చిన్నతనం నుంచే మంచి, చెడులను బేరీజు వేసుకునే సామర్థ్యాన్ని పెంపొందింపజేయాలని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. సోమవారం ఉపరాష్ట్రపతి భవన్ నుంచి ఆన్‌లైన్లో టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థ నిర్వహించిన ‘టైమ్స్ స్కాలర్స్ ఈవెంట్’ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వాస్తవాలను తెలుసుకుని దాన్ని అలవర్చుకోవడం, అసత్యాలను గుర్తించి వాటికి దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.
విద్యార్థుల్లో పఠనాసక్తి తగ్గిపోతుండటంపై ఉపరాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. పుసక్త పఠనం, వార్తాపత్రికల పఠనాన్ని దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాలని విద్యార్థులు, యువతకు సూచించారు. అపరిమిత సమాచారం అరచేతిలోనే అందుబాటులో ఉన్న ఈ పరిస్థితుల్లో జాగరూకతతో వ్యవహరించడంతోపాటు నిరంతర అధ్యయనం చేయడం, పుస్తకాలు చదవడంపై విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు.
‘కలలు కనండి. వాటి సాకారానికి కృషిచేయండి’ అన్న మాజీ రాష్ట్రపతి శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం చెప్పిన సూక్తిని ఆయన గుర్తుచేశారు. ఈ కలలను సాకారం చేసుకునేందుకు క్రమశిక్షణ, కఠోరమైన శ్రమ, చిత్తశుద్ధి, పట్టుదలతోపాటుగా దృఢసంకల్పంతో ముందుకెళ్లాలన్నారు. కరోనా నేపథ్యంలో విద్యాసంవత్సరం, ప్రణాళికలో వచ్చిన మార్పుల కారణంగా విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి పెరిగిపోయిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఎవరి చేతుల్లోనూ లేని అంశాలపై ఆందోళన చెందవద్దన్నారు.
‘మానసిక సంతులనాన్ని అలవర్చుకోవాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలి’ అని ఆయన అన్నారు. ఇందుకోసం యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగా ద్వారా శారీరక దృఢత్వంతోపాటు మానసిక స్థిరత్వం అలవరుతుందన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యాధినిరోధకతను పెంచుకోవడంతోపాటు ఏకాగ్రత, క్రమశిక్షణ పెంచుకునేందుకు యోగాసాధన ఉపయుక్తంగా ఉంటుందన్నారు.
నేటి ప్రపంచంలో ప్రతి రంగంలో తీవ్రమైన పోటీ నెలకొందని.. దీన్ని అధిగమించేందుకు తమ తమ రంగాల్లో నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా ఉన్నతస్థానాలకు చేరుకోవాలన్నారు. ‘విజయం సాధించేందుకు అడ్డదార్లు ఉండవు. దయచేసి ఈ విషయాన్ని అందరూ మదిలో ఉంచుకోవాలి’ అని ఉపరాష్ట్రపతి సూచించారు.
విద్యను ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సాధనంగా మాత్రమే భావించవద్దని.. జ్ఞానాన్ని పెంపొందించుకుని సాధికారత సాధించేందుకు విద్యను వినియోగించుకోవాలన్నారు. ప్రాచీన భారతీయ విద్యావిధానంలో విద్యతోపాటు నైతిక విలువల బోధన కూడా జరిగేదన్న విషయాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేస్తూ.. నేటితరం చిన్నారుల్లోనూ దయ, జాలి, కరుణ, క్షమాగుణం, పెద్దలపట్ల గౌరవభావాలు వంటివి పెంపొందించేందుకు కృషి జరగాలని సూచించారు. యువత.. భారతీయ సంస్కృతి, వారసత్వ సంపద, ఘనమైన చరిత్రను తెలుసుకోవాలని సూచించారు.
సాధించిన దానితో సంతృప్తి చెందకుండా.. మరింత ఉన్నతస్థితిని చేరుకునే లక్ష్యంతో కృషిచేయాలన్నారు. నేటి ప్రపంచం ఎదుర్కుంటున్న పేదరికం, అసమానతలు, హింస, వాతావరణ మార్పులు తదితర అంశాలకు వినూత్న పరిష్కారాలకోసం కృషిచేయాలని యువతకు సూచించారు.
***
(Release ID: 1641627)
Visitor Counter : 280