ప్రధాన మంత్రి కార్యాలయం

కోల్ కతా, ముంబయ్, నోయిడాలలో ఉన్నత శ్రేణి కోవిడ్ పరీక్షా కేంద్రాలు ప్రారంభించిన ప్రధాని

దేశంలో రోజుకు 5 లక్షలకు పైగా పరీక్షలు, కొద్ది వారాల్లో 10 లక్షలకు పెంచే ప్రయత్నం

భారత్ లో 11,000 కోవిడ్ కేంద్రాలు, 11లక్షల ఐసొలేషన్ పడకలు: ప్రధాని

మరిన్ని ఆరోగ్య మౌలిక సదుపాయాలపై దృష్టి, గ్రామాల్లోనూ కోవిడ్ సౌకర్యాల పెంపు

కోవిడ్ సంక్షోభ సమయంలో చర్యలు, ప్రధాని నాయకత్వంపై ముఖ్యమంత్రుల ప్రశంసల జల్లు

Posted On: 27 JUL 2020 5:56PM by PIB Hyderabad

ప్రధాని నరేంద్రమోదీ ఈ రోజు అత్యున్నత స్థాయి కోవిడ్ పరీక్షా కేంద్రాలను ప్రారంభించారు. భారతీయ వైద్య పరిశోధనామండలికి చెందిన జాతీయ సంస్థలను కోల్ కతా, ముంబయ్, నోయిడా కేంద్రాలలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. 


ఈ అత్యాధునిక హై టెక్ పరీక్షా కేంద్రాలలో ఉన్న సౌకర్యాలు కోవిడ్ పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతాయని, ఫలితంగా ఈ మూడు నగరాల్లో రోజుకు పదివేల పరీక్షలు జరిపే వీలుంటుందని ప్రధాని అన్నారు. పరీక్షల సంఖ్య పెరిగేకొద్దీ కేసుల గుర్తింపు పెరుగుతుందని, దాని వలన వైరస్ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకోగలుగుతామని అన్నారు. ఈ పరీక్షా కేంద్రాలు కేవలం కోవిడ్ పరీక్షలకే పరిమితం కాబోవని, భవిష్యత్తులో హెపటైటిస్ బి, సి, హెచ్ ఐ వి, డెంగ్యూ తదితర అనేక వ్యాధులను నిర్థారించగలవని చెప్పారు.


సకాలంలో నిర్ణయాలు


ప్రభుత్వం సకాలంలో తీసుకున్న నిర్ణయాల ఫలితంగా ఇతర దేశాల కంటే భారత్ కరోనా కట్టడిలో మెరుగైన స్థితిలో ఉందన్న విషయాన్ని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అందుకే కోవిడ్ మరణాలను గణనీయంగా తగ్గించగలిగామన్నారు. కోలుకున్నవారి సంఖ్య కూడా రోజు రోజుకూ పెరుగుతూ ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైరస్ సోకి కోలుకున్నవారి సంఖ్య పది లక్షలు చేరుకుంటున్నదన్నారు.


కరోనా సంబంధిత మౌలిక సదుపాయాల కల్పన


కరోనా సంబంధమైన మౌలిక వసతులు వేగంగా అభివృద్ధి చేసుకోవటం, పెంచుకోవటం దేశానికి తప్పనిసరి అన్నారు. ఈ పోరు మొదలైనప్పుడు కేంద్రం రూ.15,000 కోట్ల పాకేజ్ ప్రకటించిందని, ఇప్పుడు దేశవ్యాప్తంగా11,000 కోవిడ్ కేంద్రాలు ఉండగా వాటిలో, 11లక్షల ఐసొలేషన్ పడకలున్నాయని ప్రధాని అన్నారు. జనవరిలో దేశంలో ఒకే ఒక్క కోవిడ్ పరీక్షాకేంద్రం ఉండగా ఇప్పుడు అలాంటివి 1300 లాబ్ లు ఉన్నాయన్నారు. ప్రస్తుతం రోజుకు ఐదు లక్షల వంతున పరీక్షలు జరుగుతున్నాయని, మరి కొద్ది వారాల్లోనే ఈ సామర్థ్యాన్ని రోజుకు పది లక్షలకు పెంచటానికి కృషి జరుగుతోందని చెప్పారు


ప్రపంచంలో పిపిఇ కిట్స్ తయారీలో రెండో పెద్ద దేశంగా  ఇప్పుడు భారత్ తయారైందన్నారు. కేవలం ఆరు నెలల కిందట ఒక్క కిట్ కూడా తయారు చేసుకోలేని పరిస్థితి నుంచి ఇప్పుడు 1200  మందికి పైగా తయారీదారులు ఉండేలా ఎదిగిందన్నారు. వీళ్ళు రోజుకు 5 లక్షల కిట్స్ తయారు చేయగలుగుతున్నారన్నారు. 

 

దిగుమతుల మీద ఆధారపడే స్థితి నుంచి ఇప్పుడు రోజుకు  3 లక్షల ఎన్-95  మాస్కులు తయారు చేయగలిగే స్థితికి వచ్చామని చెప్పారు. ఏడాదికి 3  లక్షల వెంటిలేటర్ల చొప్పున మనం తయారు చేసుకోగలుగుతున్నామని, ఆక్సిజెన్ సిలిండర్ల తయారీలో సైతం అదే విధమైన పురోగతి కనబడుతోందని చెప్పారు. దీనివలన ప్రజల ప్రాణాలు కాపాడటమే కాకుండా భారత్ ను దిగుమతుల బారినుమ్చి తప్పిమ్చి ఎగుమతులు చేయగలిగే దేశంగా మార్చుకోగలిగామన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటం గురించి ప్రస్తావిస్తూ, కొత్తగా అక్కడ కూడా మౌలిక సదుపాయాలు కల్పించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇప్పటికే ఉన్న సదుపాయాల స్థాయి మరింత పెంచుకొవాలని కూడా సూచించారు.


మానవ వనరుల పెంపు


భౌతిక వసతుల కల్పనతో బాటుగా దేశం చాలా త్వరగా మానవ వనరులను సైతం పెంచుకోగలిగిందని ప్రధాని అభిప్రాయపడ్దారు. పారామెడికల్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలు వారిలో ఉన్నారన్నారు.  వైరస్ మహమ్మారి వ్యాపించకుండా చూడటంలో వారి సేవలు అసామాన్యమైనవని అభినందించారు. కొత్త, ఉద్యోగ విరమణ చేసిన వైద్యుల సేవలు కూడా నిరవధికంగా వాడుకోవటం ద్వారా వైద్య వ్యవస్థను పటిష్ఠం చేసుకోవాలని, కరోనా యోధులలో అలసట తగ్గించాలని ప్రధాని సూచించారు.


పండుగల వేళ సురక్షితంగావచ్చే ఉంటూ వైరస్ వ్యాప్తి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రధాని ప్రజలకు పిలుపునిస్తూ ముందస్తు హెచ్చరికలు జారీచేశారు. ప్రధాని గరీబ్ కల్యాణ్ అన్న యోజన ఫలాలు నిరుపేదలకు సకాలంలో అందాలని కోరారు. వాక్సిన్ తయారయ్యే దాకా రెండు గజాల దూరం, మాస్కులు ధరించటం, శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవటం తప్పనిసరిగా పాటించాలన్నారు.


కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ, కోవిడ్ పరీక్షలు జరపటానికి లాబ్ లు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందుబాటులొ ఉన్నాయన్నారు. కేంద్ర హోమ్ మంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రితోఈ కలసి పనిచేస్తూ జాతీయ రాజధాని ఢిల్లీలో వైరస్ వ్యాపించకుందా కట్టుదిట్టమైన చర్యలు తీసుకూంటున్నారన్నారు.


ముఖ్యమంత్రుల మాట


పరీక్షా కేంద్రాలు ప్రారంభించటం పట్ల ముఖ్యమంత్రులు ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఉద్ధవ్ ఠాక్రే ఈ కష్ట కాలంలో ప్రధాని చూపిన నాయకత్వపటిమను ప్రశంసల్లో ముంచెత్తారు. వైరస్ ను తరిమేద్దాం అనే నినాదంతో ముంబయ్ లో తీసుకున్న చర్యల గురించి చెబుతూ ఇప్పుడు ప్రారంభించిన అత్యాధునిక పరీక్షాకేంద్రాన్ని శాశ్వత ఇన్ఫెక్షన్ ఆస్పత్రిగా ముంబయ్ కి కూడా కేటాయించాలని కోరారు.


ప్రధాని రాష్ట్రాల పట్ల అనుసరిస్తున్న సహకార ధోరణికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రత్యేకంగా అభినందించారు. కేసులను గుర్తించటంలోను, టెలీమెడిసిన్ వాడటం లోను జరుగుతున్న కృషిని ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో ఇప్పుడున్న పరీక్షాకేంద్రాలను ఇంకా పెంచాల్సిన అవసరం ఉందన్నారు.


వైరస్ మీద ప్రధాని అవిశ్రాంతంగా జరుపుతున్న పోరుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రోజు ప్రారంభించిన లాబ్ ల వల్ల పరీక్షల సమయం గణనీయంగా తగ్గుతుందన్నారు. రాష్ట్రంలో పరీక్షల సామర్థ్యాన్ని పెంచటం వలన రోజువారీ పరీక్షల సంఖ్య పెరుగుతుందన్నారు.


ఈ మూడు అత్యాధునిక పరీక్షాకేంద్రాలలో ఒకటి భారతీయ వైద్య పరిశోధనామండలి- నోయిడాలోని జాతీయ కాన్సర్ నివారణ పరిశోధనా సంస్థ ఏర్పాటు చేయగా మరొకటి భారతీయ వైద్య పరిశోధనామండలి - ముంబయ్ లోని పునరుత్పత్తి ఆరోగ్య పరిశోధనా సంస్థ ఏర్పాటు చేసాయి. మరొకదాన్ని భారతీయ వైద్య పరిశోధనామండలి - కోల్ కతా లోని కలరా, అంటువ్యాధుల జాతీయ సంస్థ ఏర్పాటు  చేశాయి. ఇవి ఒక్కొక్కటి రోజుకు పది వేలకు పైగా పరీక్షలు చేయగలుగుతాయి. పరీక్షల సమయాన్ని కూడా ఇవి బాగా తగ్గించగలుగుతాయి. పరీక్షలకోసం వచ్చేవారు అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం నుంచి కూడా తప్పించుకోగలుగుతారు.  కోవిడ్ మాత్రమే కాకుండా హెపటైటిస్ బి, సి, హెచ్ ఐ వి, టిబి, డెంగ్యు లాంటి వ్యాధులకు కూడా నిర్థారణ పరీక్షలు జరపగలుగుతాయి..

***



(Release ID: 1641729) Visitor Counter : 288