PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
13 JUL 2020 6:35PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- కోవిడ్-19 నుంచి కోలుకున్నవారి సంఖ్య 5.5 లక్షలకుపైగానే; చికిత్స పొందేవారికన్నా వ్యాధి నయమైనవారి సంఖ్య 2.5 లక్షలకుపైగా అధికం.
- కోలుకునేవారి జాతీయ సగటు 63.02 శాతం కాగా, 19 రాష్ట్రాల్లో ఇంతకన్నా అధికంగా నమోదు.
- కోవిడ్-19 మరణాల్లో జాతీయ సగటు 2.64 శాతంకాగా, 30 రాష్ట్రాల్లో మరింత తక్కువ నమోదు.
- రోగ నిర్ధారణ నమూనాల పరీక్ష జాతీయ సగటు ప్రతి 10 లక్షలమందికి 8555గా నమోదు.
- గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌తో ప్రధానమంత్రి సంభాషణ; కోవిడ్ మహమ్మారిపై భారత్ పోరాటంలో ప్రధాని నాయకత్వంపై గూగుల్ సీఈవో ప్రశంసలు.
- దేశంలో మూడు బల్క్ డ్రగ్ పార్కులు, నాలుగు వైద్య పరికరాల పార్కుల ఏర్పాటుకు స్థల ఎంపికపై మార్గదర్శకాలు ఖరారు చేస్తున్న ఔషధ శాఖ.


కోవిడ్-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ సమాచారం: కోలుకునేవారి సంఖ్య 5.5 లక్షలకుపైగా; జాతీయ సగటు 63.02 శాతం..19 రాష్ట్రాల్లో మరింత అధికం; మరణాల్లో జాతీయ సగటు 2.64 శాతం.. 30 రాష్ట్రాల్లో మరింత తక్కువ
దేశవ్యాప్తంగా కోవిడ్-19 నిరోధం, నియంత్రణ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చురుకైన, ముందస్తు చర్యలు తీసుకోవడంవల్ల మహమ్మారి నుంచి కోలుకునేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ మేరకు గడచిన 24 గంటల్లో 18,850 మంది కోలుకోగా ఇప్పటివరకూ వ్యాధి నయమైనవారి సంఖ్య 5,53,470కి పెరిగింది. దీనికి అనుగుణంగా కోలుకున్నవారి జాతీయ సగటు 63.02 శాతానికి పెరిగింది. మరోవైపు 19 రాష్ట్రాల్లో జాతీయ సగటుకన్నా అధికంగా నమోదవడం విశేషం. దేశంలోని వివిధ కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రులు, సంరక్షణ కేంద్రాలుసహా ఏకాంత గృహవాసంలో 3,01,609 మంది చురుకైన వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. ఇక చికిత్సలో ఉన్నవారికన్నా కోలుకున్నవారి సంఖ్య 2,51,861 మేర అధికంగా నమోదైంది. భారత్‌లో మరణాల శాతం కూడా గణనీయంగా తగ్గి 2.64 శాతానికి దిగిరాగా, 30 రాష్ట్రాల్లో జాతీయ సగటుకన్నా తక్కువగా నమోదవడం గమనార్హం. ఇక గత 24 గంటల్లో 2,19,103 పరీక్షలు నిర్వహించగా, ఇప్పటిదాకా పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 1,18,06,256కు పెరిగింది. దీంతో ఇవాళ్టికి ప్రతి పది లక్షల జనాభాలో 8555.25 మందికి పరీక్షలు నిర్వహించినట్లయింది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638379
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో ప్రధానమంత్రి సంభాషణ; మహమ్మారిపై భారత్ పోరాటంలో ప్రధాని నాయకత్వంపై గూగుల్ సీఈవో ప్రశంసలు
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గూగుల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO) శ్రీ సుందర్ పిచాయ్‌తో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సంభాషించారు. కోవిడ్-19పై ప్రజల్లో అవగాహన కల్పనకు, విశ్వసనీయ సమాచార ప్రదానానికి గూగుల్ చేసిన కృషి గురించి ఈ సందర్భంగా ప్రధానమంత్రికి శ్రీ పిచాయ్ వివరించారు. మహమ్మారిపై భారత పోరాటానికి ప్రధానమంత్రి అమలు చేసిన దిగ్బంధం బలమైన పునాది వేసిందని ఆయన అన్నారు. కాగా, తప్పుదోవ పట్టించే సమాచారంపై యుద్ధంలోనూ, అవసరమైన జాగ్రత్తలపై సమాచారం అందించడంలోనూ గూగుల్ చురుకైన పాత్ర పోషించిందని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఆరోగ్య సేవల ప్రదానం దిశగా సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని మరింత పెంచడంపైనా ఆయన మాట్లాడారు. కాగా, భారతదేశంలో ఒక భారీ పెట్టుబడుల నిధి ప్రారంభంతోపాటు వ్యూహాత్మక భాగస్వామ్యాల నిర్మాణంపై గూగుల్ ప్రణాళికల గురించి ప్రధానమంత్రికి శ్రీ పిచాయ్ వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని స్పందిస్తూ- ప్రపంచంలోని అత్యంత పారదర్శక విపణులలో భారత్ కూడా ఒకటని పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638345
దేశంలో మూడు బల్క్ డ్రగ్ పార్కులు, నాలుగు వైద్య పరికరాల పార్కుల ఏర్పాటుకు స్థల ఎంపికపై మార్గదర్శకాలు ఖరారు చేస్తున్న ఔషధ శాఖ: శ్రీ గౌడ
దేశంలో 3 బల్క్ డ్రగ్స్ పార్కులు 4 వైద్య పరికరాల పార్కుల ఏర్పాటు కోసం నిష్పాక్షిక స్థల ఎంపిక ప్రాతిపదికగా తమ శాఖ పరిధిలోని ఔషధ విభాగం మార్గదర్శకాలను ఖరారు చేస్తున్నదని కేంద్ర రసాయనాలు-ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి.సదానంద గౌడ తెలిపారు. బల్క్ డ్రగ్ పార్కులను ప్రోత్సహించే పథకం వల్ల రూ.46,400 కోట్ల విలువైన బల్క్ ఔషధాల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. అలాగే వైద్య పరికరాల పార్కులకు ప్రోత్సాహంతో సుమారు రూ.68,437 కోట్ల విలువైన వైద్య పరికరాల ఉత్పత్తికి వీలు కలుగుతుందని చెప్పారు. అంతేకాకుండా ఈ పథకాల అమలుతో గణనీయ సంఖ్యలో ఉద్యోగ సృష్టి జరుగుతుందని పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638402
కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖతో ఆర్థిక సంఘం సమావేశం
కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌తోపాటు ఆ శాఖ సీనియర్ అధికారులతో 15వ ఆర్థిక సంఘం ఇవాళ సమావేశమైంది. కోవిడ్-19 అనుభవాల నేపథ్యంలో రాష్ట్రాలకు ప్రత్యేకమైన ఆరోగ్య ప్రతిపాదనల సవరణపై నిర్దిష్ట అంశాల గురించి చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటైంది. ఆర్థిక ఒత్తిళ్లు ఎదురైన నేపథ్యంలో మద్దతునివ్వడానికిగల అవకాశాల అన్వేషణ, ఆరోగ్యంపై 15వ ఆర్థిక సంఘంలోని ఉన్నతస్థాయి కమిటీ సిఫారసులపై మంత్రిత్వశాఖ పరిశీలన కూడా ఈ సమావేశంలోని అంతరార్థం. దేశంలో మహమ్మారి విచిత్ర పరిస్థితులను సృష్టించిన నేపథ్యంలో ఆరోగ్యం రంగంపై తమ తుది నివేదికలో ఒక అధ్యాయం చేర్చాలని నిర్ణయించినట్లు సమావేశాన్ని ప్రారంభిస్తూ కమిషన్ చైర్మన్ శ్రీ ఎన్.కె.సింగ్ చెప్పారు. ఈ సందర్భంగా జాతీయ ఆరోగ్య విధానం-2017లక్ష్యాలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరణాత్మకంగా విశదీకరించింది. ఆ మేరకు 2025నాటికి ప్రజారోగ్య వ్యయాన్ని ప్రగతిశీలంగా స్థూల దేశీయోత్పత్తి (GDP) 2.5 శాతానికి పెంచడం, మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రాథమిక ఆరోగ్య వ్యయాన్ని 2/3 వంతుకు పెంచడం, 2020 నాటికి ఆయా రాష్ట్రాల ఆరోగ్య వ్యయాన్ని వాటి బడ్జెట్‌లో 8 శాతంకన్నా ఎక్కువకు పెంచడం వంటివి ఈ లక్ష్యాల్లో భాగంగా ఉన్నాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638420
ఐక్యరాజ్యసమితి ఉన్నత రాజకీయ వేదికపై భారత రెండో స్వచ్ఛంద జాతీయ సమీక్షను సమర్పించిన నీతి ఆయోగ్
ఐక్యరాజ్యసమితి ఉన్నతస్థాయి రాజకీయ వేదిక (HLPF)పై భారత్‌కు సంబంధించి సుస్థిర ప్రగతి-2020పై రెండో స్వచ్ఛంద జాతీయ సమీక్ష (VNR)ను నీతి ఆయోగ్ సమర్పించింది. కాగా, ఐక్యరాజ్య సమితి నిర్దేశిత 17 సుస్థిర ప్రగతి లక్ష్యా (SDG)ల సాధన కృషిపై పర్యవేక్షణ, ముందంజపై సమీక్షకు ఈ ప్రపంచ స్థాయి అత్యున్నత వేదిక ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ కుమార్ స్వచ్ఛంద సమీక్ష నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- కోవిడ్ వైరస్ సవాళ్లపై పోరాడుతున్న దేశాలన్నిటికీ సంఘీభావం ప్రకటించారు. అదే సమయంలో మహమ్మారి సవాలుకు ప్రతిస్పందనగా *స్వయం సమృద్ధ భారతం* పేరిట చేపట్టిన కార్యక్రమంలోని కీలకాంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ఈ మేరకు “ప్రస్తుత పరిస్థితుల్లో మనం అన్నిరకాల హెచ్చుతగ్గులపై భిన్నాభిప్రాయాలకు స్వస్తి చెప్పాలి. అలాగే సుస్థిర అభివృద్థి లక్ష్యాల సాధన దిశగా పురోగమనాన్ని వేగిరపరచేందుకు మనమంతా ఈ సంక్షోభాన్ని ఓ అవకాశంగా మలచుకుని, సమైక్యంగా కృషిచేయాలి” అని తన ప్రకటనలో స్పష్టం చేశారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638329
బాంబే చాంబర్ ఆఫ్ కామర్స్ 184వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి ప్రసంగం
“కోవిడ్-19 ప్రపంచాన్ని కుదిపేసినప్పటికీ, భారతదేశ ప్రజలు, వ్యాపారాలు, పరిశ్రమలు ఈ సంక్షోభానికి లొంగలేదు సరికదా... విశిష్ట పంథాలో ఎదురొడ్డి నిలవడమేగాక పరిస్థితిని చక్కదిద్దుకోవడంలో నిరంతరం సరికొత్త మార్గాలను అన్వేషిస్తూ అపాయాన్ని అవకాశంగా మార్చుకున్నాయి” అని కేంద్ర వాణిజ్య-పరిశ్రమల, రైల్వే శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఇవాళ న్యూఢిల్లీలో అన్నారు. కోవిడ్‌కు ముందు-తర్వాత ప్రపంచాలు భిన్నమైనవని, ఈ నేపథ్యంలో కోవిడ్ అనంతర మెరుగైన ప్రపంచంవైపు పయనానికి మనం సిద్ధమయ్యామని పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638355
2030 నాటికి ‘హరిత రైల్వే’గా పరివర్తనకు ఉద్యమ తరహా కృషి; (శూన్య కర్బన ఉద్గారాలు లక్ష్యం) కోవిడ్ పరిస్థితుల్లోనూ 365 కి.మీ.మేర ప్రధాన సంధాన మార్గాల పూర్తి... ప్రారంభం
భారత రైల్వేలను 2030 నాటికి ‘హరిత రైల్వే’గా రూపొందించే లక్ష్యంతో రైల్వే మంత్రిత్వ శాఖ ఉద్యమతరహాలో కృషి చేస్తోంది. ఇందులో భాగంగా భూతాపం తగ్గింపు, వాతావరణ మార్పులను ఎదుర్కొనే దిశగా అనేక కీలక చర్యలు చేపట్టింది. ఆ మేరకు రైల్వేల విద్యుదీకరణ, ఇంజిన్లు-రైళ్లు, స్థిర అమరికల ఇంధన సామర్థ్యం పెంపు, రైల్వే స్టేషన్లు/ ఇన్‌స్టలేషన్లకు హరిత ధ్రువీకరణ, కోచ్‌లకు బయోటాయిలెట్ల బిగింపు, పునరుత్పాదక ఇంధన వనరులవైపు పరివర్తన వంటివి కర్బన ఉద్గారాలను శూన్యస్థాయికి తెచ్చే దిశగా రైల్వేలు చేపట్టిన వ్యూహంలో భాగంగా ఉన్నాయి. భారత రైల్వేశాఖ ఇప్పటిదాకా 40,000 రూట్ కిలోమీటర్ల (RKM) మేర విద్యుదీకరణను పూర్తి చేసింది (ఇందులో 63 శాతం బ్రాడ్ గేజ్ మార్గాలు). అలాగే కోవిడ్ సమయంలో 365 కిలోమీటర్ల మేర ప్రధాన అనుసంధాన పనులను పూర్తిచేసి, ప్రారంభించింది. ఇందులో ముఖ్యంగా హౌరాకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పరచేందుకు అలహాబాద్ మీదుగా వెళ్లే ముంబై-హౌరా మార్గంలోని కట్ని-సత్నా సెక్షన్ (99 రూట్ కిలోమీటర్లు) మార్గాన్ని సంధానించింది. అలాగే మాక్సి-భోపాల్- బినా కు ప్రత్యామ్నాయంగా ఇండోర్-గుణ-బినా మార్గంలోని పచోరె-మాక్సి మార్గాన్ని (88 రూట్ కిలోమీటర్లు) పూర్తిచేసి, ప్రారంభించారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638313
కట్-పాలిష్డ్ వజ్రాలను తిరిగి దిగుమతి చేసుకునే గడువు 3 నెలలు పొడిగింపు
కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఇవాళ రత్నాలు, ఆభరణాల రంగానికి భారీ ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ధ్రువీకరణ-గ్రేడింగ్ కోసం విదేశాలకు పంపిన కట్-పాలిష్ వజ్రాలను తిరిగి దిగుమతి చేసుకొనే గడువును మరో మూడు నెలలు పొడిగించింది. కట్-పాలిష్ వజ్రాల దిగుమతులు 2020 ఫిబ్రవరి 1 - జూలై 31 పూర్తి కావాల్సినప్పటికీ కోవిడ్-19 మహమ్మారి అంతరాయం వల్ల సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పొడిగించిన వ్యవధిలోగా మౌలిక కస్టమ్స్ సుంకం (BCD)తోపాటు సమీకృత వస్తుసేవల పన్ను (IGST) చెల్లించకుండానే తిరిగి దిగుమతి చేసుకోవచ్చు. అయితే, గడచిన మూడేళ్లుగా సగటు వార్షిక ఎగుమతి వ్యాపార పరిమాణం రూ.5 కోట్లదాకాగల వ్యాపారులకు ఈ సదుపాయం వర్తిస్తుంది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638313
కోవిడ్ సమయంలో పేదలకు, అన్నార్తులకు ఆహారం, వంటసరకులు అందించిన ఆగ్నేయ రైల్వే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్
కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులు, దిగ్బంధం సమయంలో పేదలకు, అన్నార్తులకు సేవలందించడంలో
ఆగ్నేయ రైల్వే (SER) భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కీలకపాత్ర పోషించింది. ఆ మేరకు దిగ్బంధం విధించినప్పటి నుంచి తమ పరిధిలోని వివిధ స్టేషన్లు, పరిసర ప్రాంతాల్లో 76,821 ఆహార ప్యాకెట్లతోపాటు బియ్యం, పప్పుదినుసులు, మసాల దినుసులు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, సోయా బీన్స్, వెల్లుల్లి, వంటనూనె తదితరాలతో కూడిన 3,16,084 వంటసరుకుల ప్యాకెట్లను పంపిణీ చేసింది. ప్రజలు ఇళ్ల నుంచి వెలుపలకు రాలేని పరిస్థితుల నడుమ ఆగ్నేయ రైల్వే స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు చెందిన రేంజర్స్, రోవర్స్‌సహా యువ కార్యకర్తలు సమాజంలోని అణగారిన-పేద వర్గాలకు సహాయం అందించారు. అలాగే కోవిడ్-19 వ్యాప్తి నిరోధం కోసం 25,876 ఫేస్ మాస్క్‌లను తయారుచేసి నిస్సహాయులకు, పేద ప్రజలకు పంపిణీ చేశారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638165
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- కేరళ: రాష్ట్రంలోని కోట్టయం వైద్యకళాశాల ఆస్పత్రిల 71 ఏళ్ల వ్యక్తి మరణించడంతో కేరళలో కోవిడ్ మరణాల సంఖ్య 32కి పెరిగింది. వయనాడ్‌లో మరో్ వ్యక్తి మరణించినప్పటికీ అతడి నమూనాల నివేదిక అందాల్సి ఉంది. ఇక కేరళ తీరప్రాంతాల్లోని నియంత్రణ జోన్లలో ఇవాళ్టినుంచి జూలై 23వరకూ ట్రిపుల్ లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. మహమ్మారి వ్యాప్తి నిరోధం దిశగా తీరప్రాంతాలన్నిటీ దిగ్బంధం విధించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని మత్స్యశాఖ మంత్రి జె.మెర్సికుట్టి అమ్మ తెలిపారు. అయితే, మత్స్యకారులను సముద్రంలో చేపల వేటకు అనుమతిస్తారు. మరోవైపు వందే భారత్ మిషన్ కింద 13 విమానాల్లో 2680 మంది ప్రవాసులు కొచ్చి చేరుకోనున్నారు. రాష్ట్రంలో నిన్న 435 కేసులు నమోదవగా వాటిలో 206 పరిచయాలద్వారా సంక్రమించాయి. మరోవైపు 3,743 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు.
- తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 50 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,468కి పెరిగింది. వ్యాధి సంక్రమణ ముప్పుగల ప్రాంతాల్లోని ప్రజలు పరీక్షలు చేయించుకునేలా ఎమ్మెల్యేలు కృషిచేయాలని పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి కోరారు. ఇక తమిళనాడులోని వెల్లూర్ జిల్లాలో కేసుల సంఖ్య 3000 దాటడంతో అధికారులు జ్వరపీడితులపై నిఘా పెంచారు; జిల్లాలో ఇప్పటిదాకా 3131 కేసులు, 25 మరణాలు నమోదయ్యాయి. ఇక చెన్నైలో కోవిడ్-19 నుంచి కోలుకున్న 72 మంది పోలీసు సిబ్బంది తిరిగి విధుల్లో చేరారు. రాష్ట్రంలో నిన్న 4244 కొత్త కేసులు, 68 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు: 1,38,470; యాక్టివ్ కేసులు: 46,969; మరణాలు: 1966; చెన్నైలో చురుకైన కేసులు: 17,469గా ఉన్నాయి.
- కర్ణాటక: రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణపై ముఖ్యమంత్రి ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, సీఈవోలు, ఎస్పీలతో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సంభాషించారు. కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం జిల్లాల్లో దిగ్బంధం విధించాలని సమావేశంలో చాలామంది కలెక్టర్లు అభిప్రాయపడ్డారు. కాగా, ధార్వాడ్, దక్షిణ కన్నడ జిల్లాల కలెక్టర్లు జూలై 15 నుంచి వారంపాటు దిగ్బంధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇక హోటళ్లు, అపార్ట్‌మెంట్ల సముదాయాల్లో మరిన్ని కోవిడ్ రక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇక పరియస్తుల అన్వేషణ, గృహ నిర్బంధ నిబంధనల అమలు కృషిని రెట్టింపు చేయాలని బీబీఎంపీ నిర్ణయించింది. కాగా రాష్ట్రంలో నిన్న 2627 కొత్త కేసులు, 71 మరణాలు నమోదవగా బెంగళూరు నగరంలో 1525 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు: 38,843; యాక్టివ్ కేసులు: 22,746; మరణాలు: 684గా ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్: కరోనా పీడిత అనుమానితులను కనుగొనే దిశగా ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లను ఉపయోగించాలని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య-వైద్యశాఖ సంబంధిత జిల్లా అధికారులను కోరింది. కాగా, ప్రతి జిల్లాకు ఇప్పటికే 20వేల ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్లు అందాయి. కోవిడ్ కారణంగా తిరుపతిలోని తెలుగు న్యూస్ ఛానెల్‌లో పనిచేస్తున్న సీనియర్ వీడియో జర్నలిస్ట్ ఆదివారం మరణించారు. దీంతో జిల్లా సమాచార-పౌరసంబంధాల విభాగం ఇవాళ విలేకరులకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. గొల్లపుడి (విజయవాడ) టోకు మార్కెట్లో కరోనావైరస్ సోకిన వ్యాపారుల సంఖ్య పెరగడంతో ఇవాళ్టినుంచి వారంపాటు స్వచ్ఛందంగా దిగ్బంధం అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో నిన్న 1933 కొత్త కేసులు, 19 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు: 29,168; యాక్టివ్ కేసులు: 13,428; మరణాలు: 328గా ఉన్నాయి.
- తెలంగాణ: కోవిడ్-19కు అల్లోపతి ఔషధం తయారీ దిశగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ప్రయోగాలతో పోలిస్తే ఆయుష్ పరిధిలో ప్రయోగాలే ముందంజలో ఉన్నట్లు ఐసీఎంఆర్ పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ స్టాటిస్టిక్స్ ప్రయోగ నమోదు విశ్లేషణలో స్పష్టమైంది. ఇక తెలంగాణలో నిన్నటిదాకా నమోదైన మొత్తం కేసులు: 34,671; యాక్టివ్ కేసులు: 11,883; మరణాలు 356; డిశ్చార్జి అయినవారు: 22,482 మంది.
- హర్యానా: యువతలో పరవళ్లు తొక్కే ఉత్సాహాన్ని కోవిడ్-19వల్ల తలెత్తిన అనిశ్చతి అధిగమించకుండా చూసుకోవాలని హర్యానా ముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు “యువ మంథన్ విత్ ముఖ్యమంత్రి” పేరిట నిర్వహించిన వెబినార్‌లో “కోవిడ్-19 సవాళ్లు-అవకాశాలు”పై వృత్తిపరమైన చర్చాగోష్ఠిలో ఆయన వారితో ముచ్చటించారు. కోవిడ్-19 దిగ్బంధం సమయంలో వివిధ విద్యా సంస్థలలో చదివే విద్యార్థులు విద్యాపరంగా నష్టపోకుండా చూడటంలో భాగంగా రాష్ట్రంలో 70 లక్షల మంది విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులతోపాటు టీవీద్వారా దూరవిద్య సౌకర్యాలు కల్పించామని ముఖ్యమంత్రి చెప్పారు.
- మహారాష్ట్ర: రాష్ట్రంలో గత 24 గంటల్లో 7,827 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 2,54,427కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 1,40,325 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఆదివారం నాటికి రాష్ట్రంలో మొత్తం మరణాలు 10,116 కాగా, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అత్యధికంగా ఉంది. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 91,457గా ఉన్నాయి. పుణెలో ఈ అర్ధరాత్రి నుంచి జూలై 23 వరకు దిగ్బంధం కొనసాగుతుంది. కాగా, ముంబైలో 1,263 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసులు 92,720కి చేరాయి. ముంబైలో కేసుల రెట్టింపు వ్యవధి ఇప్పుడు 50 రోజులు కాగా, కోలుకునేవారి రాష్ట్ర సగటు 70 శాతంకన్నా ఎక్కువగా ఉంది.
- గుజరాత్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 879 కొత్త కేసులు నమోదవగా ఆదివారంనాటి మొత్త యాక్టివ్ కేసులు సంఖ్య 10,613గా ఉంది. ఇక గుజరాత్‌లో మరణాల సంఖ్య కూడా 2045కు పెరిగింది. గత 24 గంటల్లో 513 మంది కోలుకుని డిశ్చార్జ్ కావడంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 29,162కు చేరింది. అహ్మదాబాద్ నగరంలో విజయవంతమైన ధన్వంతరి రథాల ప్రయోగానికి విస్తృత ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ రథాలు ఇప్పటిదాకా అహ్మదాబాద్‌లో 5 లక్షలకుపైగా ఓపీడీ సంప్రదింపులు విజయవంతంగా నిర్వహించాయి.
- రాజస్థాన్: రాష్ట్రంలో 95 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 24,370కు పెరిగింది. ఇక ఇప్పటిదాకా (ఈ ఉదయం 10:30 వరకు) 514మంది మరణించగా రోగ నిర్ధారణ పరీక్షలకోసం 10,54,080 నమూనాలను సేకరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 18,123 మంది కోలుకోగా 17,754 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 17,238గా ఉంది.
- మధ్యప్రదేశ్: రాష్ట్రంలో ఆదివారం 431 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 17,632కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,103కాగా, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 12,876గా ఉంది. భోపాల్‌లో గరిష్ఠంగా ఆదివారం 95 కేసులు నమోదయ్యాయి. ఇండోర్ (84), జబల్పూర్ (24), బార్వానీ(20) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. హాట్‌స్పాట్ ఇండోర్‌లో కోవిడ్-19 కేసుల సంఖ్య 5260గా ఉంది. రాజధాని నగరం భోపాల్‌లో ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య 3502గా ఉంది.
- ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలో ఆదివారం 150 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4081కి చేరింది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 909 కాగా, ఆదివారం 83 మంది కోలుకోవడంతో ఇప్పటిదాకా కోలుకువారి సంఖ్య 3,153కు చేరింది. రాయ్‌పూర్‌లో 96 కొత్త కేసులు నమోదయ్యాయి.
- గోవా: గోవాలో ఆదివారం 85 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 2453కు చేరింది. అలాగే శనివారం 2 మరణాలు సంభవించగా మొత్తం మృతుల సంఖ్య 14కు చేరింది. మరోవైపు 59 మంది ఒకేరోజు కోలుకోవడంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1487కు పెరిగింది. తాజా సమాచారం ప్రకారం... రాష్ట్రంలో ప్రస్తుతం 952 యాక్టివ్ కేసులున్నాయి.
- అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో ఇప్పటిదాకా 31,520 నమూనాలను సేకరించారు. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 219 కాగా, 1657 నమూనాల ఫలితాలు వెలువడాల్సి ఉంది. వీధుల్లో అనవసర జన సంచారం తగ్గించడానికి ఇటానగర్ క్యాపిటల్ కాంప్లెక్స్‌లోని వివిధ తనిఖీ కేంద్రాలవద్ద పోలీసు బలగాలను మోహరించారు.
- అసోం: రాష్ట్రంలోని దిబ్రూగఢ్, రోహ్‌మోరియాలలో నేల కోతను అరికట్టే పనులకు సంబంధించి రూ.25 కోట్లతో మూడు కొత్త పథకాలను అసోం ముఖ్యమంత్రి శ్రీ సర్వానంద సోనోవాల్ ఇవాళ ప్రకటించారు.
- మణిపూర్: ఇంఫాల్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం మణిపూర్‌లోని సీఎంవోలో 350 పీపీఈ కిట్లతోపాటు 3 వెంటిలేటర్లను విరాళంగా ముఖ్యమంత్రికి అందజేసింది.
- నాగాలాండ్: కోహిమా జిల్లాలోని అప్పర్ ఏజీ కాలనీలో ఒకరికి కోవిడ్-19 నిర్ధారణ కావడంతో జిల్లా యంత్రాంగం ఆ కాలనీలోని కొన్ని ప్రాంతాలను నియంత్రణ జోన్లుగా ప్రకటించింది.
- మిజోరం: మిజోరం బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రేపు HSSLC మరియు HSLC (కంపార్ట్‌మెంటల్) ఫలితాలను ప్రకటించనుంది.
- సిక్కిం: రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 153 కాగా, వివిధ జిల్లాలవారీగా: తూర్పు జిల్లా-88; పశ్చిమ జిల్లా-22; దక్షిణ జిల్లా 42; ఉత్తర జిల్లా- 2 వంతున నమోదయ్యాయి.
FACTCHECK


******
(Release ID: 1638459)
Visitor Counter : 192
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam