నీతి ఆయోగ్
ఐక్యరాజ్యసమితి ఉన్నత స్థాయి రాజకీయ వేదికపై రెండవ జాతీయ స్వచ్ఛంద సమీక్షను సమర్పించిన నీతీ ఆయోగ్
“క్రియాశీలక దశాబ్ది: ప్రపంచ స్థాయినుంచి స్థానిక స్థాయికి
సుస్థిర ప్రగతి” పేరిట నివేదిక విడుదల
Posted On:
13 JUL 2020 11:14AM by PIB Hyderabad
సుస్థిర అభివృద్ధిపై భారతదేశానికి సంబంధించిన రెండవ స్వచ్ఛంద జాతీయ సమీక్షను నీతీ ఆయోగ్ సమర్పించింది. 2020వ సంవత్సరానికి సంబంధించిన ఈ సమీక్షను ఐక్యరాజ్యసమితికి చెందిన ఉన్నత స్థాయి జాతీయ వేదికపై నీతీ ఆయోగ్ సమర్పించింది. సుస్థిర అభివృద్ధికి సంబంధించిన 17 లక్ష్యాల సాధనకు తీసుకోవలసిన తదుపరి చర్యలు, సమీక్షకోసం ఈ సమీక్షను ఆవిష్కరించారు. “క్రియాశీలక దశాబ్ది : ప్రపంచ స్థాయినుంచి స్థానిక స్థాయికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు” అనే పేరుతో సమీక్షా నివేదికను నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ కుమార్, నీతీ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్, ముఖ్య కార్యనిర్వహణాధికారి అమితాబ్ కాంత్, సుస్థిర అభివృద్ధి అంశాల సలహాదారు శ్రీమతి సంయుక్త సమద్దర్ విడుదల చేశారు. కోవిడ్-19 వైరస్ వ్యాప్తి సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది సమావేశాన్ని ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నారు. 2020 జూలై 10న మొదలైన ఈ సమావేశం జూలై 16వరకూ జరుగుతుంది. ఈ సమావేశంలో 47 సభ్యదేశాలు పాల్గొని తమ సమీక్షా నివేదికలను సమర్పిస్తాయి.
ఐక్యరాజ్య సమితికి చెందిన ఆర్థిక సామాజిక మండలి (ECOSOC) ఆద్వర్యంలో ఉన్నత స్థాయి రాజకీయ వేదిక ప్రతి సంవత్సరం జూలై నెలలో 8రోజులపాటు సమావేశమవుతుంది. ఈ సమావేశాల్లో సభ్యదేశాలు సమర్పించే స్వచ్ఛద జాతీయ సమీక్షా నివేదికలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రగతిపై సమీక్షకు, 2030 అజెండా, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అమలు చేయడానికి ఈ సమీక్షా నివేదికలు ఎంతో దోహదపడతాయి. ఆయా దేశాల ఆధ్వర్యంలో సమర్పించే ఈ సమీక్షలన్నీ స్వచ్ఛదమైనవే. వివిధ దేశాలు తమ అనుభవాలను, విజయాలను, తాము ఎదుర్కొన్న సవాళ్లను, నేర్చుకున్న పాఠాలను పరస్పరం పంచుకునేందుకు ఈ సమీక్షలు రూపొందిస్తారు. ఏదైనా ఒక దేశానికి సంబంధించిన స్వచ్ఛంద జాతీయ సమీక్షా నివేదిక తయారీ ప్రక్రియ వివిధ వర్గాల భాగస్వామ్యాలకు వేదికగా ఉపయోగపడుతుంది. భారతదేశం తన తొలి నివేదికను 2017లో సమర్పించింది.
2020వ సంవత్సరానికి భారతదేశపు స్వచ్ఛంద జాతీయ సమీక్షా నివేదిక
సమావేశంలో తనతో పాటు రెండవసారి పాల్గొంటున్న బంగ్లాదేశ్, జార్జియా, కెన్యా, మొరాకో, నేపాల్, నైగర్, నైజీరియా, ఉగాండా వంటి దేశాలతో కలసి భారత్ తన సమీక్షా నివేదికను సమర్పించింది. ఈ నివేదిక సమర్పణలో భాగంగా ఒక లఘు చలనచిత్రాన్ని కూడా ప్రదర్శించారు. రెండవ స్వచ్ఛంద జాతీయ సమీక్షా నివేదికలో పొందుపరిచే అంశాలతో ఈ లఘు చిత్రాన్ని రూపొందించారు. ప్రధానమైన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై భారత్ సాధించిన అభివృద్ధిని కూడా ఈ లఘు చిత్రంలో వివరించారు.
సమావేశం ప్రారంభంలో నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, కోవిడ్ వైరస్ సవాళ్లను ఎదుర్కొనేందుకు పోరాటం సాగిస్తున్న అన్ని దేశాలకు తాము సంఘీభావం ప్రకటిస్తున్నట్టు చెప్పారు. కోవిడ్ మహమ్మారి విసిరిన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద భారత్ చేపట్టిన కార్యక్రమంలో కీలక అంశాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. “ఈ పరిస్థితుల్లో మనం అన్ని విభేదాలకు అంతం పలకాలి. సుస్థిర అభివృద్థి లక్ష్యాల సాధన దిశగా ప్రగతిని వేగవంతం చేసేందుకు మనమంతా ప్రస్తుత సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలి. అందుకు సమైక్యంగా కృషిచేయాలి” ఆయన తన ప్రారంభోన్యాసంలో పేర్కొన్నారు. అభివృద్ధి లక్ష్యాల సాధనకు జరిగే కృషిలో ఎవరూ వెనకబడకుండా చూసేందుకు జరిగే ప్రయత్నాలను డాక్టర్ రాజీవ్ కుమార్ వివరించారు. బహుముఖమైన పేదరికాన్ని తగ్గించేందుకు, అందరికీ ఆహార భద్రత, విద్య, విద్యుత్ సదుపాయం, కాలుష్యంలేని వంట ఇంధనం, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించే విషయంలో భారత్ సాధించిన గణనీయమైన ప్రగతిని ఆయన పేర్కొన్నారు. 50కోట్ల మంది పౌరులకు ప్రయోజనం కలిగించేలా ప్రపంచంలోనే అతి భారీ పథకమైన ఆరోగ్యబీమా కార్యక్రమం అమలుచేయడంలో భారత్ సాధించిన ప్రగతిని కూడా తెలియజేశారు.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకోసం అభివృద్ధిని వేగవంతమయ్యేలా కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి, ఇప్పటికే అమలులో ఉన్న కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని ముఖ్య కార్య నిర్వహణాధికారి అమితాబ్ కాంత్ చెప్పారు. ఈ కృషిలో కొత్త విషయాలు తెలుసుకోవడం, తెలిసిన అంశాలను పరస్పరం పంచుకోవడం వంటివి ఎంతో కీలకపాత్ర పోషిస్తాయని, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో వాటిని పంచుకుంటున్నామని ఆయన అన్నారు.
భారత్ ఈ ఏడాది సమర్పించిన స్వచ్ఛంద జాతీయ సమీక్షా నివేదికను,.. సంపూర్ణంగా సమాజానికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా రూపొందించారు. ఈ నివేదిక రూపకల్పనలో స్థానిక పరిపాలనా సంస్థలకు నీతీ ఆయోగ్ ప్రమేయం కల్పించింది. పౌర సమాజ సంఘాలు, స్థానిక సంఘాలు, ప్రైవేట్ రంగం ప్రతినిధులు, దయనీయమైన స్థితిలో ఉన్న పేదవర్గాలకు కూడా ప్రమేయం కల్పించారు. ఈ ప్రక్రియలో భాగంగా, భారత్ లోని ఐక్యరాజ్యసమితి సంస్థ ప్రతినిధులకు, పౌర సమాజ సంస్థలకు నీతీ ఆయోగ్ భాగస్వామ్యం కల్పించింది. జాతీయ, ఉపజాతీయ స్థాయిలో 50 సంప్రదింపుల ప్రక్రియలు జరిగాయి. మహిళలు, బాలలు, వయోవృద్ధులు, వికలాంగులు, హైచ్.ఐ.వి. బాధితులు తదితర వర్గాలకు చెందిన వెయ్యికిపైగా పౌర సమాజ సంఘాలతో నీతీ ఆయోగ్ సంప్రదింపులు జరిపి ఈ సమీక్షా నివేదికను రూపొందించింది.
ఈ సారి అంతర్జాతీయ సహకారం ఇదివరకెన్నడూ లేనంతగా కీలకపాత్రపోషించిందని నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడు అన్నారు. అంతర్జాతీయ సౌర కూటమి, ప్రకృతి వైపరీత్యాలనుంచి కోలుకునే మౌలిక సదుపాయాలు, సెండాయ్ ఫ్రేమ్ వర్క్, భూములు ఎడారులు కాకుండా నివారించడం వంటి అంశాల్లో ప్రపంచ స్థాయి వేదికలకు తగిన ప్రమేయం కల్పించడంలో భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తూ వస్తోందని ఆయన అన్నారు. సమీక్షా నివేదిక సమర్పణ అనంతరం సభ్యదేశాల ప్రతినిధుల ప్రశ్న, జవాబు రూపంలో చర్చా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పునరుత్పాదక ఇంధనం, ఆర్థిక సమ్మిళిత కార్యక్రమాలు, తదితర అంశాలపై ఈక్వడార్, బంగ్లాదేశ్ వంటి సభ్యదేశాలు, పౌర సమాజ సంస్థల ప్రతినిధులు ప్రశ్నలు వేశారు.
క్రియాశీలక దశాబ్ది :
ప్రపంచ స్థాయినుంచి స్థానిక స్థాయికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు
భారతదేశపు స్వచ్ఛంద జాతీయ సమీక్షా నివేదికను కూడా ఈ సమావేశంలో ఆవిష్కరించారు. భారతదేశంలో 2030 అజెండా అమలుపై సమగ్రమైన అంశాలను ఈ నివేదికలో పొందుపరిచారు. అలాగే, సుస్థిర అభివృద్ధికి సంబంధించి 17 లక్ష్యాల అమలులో ప్రగతిని కూడా ఈ నివేదికలో సమీక్షించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను స్థానిక అవసరాలకు తగినట్టుగా రూపకల్పన చేయడంలో భారత్ అనుసరించిన మార్గాన్ని కూడా ఈ నివేదికలో వివరించారు.
దేశం నలుమూలల్లో ఉన్న పౌర సమాజ సంఘాలతో సంప్రదింపుల ద్వారా సేకరించిన అంశాలను కూడా ఈ నివేదికలో ఒక అధ్యాయం రూపంలో పొందుపరిచారు. పౌర సమాజ సంఘాలు, ప్రభుత్వేతర సమాజసేవా సంఘాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను, ఆవేదనలను ఈ అధ్యాయంలో చేర్చారు. దశాబ్ది కార్యచరణ ప్రణాళికలో వాణిజ్య, ప్రైవేటు రంగాలు పోషించే పాత్రను కూడా పొందుపరిచారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సైన్స్, టెక్నాలజీ, సృజనాత్మక రంగాలు పోషించే పాత్రను కూడా వివరించారు.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రపంచ స్థాయినుంచి స్థానిక సంస్థల స్థాయికి తీసుకుపోవాలన్న సూత్రానికి అనుగుణంగా సుస్థిర అభివృద్ధిపై లక్ష్యాలవారీగా వివరాలన సమీక్షా నివేదికలో పొందుపరిచారు. ఈ అంశంపై వివిధ రాష్ట్రాలు, ప్రత్యేకించి ఆశావహ జిల్లాలకు చెందిన విజయ గాథలను ఉదాహరణ సహితంగా వివరించారు.
జాతీయ, ఉపజాతీయ స్థాయిలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల అమలును పర్యవేక్షించే అధికారం నీతీ ఆయోగ్ సంస్థకు ఉంది. ఐక్యరాజ్యసమితి రాజకీయ వేదికపై సమర్పంచిన స్వచ్ఛంద జాతీయ సమీక్షా నివేదిక,..నీతీ ఆయోగ్ విస్తృత కృషిని ప్రతిబింబిస్తోంది.
భారత్ స్వచ్చంద జాతీయ సమీక్షా నివేదిక (13జూలై) కోసం ఈ లింకును వెళ్లండి.
https://sustainabledevelopment.un.org/content/documents/26281VNR_2020_India_Report.pdf
http://niti.gov.in/un-high-level-political-forum
- ఇండియా స్వచ్ఛంద జాతీయ సమీక్షా నివేదిక-2020 ఆవిష్కరణ సందర్భంగా ( ఎడమనుంచి కుడికి) నీతీ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్, ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్, ముఖ్య కార్యనిర్వహణాధికారి అమితాబ్ కాంత్, సుస్థిర అభివృద్ధి అంశాల సలహాదారు సంయుక్తా సమద్దార్.
- సుస్థిర అభివృద్ధి (2020)కి సంబంధించిన ఐక్యరాజ్యసమితి ఉన్నత స్థాయి రాజకీయ వేదికపై భారతదేశపు రెండవ స్వచ్ఛంద జాతీయ సమీక్షా నినవేదికను సమర్పించిన నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ కుమార్.
1.3. ఇండియా వి.ఎన్.ఆర్. 2020 నివేదిక- క్రియాశీలక దశాబ్ది: ప్రపంచ స్థాయినుంచి స్థానిక స్థాయికి సుస్థిర అభివృద్ధి పేరిట నివేదికను ఐక్యరాజ్యసమితి ఉన్నత స్థాయి రాజకీయ వేదికపై సమర్ఫించినప్పటి చిత్రం
2.0. ఇండియా వి.ఎన్.ఆర్. నివేదికలో చిత్రాలు
2.1. వి.ఎ్.ఆర్. నివేదిక తయారీ ప్రక్రియ
2.2. 14 జనాభా గ్రూపులు, ప్రైవేటు రంగానికి చెందిన భాగస్వామ్య వర్గాలతో సంప్రదింపులు
***
(Release ID: 1638329)
Visitor Counter : 539