రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
మూడు బల్క్ డ్రగ్ పార్కులు, నాలుగు వైద్య పరికరాల పార్కుల ఏర్పాటుకు కసరత్తు
స్థలాల ఎంపికకోసం మార్గదర్శకాలను ఖరారు చేస్తున్న ఔషధ విభాగం
బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుపై పంజాబ్ ఆసక్తి
Posted On:
13 JUL 2020 5:12PM by PIB Hyderabad
దేశంలో బల్క్ డ్రగ్స్ ఉత్పత్తి చేసే మూడు పార్కులు, వైద్య పరికరాలు తయారు చేసే నాలుగు పార్కుల ఏర్పాటుకు స్థలాల ఎంపికకోసం మార్గదర్శక సూత్రాలను ఖరారు చేసే కసరత్తు సాగుతోంది. ఔషధ విభాగం ఈ ప్రయత్నంలోనే ఉందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డి.వి. సదానంద గౌడ చెప్పారు. కాగా, మూడు బల్క్ డ్రగ్ పార్కుల్లో ఒకదానిని పంజాబ్ లోని భటిండాలో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. పంజాబ్ ఆర్థిక శాఖ మంత్రి మన్ ప్రీత్ సింగ్ బాదల్ ఈ రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి డి.వి. సదానంద గౌడను కలుసుకుని ఈ మేరకు ఒక విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. భటిండాలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు ఆసక్తి చూపినందుకు బాదల్.కు సదానంద గౌడ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా బాదల్ మాట్లాడుతూ, భటిండా ప్రాంతానికి ఇతర ప్రాంతాలతో చక్కటి అనుసంధానం ఉందని, నీటి సరఫరా, స్థలం అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తమ రాష్ట్రంలో ఇప్పటికే యు.ఎస్.ఎఫ్.డి.ఎ. ఆమోదం పొందిన ఔషధ కంపెనీలు ఎన్.ఐ.పి.ఇ.ఆర్., ఐఐఎస్.ఇఆర్, ఎఐఐఎంఎస్ తదితర సంస్థలు ఉన్నాయని బాదల్ చెప్పారు.
మాత్రలు, కాప్స్యూల్స్ తయారీలో ఉపయోగించే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్ గ్రీడియంట్ (ఎ.పి.ఐ.), కె.ఎస్.ఎం.ల, స్వదేశీ తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2020వ సంవత్సరం మార్చి 12న ఒక పథకాన్ని ఆమోదించింది. దేశంలో బల్క్ డ్రగ్స్ తయారు చేసే 3 పార్కులు, వైద్యపరికరాలు వైద్య పరికరాలను ఉత్పత్తి చేసే నాలుగు పార్కులు అభివృద్ధి చేసేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం కింద బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు చేసే రాష్ట్రానికి గరిష్టంగా వెయ్యి కోట్ల రూపాయలు, వైద్య పరికరాల తయారీ పార్కులకు వందకోట్ల రూపాయలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. కీలకమైన క్రిటికల్ స్టార్టింగ్ మెటీరియల్ లేదా డ్రగ్ ఇంటర్మీడియట్ల తయారీకి సంబంధించి ఉత్పాదనతో ముడివడిన ప్రోత్సాహక పథకాన్ని కూడా భారత ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఈ పథకాల ద్వారా మొత్తం 13,760 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని కేంద్రం అందిస్తుంది. బల్క్ డ్రగ్ పార్క్ ప్రోత్సాహక పథకం ద్వారా 46,400కోట్ల రూపాయల విలువైన బల్క్ డ్రగ్స్ తయారయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇక, వైద్య పరికరాల తయారీ ప్రోత్సాహక పథకం ద్వారా 68,437 కోట్ల రూపాయల విలువైన వైద్యపరికరాలు తయారయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ రెండు పథకాల అమలుతో గణనీయమైన సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి.
*******
(Release ID: 1638402)
Visitor Counter : 224