PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 21 JUN 2020 6:33PM by PIB Hyderabad

 

(కోడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • కోవిడ్‌-19 నయమైనవారి సంఖ్య 2,27,755కు చేరగా; కోలుకునేవారి శాతం 55.49కి దూసుకెళ్లింది.
  • దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసులకన్నా కోలుకున్న కేసుల సంఖ్య 50,000కుపైగా నమోదైంది.
  • ముంబైలో చురుకైన చర్యలవల్ల జనసమ్మర్దంగల ధారవి ప్రాంతంలో సత్ఫలితాలు; కోవిడ్‌-19 సంక్రమణ శాతం 10.2కు తగ్గుదల; కేసుల రెట్టింపు వ్యవధి 78 రోజుల స్థాయికి పెరుగుదల.
  • దేశవ్యాప్తంగా 6వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ.
  • అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం; కోవిడ్‌-19పై పోరులో యోగాద్వారా వ్యాధి నిరోధక వ్యవస్థకు ఉత్తేజం లభిస్తుందని సూచన.
  • మన జీవితాల్లో ప్రపంచ మహమ్మారి ప్రభావిత ఒత్తిడికి ఉపశమనం కలిగించడంలో యోగా సమర్థ పరిష్కారం కాగలదు: ఉప రాష్ట్రపతి

 

పత్రికా సమాచార సంస్థ

సమాచార – ప్రసార మంత్రిత్వ శాఖ

భారత ప్రభుత్వం

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005EQGZ.jpg

Image

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ తాజా సమాచారం: ప్రస్తుత రోగుల సంఖ్యతో పోలిస్తే కోలుకున్నవారు 50,000కుపైగానే; కోలుకునేవారి శాతం 55.49కి చేరిక

దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య స్థిరంగా పెరుగుతూనే ఉంది. ఈ మేరకు గడచిన 24 గంటల్లో 13,925 మంది కోలుకోగా, వ్యాధి నయమైనవారి సంఖ్య 2,27,755కి చేరడంతో కోలుకునేవారి శాతం మెరుగుపడి 55.49కి చేరింది. ప్రస్తుతం 1,69,451 మంది చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్యతో పోలిస్తే కోలుకున్నవారి సంఖ్య 58,305 మేర అధికంగా ఉంది. ఇక రోగ నిర్ధారణ పరీక్షలకు ప్రభుత్వ రంగంలో 722, ప్రైవేటు రంగంలో 259 (మొత్తం 981) ప్రయోగశాలలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. దీంతో గడచిన 24 గంటల్లో 1,90,730 పరీక్షలు నిర్వహించగా, ఇప్పటిదాకా పరీక్షించిన నమూనాల సంఖ్య 68,07,226గా నమోదైంది.

మరిన్ని వివరాలకు...

ధారవిలో ‘వైరస్‌ వేట’... కొత్త కేసుల సగటు మే నెలతో పోలిస్తే జూన్‌ 3వ వారానికి బాగా తగ్గి 43కు పతనం

దేశంలో కోవిడ్‌-19 నిరోధం, నియంత్రణ, నిర్వహణ దిశగా కేంద్ర ప్రభుత్వం ముందస్తు-చురుకైన-క్రమబద్ధ స్పందన విధానాన్ని అనుసరించింది. ఈ మేరకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో సంయుక్తంగా పలు చర్యలు చేపట్టింది. అనేక రాష్ట్రాలు ఈ నియంత్రణ వ్యూహాల అమలుద్వారా చక్కటి ఫలితాలు వచ్చాయి. ఇందులో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం, బృహన్‌ ముంబై నగరపాలక సంస్థ (బీఎంసీ) చేపట్టిన చర్యలు కూడా ప్రోత్సాహకర ఫలితాలిచ్చాయి. ఈ మేరకు చురుగ్గా ‘వైరస్‌ వేట’ చేపట్టి, ధారవి ప్రాంతంలో కోవిడ్‌ అనుమానిత రోగుల జాడ అన్వేషణను ముమ్మరం చేసింది. తీవ్ర జనసమ్మర్దం (చదరపు కి.మీ/2,27,136)గల ధారవిలో 2020 ఏప్రిల్‌ నాటికి 491 కేసులు నమోదు కాగా, కేసుల రెట్టింపు వ్యవధి 18 రోజులుగానూ, పెరుగుదల 12 శాతంగానూ ఉంది. అయితే, బీఎంసీ చేపట్టిన చురుకైన ముందస్తు చర్యలవల్ల 2020 మే నాటికి కేసుల పెరుగుదల 4.3 శాతానికి, ప్రస్తుత జూన్‌ నెలలో 1.02 శాతానికి దిగివచ్చింది. అలాగే 2020 మే నాటికి కేసుల రెట్టింపు వ్యవధి 43 రోజులు కాగా, 2020 జూన్‌ నాటికి 78 రోజులకు పెరిగింది.    

మరిన్ని వివరాలకు...

దేశ‌వ్యాప్తంగా డిజిటల్ మాధ్య‌మం ద్వారా 6వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

దేశవ్యాప్తంగా 6వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్ర‌జ‌లు ఎలక్ట్రానిక్, డిజిటల్ మాధ్యమాల ద్వారా ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- కుటుంబ బంధాన్ని బలోపేతం చేయడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. యోగా అందరినీ దగ్గర చేస్తుందని చెప్పారు. ఈ మేరకు పిల్లలు, పెద్దలుసహా అందరినీ కుటుంబ బంధంతో చేరువ చేస్తుంద‌ని ప్ర‌ధానమంత్రి వివ‌రించారు. ఇందుకు అనుగుణంగానే ‘ఇంట్లో యోగా- కుటుంబంతో యోగా’ను ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ ఇతివృత్తంగా నిర్ణయించామని తెలిపారు. కోవిడ్‌-19 ప్రధానంగా మానవ శరీరంలోని శ్వాస‌కోశ‌ అవయవాలపై దాడిచేస్తుందని, అందువల్ల శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రాణాయామం కసరత్తులు సహాయపడతాయని ప్రధాని అన్నారు. “మన ఆరోగ్యం, ఆశాభావాలను మనం చక్కగా తీర్చిదిద్దుకోగలిగితే ఆరోగ్య, ఆనంద మానవాళి విజయాన్ని ప్రపంచం చూడగలిగే రోజు సమీపంలోనే ఉంటుందన్నారు. ఈ స్వప్నాన్ని యోగా కచ్చితంగా సాకారం చేయగలదని ప్రకటించారు. ప్రస్తుత కోవిడ్‌-19 మహమ్మారివల్ల ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారీ జనసమీకరణతో నిర్వహించడం సముచితం కానందువల్ల ఇళ్లలోనే కుటుంబసభ్యులతో కలసి యోగాభ్యాసం చేసేవిధంగా ప్రభుత్వం ప్రోత్సహించిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ప్రజలు ఆన్‌లైన్‌ మార్గంలో పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ వేదికలను గరిష్ఠంగా వినియోగించింది.

మరిన్ని వివరాలకు...

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

మరిన్ని వివరాలకు...

అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని; కోవిడ్‌-19పై పోరులో యోగాద్వారా రోగనిరోధక వ్యవస్థకు ఉత్తేజం: ప్రధానమంత్రి

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సంఘీభావం ప్రకటించే రోజుగా ప్రధానమంత్రి అభివర్ణించారు. ఇది విశ్వమానవ సౌభ్రాత్రం చాటే రోజని పేర్కొన్నారు. కోవిడ్‌-19 కారణంగా ప్రపంచ ఆరోగ్య అత్యయిక స్థితి ఏర్పడినందువల్ల ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ వేదికల ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా వారి కుటుంబ సభ్యులందరితో కలసి ఇళ్లలోనే యోగాభ్యాసం చేస్తున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆ విధంగా యోగ మనందర్నీ ఏకం చేసిందని ఆయన చెప్పారు.

మరిన్ని వివరాలకు...

ఆన్‌లైన్‌ విద్యాభ్యాస కార్యక్రమాల్లో యోగాను కూడా చేర్చాల‌ని విద్యాసంస్థలకు ఉప రాష్ట్రప‌తి సూచన

కోవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో ఆన్‌లైన్‌ విద్యాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్న విద్యా సంస్థలు యోగాభ్యాసాన్ని అందులో భాగంచేయాలని ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపరచే ఉత్తమ మార్గాల్లో యోగా కూడా ఒకటని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ‘స్పిక్‌-మెకే’ సంస్థ డిజిటల్‌ మాధ్యమంద్వారా నిర్వహించిన “యోగా-ధ్యాన శిబిరం”లో ఆయన ప్రసంగించారు. యోగా అన్నది భారతదేశం ప్రపంచానికి అందించిన విశిష్ట బహుమతిగా ఆయన అభివర్ణించారు. ఆ మేరకు ఇది నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తెచ్చిందని గుర్తుచేశారు. మానసిక, శారీరక ఆరోగ్యంపై కోవిడ్‌-19 ప్రభావం గురించి ప్రస్తావిస్తూ- “ప్రపంచం నేడు సవాళ్లతో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటుండటం వాస్తవం. అయితే, వైరస్‌ మనను శాసించేందుకు అనుమతించరాదు. దానికి వ్యతిరేకంగా మనమంతా ఏకమై పటిష్ఠంగా పోరాడటంద్వారా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి నడుం బిగించాలి” అని ఉప రాష్ట్రపతి ఉద్బోధించారు.

మరిన్ని వివరాలకు...

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2020 సందర్భంగా దేశ ప్రజలు దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా శుభాకాంక్షలు

“శరీరాన్ని ఆరోగ్యం ఉంచడానికి మించి యోగావల్ల అనేక ప్రయోజనాలున్నాయి. శరీరం, మనస్సు, పని, ఆలోచనల మధ్య మాత్రమేగాక, మానవులు-ప్రకృతి మధ్య కూడా సమతూకాన్ని సుసాధ్యం చేయగల మాధ్యమం యోగా” అని శ్రీ అమిత్‌ షా తన సందేశంలో పేర్కొన్నారు. భారత సంస్కృతి యోగాను మానవాళికి విశిష్ట బహుమతిగా అందించిందని దేశీయాంగ శాఖ మంత్రి చెప్పారు. నేడు ప్రపంచమంతా యోగాను అనుసరిస్తున్నదని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అవిశ్రాంత కృషితో అంతర్జాతీయ సమాజం దీన్ని ఆమోదించి, స్వీకరించిందని గుర్తుచేశారు.

మరిన్ని వివరాలకు...

కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ నివాసంలో యోగాభ్యాసం; వివిధ వర్గాలవారితో కలసి యోగాసనాలు వేసిన మంత్రి

కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ఇవాళ ఆరో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాలుపంచుకున్నారు. ఈ మేరకు తన నివాసంలో వివిధ వర్గాలవారితో కలసి యోగాభ్యాసం చేశారు. కోవిడ్‌-19 మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో భారీ సామూహిక కార్యక్రమాలు నిర్వహించే వీలు లేనందువల్ల ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇతివృత్తం “కుటుంబంతో యోగా”కు అనుగుణంగా ఇళ్లలోనే యోగాభ్యాసం చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సూచించారు.

మరిన్ని వివరాలకు...

 

 

 

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • మహారాష్ట్ర: రాష్ట్రంలో శనివారం 3,874 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 1,28,205కు చేరింది. పైగా ఒకేరోజు ఇంత పెద్ద సంఖ్యలో నమోదైన రికార్డు ఏర్పడింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 160 మరణించగా, ఒకేరోజు అధిక సంఖ్యలో మరణాలు సంభవించడం ఇది రెండోసారిగా నమోదైంది. దీంతో మరణించిన వారి సంఖ్య 5,984కు చేరింది. మహారాష్ట్రలో నమోదైన కేసులలో దాదాపు 51శాతం, మరణాల్లో 59 శాతం ముంబైలో నమోదైనవే. ఇక రాష్ట్రంలో వెంటిలేటర్ల కొరత నేపథ్యంలో కోవిడ్-19 రోగులకు తక్షణ ఉపశమనం కోసం ఆక్సిజన్ సిలిండర్లను ఉపయోగించాలని ప్రభుత్వం ఆస్పత్రులను కోరింది. మహారాష్ట్రలో ప్రస్తుతం 3,028 వెంటిలేటర్లు మాత్రమే ఉండగా పెరుగుతున్న కేసులవల్ల ఇవి ఏ మూలకూ సరిపోవడం లేదు.
  • గుజరాత్: రాష్ట్రంలో 539 కొత్త కేసులు నమోదుకాగా, ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో నమోదవడం ఇది రెండోసారి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 26,737కు చేరింది. ఇక శనివారం 20 మంది మృతితో మరణాల సంఖ్య 1,639కి పెరిగింది. వీటిలో 1,315 ఒక్క అహ్మదాబాద్‌లో నమోదైనవి కావడం గమనార్హం.
  • రాజస్థాన్: రాష్ట్రంలో ఆదివారం ఉదయం 154 కొత్త కరోనావైరస్ కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 14,691కి పెరిగింది. ఆరోగ్యశాఖ సమాచారం ప్రకారం.. కొత్త కేసులలో అత్యధికంగా ధోల్పూర్‌లో 59 నమోదవగా, జైపూర్ (31), ఝన్‌ఝన్‌ (22) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ వ్యాధితో ఇప్పటివరకూ 341 మంది మరణించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి పరిమితిని 100 నుంచి 200 రోజులకు పెంచాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నేడు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. దీనివల్ల కోవిడ్‌-19 మహమ్మారి ప్రభావితమైన రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లోని 70 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. దిగ్బంధం సమయంలో భారీ సంఖ్యలో వలస కార్మికులు రాజస్థాన్‌కు తిరిగి వచ్చినప్పటికీ పీఎంజీకేఆర్‌వై పరిధిలో వారిని చేర్చలేదని పేర్కొన్నారు.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో 142 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 11,724కు చేరింది. దీంతోపాటు శనివారం ఆరు మరణాలు సంభవించగా మృతుల సంఖ్య 501కి పెరిగింది.
  • మణిపూర్: రాష్ట్రంలో ప్రస్తుతం 14,983మంది సామాజిక నిర్బంధ పర్యవేక్షణలో ఉన్నారు. అలాగే అధికారిక నిర్బంధ పర్యవేక్షణ కేంద్రాల్లో 5,438 మంది, చెల్లింపు సంరక్షణ సదుపాయాలలో 530 మంది చికిత్స పొందుతున్నారు. ఇక మణిపూర్‌లో దిగ్బంధం ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు నిన్న 349 వాహనాలతోపాటు 599 మందిని అదుపులోకి తీసుకున్నారు; అనంతరం వారి నుంచి జరిమానా కింద రూ.62,100 వసూలు చేసి, తీవ్రంగా హెచ్చరించి వదిలివేశారు.
  • మేఘాలయ: రాష్ట్రంలో మరో ఐదుగురు వ్యక్తులు కోవిడ్‌-19 నుంచి కోలుకున్నారు. వీరికి పరీక్షలు నిర్వహించగా వ్యాధి నయమైనట్లు స్పష్టమైంది. ప్రస్తుతం మొత్తం కేసులు 44 కాగా, యాక్టివ్ కేసులు 6 మాత్రమే ఉన్నాయి. ఇప్పటివరకూ 37మంది కోలుకున్నారు.
  • మిజోరం: రాష్ట్రంలోని లుంగ్లీలోగల సివిల్ హాస్పిటల్‌లోని ట్రూనాట్ ప్రయోగశాలలో నిన్న పరీక్షించిన 15 నమూనాలకుగాను ఒకరికి మాత్రమే వ్యాధి ఉన్నట్లు కనిపిస్తుండగా, మిగిలిన 14 మందికి వైరస్‌ సోకలేదని తేలినట్లు నిర్ధారించారు. అయితే, సదరు వ్యక్తి నమూనా ఫలితాన్ని ZMC ప్రయోగశాల నిర్ధారించాల్సి ఉంది. ఇక ప్రస్తుతం నిర్బంధవైద్య పర్యవేక్షణలోగల రోగిని లుంగ్లీలోని ‘డిసిహెచ్‌సి’కి తరలించారు.
  • నాగాలాండ్: దిమాపూర్‌లోని బర్మా క్యాంప్‌లో వలస కార్మికుల కోసం ‘స్వయం సమృద్ధ భారతం ప్యాకేజీ’ కార్యక్రమాన్ని జిల్లా డీసీ అనూప్‌కించి ప్రారంభించారు. ఇందులో భాగంగా సుమారు 100 మంది వలస కార్మికులకు రేషన్ బియ్యం పంపిణీ చేశారు. వాడేసిన చేతి తొడుగులు, ఫేస్‌ మాస్కుల వంటి వ్యర్థ వ్యక్తిగత రక్షణ సామగ్రిని బహిరంగ ప్రదేశాల్లో, చెత్తడబ్బాల్లో పడవేయరాదని కోహిమా మునిసిపల్ కార్పొరేషన్ ప్రజలను హెచ్చరించింది. వీటన్నిటినీ సురక్షితంగా వదిలించుకోవడం కోసం విడిగా ఉంచాలని కోరింది.
  • కేరళ: రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఒక ఆటో డ్రైవర్, అతని కుటుంబ సభ్యులకు కోవిడ్‌-19 నిర్ధారణ కావడంతో ప్రభుత్వం తీవ్ర అప్రమత్తత హెచ్చరిక జారీచేసింది. కాగా, అతనితో పరిచయంగల వారి సంఖ్య 80-100దాకా ఉండవచ్చునని, వారిలో అధికశాతం వ్యక్తుల జాడ తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు నగరంలోని కొన్ని ప్రాంతాలను నియంత్రణ జోన్లుగా ప్రభుత్వం ప్రకటించింది. కన్నూర్ నగరంలో ఇటీవల కోవిడ్‌తో మరణించిన ఎక్సైజ్ శాఖ యువ డ్రైవర్ వ్యాధి సంక్రమణ మూలం కనుగొనేదాకా ఆంక్షలు కొనసాగుతాయి. ఇక వందే భారత్ మిషన్‌లో భాగంగా 1490మంది ప్రవాసులు ఇవాళ కోచ్చి చేరుకోనున్నారు. గల్ఫ్ దేశాల నుంచి 7 విమానాల్లో వీరు రాష్ట్రానికి చేరుకుంటారు. కాగా, నిన్న 9 విమానాలలో 1610 ప్రవాసులు కోచ్చి నగరానికి చేరుకున్నారు. గల్ఫ్‌ లోని దమామ్‌లో ఓ మలయాళీ కోవిడ్‌కు బలికావడంతో మొత్తం మృతుల సంఖ్య 250కి చేరింది. రాష్ట్రంలో నిన్న ఒకేరోజు అత్యధికంగా 127కొత్త కేసులు నమోదయ్యాయి.
  • తమిళనాడు: పుదుచ్చేరిలో ఇవాళ కోవిడ్-19కి ఒకరు బలికాగా, 30 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ కేంద్రపాలిత ప్రాంతంలో మరణాల సంఖ్య 8కి చేరగా, కేసుల సంఖ్య 366కు పెరిగింది. కాగా, తమిళనాడులో ఇవాళ 2,396 కొత్త కేసులు, 38 మరణాలు నమోదైన నేపథ్యంలో ప్రజల సహకారంలేనిదే ఈ మహమ్మారిని అదుపు చేయడం అసాధ్యమని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. రాష్ట్రంలో నిన్నటిదాకా మొత్తం కేసులు: 56,845, యాక్టివ్ కేసులు: 24,822, మరణాలు: 704, డిశ్చార్జ్: 30,271, చెన్నైలో యాక్టివ్ కేసులు: 17285గా ఉన్నాయి.
  • కర్ణాటక: రాష్ట్రంలోగల నియంత్రణ జోన్ల వెలుపల తెల్లవారుజామున 5 నుంచి రాత్రి 9 గంటల మధ్య ఎన్ని గంటలైనా పబ్లిక్‌ పార్కులను తెరిచేందుకు స్థానిక అధికారులు, పౌర సంస్థలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రైవేటు ఆసుపత్రులలో కోవిడ్-19కు చికిత్సపై ధర ఇంకా నిర్ణయించనప్పటికీ ప్రభుత్వ విధివిధానలు, ప్రమాణాల మేరకు కోవిడ్ రోగులను చేర్చుకుని, చికిత్స చేయాలని ‘ఆయుష్మాన్ భారత్-ఆరోగ్య కర్ణాటక’ పథకం జాబితాలోగల 518 ప్రైవేట్ వైద్య కళాశాలలు-ఆస్పత్రులను రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆదేశించింది. కాగా, రాష్ట్రంలో నిన్న 416 కొత్త కేసులు, 181 డిశ్చార్జి,  9 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు: 8697కాగా, వీటిలో 3170 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకూ నమోదైన మరణాల సంఖ్య: 132.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో కరోనావైరస్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వం మళ్లీ దిగ్బంధం విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 24,451 నమూనాలను పరీక్షించిన నేపథ్యంలో  గడచిన 24 గంటల్లో 439 కొత్త కేసులు నమోదవగా 151 మంది డిశ్చార్జ్ అయ్యారు; మరో 5 మరణాలు సంభవించాయి. దీంతో ప్రస్తుతం మొత్తం కేసులు: 7059, యాక్టివ్: 3599, కోలుకున్నవి: 3354, మరణాలు: 106గా ఉన్నాయి. ఇక గడచిన 24 గంటల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో వ్యాధి పీడితుల సంఖ్య: 1540 కాగా, వీటిలో యాక్టివ్: 639, కోలుకున్నవి: 901గా ఉన్నాయి. అలాగే విదేశాల నుంచి వచ్చినవారిలో మొత్తం కేసుల సంఖ్య: 330, యాక్టివ్: 278, కోలుకున్నవి: 52గా ఉన్నాయి.
  • తెలంగాణ: కోవిడ్-19కు చికిత్స దిశగా పరిశోధనాత్మక యాంటీవైరల్ ఔషధం ‘రెమ్‌డెసివిర్’ తయారీ, విక్రయాల నిమిత్తం హైదరాబాద్‌లోని ‘హెటెరో’ సంస్థకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతి లభించింది. మరోవైపు 'కోవిఫోర్' మందును 100 మిల్లీగ్రాముల ఇంజెక్షన్ రూపంలో ఆరోగ్య సంరక్షణ నిపుణుల పర్యవేక్షణలో నరంద్వారా ఇచ్చే విధానానికి కూడా అనుమతి లభించింది. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య: 7072; వీటిలో యాక్టివ్ కేసులు 3363; కోలుకున్నవారి సంఖ్య:3506, మరణాలు: 203గా ఉన్నాయి.

 

 

Image

*****


(Release ID: 1633257) Visitor Counter : 329