ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 తాజా సమాచారం
రోజువారీ కేసులు గణనీయంగా తగ్గిస్తూ ధరవి లో కోవిడ్ మీద పోరు
Posted On:
21 JUN 2020 4:58PM by PIB Hyderabad
ఒకవైపు ముందస్తు జాగ్రత్తలు, మరోవైపు సానుకూల స్పందన ద్వారా రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి కేంద్రం తీసుకున్న చర్యలు కోవిడ్ నియంత్రణకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఈ కృషిలో భాగంగా అనేక మార్గదర్శకాలు, సూచనలు, చికిత్సా విధివిధానాలు రూపొందించి రాష్ట్రాలకు అందించటం ద్వారా కోవిడ్ మీద ఉమ్మడి పోరు జరపటానికి దోహదం చేసింది.
అనేక రాష్ట్రాలు ఈ వ్యాహాలను అనుసరిస్తూ సమర్థవంతమైన ఫలితాలు సాధించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం, బృహన్ ముంబయ్ మున్సిపల్ కార్పొరేషన్ ( బి ఎం సి) చేసిన కృషి ఆశాజనకమైన ఫలితాలనిచ్చాయి. ఈ కృషిలో భాగంగా వైరస్ ను తరిమికొట్టే పనిలో అనుమానితులను గుర్తించి లక్ష్య సాధనలో విజయం సాధించారు.
జనసాంద్రత ఎక్కువగా ( చదరపు కిలోమీటరుకు 2,27,136 జనాభా) ఉన్న ధరవి లో 2020 ఏప్రిల్ లో 491 కేసులు నమోదై ఉన్నాయి. 12% చొప్పున పెరుగుతూ 18 రోజుల్లో రెట్టింపయ్యే అవకాశమున్న పరిస్థితి ఉండేది. అయితే బి ఎం సి తీసుకున్న చర్యల ఫలితంగా కోవిడ్-19 పెరుగుదల రేటు మే నెలకల్లా 4.3% కి పరిమితమైంది. అది జూన్ లో 1.02% కి తగ్గిపోయింది. ఆ విధంగా కేసులు సంఖ్య రెట్టింపు కావటానికి పట్టే సమయం మే నెలలో 43 రోజులకు, జూన్ లో 78 రోజులకు పెరిగింది.
నిజానికి 80% జనాభా సామూహిక మలమూత్రశాలలు ఉపయోగించే ధరవి లో బిఎంసి అనేక సవాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. పది అడుగుల పొడవు, పది అడుగుల వెడల్పు మాత్రమే ఉండే గుడిసెల్లో 8-10 మంది నివసించే వాతావరణ అక్కడ సహజం. ఇరుకు గల్లీలు, రెండు ముడు అంతస్తుల ఇళ్ళలోనూ కింది భాగం జనావాసమైతే, పైనుండే రెండు అంతస్తుల్లో ఫ్యాక్టరీలు ఉండటం లాంటి దారుణమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అందువలన భౌతిక దూరం పాటించటమన్నది అక్కడ అసాధ్యం. ఇక ఇళ్ళలోనే క్వారంటైన్ అనేది ఊహకే అందదు.
ఆనవాళ్ళు గుర్తించటం, ఆచూకీ తెలుసుకోవటం, పరీక్షలు చేయించటం, చికిత్స అనే నాలుగు అంచెల వ్యూహాన్ని బిఎంసి అధికారులు తూచా తప్పకుండా అమలు చేసారు. డాక్టర్లు, ప్రైవేట్ ఆస్పత్రుల సాయంతో ఇంటింటికీ తిరిగి 47,500 మందికి పరీక్షలు జరిపారు. మరో 14,970 మందికి మొబైల్ వ్యాన్ల ద్వారా పరీక్షలు చేశారు. మొత్తంగా బిఎంసి ఆరోగ్య సిబ్బంది 4,76,775 మందిని సర్వే చేశారు. రిస్క్ ఎక్కువగా ఉండే వృద్ధులను పరీక్షించటానికి జ్వర చికిత్సాలయాలు ఏర్పాటు చేశారు. వీటి వలన 3.6 లక్షలమందిని ప్రాథమికంగా పరీక్షించే వెసులుబాటు కలిగింది. సకాలంలో వేరుచేయటమనే వ్యూహంలో భాగంగా 8246 మంది వృద్ధులను సర్వే చేశారు. వ్యాధి వ్యాపించకుండా వారిని వేరుగా ఉంచారు. మొత్తంగా ధరవి లో 5,48,270 మందికి పరీక్షలు జరిపారు. అనుమానితులందరినీ కోవిడ్ కేర్ సెంటర్లకు, క్వారంటైన్ సెంటర్లకు తరలించారు.
రిస్క్ తో కూడుకున్న ఈ జోన్ లో పరీక్షల వంటి కార్యక్రమాలు చేపట్టటానికి సిబ్బంది కొరత ఏర్పడకుండా బిఎంసి అధికారులు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యానికి ప్రాధాన్యమిచ్చారు. అందుబాటులో ఉన్న ప్రైవేట్ డాక్టర్ల సేవలు వాడుకున్నారు. వాళ్ళకు కూడా పిపిఇ కిట్లు అందజేసి థెర్మల్ స్కానర్లు, పల్స్ ఆక్సీమీటర్లు, మాస్కులు, గౌవ్స్ అందజేసి ఇంటింటికీ ప్రాథమిక పరీక్షలకోసం పంపింది. ఆ విధంగా అనుమానితులను గుర్తించటం సాధ్యమైంది. అందుబాటులో ఉండగల డాక్టర్లందరినీ క్లినిక్స్ తెరచి ఉంచాలని కోరింది. అనుమానితులను అక్కడికి రమ్మని కూడా సూచించింది. ముందుగానే ఆ క్లినిక్స్ కూడా శుద్ధి చేయటం, తగిన సహకారం అందించటం మంచి ఫలితాలనిచ్చింది.
ఇరుకైన ఇళ్ళలో క్వారంటైన్ అన్నది ఆచరణ సాధ్యం కాదని గుర్తించటంతో అందుబాటులో ఉన్న స్కూల్స్, మారేజ్ హాల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు వాడుతూ సంస్థాగత క్వారంటైన్ కేంద్రాలు సిద్ధం చేశారు. సామూహిక వంటశాల కూడా అక్కడే ఏర్పాటు చేసి రేయింబవళ్ళూ వైద్య సదుపాయం, ఆహారం అందజేశారు.
బిఎంసి చేపట్టిన కోవిడ్ నియంత్రణ చర్యలు ప్రధానంగా మూడు కోణాల్లో ముందుకు సాగాయి. సమర్థంగా నివారించటం, సమగ్రంగా పరీక్షలు జరపటం, నిరాటంకంగా నిత్యావసరాలు అందేలా చూడటం అనే మూడు చర్యలు సత్ఫలితాలకు కారణమయ్యాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిని మాత్రమే ధరవి నుంచి వెలుపలికి తీసుకువచ్చి చికిత్స చేయించారు. అందువలన 90% మంది ధరవిలోనే ఉండిపోయారు. దాదాపు 25,000 కిరాణా సరకుల కిట్లు, 21,000 ఆహార పొట్లాలు కంటెయిన్మెంట్ జోన్లలో పంపిణీ చేసారు. అందువల్ల జనం ఇళ్లకే పరిమితం కాగలిగారు. దీంతో వైరస్ వ్యాపించటాన్ని అడ్డుకోగలిగారు.
స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు కూడా ఆహారం, కిరాణా సరకులు పంపిణీ చేశారు. అదే సమయంలో సామూహిక మలమూత్రశాలలను తరచూ ఇన్ఫెక్షన్ రహితంగా మార్చి శుద్ధి చేయటం, సిబ్బంది కోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు నడపటం కూడా చాలావరకు సహాయపడింది. అధిక రిస్క్ ఉన్న ప్రాంతాలకు అన్నివైపులా సీలు వేసి స్థానిక యువకులను సమీకరించి కోవిడ్ యోధులుగా పేరుపెట్టి, అక్కడ ఏ అవసరమున్నా వారి సాయం తీసుకోవటం కూడా మంచి ఫలితాలనిచ్చింది. ఆరోగ్య సిబ్బందికి, ప్రజలకు మధ్య వారధులుగా వారు సేవలందించారు. ప్రజల్లో అనవసర భయాలు పోగొట్టటానికి, ప్రభుత్వం పట్ల నమ్మకం కలిగించటానికి కూడా ఈ వ్యవస్థ బాగా సహాయపడింది.
***
(Release ID: 1633219)
Visitor Counter : 247