PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 15 JUN 2020 6:28PM by PIB Hyderabad

(కోడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 • దేశంలో కోవిడ్‌-19 నయమైనవారి సంఖ్య 1,69,797కి చేరగా- వీరిలో గడచిన 24 గంటల్లో బయటపడినవారు 7,419 మంది; దీంతో కోలుకునేవారి శాతం 51.08గా నమోదైంది.
 • ప్రస్తుతం 1,53,106 యాక్టివ్‌ కేసులు చురుకైన వైద్య పర్యవేక్షణలో ఉన్నాయి.
 • దేశంలో కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షల కోసం 900కుపైగా ప్రత్యేక ప్రయోగశాలలున్నాయి.
 • జాతీయ రాజధానిలో కోవిడ్‌-19పై ఢిల్లీలో దేశీయాంగ శాఖ మంత్రి అధ్యక్షతన అఖిలపక్ష భేటీ.
 • కోవిడ్‌-19పై ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కోసం సమాచార సేకరణ కేంద్రాలు ప్రారంభం.
 • తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో జూన్‌ 19 నుంచి 30వ తేదీదాకా తిరిగి పూర్తిస్థాయి దిగ్బంధం విధిస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

Image

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం; కోలుకునే వారి శాతం మెరుగుపడి 51.08కి చేరిక; దేశంలో కోవిడ్‌-19 నిర్ధారణ కోసం ప్రత్యేకంగా 900కుపైగా ప్రయోగశాలలు

దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కోవిడ్‌-19 నుంచి 7,419 మంది కోలుకోగా, వ్యాధి నయమైన వారి సంఖ్య 1,69,797కు చేరి, కోలుకునేవారి శాతం 51.08కి పెరిగింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కోవిడ్‌-19 రోగులలో సగానికిపైగా కోలుకున్నట్లయింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,53,106కాగా, వీరందరూ చురుకైన వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. మరోవైపు నవ్య కరోనా వైరస్‌ సోకినవారిని గుర్తించేందుకు భారత వైద్య పరిశోధన మండలి (ICMR) పరీక్ష సదుపాయాలను గణనీయంగా పెంచుతోంది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 653, ప్రైవేటు రంగంలో 248 (మొత్తం 901) ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 1,15,519సహా ఇప్పటిదాకా మొత్తం 57,74,133 నమూనాలను ఈ ప్రయోగశాలల్లో పరీక్షించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631748

జాతీయ రాజధానిలో కోవిడ్‌-19 పరిస్థితిపై ఢిల్లీలో దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం

ఢిల్లీలో కోవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలన్నీ తీసుకుంటుందని దేశీయాంగ్‌ శాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా చెప్పారు. ఈ మేరకు జాతీయ రాజధానిలో కోవిడ్‌-19 పరిస్థితిపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ప్రపంచ మహమ్మారిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వాన దేశవాసులు అందరూ ఒక్కటై నిలవాలని ఈ సందర్భంగా శ్రీ అమిత్‌ షా పిలుపునిచ్చారు. ఢిల్లీలో నిన్న తాను నిర్వహించిన సమీక్ష సమావేశంలో తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అఖిలపక్ష నేతలకు దేశీయాంగ శాఖ మంత్రి వివరించారు. ఈ నిర్ణయాలన్నీ క్షేత్రస్థాయిలో పటిష్ఠంగా అమలయ్యేలా అన్ని పార్టీలూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ సవ్యంగా అమలయ్యేందుకు అన్ని పార్టీల కార్యకర్తలు సహకరించేలా ఆయా పార్టీల నాయకులు సూచించాలని కోరారు. ఆ మేరకు ప్రజాహితం కోసం రాజకీయ విభేదాలకు అతీతంగా కృషిచేయాలని శ్రీ అమిత్‌ షా అన్ని పార్టీలకూ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631710

దేశంలోని సీజీఎస్టీ, కస్టమ్స్‌ కార్యాలయాల్లో ‘ఈ-ఆఫీస్‌’ వినియోగం ప్రారంభించిన సీబీఐసీ

దేశవ్యాప్తంగాగల 500 సీజీఎస్టీ, కస్టమ్స్‌ కార్యాలయాల్లో ‘ఈ-ఆఫీస్‌’ అనువర్తనం (యాప్‌) వాడకాన్ని కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు (సీబీఐసీ) చైర్మన్‌ ఇవాళ ప్రారంభించారు. “ప్రత్యక్ష హాజరీరహిత, సంపర్కరహిత, కాగితరహిత” పరోక్ష పన్ను పాలన దిశగా సాంకేతిక పరిజ్ఞాన సద్వినియోగంతో చేపట్టిన చర్యల్లో భాగంగానే ‘ఈ-ఆఫీస్‌’ వాడకాన్ని సీబీఐసీ ప్రారంభించింది. సీజీఎస్టీ, కస్టమ్స్‌ కార్యాలయాల్లోని అధికారులు, సిబ్బంది మొత్తం దైనందిన విధుల్లో దీన్ని వాడటంవల్ల సత్వర నిర్ణయాలకు, పారదర్శకత-జవాబుదారీతనానికి భరోసా లభిస్తుంది. దీంతోపాటు కాగితాలు, ముద్రణ తదితరాల వినియోగం తగ్గించడంద్వారా పర్యావరణంపై సానుకూల ప్రభావం ఉంటుంది. మరోవైపు ప్రస్తుత కోవిడ్‌-19 సవాలు నేపథ్యంలో సరికొత్త సాంకేతికత వినియోగంవల్ల భౌతిక సంపర్కం, ఫైళ్ల వాడకం వంటివాటితో పని ఉండదుగనుక వైరస్‌ వ్యాప్తి నిరోధం కూడా సాధ్యమవుతుంది. అంతేకాకుండా ‘ఈ-ఆఫీస్‌’ పత్రాలను మార్పు చేయడం, వెనుకతేదీతో రూపొందించడం, నాశనం చేయడంవంటి అక్రమాలకు ఆస్కారం కూడా ఉండదు. అలాగే ఇందులో అంతర్గతంగా ఉన్న పర్యవేక్షక యంత్రాంగంద్వారా సంబంధిత ఫైళ్లు ఎక్కడున్నదీ గుర్తించి, సత్వర పరిష్కారం దిశగా తక్షణ నిర్ణయాలు తీసుకునే వీలుంటుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631715

కోవిడ్‌-19పై ప్రజా ఫిర్యాదుల స్వీకరణకు ‘సమాచార సేకరణ కేంద్రాలు’ ప్రారంభించి ప్రజలతో నేరుగా ముచ్చటించిన కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌

కేంద్ర సిబ్బంది-ప్రజా సమస్యలు-పెన్షన్ల శాఖ సహాయమంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ ఇవాళ “ప్రజా ఫిర్యాదులపై సమాచార సేకరణ కేంద్రాల”ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కోవిడ్‌-19పై జాతీయ పర్యవేక్షణ-ప్రజా ఫిర్యాదుల వేదికద్వారా ఫిర్యాదులు విజయవంతంగా పరిష్కరించిన నేపథ్యంలో సదరు ఫిర్యాదీలైన పౌరులతో ఆయన ప్రత్యక్షంగా ముచ్చటించారు. ఇప్పటిదాకా లక్షదాకా కోవిడ్‌-19 సంబంధిత ప్రజా ఫిర్యాదులను పరిష్కరించి కొత్త మైలురాయి అందుకున్నందుకు డీఆర్‌పీజీ అధికారులను, సిబ్బందిని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ అభినందించారు. కాగా, ఓ సీనియర్‌ కేంద్రమంత్రి కోవిడ్‌-19పై ఫిర్యాదులు దాఖలు చేసిన పౌరులతో ప్రత్యక్షంగా ముచ్చటించడం ఇదే తొలిసారి. తద్వారా ఇతర మంత్రిత్వ శాఖలు కూడా పౌరుల ఫిర్యాదులపై సమాచార సేకరణ యంత్రాంగం తోడ్పాటుతో వాటిని సమర్థంగా పరిష్కరించేందుకు బాటలు వేశారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631715

చందాదారుల అభ్యర్థనల సత్వర పరిష్కారం కోసం బహుళ ప్రదేశ పరిష్కార విధానం ప్రారంభించిన ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ

దేశవ్యాప్తంగా సార్వత్రిక సేవా ప్రదాన ప్రమాణాలకు భరోసాతోపాటు కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో సిబ్బంది శక్తిని గరిష్ఠంగా వినియోగించుకునే దిశగా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) ఓ పెద్ద ముందడుగు వేసింది. ఇందులో భాగంగా ఇటీవల బహుళ ప్రదేశ అభ్యర్థన పరిష్కార సదుపాయానికి శ్రీకారం చుట్టింది. ఈ సదుపాయంద్వారా దేశంలోని చందాదారుల అభ్యర్థనలను ఏ ప్రాంతీయ కార్యాలయమైనా పరిష్కరించే వెసులుబాటు ఉన్నందువల్ల వినూత్న మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆ మేరకు భవిష్యనిధి, పెన్షన్‌, పాక్షిక ఉపసంహరణ, అభ్యర్థనలు, బదిలీ అభ్యర్థనలు తదితరాలన్నిటినీ ఈ వినూత్న సదుపాయం కింద ఏ కార్యాలయమైనా పరిష్కరించే సౌకర్యం ఉంటుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1631691

మిషన్‌ సాగర్‌: మారిషస్‌లోని ‘పోర్ట్‌ లూయీ’కి తిరిగి చేరిన ఐఎన్‌ఎస్‌ కేసరి నౌక

‘మిషన్‌ సాగర్‌’లో భాగంగా భారత నావికాదళ నౌక ‘కేసరి’ 2020 జూన్‌ 14న తిరిగి మారిషస్‌లోని ‘పోర్ట్‌ లూయీ’కి చేరింది. ఇంతకుముందు 2020 మే 23వ తేదీన భారత నావికాదళ వైద్య బృందాన్ని అక్కడ దింపి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం వారిని తిరిగి తీసుకువచ్చేందుకు వెళ్లింది. మారిషస్‌లో కోవిడ్‌-19 మహమ్మారి నిర్వహణకు తోడ్పడటం కోసం వెళ్లిన ఈ బృందంలో ప్రత్యే వైద్య నిపుణులతోపాటు పారామెడికల్‌ సిబ్బంది కూడా ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడి డాక్టర్లతో తమ నైపుణ్యాన్ని పంచుకుంటూ మహమ్మారి నిరోధం, నియంత్రణకు సహకరించి ప్రాణ నష్టం తప్పించడంలో ఇతోధికంగా సహకరించారు. భారత నావికాదళ వైద్య సిబ్బంది అక్కడికి చేరింది మొదలు ఇప్పటిదాకా మారిషస్‌లోని కోవిడ్‌ పోరాటయోధులతో అన్నిస్థాయులలోనూ అర్ధవంతమైన చర్చలద్వారా కోవిడ్‌-19 నిర్వహణలో ఉత్తమాచరణలను వారితో పంచుకుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631583

కేంద్ర సామాజిక న్యాయం-సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని ఏడీఐపీ పథకం కింద వర్చువల్‌ వేదికద్వారా పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో దివ్యాంగులకు తొలిసారి సహాయ పరికరాలు, ఉపకరణాల పంపిణీ

కోవిడ్‌-19 మహమ్మారివల్ల ఏర్పడిన అనూహ్య పరిస్థితులను సమాజం ఎదుర్కొంటున్న నేపథ్యంలో దివ్యాంగుల సంక్షేమ పథకాలు నిరాటంకంగా అమలయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు వ్యాధి నియంత్రణ చర్యలు చేపట్టడంతోపాటు వారికి ఏడీఐపీ పథకం కింద సమితి స్థాయిలో సహాయ పరికరాలు, ఉపకరణాలను పంపిణీ చేయడం కోసం పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ జిల్లాలోగల తల్వాండీ భాయ్‌ సమితిలో వర్చువల్‌ వేదికను నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం దిగ్బంధం ఆంక్షలు తొలగించిన తర్వాత నిర్దేశిత ప్రామాణిక ప్రక్రియ విధివిధానాల మేరకు కేంద్ర సామాజిక న్యాయం-సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని ఏడీఐపీ పథకం కింద డీఈపీ డబ్ల్యూడీ కింద ఏఎల్ఐఎంసీవో ద్వారా నిర్వహించిన తొలి వర్చువల్‌ సహాయ శిబిరం ఇదే కావడం విశేషం.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631712

దేశవ్యాప్త దిగ్బంధం సమయంలో నిత్యావసరాల నిరంతర సరఫరా కోసం 1,739 ట్రిప్పుల పార్శిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడిపిన ఎస్‌ఈఆర్‌

కోవిడ్‌-19పై పోరు దిశగా దేశం కట్టుబాటులో భాగంగా ఆగ్నేయ రైల్వే (SER) తనవంతు తోడ్పాటు అందించింది. ఈ మేరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు కాలపట్టిక ప్రాతిపదికన పార్శిల్‌ రైళ్లు నడిపేందుకు తన నెట్‌వర్క్‌ మొత్తాన్నీ సర్వసన్నద్ధంగా ఉంచింది. తదనుగుణంగా ఇప్పటివరకూ 1,739 ట్రిప్పుల పార్శిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ద్వారా 2020 ఏప్రిల్‌ 2 నుంచి జూన్‌ 13వ తేదీవరకూ ఆహారపదార్థాలు, కిరాణ సరకులు, మందులు, మాస్కులు-శానిటైజర్లు, కవరాల్స్‌, గ్లోవ్స్‌ తదితర వ్యక్తిగత రక్షణ సామగ్రిసహా వైద్య పరికరాలు, చేపలు, పండ్లు, పత్తి వస్తువులు, జనుపనార గోతాలు, కూరగాయలు, ఉల్లి, అల్లం, వెల్లుల్లి తదితర నిత్యావసరాలను చేరవేసింది. ఆ ప్రకారం మొత్తం 9,97,145 పార్శిల్‌ ప్యాకేజీలద్వారా 26,335 టన్నుల వస్తుసామగ్రిని సకాలంలో దేశంలోని వివిధ గమ్యాలకు అందించింది.   

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1631560

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 • పంజాబ్: రాష్ట్రంలో కోవిడ్ సంక్షోభం దృష్ట్యా ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్‌ అన్నయోజన ప్రయోజనాలను మరో ఆరునెలలపాటు అందించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి పంజాబ్ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జాతీయ ఆహారభద్రత చట్టం పరిధిలోకి వచ్చే లబ్ధిదారులందరికీ ఉచిత గోధుమలు, పప్పుదినుసులు అందించాలని కోరారు.
 • హర్యానా: రాష్ట్రంలో కోవిడ్‌ ఏకాంత గృహ పర్యవేక్షణలో ఉన్నవారి నుంచి సమాచార సేకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు వారికి ఫోన్‌ చేసి- సాధారణ ఆరోగ్య సేవల లభ్యత, వైద్యులు సూచించిన పద్ధతులను ఇళ్లలో అమలు చేస్తున్న తీరు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి సమాచారం స్వీకరిస్తారు. అలాగే ఆరోగ్యశాఖ మద్దతు అవసరమా, మందులు సవ్యంగా తీసుకుంటున్నారా, మాస్కులు ధరించడం, సూచనల ప్రకారం శుభ్రం చేయడం తదితరాల గురించి కూడా వాకబు చేస్తారు. ఇందుకోసం హర్యానా సహాయకేంద్రం నంబరు 1075 సేవలను వినియోగించుకుంటారు. ఇక్కడినుంచి వారికి కాల్‌ చేసిన సందర్భంలో కేవలం వారి అభిప్రాయం తీసుకోవడం మాత్రమేగాక వారి సమస్యలను కూడా పరిష్కరిస్తారు. దీంతోపాటు ఒత్తిడి, ఆందోళన తగ్గించడానికి ఈ ఫోన్‌కాల్‌ ద్వారానే మానసికపరమైన అంశాలపై సలహాలిస్తారు. ప్రస్తుత కోవిడ్‌-19 మహమ్మారి సవాలు సమయంలో ఇదెంతో ప్రయోజనకరం కానుంది. కాగా, కోవిడ్‌-19 నేపథ్యంలో ఇళ్లలో ఉన్నవారికి కాల్ సెంటర్ నంబరు 1075ద్వారా మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్ ఇవ్వడం కోసం హర్యానా ప్రభుత్వం 3 నెలల కాలానికి ‘ఇ-సైక్లినిక్” (అనుభవజ్ఞులు, అర్హతగల మనస్తత్వవేత్తల వేదిక)తో ఒప్పందం కుదుర్చుకుంది.
 • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధం ఏర్పాట్లతోపాటు అభివృద్ధి పనులుసహా ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ వ్యూహంపై ప్రణాళికలపై అంచనా దిశగా ప్రతి జిల్లాలో సమీక్ష సమావేశాల నిర్వహణకు ముఖ్యమంత్రి ఆమోదించారు. ఈ సమీక్ష సమావేశాలకు స్పీకర్, మంత్రులు, డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ చైర్మన్, చీఫ్ విప్ అధ్యక్షత వహిస్తారు. జిల్లా స్థాయిలో ఈ సమావేశాలకు ముఖ్యమంత్రి ఆమోదించిన చర్చనీయాంశాల్లో కోవిడ్-19 నియంత్రణ సన్నద్ధత, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించిన అన్ని ప్రధాన కార్యక్రమాల అమలు, ఖర్చు చేయని మొత్తాల వినియోగం, ముఖ్యమంత్రి ప్రకటనల అమలులో ప్రగతి, ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన పథకాల పురోగతి తదితరాలపైనా సమీక్షిస్తారు.
 • కేరళ: రాష్ట్రానికి వచ్చే ఇతర ప్రాంతాలవారి కోసం కేరళ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. ఈ మేరకు కొద్దిరోజుల పర్యటనకు వచ్చేవారు 7 రోజులు మించి ఉండకూడదు. కాగా, రాష్ట్రానికి తిరిగివచ్చే అధికారులు, ఇతర వృత్తి నిపుణులకు నిర్బంధవైద్య వ్యవధిలో ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. ఈ వెసులుబాటును ఇప్పుడు పరీక్షలు రాయడం కోసం వచ్చే అభ్యర్థులకూ వర్తింపజేస్తారు. అయితే, వారు నేరుగా వారికి కేటాయించిన వసతిగృహానికి వెళ్లాలి. అలాగే అనుమతి లేకుండా ఇతర ప్రదేశాలకు ప్రయాణించరాదు. ఇక దిగ్బంధ సమయంలో విద్యుత్‌ చార్జీలను అనూహ్యంగా పెంచడంపై పిటిషన్‌ దాఖలైన నేపథ్యంలో వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర హైకోర్టు విద్యుత్ బోర్డును ఆదేశించింది. మరోవైపు దిగ్బంధం అనంతరం రాష్ట్రంలో సినిమా షూటింగులు తిరిగి ప్రారంభమయ్యాయి. వలసకార్మికులు తిరిగి సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు ఉచిత టికెట్ల పంపిణీ చేస్తున్నారన్న వదంతితో కొచ్చి సమీపంలోని పెరుంబవూర్‌లో గుమిగూడిన వలస కార్మికులను  చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. కాగా, నిన్న రాష్ట్రంలో 54 కొత్త కేసులు, 56 రికవరీలు నమోదయ్యాయి. వ్యాధిసోకిన 1,340 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు.
 • తమిళనాడు: రాష్ట్రంలోని చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో జూన్ 19 నుంచి 30 వరకు సంపూర్ణ దిగ్బంధం విధిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. ఇక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 8 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 202కు చేరింది. తమిళనాడులో కేసులు పెరుగుతుండటంతో ఓ మోస్తరు వ్యాధి లక్షణాలున్న వారికోసం కొత్త కోవిడ్‌-19 సంరక్షణ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్వేషణ చేస్తోంది. రాష్ట్రంలో నిన్న ఒకేరోజు అత్యధికంగా 1,974 కేసులు నమోదవగా, 38 మరణాలు సంభవించాయి. కొత్త కేసులలో 1415 చెన్నైలో నమోదైనవి కాగా, మొత్తం కేసుల సంఖ్య: 44661కి పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు: 19676, మరణాలు: 435, చెన్నైలో యాక్టివ్ కేసులు: 14667గా ఉన్నాయి.
 • కర్ణాటక: రాష్ట్రంలోని శివమొగ్గలో రూ.220 కోట్లతో నిర్మించే విమానాశ్రయ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఇక కరోనా వ్యాప్తి నిరోధం కోసం, నిర్బంధవైద్య కేంద్రాల పర్యవేక్షణకు 800 బూత్ స్థాయి కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, రాష్ట్రంలో గురువారం మాస్కుల దినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పలువురు ప్రముఖులు, క్రీడాకారులు ఇందులో పాల్గొనబోతున్నారు. కర్ణాటకలో ఇప్పటిదాకా 4,40,684 పరీక్షలు నిర్వహించగా, 2956 యాక్టివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక నిన్న 176 కొత్త కేసులు నమోదవగా, 312 మంది డిశ్చార్జి అయ్యారు. మరో ఐదుగురు మరణించారు. మొత్తం కేసుల సంఖ్య: 7000, మరణాలు: 86, డిశ్చార్జి అయినవి: 3955గా ఉన్నాయి.
 • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని విశాఖపట్నంలోగల కింగ్ జార్జ్ హాస్పిటల్ (కెజిహెచ్) ఫోరెన్సిక్ మెడికల్ విభాగంలో జూనియర్‌ వైద్యుడొకరికి కోవిడ్-19 నిర్ధారణ కావడంతో అక్కడి అనాథ శవాగారాన్ని తాత్కాలికంగా మూసివేశారు. చిత్తూరులోని కాణిపాకం వినాయక ఆలయంలో విధుల్లో ఉన్న హోంగార్డుకు కోవిడ్‌ నిర్ధారణ కావడంతో రెండు రోజులపాటు దర్శనాలను అధికారులు రద్దుచేశారు. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 15,173 నమూనాలను పరీక్షించిన తర్వాత 246 కొత్త కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. కాగా, 47 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం మొత్తం కేసులు: 5087, యాక్టివ్: 2231, రికవరీ: 2770, మరణాలు: 86గా ఉన్నాయి.
 • తెలంగాణ: రాష్ట్రంలోని ప్రైవేట్ ప్రయోగశాల్లలో కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్ష రుసుమును ప్రభుత్వం రూ.2,200గా నిర్ణయించింది. ఇక ప్రైవేట్‌ ఆస్పత్రులలో సాధారణ ఏకాంత చికిత్స కోసం రోజుకు రూ.4,000, వెంటిలేటర్ లేకుండా చికిత్సకు రూ.7,500, వెంటిలేటర్‌తో రూ.9,000గా ధరలు నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాలను తర్వాత జారీచేయనుంది. కాగా, రాష్ట్రంలో జూన్ 15 నాటికి మొత్తం కేసులు 4,974 కాగా, వీటిలో 2,412 యాక్టివ్‌ కేసులున్నాయి.
 • మహారాష్ట్ర: రాష్ట్రంలో 3,390 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసులు 1,07,958కి పెరిగాయి. వీటిలో 53,030 యాక్టివ్‌ కేసులు కాగా, హాట్‌స్పాట్ ముంబైలో 1,395 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో కోవిడ్‌-19 రోగుల సంఖ్య 58,135కు చేరింది. ధారవి మురికివాడలో గత 24 గంటల్లో 13 కొత్త కేసులు మాత్రమే నమోదవగా, మరణాలేవీ సంభవించకపోవడంతో కరోనా కేసుల సంఖ్య అదుపులో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక ముంబైలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో శివారు రైళ్ల సేవలు ఈ తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. అయితే, ఇవి పశ్చిమ, మధ్య రైల్వే మార్గాల్లో కేవలం అత్యవసర సేవల సిబ్బంది రాకపోకలకు మాత్రమే పరిమితం. అందువల్ల ఈ ప్రత్యేక సబర్బన్ రైళ్ల సేవలు సాధారణ ప్రయాణికులకు/ప్రజలకు అందుబాటులో ఉండవు.
 • గుజరాత్: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 511 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 23,017కు పెరిగింది. మరో 29 మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య 1,478కి చేరింది.
 • రాజస్థాన్: రాష్ట్రంలో ఇవాళ 78 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 12,772కు చేరింది. వీరిలో 9631 మందికి వ్యాధి నయంకాగా డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2847కాగా, కొత్త కేసులలో అధికశాతం జైపూర్, ఝన్‌ఝన్‌ జిల్లాల నుంచి నమోదయ్యాయి.
 • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 161 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 10,808కి చేరింది. మరోవైపు 4 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధిక సంక్రమణగల ఇండోర్‌ జిల్లాలో కేసుల సంఖ్య 4063కు పెరిగింది. ఇక రాజధాని భోపాల్‌లో ఇప్పటిదాకా 2195 మంది కరోనా వైరస్‌ పీడితులు నమోదయ్యారు. మధ్యప్రదేశ్‌లో వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు సాయపడటం కోసం రాష్ట్ర ఆరోగ్యశాఖ స్వచ్ఛంద కార్యకర్తలను ‘కోవిడ్ మిత్ర’ పేరిట రంగంలో దింపాలని ప్రతిపాదించింది. ప్రజల ఆక్సిజన్ స్థాయిని తనిఖీ చేయడం కోసం వీరికి ‘ఆక్సీ మీటర్లు’ అందజేస్తారు. కాగా, 45 ఏళ్లవరకూ వయసున్న ఆరోగ్యకరమైన వ్యక్తులతోపాటు పట్టణ ప్రాంతంలోని సామాజిక/స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు ‘కోవిడ్ మిత్ర’గా నమోదు కావచ్చు.
 • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో ఆదివారం 113 కొత్త కేసులు నమోదవగా వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న 84 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 1662గా ఉంది.
 • గోవా: గోవాలో ఆదివారం 41 కోవిడ్-19 కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 564కు చేరగా, ఇప్పటిదాకా 74 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు.

 

FACT CHECK

 

******(Release ID: 1631804) Visitor Counter : 84