PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 10 JUN 2020 6:10PM by PIB Hyderabad

(కోడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • దేశంలో కోవిడ్‌-19 నయమైనవారి సంఖ్య (1,35,205) యాక్టివ్‌ కేసుల సంఖ్య (1,33,632)ను అధిగమించింది.
  • కోలుకునేవారి శాతం మెరుగుపడి 48.88గా నమోదైంది.
  • ఇప్పటిదాకా 50 లక్షలకుపైగా నమూనాలు పరీక్షించబడ్డాయి.
  • కోవిడ్‌ ఆస్పత్రులుగా ప్రకటించబడిన సీజీహెచ్‌ఎస్‌ జాబితాలోని అన్ని ఆస్పత్రులూ ఆ పథకం లబ్ధిదారులకు చికిత్స సదుపాయాలు అందించాలని ఉత్తర్వు జారీ.
  • దేశంలో దిగ్బంబంధం మొదలైనప్పటినుంచి 31.9 లక్షల వ్యాగన్లద్వారా సరకుల రవాణాతో సరఫరా గొలుసు కొనసాగింపు.

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం; యాక్టివ్‌ కేసుల సంఖ్యను అధిగమించిన కోలుకున్నవారి సంఖ్య; 50 లక్షలకుపైగా నమూనాలను పరీక్షించిన ఐసీఎంఆర్‌; కోవిడ్‌-19 నిర్వహణపై రాష్ట్రాలకు సహాయ పడేందుకు 6 కేంద్ర బృందాల నియామకం

గడచిన 24 గంటల్లో 5,991 మందికి కోవిడ్‌-19 వ్యాధి నయమైంది. దీంతో కోలుకున్నవారి సంఖ్య 1,35,205కు చేరగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,33,632గా నమోదైంది. ఈ మేరకు దేశంలో తొలిసారిగా యాక్టివ్‌ కేసుల సంఖ్యను కోలుకున్నవారి సంఖ్య అధిగమించింది. దీంతో కోలుకునేవారి శాతం మెరుగుపడి 48.88గా నమోదైంది. ఇక ఐసీఎంఆర్‌ ఇప్పటివరకూ 50 లక్షలకు మించి నమూనాలను పరీక్షించిన నేపథ్యంలో మొత్తం పరీక్షలు 50,61,332కు చేరగా, గడచిన 24 గంటల్లో 1,45,216 నమూనాలు పరీక్షించబడ్డాయి. మరోవైపు నవ్య కరోనా వైరస్‌ సోకినవారిని గుర్తించేందుకు ఐసీఎంఆర్‌ పరీక్ష సదుపాయాలను గణనీయంగా పెంచింది. ఆ మేరకు ప్రభుత్వపరంగా 590, ప్రైవేటు రంగంలో 233 (మొత్తం 823) ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి.

దేశంలోని ఆరు నగరాలు... ముంబై, అహ్మదాబాద్‌, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరులలో కోవిడ్‌-19కు సంబంధించిన ప్రజారోగ్య చర్యలపై సమీక్షించి, రాష్ట్ర ప్రజారోగ్య శాఖలుసహా పురపాలక అధికారులకు సాంకేతిక మద్దతుద్వారా  చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆరు బృందాలను పంపించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630705

రాష్ట్ర ప్ర‌భుత్వాలు కోవిడ్ ఆస్ప‌త్రులుగా ప్ర‌క‌టించిన సీజీహెచ్ఎస్ జాబితాలోని అన్ని ఆస్ప‌త్రులలో ఆ ప‌థ‌కం ల‌బ్ధిదారుల‌కు చికిత్స స‌దుపాయాలు

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) కిందకు వచ్చే జాబితాలోని ఆరోగ్య సంరక్షణ సంస్థలకు కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ ఒక ఉత్తర్వు జారీచేసింది. ఈ మేరకు వివిధ రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు కోవిడ్‌ ఆస్పత్రులుగా ప్రకటించిన అన్ని ఆస్పత్రుల్లోనూ సీజీహెచ్‌ఎస్‌ లబ్ధిదారులకు పథకం నిబంధనల మేరకు కోవిడ్‌ సంబంధిత వైద్యసేవలు అందించాలని అందులో ఆదేశించింది. అలాగే సీజీహెచ్‌ఎస్‌ జాబితాలోని కోవిడేతర ఆస్పత్రులలో నిబంధనల మేరకు చార్జీలు వసూలు చేస్తూ ఇతరత్రా వ్యాధులతో బాధపడేవారికి వైద్య సదుపాయాల కల్పనకు తిరస్కరించరాదని, ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630681

దిగ్బంధం తొలగింపు నేపథ్యంలో రైల్వేలద్వారా సరకు రవాణాలో పెరుగుదల

కోవిడ్‌-19 నేపథ్యంలో దిగ్బంధం విధించిన సమయంలోనే కాకుండా ప్రస్తుతం ఆంక్షలు తొలగించిన తర్వాత కూడా సరకు రవాణా- పార్శిల్‌ సేవలద్వారా దేశవ్యాప్తంగా నిత్యావసరాలను అందుబాటులో ఉంచడంలో భారత రైల్వేశాఖ గణనీయ సేవలందిస్తోంది. ఈ మేరకు పౌరులకు అవసరమైన వస్తువులను, ఇంధన-మౌలిక సదుపాయాల రంగాలకు కీలకమైన వస్తుసామగ్రిని సకాలంలో చేరవేసేందుకు అవిరళ కృషి చేస్తోంది. తదనుగుణంగా కోవిడ్‌-19 దిగ్బంధం సమయంలోనూ తన రవాణా మార్గాలను పూర్తిస్థాయిలో నిర్వహించింది. తద్వారా గృహ-పరిశ్రమల అవసరాలను తీర్చడంలో విజయవంతమైంది. ఇందులో భాగంగా మే నెలలో రైల్వేశాఖ 82.27 మిలియన్‌ టన్నుల నిత్యావసరాలను రవాణా చేయగా, 2020 ఏప్రిల్‌ నెలలో రవాణా చేసిన 65.14 మిలియన్‌ టన్నులతో పోలిస్తే ఇది 25 శాతం అధికం కావడం గమనార్హం. మొత్తంమీద 2020 ఏప్రిల్‌ 1 నుంచి 2020 జూన్‌ 9వరకూ రోజుకు 24 గంటలూ సరకు రవాణా రైళ్లను నడుపుతూ 175.46 మిలియన్‌ టన్నుల నిత్యావసరాలను రైల్వేశాఖ దేశంలోని వివిధ ప్రాంతాలకూ చేరవేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630713

కేదారనాథ్‌ పునర్నిర్మాణ ప్రాజెక్టుపై ప్రధానమంత్రి సమీక్ష

ప్రధానమంత్రి ఇవాళ కేదారనాథ్‌ పుణ్యక్షేత్రం అభివృద్ధి-పునర్నిర్మాణ ప్రాజెక్టుపై దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ఉత్తరాఖండ్‌ ప్రభుత్వంతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణంపై తన దృష్టికోణాన్ని వివరించారు. కేదారనాథ్, బద్రీనాథ్‌ వంటి పవిత్ర ప్రదేశాల అభివృద్ధి ప్రాజెక్టులను ముందుచూపుతో రూపొందించాలని చెప్పారు. ఈ మేరకు అవి పర్యావరణ హితంగానూ, పరిసరాలకు తగినట్లు ప్రకృతితో మమేకమయ్యేలా, కాలపరీక్షకు తట్టుకోగలిగే విధంగానూ ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఈ పవిత్ర స్థలాలకు పర్యాటకులు, యాత్రికుల రాకపోకలు సాపేక్షంగా తక్కువగా ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని  పెండింగ్‌ పనులను పూర్తిచేయాలని ప్రధానమంత్రి సూచించారు. ఆ మేరకు అందుబాటులోగల కార్మిక సమూహాలను తగువిధంగా వినియోగించుకుంటూ సామాజిక దూరం నిబంధనలను పాటిచండానికి ప్రాధాన్యమివ్వాలని కోరారు. రాబోయే సంవత్సరాల్లో పర్యాటక ప్రవాహాన్ని కొనసాగించే విధంగా సౌకర్యాలు, మౌలిక సదుపాయాల సృష్టికి ఈ కృషి దోహదపడుతుందని ఆయన చెప్పారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630679

ప్రైవేటు సంస్థలు తమ సామర్థ్యం పెంచుకునే దిశగా ఇస్రో సదుపాయాల వినియోగానికి అనుమతి: డాక్టర్‌ జితేంద్ర సింగ్‌

ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 2.0 ఏడాది పాలనలో దేశం సాధించిన విజయాలను కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ వివరించారు. ఇందులో భాగంగా ‘స్వయం సమృద్ధ భారతం’పై మోదీ ప్రభుత్వ మార్గ ప్రణాళికకు అనుగుణంగా ఆర్థికశాఖ మంత్రి చేసిన ప్రకటనతో అంతరిక్ష కార్యకలాపాలలో ప్రైవేటురంగం భాగస్వామ్యానికి ఉత్తేజమిస్తుందని ఆయన చెప్పారు. భారత అంతరిక్షరంగ ప్రగతి పయనంలో దేశ ప్రైవేటు రంగం సహ ప్రయాణ భాగస్వామిగా ఉంటుందని పేర్కొన్నారు. ఇక కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలోనూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో శాస్త్రవేత్తలు కోవిడ్‌-19పై పోరుకోసం అత్యవసర వైద్య పరికరాలు, రక్షణ సమాగ్రి, ఇతర ఉపకరణాల రూపకల్పనకు అత్యుత్తమ పద్ధతుల అన్వేషణలో నిమగ్నమయ్యారని మంత్రి చెప్పారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630524

భార‌త ప్రధానమంత్రి, ఫిలిప్పీన్స్ అధ్యక్షుల‌ మధ్య టెలిఫోన్ సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు గౌరవనీయ రోడ్రిగో దుత‌ర్తేతో సంభాషించారు. కోవిడ్-19 మహమ్మారి విసిరిన సవాళ్ల పరిష్కారంలో త‌మ‌త‌మ దేశాల్లో ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై ఈ సంద‌ర్భంగా వారు చర్చించారు. ప్ర‌స్తుత ఆరోగ్య సంక్షోభం నేప‌థ్యంలో భార‌త‌, ఫిలిప్పీన్స్ పౌరుల‌ సంక్షేమంపై శ్ర‌ద్ధతోపాటు స్వ‌దేశం పంపేందుకు చొర‌వ చూప‌డంపై దేశాధినేత‌లిద్ద‌రూ ప‌ర‌స్ప‌రం అభినంద‌న‌లు తెలియ‌జేసుకున్నారు.  త‌మకు అవసరమైన మందుల సరఫరాలో భార‌త్ చూపిన చొర‌వను ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ప్రశంసించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630574

 

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • చండీగఢ్‌: కేంద్రపాలిత ప్రాంతం పరిధిలో కరోనాతో పోరాడి యాక్టివ్‌ కేసుల సంఖ్యను తగ్గించడంలో అవిరళ కృషిచేసిన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పురపాలక, పోలీసు, పాలన యంత్రాంగం సిబ్బంది తదితరులకు నగర పాలనాధికారి కృతజ్ఞతలు తెలిపారు. అయినప్పటికీ ఇతర రాష్ట్రాలనుంచి తిరిగి వస్తున్నవారి విషయంలో జిల్లా అధికారులు నిఘా ఉంచాలని, తద్వారా వ్యాధి వ్యాప్తిని త్వరగా గుర్తించి, నియంత్రించడం సాధ్యమవుతుందని ఆయన నొక్కి చెప్పారు. సరిహద్దులు తెరిచిన నేపథ్యంలో వైరస్‌ రెండోదశ విజృంభణ సంభవిస్తే రోగులకు చికిత్స సదుపాయాల కల్పనకు అన్ని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు.
  • హర్యానా: రాష్ట్రంలో కోవిడ్‌-19 వ్యాప్తి శాతంపై విశ్లేషణ ప్రాతిపదికన భవిష్యత్‌లో చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ప్రస్తుత ఏర్పాట్లపై పర్యవేక్షణ, సమీక్ష నిమిత్తం కనీసం రెండు పగళ్లు, రెండు రాత్రులపాటు జిల్లాల్లో పర్యటించేలా సీనియర్‌ అధికారులను నియమించింది. ఈ మేరకు సంబంధిత అధికారులు ఆయా జిల్లాల్లో పోలీసు,  పట్టణ స్థానిక సంస్థల, ఆరోగ్య-వైద్య, విద్యా, పరిశోధన విభాగాల అధికారులంతా కోవిడ్‌-19పై పోరాటం కొనసాగించేలా ఉత్తేజమిస్తారు.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో 2,259 కొత్త కేసులతో మొత్తం కేసులు 90,787కు పెరిగాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం... మరోవైపు 120 మంది మృతితో మరణాల సంఖ్య 3289కి చేరింది. గత 24 గంటల్లో 1663 డిశ్చార్జి కాగా, ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 42,638కి పెరిగింది. మరోవైపు ముంబైలో 1,015 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 50,878కి చేరాయి. నగరంలో 58 మరణాల నమోదుతో మృతుల సంఖ్య కూడా 1,758కి చేరింది. కాగా, ముంబైలో నమోదైన కేసుల సంఖ్య ఇప్పుడు చైనాలో కరోనాకు మూలస్థానమైన వుహాన్ స్థాయిని దాటింది. అయితే, ముంబైలో కేసుల రెట్టింపు  వ్యవధి ఇప్పుడు 23 రోజులకు పెరిగింది. ఇక ఆసియాలోనే అతిపెద్దదైన మురికివాడ ధారవిలో కేసుల రెట్టింపు వ్యవధి 48 రోజులకు పెరిగింది. అంతేకాకుండా గడచిన ఏడు రోజులుగా మరణాలేవీ సంభవించకపోవడం ఊరటనిచ్చే అంశం.
  • గుజరాత్: రాష్ట్రంలో 470 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 21044కు చేరింది. వీటిలో 5336 యాక్టివ్‌ కేసులున్నాయి. కొత్త కేసులలో హాట్‌స్పాట్ అహ్మదాబాద్‌లో 331 నమోదవడం గమనార్హం. ఇక మంగళవారం 33 మంది రోగుల మృతితో రాష్ట్రంలో మరణాల సంఖ్య 1,313కు పెరిగింది. మరోవైపు 409 మంది రోగులు డిశ్చార్జ్ కాగా, కోలుకున్నవారి సంఖ్య 14,373కు చేరింది. ఇక అహ్మదాబాద్‌లో ప్రముఖ కీలకవైద్య నిపుణుడు డాక్టర్ రాజ్ రావల్ నైపుణ్యంగల వైద్య బృందాన్ని ఏర్పాటుచేసి, తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్న రోగులకు ఇళ్లవద్దనే సేవలు అందిస్తున్నారు. ఈ గృహ సంరక్షణ సేవలో భాగంగా రోగులకు సహాయక నర్సు, ఆక్సిజన్ సదుపాయాలు కల్పించడం సహా అవసరమైతే కేసులను ఆయన పర్యవేక్షిస్తారు.
  • రాజస్థాన్: రాష్ట్రంలో ఈ ఉదయం వరకూ 123, మంగళవారం 369 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 11,368కి పెరిగింది. కాగా, దేశంలో కోలుకుంటున్నవారి శాతం అత్యధికంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకూ 8,502 మందికి వ్యాధి నయమైంది. కరోనా కేసులు నిరంతరం పెరుగుతుండటంతో రాజస్థాన్ ప్రభుత్వం ఇవాళ తమ అంతర్రాష్ట్ర సరిహద్దులన్నింటినీ మూసివేసింది. అంతేకాకుండా రాష్ట్రంలోనూ వాహన రాకపోకలను నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో 211 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 9849కి చేరింది. వీటిలో 2700 యాక్టివ్‌ కేసులు కాగా, ఇప్పటిదాకా 6,729 మంది కోలుకున్నారు. మరో 420మంది మరణించారు. మధ్యప్రదేశ్‌లో కరోనా వ్యాప్తిలో వృద్ధి శాతం ఇప్పుడు 2.74 శాతం కాగా, జాతీయ సగటు 5.4 శాతం కావడం గమనార్హం.
  • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో మంగళవారం 43 కొత్త కేసుల నమోదుతో మొత్తం కరోనావైరస్ సోకినవారి సంఖ్య 1,251కి చేరగా, వీటిలో 859 యాక్టివ్‌ కేసులున్నాయి.
  • గోవా: రాష్ట్రంలో మంగళవారంనాటి 29 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 359కి పెరిగింది. వీటిలో 292 యాక్టివ్‌ కేసులు కాగా, ఇప్పటిదాకా 67 మంది కోలుకున్నారు. రాష్ట్రంలోని మాంగోర్ ప్రాంతంలో కేసులు గరిష్ఠంగా నమోదవుతుండగా కొత్త కేసులలో 22 ఆ ప్రాంతానికి చెందినవే.
  • అరుణాచల్ ప్రదేశ్: దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటివరకూ 11,500 మందికిపైగా రాష్ట్రానికి తిరిగి వచ్చారని రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి చెప్పారు. వీరేకాకుండా ఇంకా చాలామంది ఇప్పటికీ తిరిగి వస్తున్నారని, వారందరి కోసం ఆరోగ్య తనిఖీతోపాటు నిర్బంధవైద్య పర్యవేక్షణకు ప్రామాణిక ప్రక్రియ విధివిధానాలను అనుసరిస్తామని ప్రకటించారు.
  • అసోం: రాష్ట్రంలో 42 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 3092కు చేరగా, వీటిలో 1987 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక ఇప్పటిదాకా 1097 మంది కోలుకోగా, ఐదుగురు మరణించారు.
  • మణిపూర్: రాష్ట్రంలో ఐదుగురికి రోగ నిర్ధారణ కావడంతో మొత్తం కేసులు 309కి పెరిగాయి. వీరందరూ రాష్ట్రానికి తిరిగివచ్చిన వారే కావడం గమనార్హం. కాగా, రాష్ట్రంలో ఇప్పటిదాకా 19,854 నమూనాలను పరీక్షించారు.
  • మిజోరం: రాష్ట్రంలో దిగ్బంధం నిబంధనల్లో పాక్షికంగా మార్పులు చేస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేరకు మిజోరంలోని లెంగ్‌పుయి విమానాశ్రయం తదుపరి ఆదేశాలిచ్చేదాకా కార్యకలాపాలు కొనసాగిస్తుంది.
  • నాగాలాండ్: నాగాలాండ్ పౌరసంఘాల సంస్థలు ఇవాళ రాత్రి 7 గంటలకు ‘ఇళ్ల నుంచే ప్రార్థన’లు చేశారు. ఇందులో భాగంగా ప్రజలు కొవ్వొత్తులు లేదా మొబైల్ ఫోన్ లైట్లను వెలిగించి, కోవిడ్‌పై పోరాడుతున్న ముందువరుసలోని వైద్యులు, ఆరోగ్య సిబ్బంది భద్రత కోసం ప్రార్థించాలని పిలుపునిచ్చాయి. కాగా, నాగాలాండ్‌లో ఇప్పటివరకు 4732 నమూనాలను పరీక్షించగా, 3518 ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం 5922 మంది నిర్బంధవైద్య పర్యవేక్షణలో ఉన్నారు.
  • కేరళ: త్రివేండ్రం మెడికల్ కాలేజీ నుంచి ఇటీవల తప్పించుకున్న కోవిడ్-19 రోగిని తిరిగి ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో అతడు ఏకాంత చికిత్స వార్డులో ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, అతనికి రెండోసారి నిర్వహించిన పరీక్షలో వ్యాధి లేదని తేలడం గమనార్హం. అయితే, అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులలో 40 మందిని ప్రస్తుతం నిర్బంధవైద్య పర్యవేక్షణకు తరలించారు. కోవిడ్-19 సామాజిక వ్యాప్తి నిరోధం దిశగా నియంత్రణ చర్యలను మరింత కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. ఇక వచ్చే సోమవారం నుంచి శబరిమలలో నెలవారీ పూజలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయంలోకి భక్తులను అనుమతించవద్దని, వేడుకలను వాయిదా వేయాలని ప్రధాన పూజారి దేవస్వం బోర్డుకు లేఖ రాశారు. గల్ఫ్ ప్రాంతంలో మరో నలుగురు కేరళీయులు వైరస్‌కు బలయ్యారు. దీంతో గల్ఫ్‌ ప్రాంతంలో మలయాళీ మృతుల సంఖ్య 207కు చేరింది. ఇక స్వదేశంలో ఇద్దరు ముంబైలోనూ, ఒకరు ఢిల్లీలోనూ ప్రాణాలు కోల్పోయారు. కేరళలో వరుసగా రెండో రోజు 91 కేసులు నిర్ధారణ కాగా, రాష్ట్రంలో నిర్బంధవైద్య పర్యవేక్షణలో ఉన్నవారి సంఖ్య 2 లక్షలు దాటింది.
  • తమిళనాడు: రాష్ట్రంలో కోవిడ్-19 మరణాల సంఖ్యను తక్కువగా అంచనా వేస్తున్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం ఉండొచ్చునని ప్రభుత్వం అంగీకరించింది; ఈ నేపథ్యంలో చెన్నై నగరంలో సంభవించిన అన్ని కోవిడ్-19 మరణాల ఆడిట్ కోసం 9 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. కాగా పుదుచ్చేరిలో మరణించిన రిటైర్డ్ టీచర్‌కు కోవిడ్‌-19 సోకినట్లు గుర్తించారు. కాగా ఈ కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం కేసుల సంఖ్య 145కి పెరిగింది. తమిళనాడు తరహాలోనే పుదుచ్చేరి పాలన యంత్రాంగం పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను మంగళవారం రద్దుచేసింది. డిఎంకె ఎమ్మెల్యే జె.అన్బళగన్‌ చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో కోవిడ్-19కు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాష్ట్రంలో నిన్న 1685 కొత్త కేసులు నమోదు కాగా, 798 మంది కోలుకున్నారు; 21 మంది మరణించారు. చెన్నైలో కొత్త కేసులు 1242కాగా, మొత్తం కేసులు: 34914, యాక్టివ్: 16279, మరణాలు: 307. చెన్నైలో యాక్టివ్ కేసులు 12570గా ఉన్నాయి.
  • కర్ణాటక: రాష్ట్రంలో ‘ఐఎల్‌ఐ, సారి’ లక్షణాల చరిత్రగలవారు మరణిస్తే వారి నమూనాలను సేకరించి కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు కొనసాగిస్తున్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ మేరకు మరణించిన 6 గంటల్లోగా పరీక్ష కోసం నమూనాలను సేకరించాలని పేర్కొంది. కాగా, రాష్ట్రంలో మంగళవారంనాటికి 4 లక్షలకుపైగా నమూనాలను పరీక్షించినట్లు వైద్యవిద్యాశాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ తెలిపారు. ఇప్పటిదాకా 2605 మంది డిశ్చార్జి అయిన నేపథ్యంలో మొత్తం కేసులు 5921 కాగా, కోలుకునేవారి శాతం 44గా ఉంది. ఇకపై మహారాష్ట్ర నుంచి తిరిగి వచ్చేవారిని సంస్థాగత నిర్బంధానికి కాకుండా నేరుగా 14 రోజుల గృహ నిర్బంధవైద్య పర్యవేక్షణకు పంపుతామని ఆరోగ్యశాఖ మంత్రి బి.శ్రీరాములు తెలిపారు. రాష్ట్రంలో నిన్న 161 కొత్త కేసులు నమోదవగా, 164 మంది డిశ్చార్జి అయ్యారు. రెండు మరణాలు సంభవించాయి. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య: 5921, యాక్టివ్‌ కేసులు: 3248, మరణాలు: 66గా ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్.రమేష్ కుమార్ పునర్నియామకం కేసులో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పుపై స్టే కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇక రాష్ట్రంలో ఇంతకుముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పదో తరగతి పరీక్షలు జరుగుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. రాష్ట్రంలోని 2,47,040 మంది రజకులు, క్షురకులు, దర్జీలకు రూ.10,000 ఆర్థిక సాయం అందించే “జగనన్న చేదోడు” పథకాన్ని ముఖ్యమంత్రి ఇవాళ ప్రారంభించారు. తిరుమల-తిరుపతి దేవస్థానం గురువారం నుంచి తిరుమలలో దర్శనాలను ప్రారంభించడానికి సిద్ధమైంది. ఇక గత 24 గంటల్లో 15,384 నమూనాలను పరీక్షించిన నేపథ్యంలో 136 కొత్త కేసులు నమోదవగా, 72 మంది డిశ్చార్జ్ అయ్యారు; ఒకరు మరణించారు. ప్రస్ఉతతం మొత్తం కేసులు: 4126. యాక్టివ్: 1573, రికవరీ: 2475, మరణాలు: 78గా ఉన్నాయి.
  • తెలంగాణ: రాష్ట్రంలోని గాంధీ ఆస్పత్రిలో నిన్న ఒక వైద్యుడిపై దాడి తర్వాత నిరసన తెలుపుతున్న వైద్యులకు సంఘీభావంగా ఇవాళ రాష్ట్రమంతటా నిరసనలు వెల్లువెత్తాయి. అంతర్గత పరీక్షల మార్కుల ఆధారంగా రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులను పై తరగతులకు పంపాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో 7 లక్షల మంది విద్యార్థులు పై తరగతికి వెళ్తారు. ఇక నేటివరకూ వలసదారులు, విదేశాల నుంచి తిరిగివచ్చిన వారిలో 448 మందికి కోవిడ్‌-19 నిర్ధారణ అయింది.

 

FACT CHECK

 

 

Image

*****



(Release ID: 1630770) Visitor Counter : 268