రైల్వే మంత్రిత్వ శాఖ

లాక్ డౌన్ ను క్రమంగా ఎత్తివేస్తున్న నేపథ్యంలో రైల్వే ద్వారా సరకు రవాణా మళ్ళీ పుంజుకుంటోంది.

2020 మే 1వ తేదీ నుండి 2020 మే 31వ తేదీ వరకు భారత రైల్వే 82.27 మిలియన్ టన్నుల నిత్యావసర వస్తువులను రవాణా చేసింది. ఏప్రిల్ నెలతో పోలిస్తే ఇది 25 శాతం కంటే ఎక్కువ.


2020 ఏప్రిల్ 1వ తేదీ నుండి 2020 జూన్ 9వ తేదీ వరకు భారత రైల్వే దేశవ్యాప్తంగా 175.46 మిలియన్ టన్నుల నిత్యావసర వస్తువులను రవాణా చేసింది.


24.03.2020 నుండి 09.06.2020 వరకు 31.90 లక్షలకు పైగా వ్యాగన్ల ద్వారా సామాగ్రి రవాణా అయ్యింది. వీటిలో 17.81 లక్షలకు పైగా వ్యాగన్లు నిత్యావసర వస్తువులను రవాణా చేశాయి.


వైద్య సామాగ్రి, వైద్య పరికరాలు, ఆహారం మొదలైన ముఖ్యమైన వస్తువుల రవాణా కోసం భారతీయ రైల్వే 22.03.2020 నుండి 9.06.2020 వరకు మొత్తం 3,861 గూడ్సు రైళ్లను నడిపింది.

Posted On: 10 JUN 2020 3:25PM by PIB Hyderabad

కోవిడ్-19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్న సమయంలోనూ, ఆ తరువాత భారతీయ రైల్వే తన సరకు రవాణా  మరియు పార్శిల్ సేవల ద్వారా నిత్యావసర వస్తువులు నిరంతరం అందుబాటులో ఉండే విధంగా తన కృషిని కొనసాగిస్తోంది.   కోవిడ్-19 లాక్ డౌన్ పరిస్థితుల్లో కూడా, భారతీయ రైల్వే, ఇంధన మరియు మౌలిక సదుపాయాల రంగానికి అవసరమైన వస్తువులనూ, పౌరులకు అవసరమైన నిత్యావసర వస్తువులనూ సకాలంలో అందజేయడానికి, పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టింది. ఇటు గృహ వినియోగదారులకు, అటు పరిశ్రమ రంగానికీ అవసరమైన సరకులు రవాణా చేయడంలో భారతీయ రైల్వే విజయవంతమయ్యింది.  

2020 మే నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు మే నెలలో భారత రైల్వే 82.27 మిలియన్ టన్నుల నిత్యావసర వస్తువులను రవాణా చేసింది. 2020 ఏప్రిల్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు రవాణా చేసిన 65.14 మిలియన్ టన్నులతో పోలిస్తే ఇది 25 శాతం కంటే కంటే ఎక్కువ.

2020 ఏప్రిల్ 1వ తేదీ నుండి 2020 జూన్ 9వ తేదీ వరకు భారత రైల్వే తన నిరంతరాయమైన 24 గంటల సరుకు రవాణా రైళ్ల కార్యకలాపాల ద్వారా మొత్తం 175.46 మిలియన్ టన్నుల నిత్యావసర వస్తువులను దేశవ్యాప్తంగా రవాణా చేసింది.

24.03.2020 నుండి 09.06.2020 వరకు 31.90 లక్షలకు పైగా వ్యాగన్ల ద్వారా సామాగ్రి రవాణా అయ్యింది.  వీటిలో 17.81 లక్షలకు పైగా వ్యాగన్లు ఆహార ధాన్యాలు, ఉప్పు, చక్కెర, పాలు, వంట నూనె, ఉల్లిపాయలు, పండ్లు, కూరగాయలు, పెట్రోలియం ఉత్పత్తులు, బొగ్గు, ఎరువులు వంటి ముఖ్యమైన వస్తువులను దేశవ్యాప్తంగా రవాణా చేశాయి. 2020 ఏప్రిల్ 1వ తేదీ నుండి 2020 జూన్ 9వ తేదీ వరకు, రైల్వేలు 12.56 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను రవాణా చేశాయి. గత ఏడాది ఇదే కాలంలో 6.7 మిలియన్ టన్నుల ధాన్యాలు రవాణా అయ్యాయి. 

వీటితో పాటు, 22.03.2020 నుండి 9.06.2020 వరకు భారతీయ రైల్వే మొత్తం 3,861 పార్సెల్ రైళ్లను నడిపాయి. వీటిలో 3,755 రైళ్ళు, టైమ్ టేబుల్ ప్రకారం నడిచే రైళ్ళు ఉన్నాయి.  ఈ పార్సెల్ రైళ్ల ద్వారా మొత్తం 1,37,030 టన్నుల సరుకు రవాణా అయ్యింది.  కోవిడ్-19 కారణంగా లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలోనూ, ఆ తర్వాత  చిన్న పార్శిల్ పరిమాణంలో వైద్య సామాగ్రి, వైద్య పరికరాలు, ఆహారం మొదలైన నిత్యావసర వస్తువుల రవాణా చాలా ముఖ్యం. ఈ కీలకమైన అవసరాన్ని తీర్చడానికి, ఇ-కామర్స్ సంస్థలు మరియు రాష్ట్ర ప్రభుత్వంతో సహా ఇతర వినియోగదారుల ద్వారా త్వరితగతిన రవాణా చేయడానికి రైల్వే పార్శిల్ వ్యాన్లను భారతీయ రైల్వే అందుబాటులోకి తెచ్చింది.  అవసరమైన వస్తువుల నిరంతరాయ సరఫరాను నిర్ధారించడానికి భారతీయ రైల్వే, టైమ్ టేబుల్ ప్రకారం నడిచే పార్సెల్ ప్రత్యేక రైళ్లను ఎంచుకున్న మార్గాల్లో నడుపుతోంది. 

ఈ పార్శిల్ ప్రత్యేక రైళ్ల మార్గాలను జోనల్ రైల్వేలు క్రమం తప్పకుండా గుర్తించి తెలియజేస్తున్నాయి.   ప్రస్తుతం ఈ రైళ్లు తొంభై ఆరు (96) మార్గాల్లో నడుస్తున్నాయి.  గుర్తించబడిన మార్గాలు ఈ విధంగా ఉన్నాయి : 

i)     దేశంలోని ప్రధాన నగరాలు, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, మరియు హైదరాబాద్‌ల మధ్య రెగ్యులర్ కనెక్టివిటీ.

ii)       రాష్ట్ర-రాజధానులు / ముఖ్యమైన నగరాల నుండి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ.

iii)      దేశంలోని ఈశాన్య ప్రాంతానికి కనెక్టివిటీని నిర్ధారిస్తుంది.

iv)    మిగులు ప్రాంతాలు (గుజరాత్, ఆంధ్రప్రదేశ్) నుండి అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాలకు పాలు మరియు పాల ఉత్పత్తుల సరఫరా.

v)      ఉత్పత్తి చేసే ప్రాంతాల నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు ఇతర అవసరమైన వస్తువులు (వ్యవసాయ ఇన్పుట్లు, మందులు, వైద్య పరికరాలు మొదలైనవి) సరఫరా.

 

దేశానికి అవసరమైన వస్తువుల సరఫరా దెబ్బ తినకుండా చూసేందుకు, వివిధ వస్తువులు నిల్వ చేసే షెడ్లు, స్టేషన్లు మరియు నియంత్రణ కార్యాలయాలలో, భారతీయ రైల్వే సిబ్బంది  24 గంటల ప్రాతిపదికన పనిచేస్తున్నారు.  లోకోమోటివ్ పైలట్లు మరియు గార్డులు రైళ్లను సమర్థవంతంగా నడుపుతున్నారు.  ట్రాక్, సిగ్నలింగ్, ఓవర్ హెడ్ పరికరాలు, లోకోమోటివ్స్, కోచ్‌లు మరియు వ్యాగన్ల యొక్క ముఖ్య నిర్వహణ సిబ్బంది సరుకు రవాణా రైళ్లను సజావుగా నడిపించేలా మౌలిక సదుపాయాలను మంచిగా నిర్వహిస్తున్నారు.

 

గూడ్స్ రైలు కార్యకలాపాల్లో జోనల్ రైల్వే ఎదుర్కొంటున్న సమస్యలను రైల్వే అధికారుల ద్వారా రియల్ టైమ్ ప్రాతిపదికన హోం మంత్రిత్వ శాఖ (ఎమ్.హెచ్.ఏ) ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ కు ఎత్తిచూపడానికి ఒక సంస్థాగత విధానాన్ని అమలుచేయడం జరిగింది.  

*****



(Release ID: 1630713) Visitor Counter : 242