గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జూలై 1, 2026 నుంచి గ్రామీణ భారతం అంతటా వికసిత భారత్ – జీ రామ్ జీ చట్టం అమలు

గ్రామీణ జీవనోపాధులను బలపరచడానికి 125 రోజుల చట్టబద్ధమైన ఉపాధి హామీ

ఎంజీఎన్ఆర్‌ఈజీఏ నుంచి వికసిత భారత్-జీ రామ్ జీ కి సజావుగా మారేలా చర్యలు

ఉపాధి, జీవనోపాధులు, గ్రామీణ అభివృద్ధికి రూ.95,692 కోట్ల భారీ కేటాయింపు

ప్రస్తుత జాబ్ కార్డులు చెల్లుబాటులోనే ఉంటాయి, కొనసాగుతున్న పనులు ఆగవు

నాడు పోస్టు చేయడమైనది: 11 MAY 2026 12:09PM by PIB Vijayawada

11 మే 2026

విజయవాడ

భారత గ్రామీణాభివృద్ధి చరిత్రలో మరో కీలకమైన అడుగు వేస్తూ, భారత ప్రభుత్వం 11 మే 2026న వికసిత భారత్గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్) : వికసిత భారత్-జీ రామ్ జీ చట్టం, 2025ను జూలై 1, 2026 నుంచి దేశమంతటా అమలు చేసేలా నోటిఫై చేసింది.

ఈ కొత్త చట్టం అమలులోకి వచ్చిన రోజు నుంచి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (మహాత్మా గాంధీ NREGA), 2005 రద్దు అవుతుంది. ఇది భారత గ్రామీణాభివృద్ధిలో చారిత్రక మార్పుకు నాంది. వికసిత భారత్ @2047 లక్ష్యానికి అనుగుణంగా గ్రామాలను సమగ్రంగా, భవిష్యత్తు అవసరాలకు సరిపడేలా అభివృద్ధి చేయడమే దీని లక్ష్యం.

కొత్త చట్టం కింద, పని చేసేందుకు ముందుకొచ్చే వయోజన సభ్యులున్న ప్రతి గ్రామీణ కుటుంబానికి ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధికి హామీ ఇస్తుంది. దీంతో గ్రామీణ కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడి, ఆదాయాలు పెరిగి, గ్రామ స్థాయిలో స్థిరమైన అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారు.

పని కోసం అడిగిన కార్మికులకు నిర్ణీత గడువులోగా పని చూపించాల్సి ఉంటుంది. లేదంటే చట్టంలోని నిబంధనల ప్రకారం నిరుద్యోగ భత్యం చెల్లించాలి.

సకాలంలో, పారదర్శకంగా వేతనాలు చెల్లించడంపై ఈ చట్టం ప్రత్యేక దృష్టి పెట్టింది. వేతనాలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా నేరుగా కార్మికుల బ్యాంకు లేదా పోస్టాఫీసు ఖాతాలకు పంపుతారు. వేతనాలు వారానికోసారి లేదా మస్టర్ రోల్ మూసిన 15 రోజులలోపు చెల్లించాలి; లేకపోతే చట్టం ప్రకారం ఆలస్య పరిహారం ఇవ్వాలి.

వికసిత భారత్జీ రామ్ జీ చట్టం, 2025 సరిగ్గా అమలు చేయడానికి భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రూ.95,692.31 కోట్లు కేటాయించింది. గ్రామీణ ఉపాధి పథకానికి బడ్జెట్ అంచనా దశలో ఇంత వరకు జరిగిన అత్యధిక కేటాయింపు.

రాష్ట్రాల వాటాతో కలిపితే మొత్తం పథకానికి అయ్యే ఖర్చు రూ.1.51 లక్షల కోట్లు దాటుతుందని అంచనా. దీంతో గ్రామీణ మౌలిక సదుపాయాలు మెరుగుపడి, పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరిగి, గ్రామీణ ఆదాయాలు పెరుగుతాయని భావిస్తున్నారు.

కొత్త చట్టం అమలు తేదీ వరకు మహాత్మా గాంధీ  జాతీయ గ్రామీణ ఉపాధీ హామీ పథకం కింద పనులు ఆగకుండా కొనసాగుతాయి. జూన్ 30 నాటికి కొనసాగుతున్న పనులు కొత్త చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా సజావుగా కొనసాగిస్తారు. గ్రామీణ కార్మికులకు సమయానికి పని దొరకడం, వేతనాలు వెంటనే చెల్లించడం ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత.

వికసిత భారత్-జీ రామ్ జీ చట్టం మొదలయ్యే ముందు అర్హత గల ఏ గ్రామీణ కుటుంబానికీ ఇబ్బంది కలగకుండా, డిమాండ్ తీరు, క్షేత్ర స్థాయి అవసరాలను బట్టి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తగిన లేబర్ బడ్జెట్ ఏర్పాట్లు చేయబడ్డాయి.

గ్రామీణ రోజ్గార్ గ్యారెంటీ కార్డులు ఇచ్చే వరకు e-KYC ధృవీకరించిన ప్రస్తుత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధీ హామీ పథకం జాబ్ కార్డులు వికసిత భారత్జీ రామ్ జీ కింద చెల్లుబాటులో ఉంటాయి. జాబ్ కార్డు లేని కార్మికులు గ్రామ పంచాయతీ స్థాయిలో పేర్లు నమోదు చేసుకోవచ్చు. e-KYC పెండింగ్లో ఉందని పని నిరాకరించరు; e-KYC పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్ర స్థాయిలో సహాయం చేస్తాయి.

వికసిత భారత్జీ రామ్ జీ చట్టం, 2025 కింద వివిధ నిబంధనల ముసాయిదాలను గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి తయారు చేస్తోంది.

  • నిధుల పంపిణీకి సంబంధించిన నిబంధనలు 
  • పాత పథకం నుంచి కొత్త పథకానికి మారే సమయానికి సంబంధించిన నిబంధనలు
  • జాతీయ స్థాయి స్టీరింగ్ కమిటీ నిబంధనలు
  • కేంద్ర గ్రామీణ రోజ్గార్ గ్యారెంటీ కౌన్సిల్ నిబంధనలు
  • పరిపాలనా వ్యయం నిబంధనలు
  • ఫిర్యాదుల పరిష్కార నిబంధనలు
  • వేతనాలు, నిరుద్యోగ భత్యం చెల్లింపు విధానంపై నిబంధనలు
  • అదనపు వ్యయాన్ని భరించే విధానంపై నిబంధనలు
  • శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతాల్లో పథకం ఖర్చులు భరించే నిబంధనలు

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధీ హామీ పథకం నుంచి వికసిత భారత్జీ రామ్ జీకి సజావుగా మారేందుకు పరివర్తన నిబంధనలలో తగిన ఏర్పాట్లు చేర్చబడుతున్నాయి; ఇవి త్వరలో విడుదల అవుతాయి. పైన పేర్కొన్న ఇతర నిబంధనలు కూడా తయారై, త్వరలో అందరి అభిప్రాయాల కోసం విడుదల చేయబడతాయి.

వికసిత భారత్జీ రామ్ జీ చట్టం, 2025 ఉపాధి కల్పన, గ్రామీణాభివృద్ధి, గ్రామాల స్వావలంబనకు కొత్త శక్తి ఇస్తుందని భావిస్తున్నారు. గ్రామ పంచాయతీలను గ్రామీణ అభివృద్ధికి కేంద్ర బిందువుగా చేసే ఈ చట్టం, బలమైన, సంపన్నమైన, అభివృద్ధి చెందిన గ్రామీణ భారత్ నిర్మాణంలో ఒక చారిత్రక మైలురాయిగా నిలవనున్నది.

 

****


(రిలీజ్ ఐడి: 2259963) సందర్శకుల సూచీ సంఖ్య : : 15