|
ఆర్థిక మంత్రిత్వ శాఖ
నామమాత్రపు జీడీపీ వృద్ధి 2025-26లో 8 శాతంగా ఉంటుందని అంచనా వేసినప్పటికీ... వాస్తవ వృద్ధి 7.4 శాతంగా ఉంటుంది
· అయితే, 2025-26 తొలి ముందస్తు అంచనాలతో పోలిస్తే 2026-27 బడ్జెట్‌లో నామమాత్రపు జీడీపీ వృద్ధి 10 శాతంగా ఉంటుందని అంచనా · సేవా రంగం 9.1 శాతం విస్తరణతో వృద్ధికి ప్రధాన చోదక శక్తిగా కొనసాగుతుంది · 2026-27 బడ్జెట్ అంచనాల మేరకు పన్నుల పంపిణీ (₹15.26 లక్షల కోట్లు)... గ్రాంట్లు (₹1.4 లక్షల కోట్లు) సహా ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రాలతో పంచుకునే మొత్తం వనరుల విలువ ₹16.56 లక్షల కోట్లు · 2026-27లో కేంద్ర ప్రభుత్వ వాస్తవ మూలధన వ్యయం జీడీపీలో 4.4 శాతం.. అంటే- ₹17.15 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా · మొత్తం వాస్తవ మూలధన వ్యయంలో కేంద్ర ప్రభుత్వ వాటా (₹12.22 లక్షల కోట్లు) సహా మూలధన ఆస్తుల సృష్టి దిశగా రాష్ట్రాలకిచ్చే సహాయక గ్రాంట్లు (₹4.93 లక్షల కోట్లు) కూడా ఉన్నాయి · 2026-27 బడ్జెట్ అంచనాలలో కేంద్ర ప్రభుత్వ రుణభారం జీడీపీలో 55.6 శాతం కాగా.. 2025-26లో ఇది 56.1 శాతంగా నమోదైంది. · ప్రైవేట్ అంతిమ వినియోగ వ్యయం (పీఎఫ్‌సీఈ)లో వృద్ధి 7 శాతంగా ఉంటుందని అంచనా వేయగా.. జీడీపీలో దీని వాటా 61.5 శాతంగా ఉంది.. 2012 నుంచి ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే ఇదే అత్యధిక స్థాయి. · 2026లో స్థూల స్థిర మూలధన కల్పన (జీఎఫ్‌సీఎఫ్) 7.8 శాతం పెరుగుతుంది · ద్రవ్య లోటును 2025-26 సవరించిన అంచనాలు 4.4 శాతంగా పేర్కొన్న నేపథ్యంలో 2026-27 బడ్జెట్ అంచనాలు 4.3 శాతంగా పేర్కొంటున్నాయి · 2026-27 బడ్జెట్ అంచనాల్లో రెవెన్యూ లోటు 1.5 శాతం కాగా... వాస్తవ లోటు 0.3 శాతంగా ఉంటుందని పేర్కొంటోంది · 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం స్థూల పన్నుల రాబడి జీడీపీలో 11.2 శాతం · ద్రవ్యలోటు 2025 తొలి అర్ధభాగంలో జీడీపీలో 1.3 శాతం కాగా, 2026 తొలి అర్ధభాగంలో 0.8 శాతానికి తగ్గింది · అంతర్జాతీయ సుంకాల్లో అనిశ్చితి ఉన్నప్పటికీ 2025లో భారత్ మొత్తం ఎగుమతులు 825.3 బిలియన్ డాలర్ల స్థాయిని అందుకున్నాయి · స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) 2025లో 81 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి
प्रविष्टि तिथि:
01 FEB 2026 12:36PM by PIB Hyderabad
భారత వృద్ధి దృక్పథం సానుకూలతను ప్రదర్శిస్తోంది. బలమైన దేశీయ డిమాండ్, సమూల సంస్కరణలు, సుస్థిర స్థూల ఆర్థిక పరిస్థితులే ఇందుకు కారణం. ఇందువల్ల ఈ ఏడాది మూడు స్వతంత్ర రేటింగ్ సంస్థలు మన దేశం స్థానాన్ని ఉన్నతీకరించాయి. ఈ మేరకు 2026-27 ఆర్థిక బడ్జెట్ సహా కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ ముందుంచిన స్థూల ఆర్థిక పత్రంలో ప్రకటించారు. దీంతోపాటు మధ్యకాలిక ద్రవ్య విధానం-వ్యూహ ప్రకటన మేరకు ద్రవ్యోల్బణం దృక్పథం కూడా అనుకూలమే. ప్రభుత్వ పెట్టుబడులు, నియంత్రణల సరళీకరణ, కార్మిక మార్కెట్ సంస్కరణలు, మానవ మూలధన పెట్టుబడులు, పన్ను సంస్కరణలు, డిజిటల్ పరిణామం, ఆర్థిక వ్యవస్థ అధికారికీకరణ వంటివి మరింత ఉన్నత వృద్ధి పథంవైపు నడిపిస్తాయని ఈ పత్రం పేర్కొంది. ఆస్తులు-అప్పులు, లాభనష్టాలకు సంబంధించి కార్పొరేట్, ఆర్థిక రంగాల బలమైన పట్టికలను బట్టి, పెరిగే ప్రైవేట్ రంగ పెట్టుబడుల పెరుగుదల స్ఫూర్తితో వృద్ధి క్రమం సవ్యంగా నడుస్తుందని అంచనా.
స్థూల ఆర్థిక చట్రం ప్రకటన
ఆర్థిక వృద్ధి
జాతీయ గణాంక కార్యాలయం ప్రకటించిన తొలి ముందస్తు అంచనాల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వాస్తవ జీడీపీ 7.4 శాతం వృద్ధి చెందుతుంది... నామమాత్రపు జీడీపీ వృద్ధి 8 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. అలాగే, సేవల రంగం 9.1 శాతం విస్తరించి ప్రధాన వృద్ధి చోదకంగా కొనసాగుతోంది. ఉత్పాదకత, నిర్మాణ రంగాలు 7 శాతం వృద్ధి చెందగా, వ్యవసాయ రంగం 3.1 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా. ఇక 2025-26 తొలి ముందస్తు అంచనాలతో పోలిస్తే 2026-27 బడ్జెట్‌లో నామమాత్రపు జీడీపీ వృద్ధి 10 శాతంగా ఉంటుందని అంచనా వేయబడింది.
వినియోగం – పెట్టుబడి
ఈ వృద్ధికి దేశీయ డిమాండ్ మూలస్తంభంగా నిలుస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ రంగ అంతిమ వినియోగ వ్యయం (పీఎఫ్‌సీఈ) వృద్ధి 7 శాతంగా నమోదు కాగలదని అంచనా. జీడీపీలో దీని వాటా 61.5 శాతం కాగా, 2012 ఆర్థిక సంవత్సరం తర్వాత ఇదే అత్యధిక స్థాయి కావడం గమనార్హం. అలాగే ప్రభుత్వ అంతిమ వినియోగ వ్యయం కూడా 2025నాటి 2.3 శాతంతో పోలిస్తే, 2026లో ఏటా 5.2 శాతం వంతున వృద్ధితో బలం పుంజుకుంటుందని అంచనా. యూపీఐ లావాదేవీలు, విమానాలు, రైళ్లలో రద్దీ, ఇ-వే బిల్లులు తదితర అధిక పౌనఃపున్య సూచీలు పట్టణ-గ్రామీణ వినియోగం రెండింటిలోనూ నిరంతర వేగాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పెట్టుబడి కార్యకలాపాలు ఉత్తేజపూరితంగా కొనసాగుతూ, నిరుటికన్నాపెరిగి, 2026లో స్థూల స్థిర మూలధన కల్పన (పీఎఫ్‌సీఎఫ్) 7.8 శాతంగా నమోదైంది. అంతేగాక గత మూడేళ్లుగా స్థూల దేశీయోత్పత్తిలో స్థూల స్థిర మూలధన కల్పన వాటా సుమారు 30 శాతం వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
విదేశీ రంగం
భారత (వస్తుసేవల) మొత్తం ఎగుమతులు 2025 ఆర్థిక సంవత్సరంలో 825.3 బిలియన్ డాలర్లకు చేరగా, 2026లోనూ ఇదే ఊపు కొనసాగింది. యునైటెడ్ స్టేట్స్ విధించిన సుంకాలతో నిమిత్తం లేకుండా వస్తు ఎగుమతులు 2.4 శాతం (2025 ఏప్రిల్–డిసెంబర్) పెరిగితే, సేవల ఎగుమతులు 6.5 శాతం దాకా పెరిగాయి. ఇక ఇదే కాలంలో వస్తుదిగుమతులు 5.9 శాతం పెరిగాయి. స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) రాక 2025లో 81 బిలియన్ డాలర్లుకాగా, 2026లో ఇది మరికొంత బలపడి, ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా తొలి 7 నెలలతో పోలిస్తే ఈసారి అత్యధిక ‘ఎఫ్‌డీఐ'లు వచ్చాయి. మరోవైపు కరెంటు ఖాతా లోటు 2025 తొలి అర్ధభాగంలో జీడీపీలో 1.3 శాతం కాగా, 2026 తొలి అర్ధభాగంలో 0.8 శాతానికి తగ్గింది.
మధ్యంతర ద్రవ్య విధాన - వ్యూహ ప్రకటన
ద్రవ్య సూచీలు
రుణ భారం తగ్గింపు దిశగా 2024-25, 2025-26 సార్వత్రిక బడ్జెట్లలో ప్రతిపాదించిన మార్గాలే 2026-27 కేంద్ర బడ్జెట్‌కు ఆర్థిక మూలస్తంభాలుగా ఉన్నాయి. ఇక ఆర్థిక సంవత్సరం 2021-22లో ప్రకటించిన ఆర్థిక ఏకీకరణ నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్‌ను సమర్పించారు. ఈ క్రమంలో ఆర్థిక వివేచనకు పెద్దపీట వేస్తూ, అభివృద్ధి ప్రాథమ్యాల సమతౌల్యానికి తగిన వనరులను అందుబాటులో ఉంచేవిధఃగా చక్కటి పునాది వేసింది. లోగడ 2021-22 నాటి బడ్జెట్‌లో ప్రకటించిన మేరకు 2025-26నాటికి లోటును జీడీపీలో 4.5 శాతానికన్నా దిగువకు తెస్తామన్న తన సంకల్పాన్ని సాకారం చేసింది. అంతేగాక రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ రుణభారాన్ని తగ్గుముఖం పట్టించే ఆర్థిక వైఖరి అనుసరణకు ప్రభుత్వం కృషి చేస్తుది. కాగా, 2025-26 సవరించిన అంచనాలు, 2026-27 బడ్జెట్ అంచనాల సంబంధిత కేంద్ర ప్రభుత్వ ప్రధాన ద్రవ్య సూచీలను జీడీపీ వాటాలో శాతంగా దిగువ పట్టికలో సంగ్రహంగా పొందుపరిచారు.


రాబడులు
ఈ ఏడాది (2026-27) బడ్జెట్ అంచనాలలో స్థూల పన్ను రాబడి (జీటీఆర్)ని ₹44.04 లక్షల కోట్లుగా అంచనా వేశారు. సవరించిన అంచనాల (2025-26)తో పోలిస్తే ఇందులో వృద్ధి 8.0 శాతంగా నమోదైంది. ఈ మేరకు స్థూల పన్ను రాబడులకు రూ.26.97 లక్షల కోట్ల దాకా ప్రత్యక్ష పన్నులు (‘జీటీఆర్’లో 61.2 శాతం) ప్రధానంగా దోహదం చేస్తాయి. అలాగే, పరోక్ష పన్నుల వసూళ్లు రూ.17.07 లక్షల కోట్లుగా అంచనా వేశారు. అంటే.. జీటీఆర్, జీడీపీ నిష్పత్తిని 2026-27 బడ్జెట్ అంచనాలలో 11.2 శాతంగా అంచనా వేశారు. ఇక ఈ బడ్జెట్ 16వ ఆర్థిక సంఘం (ఎస్‌ఎఫ్‌సీ) అవార్డు కాలానికి తొలి ఏడాదికి చెందినది కావడం గమనార్హం. విభజనీయ రాబడులలో రాష్ట్రాల వాటాను 41 శాతంగా కొనసాగించాలని ‘ఎస్‌ఎఫ్‌సీ’ సిఫారసు చేసింది. పన్ను రాబడులను (కేంద్రానికి నికరంగా) రూ.28.67 లక్షల కోట్లుగానూ, బడ్జెట్ అంచనాలలో నికర పన్నేతర రాబడులను రూ.6.66 లక్షల కోట్లుగానూ అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వ రాబడి వసూళ్లు [పన్ను-పన్నేతర రాబడులు] రూ.35.33 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఆ మేరకు 2025-26 సవరించిన అంచనాలతో పోలిస్తే రాబడి వసూళ్ల అంచనాలు 5.7 శాతం వృద్ధిని సూచిస్తున్నాయి.
వ్యయం
కేంద్ర ప్రభుత్వ మొత్తం వ్యయాన్ని ₹53.47 లక్షల కోట్లు (జీడీపీలో 13.6 శాతం)గా ఈసారి బడ్జెట్ అంచనా వేసింది. ఇది 2025-26 సవరించిన అంచనా ₹49.65 లక్షల కోట్లతో పోలిస్తే 7.7 శాతం వృద్ధిని చూపుతోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో మూలధన వ్యయం కోసం ₹12.22 లక్షల కోట్లు (జీడీపీలో 3.1 శాతం) కేటాయించారు. ఇందులో ‘ఎస్‌ఏఎస్‌సీఐ' (మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు ప్రత్యేక రుణసాయం) కింద ₹2.0 లక్షల కోట్ల కేటాయింపు ద్వారా మూలధన మద్దతు కూడా అంతర్భాగంగా ఉంటుంది. మొత్తం వాస్తవ మూలధన వ్యయంలో కేంద్రం వాటాతోపాటు మూలధన ఆస్తుల కల్పన కోసం ఇచ్చే గ్రాంట్లు కూడా అంతర్భాగంగా ఉంటాయి. ఇవి రెండూ కలిసి ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదక సామర్థ్యం పెంచే, మెరుగుపరిచగల పెట్టుబడులకు బాటలు వేస్తాయి. ఇక ఈ బడ్జెట్‌లో మూలధన ఆస్తుల కల్పన గ్రాంట్ల కింద కేటాయింపులు ₹4.93 లక్షల కోట్లు (జీడీపీలో 1.3 శాతం)గా అంచనా వేశారు. అంటే- 2026-27లో వాస్తవ మూలధన వ్యయాన్ని ₹17.15 లక్షల కోట్లు (జీడీపీలో 4.4 శాతం)గా పేర్కొన్నారు.
రాష్ట్రాలకు పన్నుల పంపిణీ.. ఆర్థిక సంఘం గ్రాంట్లు
ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఆర్థిక సంఘం పదవీకాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పన్నుల్లో వాటాను పంపిణీ చేస్తుంది. ఇప్పటికే ప్రకటించిన మేరకు రాష్ట్రాల వాటాను 41 శాతంగా కొనసాగించాలని 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేయగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. తదనుగుణంగా 2026-27 బడ్జెట్‌లో రాష్ట్రాలకు పంపిణీ చేసే పన్నుల వాటాను ₹15.26 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఇది 2025-26 సవరించిన అంచనా ₹13.93 లక్షల కోట్లతో పోలిస్తే ఎక్కువ. ఇందులో మునుపటి పంపిణీ కింద రాష్ట్రాల నుంచి కేంద్రానికి రావాల్సిన బకాయిల మొత్తం ₹9,084.02 కోట్లు కూడా కలిసి ఉంది. ప్రస్తుత బడ్జెట్‌లో రాష్ట్రాలకు పన్నుల పంపిణీ జీడీపీలో 3.9 శాతం కాగా, 2025-26 సవరించిన అంచనాలతో పోలిస్తే (గత బకాయిలు సహా) ₹1.33 లక్షల కోట్లు అధికం. ఈసారి బడ్జెట్‌లో ఆర్థిక సంఘం గ్రాంట్లను ₹1.4 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఈ విధంగా ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రాలతో పంచుకునే మొత్తం వనరులు, పన్నుల పంపిణీ, ఆర్థిక సంఘం గ్రాంట్లు అన్నీ కలిపి 2026-27 బడ్జెట్‌లో ₹16.56 లక్షల కోట్లుగా అంచనా వేశారు.

ద్రవ్య విధాన వ్యూహం - 2026-27
ప్రస్తుత (2026-27) ఆర్థిక సంవత్సరం ద్రవ్య విధాన వ్యూహంపై 2025-26నాటి బడ్జెట్‌లో సూచించిన రుణ భారం తగ్గింపు సూత్రం మార్గనిర్దేశం చేస్తుంది. దీని ప్రకారం 2030-31 నాటికి రుణభారం-జీడీపీ నిష్పత్తిని 50±1 శాతానికి చేర్చడం మధ్యకాలిక లక్ష్యంగా ఉంటుంది. ఇందులో ద్రవ్య లోటు తగ్గింపు కార్యాచరణ లక్ష్యంగా ఉంటుంది. తదనుగుణంగా 2026-27 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వ రుణభారం-జీడీపీ నిష్పత్తి జీడీపీలో 55.6 శాతంగా ఉంటుందని, ద్రవ్య లోటు లక్ష్యం జీడీపీలో 4.3 శాతంగా ఉంటుందని అంచనా. ద్రవ్య వ్యూహంలోని ఇతర అంశాలలో మూలధన వ్యయంపై నిరంతర దృష్టి ద్వారా ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడం ప్రధానాంశం. అలాగే అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలపై ప్రతిస్పందనకు తగుమేర ద్రవ్య వెసులుబాటు కల్పన, వికసిత భారత్ దిశగా దేశం ప్రస్థానంలో నిరంతర సౌభాగ్య నిర్ధారణ వంటి లక్ష్యాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా పన్ను విధానం, వ్యయ విధానం, ప్రభుత్వ రుణాలు, రుణాల మంజూరు, పెట్టుబడి సంస్కరణలు ఇతరత్రా దృష్టి సారించిఇన కీలకాంశాలు.
***
(रिलीज़ आईडी: 2221606)
|