సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ప్రగతి పథంలో కాశీ పురోగమిస్తున్న నయా భారత్
Posted On:
16 APR 2025 2:28PM by PIB Hyderabad
“ప్రాచీనతకు మాత్రమే కాదు.. కాశీ నేడు పురోగతికి దిక్సూచిగానూ నిలుస్తోంది.” ~ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
పరిచయం
కాశీలో రూ. 3,880 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఏప్రిల్ 11న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పురాతన నగరం ఆధునిక సొబగులద్దుకుంటోంది. రోడ్లు విశాలమవుతున్నాయి, పాఠశాలల ఉన్నతీకరణ కొనసాగుతోంది, కొత్త విద్యుత్ కేంద్రాలు వస్తున్నాయి. మూలాలను సజీవంగా నిలుపుకొంటూనే, కాశీ పురోగమిస్తోంది. 2014 నుంచి ఈ ఏడాది మార్చి వరకు కాశీ అభివృద్ధి కోసం మొత్తం రూ.48,459 కోట్ల పెట్టుబడితో 580 ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. వారణాశిలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, వారసత్వాన్ని పరిరక్షించడం, పర్యాటకానికి ఊతమివ్వడమే వీటి లక్ష్యం.
కాశీ అభివృద్ధి ప్రస్థానం: ముఖ్యాంశాలు
🗓️ 2014 నవంబరు 7: పవర్‌లూమ్ సేవా కేంద్రాన్ని ప్రారంభించడంతోపాటు జిల్లా సహకార బ్యాంకులకు రూ. 2,375 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీని ప్రకటించారు.
🗓️ 2015 సెప్టెంబరు 18: కాశీ ఆధునికీకరణ కోసం రూ. 572 కోట్లు, సమీప జిల్లాలతో నగరాన్ని అనుసంధానించేలా రోడ్ల కోసం రూ.11,000 కోట్లు ప్రకటించారు.
🗓️ 2016 డిసెంబరు 22: వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపనలు సహా రూ. 2,100 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.
🗓️ 2017 సెప్టెంబరు 22: హస్తకళల వాణిజ్య సదుపాయ కేంద్రమైన దీనదయాళ్ హస్తకళా సంకుల్‌ను ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రారంభించారు.
🗓️ 2018 జూలై 14: రూ. 900 కోట్లకు పైగా విలువైన కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
🗓️ 2019 మార్చి 8: కాశీ విశ్వనాథ్ కారిడార్‌కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.
🗓️ 2020 నవంబరు 30: ప్రయాగ్‌రాజ్, వారణాసి మధ్య ప్రయాణాన్ని సులభతరం చేయడం కోసం రూ. 2,447 కోట్లతో నిర్మించిన 73 కి.మీ ఆరు వరుసల జాతీయ రహదారి-19ని ప్రారంభించారు. దేశంలో మొదటి ఓవర్‌నైట్ ప్రైవేటు రైలు మహా కాల్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా ప్రారంభించారు.
🗓️ 2021 డిసెంబరు 13-14: సుమారు రూ.339 కోట్ల వ్యయంతో నిర్మించిన శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ మొదటి దశను ప్రారంభించారు.
🗓️ 2022 జూలై 7: రూ. 1,800 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. రూ. 590 కోట్లతో చేపట్టిన వారణాసి స్మార్ట్ సిటీ, అర్బన్ ప్రాజెక్టులు ఇందులో భాగంగా ఉన్నాయి.
🗓️ 2023 జనవరి 13: ప్రపంచంలో అతి పొడవైన నదీ యాత్ర ‘ఎంవీ గంగా విలాస్’ను ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రారంభించారు.
🗓️ 2023 డిసెంబరు 18: వారణాసిలో రూ.19,150 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు.
🗓️ 2024 అక్టోబరు 10: రూ. 6,100 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి, ప్రారంభించారు.
తీర్థయాత్ర నుంచి అద్భుత అనుభవాల దాకా...
వారణాసి పర్యటన అంటే కేవలం ఓ ప్రయాణం మాత్రమే కాదు. చరిత్ర, విశ్వాసం, సాంస్కృతిక చేతన ఈ యాత్రలో అంతర్భాగాలు. కాశీ నగరంలో పర్యాటక అనుభవాన్ని పునరుద్ధరిస్తున్న పలు కీలక కార్యక్రమాల వివరాలిలా ఉన్నాయి:
image.png1. ఎంవీ గంగా విలాస్: ప్రపంచంలో అతి పొడవైన నదీ యాత్ర
ప్రపంచంలో అతి పొడవైన నదీ యానం ‘ఎంవీ గంగా విలాస్’ను 2023 జనవరి 13న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది వారణాశిలో ప్రారంభమై 2023 ఫిబ్రవరి 28న దిబ్రూగఢ్‌లో ముగిసింది.
image.png2.
టెంట్ సిటీ: నదీ తీరంలో విలాసానుభవం
2023 జనవరి 13న నగర ఘాట్ల నుంచి గంగానదికి అవతలి ఒడ్డున టెంట్ సిటీని ప్రారంభించారు. ఏటా అక్టోబర్ నుంచి జూన్ వరకు ఇది తెరిచి ఉంటుంది. నదీ తీరంలో ప్రశాంతంగా సేదతీరే అవకాశాన్ని అందించడం ద్వారా.. పెరుగుతున్న పర్యాటకుల తాకిడిని తగిన విధంగా నిర్వహించడానికి టెంట్ సిటీ దోహదపడుతుంది.
image.png3.
శ్రీ కాశీ విశ్వనాథ్ కారిడార్
2021 డిసెంబరు 13న ప్రారంభమైన శ్రీ కాశీ విశ్వనాథ్ కారిడార్ రూ. 355 కోట్లతో చేపట్టిన ఒక విప్లవాత్మకమైన ప్రాజెక్టు. 5.5 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. ఇది నాలుగు వరుసల మార్గం ద్వారా కాశీ విశ్వనాథ ఆలయాన్ని నేరుగా గంగా నదితో అనుసంధానిస్తుంది. దీంతో భక్తులకు ఆలయ దర్శనం మరింత సులభతరమైంది.
image.png4.
చారిత్రక కట్టడాల లైటింగ్ ప్రాజెక్టులు
వారణాసిలోని పలు చారిత్రక కట్టడాల సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసేలా అనేక లైటింగ్ ప్రాజెక్టులను చేపట్టారు: 2015లో ధమేఖ్ స్థూపం, చౌఖండి స్థూపం, లాల్కాన్ సమాధి, మాన్ మహల్ వంటి చారిత్రక కట్టడాల్లో వెలుగులు నింపేందుకు రూ. 5.12 కోట్లు మంజూరయ్యాయి. 2017లో రూ.2.93 కోట్లతో దశాశ్వమేధ నుంచి దర్భాంగా ఘాట్, తులసి మానస్ మందిర్, సారనాథ్ మ్యూజియాలను దేదీప్యమానం చేశారు.
కాశీలో మౌలిక వసతుల కల్పన
కాశీలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో 2021 నుంచి 2025 వరకు గణనీయమైన పురోగతిని గమనించవచ్చు. 72.16 కిలోమీటర్ల రహదారి అయిన వారణాశి-గోరఖ్‌పూర్ జాతీయ రహదారి-20 (ప్యాకేజీ-2)ను 2021 అక్టోబరు 25న ప్రారంభించారు. ప్రాజెక్టు వ్యయం రూ.3,509 కోట్లు. నమో ఘాట్ (ఖిడ్కియా ఘాట్) పునర్నిర్మాణం 2024 నవంబర్ 15న పూర్తయింది. పునర్నిర్మాణానికి రూ.95.2 కోట్లు ఖర్చయింది. ఈ ఘాట్‌లో ఒక కెఫ్టీరియా, వీక్షణ వేదికలు, వారసత్వాన్ని ప్రతిబింబించేలా కుడ్యచిత్రాలు ఉన్నాయి. రాజ్‌ఘాట్ వద్ద జెట్టీ నిర్మాణానికి దాదాపు రూ.10 కోట్లు ఖర్చయింది. ఒక్కో క్రూయిజ్ బోటును రూ.20 కోట్లతో కొనుగోలు చేశారు. అంతేకాకుండా.. నదీ తీరం వెంబడి ఉన్న టూరిజం సర్క్యూట్ లో నడక కోసం దారులు, కొంత ఎత్తులో నిర్మించిన వీక్షణ వేదికలు ఫుడ్ కోర్టు ఉన్నాయి. 2023 మార్చి నుంచి క్రూయిజ్ బోట్లు నడుస్తున్నాయి. ఇవే కాకుండా, 2025 ఏప్రిల్ 11న ఫ్లైఓవర్లు, రోడ్డు వంతెనలు, ఎయిర్‌పోర్టు అండర్పాస్ కోసం రూ.980 కోట్లు కేటాయించారు.
image.png
కాశీలో పట్టణీకరణ
సుస్థిరతకు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రత్యేకంగా ప్రాధాన్యమిస్తూ వారణాసి శరవేగంగా పట్టణ సొబగులను దిద్దుకుంటోంది. గంగానదిలో కాలుష్యాన్ని తగ్గించేందుకు డీజిల్/పెట్రోల్ బోట్లను సీఎన్జీగా మార్చారు. రూ.29.7 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును 2022 జూలై 7న ప్రధానమంత్రి ప్రారంభించారు. వారణాశి స్మార్ట్ సిటీ లిమిటెడ్, గెయిల్ సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి. రోజుకు 120 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో నడిచే గోయితా మురుగునీటి శుద్ధి కర్మాగారాన్ని (ఎస్టీపీ) 2019 ఫిబ్రవరి 19న ప్రారంభించారు. రూ.217.57 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు మురుగునీటిని శుద్ధి చేయడం, గంగానదిలో కాలుష్యాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. నమామి గంగే పథకంలో భాగంగా రూ.300 కోట్లతో రోజుకు 55 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి ప్లాంటు (ఎస్టీపీ)ను నిర్మిస్తున్నారు. గ్రామీణ తాగునీటి పథకాల కోసం జల్ జీవన్ మిషన్ కింద ఈ ఏడాది ఏప్రిల్ 11న రూ.345 కోట్లు కేటాయించారు. 2017 మార్చి నాటికి రూ. 105 కోట్లు వెచ్చించి అమృత్ (అటల్ పునరుజ్జీవన, పట్టణీకరణ కార్యక్రమం) ద్వారా వారణాశిలోని 55,000 గృహాలను మురుగునీటి కాల్వలతో అనుసంధానించారు. మెరుగైన పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణ కోసం.. గొడోలియా బహుళ స్థాయి ద్విచక్ర వాహన పార్కింగ్ కేంద్రాన్ని నిర్మించారు. ఈ నాలుగంతస్తుల కేంద్రంలో 375 వాహనాల పార్కింగ్ సదుపాయం ఉంది. రూ.19.55 కోట్లతో దీన్ని నిర్మించారు. 24/7 పూర్తి భద్రతను అందిస్తుంది.
image.png
వారణాసి చేనేత, హస్తకళల పునరుజ్జీవనం
ఆధ్యాత్మిక తేజానికి మాత్రమే కాదు.. చేనేత, హస్తకళా వైభవానికి కూడా వారణాశి సుప్రసిద్ధమైనది. తరతరాలుగా ఇక్కడి కళాకారులు పట్టుతో నేత, కలపనూ రాతినీ చెక్కడం, లోహపు పని, కుండలు, ఆభరణాల తయారీలో ప్రావీణ్యం సాధించారు. వారి కళాఖండాలు అద్భుతమైన నైపుణ్యం, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి. వీటిలో బెనారసీ చీరలు, మృదువైన రాయితో జాలి పని, బనారస్ గులాబీ మీనాకరి, చెక్క లక్క సామాను, బొమ్మలు మొదలైన వాటికి భౌగోళిక గుర్తింపు ట్యాగ్‌లు లభించడం వాటి ప్రామాణికతకు, ఉన్నతికి నిదర్శనం.
image.png
ఈ సాంప్రదాయక కళలకు చేయూతనిచ్చి, ప్రోత్సహించడానికి వాణిజ్య సదుపాయ కేంద్రం, హస్తకళల ప్రదర్శన శాలను ఏర్పాటు చేస్తున్నట్లు 2014-15 కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. నేత కార్మికులు, చేతివృత్తులవారు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి చేయూతనివ్వడం ఈ కార్యక్రమ లక్ష్యం. మొత్తం రూ.300 కోట్ల వ్యయంతో 7.93 ఎకరాల్లో ఈ సముదాయాన్ని నిర్మించారు. స్థానిక హస్తకళల ప్రదర్శన, సంబంధిత శిక్షణ, విక్రయానికి ఇది ఓ వేదికగా నిలుస్తుంది. 2017 సెప్టెంబరు 22న ప్రారంభమైన ఈ కేంద్రం.. నేడు వారణాసి కళా వారసత్వ పరిరక్షణ దిశగా కీలక చర్యగా గుర్తింపు పొందింది.
కాశీ విద్య, ఆరోగ్య కార్యక్రమం
image.png
పరిశోధన, ఆరోగ్యం, ఇంధనం, విద్యా రంగాల్లో భారీ పెట్టుబడుల ద్వారా కాశీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. వారణాసి లోని బీహెచ్‌యూలో అంతర్విశ్వవిద్యాల ఉపాధ్యాయ విద్యా కేంద్రాన్ని (ఐయూటీఈసీ) 2021 డిసెంబరు 23న ప్రారంభించారు. రూ.107.36 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కళాశాలలో 1000 మంది విద్యార్థులు రెండేళ్ల ఎంఈడీ కోర్సును అభ్యసిస్తారు. గరిష్టంగా 3.3 పెటాఫ్లాప్‌ల సామర్థ్యం గల పరమ్ శివాయ సూపర్‌కంప్యూటింగ్ కేంద్రాన్ని 2019 ఫిబ్రవరిలో బీహెచ్‌యూలో ప్రధానమంత్రి ప్రారంభించారు. రూ. 32.5 కోట్ల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేశారు. 2025 ఏప్రిల్ 11న బెనారస్ డెయిరీ పాల సరఫరాదారులకు రూ.105 కోట్ల బోనస్ అందించారు. కొత్త సబ్ స్టేషన్లు, సరఫరాను మెరుగుపరచడం కోసం విద్యుత్ రంగంలో రూ.1,820 కోట్లు కేటాయించారు. సిగ్రాలోని స్పోర్ట్స్ స్టేడియం పునర్నిర్మాణం మొత్తం రూ .180.03 కోట్ల బడ్జెటు గల ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు (మొదటి దశ: రూ. 90.01 కోట్లు, రెండో దశ: రూ. 90.02 కోట్లు). ప్రపంచస్థాయి క్రీడా కేంద్రంగా దీన్ని రూపొందించారు. 2024 అక్టోబరు 20న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించారు.
ముగింపు
వారసత్వమూ అభివృద్ధీ ఏకకాలంలో ఎలా పురోగమించగలవో చెప్పడానికి కాశీ నేడు అత్యుత్తమ ఉదాహరణగా నిలుస్తోంది. మౌలిక సదుపాయాలు, పర్యాటకం, ఆరోగ్యం, విద్య, సంస్కృతిలో విప్లవాత్మకమైన ప్రాజెక్టుల ద్వారా.. ఆధ్యాత్మిక మూలాలను పరిరక్షించుకోవడంతోపాటు తేజోవంతమైన, భవిష్యత్ సంసిద్ధమైన అస్తిత్వాన్ని కూడా కాశీ నగరం సంతరించుకుంటోంది. ఘాట్ల నుంచి గేట్‌వేల వరుకు అన్నింటా అభివృద్ధితో ప్రగతిపథంలో పయనిస్తోంది.
(Release ID: 2122275)