ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్ లోని జామ్ నగర్ లో రూ.1450 కోట్ల పైబడిన విలువ గల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, అంకితం చేసిన ప్రధానమంత్రి
“వైభవంలో గాని, గాంభీర్యంలో గాని స్మృతి వనం 9/11 లేదా హిరోషిమా మెమోరియల్ కన్నా ఏ మాత్రం తక్కువ కాదు”
“పోలెండ్ ప్రభుత్వానికి సహాయం వెనుక మహారాజా దిగ్విజయ్ సింగ్ పెద్ద పాత్ర పోషించారు”
“జన్ శక్తి, జ్ఞాన శక్తి, జల శక్తి, ఊర్జా శక్తి, రక్షా శక్తి- ఈ ఐదింటి పటిష్ఠ పునాదులతో గుజరాత్ కొత్త శిఖరాలు చేరుతోంది”.
“సౌని స్కీమ్ కింద నర్మదా మాత అన్ని మారుమూల ప్రాంతాలకు చేరుతోంది”.
“మహమ్మారి కాలం నాటి కష్టాలను అధిగమించేందుకు 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ అందిస్తున్నాం”.
“జామ్ నగర్ తయారీ, కోస్తా ఆధారిత అభివృద్ధి కేంద్రంగా మారుతోంది”.
“సుమారు 33 వేల నిబంధనలు, నియమాలు తొలగించడం జరిగింది”.
Posted On:
10 OCT 2022 8:32PM by PIB Hyderabad
గుజరాత్ లోని జామ్ నగర్ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రూ.1450 కోట్ల విలువ గల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు కొన్నింటిని జాతికి అంకితం చేశారు. వాటిలో ఇరిగేషన్, విద్యుత్, నీటి సరఫరా, పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులున్నాయి. వాటిలో కలావద్/ జామ్ నగర్ తాలూకాలోని కలావద్ గ్రూప్ ఆగ్మెంటేషన్ నీటి పరఫరా స్కీమ్; మోర్బి-మలియా-జోడియా గ్రూప్ ఆగ్మెంటేషన్ నీటి సరఫరా స్కీమ్; లాల్ పూర్ బైపాస్ జంక్షన్ ఫ్లై ఓవర్ వంతెన; హపా మార్కెట్ యార్డ్ రైల్వే క్రాసింగ్; మురుగు నీటి సేకరణ పైప్ లైన్, పంపింగ్ స్టేషన్ ఆధునీకరణ స్కీమ్ ఉన్నాయి. అలాగే సౌరాష్ట్ర అవరతన్ ఇరిగేషన్ (సౌని) యోజన లింక్ 3 (ఉంద్ డామ్ నుంచి సోన్మతి డామ్ వరకు) ప్యాకేజి 7; సౌని యోజన లింక్ 1 (ఉంద్ నుంచి సని డామ్ వరకు) ప్యాకేజి 5; హరిపర్ లో 40 మెగావాట్ల సోలార్ పివి ప్రాజెక్టు ఉన్నాయి.
ఈ సందర్భంగా ఆ కార్యక్రమాలకు హాజరైన వారినుద్దేశించి మాట్లాడుతూ కార్యక్రమాల వేదికకు వస్తున్న మార్గంలో తనకు అద్భుత స్వాగతం పలికినందుకు, తనపై ఆశీస్సులు కురిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నీరు, విద్యుత్ సరఫరా, అనుసంధానతకు సంబంధించిన 8 ప్రాజెక్టులకు శంకుస్థాపనకు, ఆ ప్రాజెక్టులు సాధించడంలో వారి అంకిత భావానికి ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. వాల్మీకి తెగకు చెందిన వారి కోసం ఒక కమ్యూనిటీ హాలుకు కూడా శంకుస్థాపన చేశామంటూ వారు సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు.
రెండు దశాబ్దాల క్రితం ఏర్పడిన భూకంపం గురించి ప్రధానమంత్రి గుర్తు చేస్తూ ఆ సందర్భంగా ఏర్పడిన విధ్వంసం, విషాదం రాష్ట్రవ్యాప్తంగా నిరాశానిస్పృహలతో కూడిన వాతావరణం ఏర్పడిందని అన్నారు. అయినా ఆత్మవిశ్వాసం, కఠోర శ్రమతో గుజరాత్ నిలదొక్కుకుని నిరాశానిస్పృహలను, విధ్వంసాన్ని విస్మరించి దేశంలో అగ్రస్థానానికి ఎదిగిందని ఆయన చెప్పారు. కచ్ భూకంప బాధితుల కోసం నిర్మించిన స్మృతివనం సందర్శించి మృతులకు శ్రద్ధాంజలి ఘటించాలని ప్రధానమంత్రి కోరారు. వైభవంలో గాని, గాంభీర్యంలో గాని ఆ స్మారకచిహ్నం ఏ విధంగానూ 9/11, హిరోషిమా మెమోరియల్ కు ఏ మాత్రం తక్కువ కాదని చెప్పారు.
జామ్ సాహెబ్ మహరాజా దిగ్విజయ్ సింగ్ గురించి ప్రధానమంత్రి గుర్తు చేస్తూ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పోలెండ్ ప్రజల దాక్షిణ్యానికి నివాళి అర్పించారు. ఈ సంఘటన పోలెండ్ ప్రజలతో శాశ్వత అనుబంధం కల్పించిందని, ఉక్రెయిన్ నుంచి ప్రస్తుత సంక్షోభ సమయంలో భారతీయులను తరలించడంలో ఇది ఎంతో ఉపయోగపడిందని ఆయన అన్నారు. “పోలెండ్ ప్రభుత్వ సహాయం వెనుక మహారాజా దిగ్విజన్ సింగ్ చూపిన దాక్షిణ్యం కీలక పాత్ర పోషించింది” అని చెప్పారు. జామ్ సాహెబ్ నగరాన్ని కొత్త శిఖరాలకు చేర్చడం తమ సంకల్పమని ఆయన అన్నారు. జామ్ నగర్ క్రికెట్ రంగానికి కూడా ఎంతో సేవ చేసిందని ప్రధానమంత్రి చెప్పారు. సౌరాష్ట్ర రంజీ క్రికెట్ టీమ్ 2020లో ట్రోఫీని వెనక్కి తీసుకువచ్చి అందరూ గర్వపడేలా చేసిందన్నారు.
ఐదు సంకల్పాలు గుజరాత్ రాష్ర్టానికి పటిష్ఠమైన పునాది వేశాయని ప్రధానమంత్రి తెలియచేశారు. వాటిలో మొదటిది జనశక్తి కాగా రెండోది జ్ఞానశక్తి, మూడోది జలశక్తి, నాలుగోతి ఇంధన శక్తి, చివరిది రక్షా శక్తి అని వివరించారు. “ఈ ఐదు సంకల్పాల పునాదిపై గుజరాత్ కొత్త శిఖరాలకు చేరుతోంది” అన్నారు.
20-25 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం లేదా ఈ రాష్ట్రం ఎదుర్కొన్న సమస్యలు తెలియనంత అదృష్టవంతులు యువతరమని ప్రధానమంత్రి అన్నారు. ఒకప్పుడు కేవలం ఒకే ఒక నీటి టాంకును ప్రారంభించడానికి ముఖ్యమంత్రి వచ్చిన రోజు నుంచి నేడు ఒకే సారి గతంలోని బడ్జెట్ విలువ కన్నా ఎక్కువ విలువ గల ప్రాజెక్టులను ఒకేసారి ప్రారంభించే స్థాయికి చేరామని ఆయన చెప్పారు. సౌని స్కీమ్ కింద నర్మదా మాత ప్రతీ మారుమూల ప్రాంతానికి చేరుతోందని ఆయన చెప్పారు. అదే విధంగా జల్ జీవన్ మిషన్ ప్రతీ ఒక్క ఇంటికీ పైప్ ల ద్వారా నీరందిస్తున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అంకిత భావం, వేగంతో అమలుపరుస్తున్నందుకు ముఖ్యమంత్రిని ఆయన ప్రశంసించారు.
పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఏ ఒక్క కుటుంబం ఆకలితో పడుకోకూడదన్నది మహమ్మారి కాలంలో తమ ప్రధమ ఆందోళన అని చెప్పారు. అందుకే మహమ్మారి కాలంలో 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ అందించామన్నారు. ఏ ఒక్క కుటుంబం ఖాళీ కడుపుతో నిద్రించకూడదనే లక్ష్యంతోనే ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని ఈ ఏడాది డిసెంబర్ వరకు పొడిగించినట్టు చెప్పారు. ఒక జాతి-ఒకే రేషన్ కార్డు పథకం ప్రయోజనాల గురించి ప్రస్తావిస్తూ వివిధ ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం జామ్ నగర్ కు వచ్చే వారందరూ ఈ స్కీమ్ ను ఉపయోగించుకోవచ్చునని ఆయన అన్నారు.
జామ్ నగర్ ఆయిల్ రిఫైనరీ, ఆయిల్ ఎకానమీ గురించి ప్రస్తావిస్తూ ఈ భూమిపై శుద్ధి చేస్తున్న ప్రతీ ఒక్క క్రూడాయిల్ చుక్క గురించి ప్రతీ ఒక్క పౌరుడూ గర్వపడాలని ప్రధానమంత్రి అన్నారు. కేంద్రంలోని, రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక వసతుల అభివృద్దికి నిరంతరం కృషి చేస్తున్నాయని శ్రీ మోదీ చెప్పారు. నగరం ఒకప్పుడు ట్రాఫిక్ సమస్యలతో అల్లాడేదని, పౌరుల జీవితాలను సరళం చేసేందుకు ప్రణాళికాబద్ధమైన రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల ద్వారా కనెక్టివిటీ పెంచుతున్నట్టు శ్రీ మోదీ చెప్పారు. రూ.26,000 కోట్ల వ్యయంతో అమృతసర్-భటిండా-జామ్ నగర్ కారిడార్ నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారు. జామ్ నగర్ తయారీ, కోస్తా-ఆధారిత అభివృద్ధి కేంద్రంగా మారుతున్నదని ఆయన చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అంతర్జాతీయ సాంప్రదాయిక వైద్య కేంద్రం జామ్ నగర్ ప్రధానకేంద్రంగా పని చేస్తున్నదని, జామ్ నగర్ ఆయుర్వేదిక్ విశ్వవిద్యాలయం జాతీయ విశ్వవిద్యాలయం స్థానం పొందిందని అన్నారు. గాజులు,సింధూరం, బంధన్ వంటి పవిత్రమైన వస్తువులతో అనుసంధానమైన జామ్ నగర్ “సౌభాగ్య నగర్”గా అభివృద్ధి చెందుతున్నదని ప్రధానమంత్రి చెప్పారు.
వ్యాపార సరళీకరణకు తాను కట్టుబడి ఉన్నట్టు ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. నిబంధనల భారం తగ్గించడం గురించి ఆయన ప్రస్తావించారు. 33 వేల వరకు నియమ నిబంధనలు తాము తొలగించామని ఆయన చెప్పారు. అలాగే కంపెనీ చట్టాల డిక్రిమినటైజేషన్ వ్యాపార వర్గాలకు సహాయకారి అని ఆయన అన్నారు. వివిధ ఆర్థిక సూచీల్లో భారతదేశం పురోగమిస్తున్నదంటూ 2014 సంవత్సరంలో 10 ర్యాంకులో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 5వ స్థానానికి ఎదిగిందని ఆయన చెప్పారు. వ్యాపార సరళీకరణలో 2014 సంవత్సరంలో 142వ ర్యాంకులో ఉన్న భారత్ 2020 నాటికి 63వ స్థానానికి చేరిందన్నారు. ప్రగతిశీల పారిశ్రామిక విధానం తెచ్చినందుకు రాష్ట్రప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు. ఆక్రమణలు తొలగించి కోస్తా ప్రాంతాన్ని శుద్ధి చేయడంలో రాష్ట్రప్రభుత్వ కృషిని ప్రధానమంత్రి ప్రశంసించారు. జామ్ నగర్ కోస్తా ప్రాంతం ఎకో టూరిజం అవకాశాల కేంద్రంగా మారిందని చెప్పారు. ఈ ప్రాంతం జీవవైవిధ్యాల గని అని ఆయన అన్నారు.
గుజరాత్ లో శాంతిభద్రతల మెరుగుదల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. నరేంద్ర-భూపేంద్రల డబుల్-ఇంజన్ ప్రభుత్వం అంకిత భావం, వేగంతో అభివృద్ధి పథకాలు అమలుపరుస్తున్నదని చెప్పారు.
గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, పార్లమెంటు సభ్యులు శ్రీ సి.ఆర్.పాటిల్, శ్రీమతి పూనంబెన్ ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో ఉన్నారు.
పూర్వాపరాలు…
జామ్ నగర్ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రూ.1450 కోట్ల విలువ గల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు కొన్నింటిని జాతికి అంకితం చేశారు. వాటిలో ఇరిగేషన్, విద్యుత్, నీటి సరఫరా, పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులున్నాయి.
సౌరాష్ట్ర అవరతన్ ఇరిగేషన్ (సౌని) యోజన లింక్ 3 (ఉంద్ డామ్ నుంచి సోన్మతి డామ్ వరకు) ప్యాకేజి 7; సౌని యోజన లింక్ 1 (ఉంద్ నుంచి సని డామ్ వరకు) ప్యాకేజి 5; హరిపర్ లో 40 మెగావాట్ల సోలార్ పివి ప్రాజెక్టు వాటిలో ఉన్నాయి.
శంకుస్థాపన చేసిన వాటిలో కలావద్/ జామ్ నగర్ తాలూకాలోని కలావద్ గ్రూప్ ఆగ్మెంటేషన్ నీటి పరఫరా స్కీమ్; మోర్బి-మలియా-జోడియా గ్రూప్ ఆగ్మెంటేషన్ నీటి సరఫరా స్కీమ్; లాల్ పూర్ బైపాస్ జంక్షన్ ఫ్లై ఓవర్ వంతెన; హపా మార్కెట్ యార్డ్ రైల్వే క్రాసింగ్; మురుగు నీటి సేకరణ పైప్ లైన్, పంపింగ్ స్టేషన్ ఆధునీకరణ స్కీమ్ ఉన్నాయి.
(Release ID: 1866733)
Visitor Counter : 169
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam