PIB Headquarters

కోవిడ్-19 మీద పిఐబి రోజువారీ బులిటెన్

Posted On: 03 NOV 2020 6:04PM by PIB Hyderabad

(ఇందులో గత 24 గంటలలో కోవిడ్-19 కు సంబంధించిన పత్రికా ప్రకటనలు, పిఐబి క్షేత్ర సిబ్బంది అందించిన సమాచారం, పిఐబి చేపట్టిన నిజనిర్థారణ ఉంటుంది)

· భారత్ లో చికిత్సలో ఉన్న బాధితులు 5.5 లక్షలకు దిగువన

· గత 24 గంటలలో కోలుకొని డిశ్చార్జ్ అయిన వారు 58,323 మంది

· గత 24 గంటలలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు 38,310

· చికిత్సలో ఉన్నవారికంటే కోలుకున్నవారి 70 లక్షలు అధికం

· కోలుకున్నవారు జాతీయ రేటు మరింత పెరిగి 91.96% కి చేరిక

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

Image

భారత్ లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5.5 లక్షలకు దిగువన; 105 రోజుల తరువాత 38,310 కి పరిమితమైన కొత్త కోవిడ్ కేసులు; చికిత్సలో ఉన్నవారికంటే 70 లక్షలు అధికంగా కోలుకున్నవారు

కోవిడ్ మీద పోరులో భారత్ అనేక కీలకమైన మైలురాళ్ళను అధిగమించింది. గడిచిన 24 గంటలలో కొత్తగా నిర్థారణ అయిన పాజిటివ్ కేసులు 40 వేల దిగువకు పడిపోయాయి. 105 రోజుల తరువాత మొదటిసారిగా ఇలా 38,310 కి తగ్గిపోయాయి. 15 వారాలకిందట గత జులై 22 37,724 కేసులు మాత్రమే నమొదు కావటం గమనార్హం. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య 5.5 లక్షలకంటే తక్కువ స్థాయికి పడిపోవటం కూడా మరోమైలురాయి. ప్రస్తుతం 5,41,405 గా నమోదయ్యాయి. ఇది మొత్తం కేసులలో 6.55% మాత్రమే. ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 76 లక్షలు దాటి 76, 03,121 కి చేరగా, కోలుకున్నవారికీ, చికిత్సపొందుతూ ఉన్నవారికీ మధ్య తేడా ఈ రోజు 70 లక్షలు దాటి 70,61,716 కు చేరింది. గడిచిన 24 గంటలలో 58,323 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం మరింత పెరిగి 91.96% అయింది. కొత్తగా కోలుకున్నవారిలో 80% మంది 10 రాష్ట్రాలలోనే ఉన్నట్టు తేలింది. అందులో మహారాష్ట ఒకే రోజు 10, 000కు పైగా కేసులు నమోదు చేసుకొని మొదటి స్థానంలో ఉండగా 8,000 కు పైగా కేసులతో కర్నాటక రెండో స్థానంలో ఉంది. కొత్తగా నమోదైన కేసులలో 74% కేవలం పది రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర గరిష్ఠంగా 4,000 కేసుల చొప్పున నమోదు చేసుకున్నాయి. 3,000కు పైగా కేసులు వచ్చిన పశ్చిమబెంగాల్ నాలుగో స్థానంలో ఉంది. గడిచిన 24 గంటలలో 490 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. వీరిలో 80% మంది కేవలం 10 రాష్ట్రాలలోనే కేంద్రీకృతమయ్యారు. మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులోనే 104 మరణాలు నమోదు కాగా దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులలో మరణాలు 1.49 శాతానికి తగ్గాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1669710

మానసిక ఆరోగ్యానికి యోగా, ఆయుర్వేద వైద్యం పై నవంబర్ 5న అంతర్జాతీయ వెబినార్

అఖిల భారత ఆయుర్వేద సంస్థ నవంబర్ 5న పశ్చిమ సిడ్నీ విశ్వవిద్యాలయంతో కలిసి మానసిక ఆరోగ్యానికి యోగా, ఆయుర్వేద వైద్యం మీద ఒక వెబినార్ నిర్వహిస్తోంది. మానసిక ఆరోగ్యం మెరుగుదలకు ఆయుర్వేదం, యోగ లోని బలాలను వాడుకోవటం మీద ఈ వెబినార్ ప్రధానంగా దృష్టి సారిస్తుంది. యోగ, ఆయుర్వేద మీద పేరుమోసిన భారత్, ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ దేశాల పరిశోధకులందరూ ఈ సందర్భంగా కలుసుకుని తమ అనుభవాలను పంచుకుంటారు. ప్రస్తుతం జరుగుతున్న అంతర్జాతీయ పరిశోధనలకు మరిన్ని ఆలోచనలు జోడిస్తారు. దీని వలన యోగ, ఆయుర్వేద రంగాల్లో శాస్త్రీయ పరిశోధనలకు ఇది మరింత ఊతమిస్తుందని భావిస్తున్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1669760

బాంకులు విధిస్తున్న సర్వీస్ చార్జీలమీద వాస్తవ స్థితి

ప్రభుత్వ రంగ బ్యాంకులు సర్వీస్ చార్జీలను పెద్ద ఎత్తున పెంచుతున్నట్టు మీడియాలో అనేక వార్తలు వెలువడుతున్నాయి. ఈ సందర్భంగా వాస్తవాలు చూసినప్పుడు ఇలా ఉన్నాయి. నిరుపేదలు తెరచిన 41.13 కోట్ల జన్ ధన్ ఖాతాలు సహా ప్రాథమిక సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు 60.04 కోట్లు ఉండగా వాటి మీద ఎలాంటి సర్వీస్ చార్జీలూ విధించటం లేదు. జన్ ధన్ ఖాతాలకు ఉచిత సేవలు అందుతాయని రిజర్వ్ బ్యాంక్ ముందే ప్రకటించింది. ఇక మామూలు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, కరెంట్ ఖాతాలు, కాష్ క్రెడిట్ ఖాతాలు, ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాల విషయానికొస్తే, చార్జీలు పెంచలేదు. అయితే, బాంక్ ఆఫ్ బరోడా నవంబర్ 1 నుంచి కొన్ని మార్పులు చేసింది. నెలకు ఉచితంగా చేసే డిపాజిట్లు, డబ్బు ఉపసంహరణల సంఖ్య విషయంలో ఆ మార్పులు చేసింది. అంతకు ముందు ఉచిత డిపాజిట్లు, ఉపసంహరణలు 5 వరకు ఉచితం కాగా ఇప్పుడు ఆ సంఖ్యను 3కు కుదించింది. అయితే, కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో ఆ మార్పులను ఉపసంహరించుకుంటున్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. మరే ఇతర ప్రభుత్వ రంగ బ్యాంక్ కూడా ఇటీవలి కాలంలో ఎలాంటి చార్జీలూ పెంచలేదు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1669767

బియ్యాన్ని పరిపుష్టం చేసి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే కేంద్ర ప్రాయోజిత పైలట్ పథకానికి 15 రాష్టాల గుర్తింపు

దేశాన్ని పౌష్టికాహార భద్రత దిశగా నడిపించే ప్రక్రియలో భాగంగా ఆహార, ప్రజాపంపిణీ శాఖ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యాన్ని పరిపుష్టం చేసి పంపిణీ చేసే కేంద్ర ప్రాయోజిత పైలట్ పథకం నడుపుతోంది. 2019-20 మొదలుకొని మూడేళ్ళపాటు ఈ పైలట్ పథకాన్ని నడపటానికి ఆమోదం లభించింది. దీనికోసం రూ. 174.6 కోట్ల బడ్జెట్ కేటాయించారు. 15 రాష్ట్ర ప్రభుత్వాలను గుర్తించి, రాష్ట్రానికి ఒక జిల్లా చొప్పున ఈ పైలట్ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన జిల్లాల్లో పరిపుష్టం చేసిన బియ్యం పంపిణీ మొదలైంది. ఈ సందర్భంగా కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీ పీయూష్ గోయల్ 31.10.2020న సమీక్షా సమావేశం నిర్వహించి ఈ పంపిణీని పెంచాల్సిందిగా కోరారు.

నవంబర్ 2న డి ఎఫ్ ఐడి కార్యదర్శి మరో సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ బియ్యం సేకరణకు సమగ్రమైన ప్రణాళికతో ముందుకు రావాలని భారత ఆహార సంస్థను కోరారు. అన్ని జిల్లాల్లో సమీకృత శిశు అభివృద్ధి సేవలకు, మధ్యాహ్న భోజన పథకానికి 2021-22 నుంచి ఈ బియ్యం అందజేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో ఎంపిక చేసిన 112 ఆకాంక్షాపూరిత జిల్లాలకు పరిపుష్టం చేసిన బియ్యం పంపిణీ చేయటం మీద దృష్టి పెట్టాలన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1669755

కొత్త మైలురాయి చేరిన టెలీ-లా; 4లక్షలమంది లబ్ధిదారులకు న్యాయ సలహాలు

టెలీ-లా అక్టోబర్ 30న్ అసరికొత్త మైలు రాయి చేరుకుంది. ఉమ్మడి సేవా కేంద్రాల ద్వారా 4 లక్షల సంప్రదింపులు పూర్తి చేసుకుంది. పథక్లం ప్రారంభమైనప్పటినుంచి 2020 ఏప్రిల్ వరకు 1.95 లక్షల సలహాలు అందించగా, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలలకాలంలో 2.05 లక్షల సలహాలు ఇచ్చింది. భారత ప్రభుత్వం తలపెట్టిన డిజిటల్ ఇండియా విజన్ కు అనుగుణంగా న్యాయశాఖ స్వదేశీ, ఎదుగుతున్న డిజిటల్ వేదికలను వాడుకుంటూ అందరికీ న్యాయం అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తోంది. ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో 2017 లో టెలీ-లా కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేసులను తొలిదశలోనే నివారించటం దీని లక్ష్యం. గ్రామ పంచాయితీల స్థాయిలోని ఉమ్మడి సేవా కేంద్రాల దగ్గర అందుబాటులో ఉన్న వీడియో కాన్ఫరెన్సింగ్, టెలిఫోన్, తక్షణ ఫోన్ సౌకర్యం వాడుకుంటూ బడుగు బలహీన అల్పాదాయ వర్గాలకు ఒక న్యాయవాదుల బృందం సాయంతో సకాలంలో న్యాయ సేవలు అందించటం ప్రారంభించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1669868

కోవిడ్ అనంతరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ముందు వరుసలో ఉంటుంది: డాక్టర్ జితేంద్ర సింగ్

ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి, ప్రధానమంత్రి కార్యాలయం సహాయక మంత్రి, సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, పెన్షన్లు, అణు ఇంధన, అంతరిక్ష శాఖల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజుకాపిటల్ మార్కెట్ల ద్వారా కోవిడ్ అనంతర ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణ : అనే అంశం మీద వెబినార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో భారత్ కోవిడ్ అనంతర ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ముందు వరుసలో ఉంటుందన్నారు. తొలిదశలోనే లాక్ డౌన్ ప్రకటించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా భారత్ ఎంతోమంది ప్రజల ప్రాణాలు కాపాడటంతోబాటు ఆర్థిమ వ్యవస్థక్లు మరింత నష్టం జరగకుండా చూసిందన్నారు. లాక్ డౌన్ సమయం మనకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిందని కూడా అన్నారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1669778

విలువిద్య జట్టు సహాయక సిబ్బందికి కరోనా, విరామం అనంతరం శిబిరం పునరుద్ధరణ

పూణెలోని సైనిక క్రీడా సంస్థలో శిక్షణకు హాజరైన జాతీయ విలువిద్య జట్టుకు అనుబంధంగా ఉన్న సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్థారణ కావటంతో శిక్షణ నిలిపివేశారు. అక్టోబర్ 30న పాజిటివ్ గా నిర్థారణ జరిగిన వెంటనే శిబిరాన్ని పునరుద్ధరించారు. పాజిటివ్ గా తేలిన ఉద్యోగికి పూణె వెలుపల ఒక ఆస్పత్రిలో చికిత్స అందించారు. కేవలం రెండు రోజులపాటు నిలిచిపోయిన శిక్షణాశిబిరాన్ని అన్ని జాగ్రత్తల మధ్య నవంబర్ 1 వరకు అలాగే ఉంచి 2న పునరుద్ధరించారు. శిక్షణకు హాజరైనవారందరినీ వారి వారి గదులకే పరిమితం చేసి పూర్తి స్థాయి ఐసొలేషన్ అనంతరం శరీర ఉష్ణోగ్రతలు గమనిస్తూ శిబిరాన్ని పునఃప్రారంభించారు. అందరు జాతీయ క్రీడాకారులకి ఆర్ టి పిసిఆర్ పరీక్షలు జరిపేలా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటోంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1669785

ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజనను సమీక్షించిన శ్రీ సదానంద గౌడ

ఈ రోజు ఢిల్లీలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజనను కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖామంత్రి శ్రీ డివి సదానంద గౌడ సమగ్రంగా సమీక్షించారు. 2019 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద అమ్మకాలు రూ. 433 కోట్లు కాగా, దేసవ్యాప్తంగా ఉన్న 6,600 జన్ ఔషధి అమ్మక కేంద్రాల ద్వారా 2020 లో మొదటి ఏడు నెలల కాలంలో అక్టోబర్ 312 వరకు రూ. 358 కోట్ల అమ్మకాలు సాధించారు. ఇది ఏడాది చివరి నాటికి రూ. 600 కోట్లు దాటిపోగలదని అంచనా వేస్తున్నారీ సమావేశంలో మంత్రి శ్రీ గౌడ్ బిపిపిఐ బృందాన్ని అభినందించారు. మందులు, మాస్కుల లాంటి ఇతర ఫార్మా ఉత్పత్తులు కరోనా కష్టకాలంలో ప్రజలకు అందుబాటు ధరల్లో నిరంతరం అందుబాటులో ఉంచినందుకు అభినందనలు తెలియజేశారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1669797

 

పిఐబి క్షేత్రస్థాయి అధికారుల సమాచారం

మహారాష్ట్ర: మహారాష్ట్రలో కొత్తగా 4,008 కోవిడ్ కెసులు సోమవారం నమోదయ్యాయి. అదే రోజు 10,225 మంది కోలుకున్నారు. దీంతో చికిత్సలో ఉన్నవారి సంఖ్య 1.18 లక్షలకు తగ్గింది. ముంబయ్ నగరంలో 706 కొత్త కేసులు వచ్చాయి. ఇది గత 69 రోజుల్లో కనిష్టం. నగరంలో వైరస్ వ్యాప్తి శాతం 1,06% నుంచి 0.49% కి పడిపోయింది. కోలుకున్నవారి శాతం 90% చేరింది. రెండో విడత కోవిడ్ వచ్చే అవకాశం లేదని రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి రాజేశ్ తోపే అభిప్రాయపడ్దారు. అయితే, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవటానికి రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు.

గుజరాత్: గుజరాత్ ప్రభుత్వం సోమవారం నాడు పెళ్ళి వేదుకలలో కోవిడ్ నియంత్రణలను సడలించింది. బహిరంగ ప్రదేశాలలో 200 మంది వరకు పాల్గొనటానికి వీలు కల్పించింది. అంతకు ముందు ఈ సంఖ్య 100 మాత్రమే ఉండేది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అతిథులుఇ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. సామాజిక దూరం పాటించటం సహా అన్ని నిబంధనలూ పాటించాలి. అయితే పెద్ద హాల్స్ లో జరిగే వేడుకలకు మాత్రం ఆ హాలు సామర్థ్యంలో 50% మంది హాజరు కావచ్చు.

రాజస్థాన్: మాస్కులు ధరించటాన్న్ని తప్పనిసరి చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం ప్రాణాంతక వ్యాధిల బిల్లుకు సవరణలు చేసింది. బహిరంగ ప్రదేశాలలో ప్రజా రవాణా వ్యవస్థలలో, సామాజిక, రాజకీయ కార్యక్రమాల్లో ఎవరూ మాస్క్ ధరించకుందా కనబడకూడదని ఈ బిల్లు స్పష్టం చేస్తోంది. అయితే, మాస్క్ ధరించని వారికి విధిమ్చే జరిమానాల గురించి మాత్రం ఈ బిల్లు ప్రస్తావించలేదు. ఇలా ఉండగా, రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. నిన్న 1,748 కేసులు నమోదు కాగా చికిత్సలో ఉన్నవారు 15,889 మంది.

చత్తీస్ గఢ్: దాదాపు 15 వేలమంది ఆరోగ్య సిబ్బంది తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తెస్తూ సోమ, మంగళవారాల్లో సామూహికంగా సెలవు పెట్టారు. దీంతో శాంపిల్ సేకరణ బాగ అపడిపోయింది. సగటున రోజుకు 24,000 ఉండాల్సిన శాంపిల్స్ 17 వేలకు తగ్గాయి. అరోగ్య సిబ్బందిరూ. 50 లక్షల బీమా. కరోనా అలవెన్స్, రిక్స్ అలవెన్స్, స్పెషల్ అలవెన్స్ కోరుతున్నారు.

కేరళ: రెండు రోజులపాటు కేరళ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులకోసం కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగే పరీక్షలకు అన్ని జిల్లా కేంద్రాలను వాడుకోవాలని నిర్ణయించారు. కోవిడ్ కారణంగా అధికారులు ఈ నిర్ణయానికొచ్చారు. అదే విధంగా ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున కోవిడ్ బాధితులకోసం ఒక కేంద్రాన్ని కేటాయించాలని కూడా ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రంలో నిన్న 4,138 పాజిటివ్ కెసులు నమోదయ్యాయి. 21 మరణాలు నమోదు కాగా మొత్తం మృతుల సంఖ్య 1533 కు చేరింది. ఇలా ఉండగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రధాన ఆర్థికవేత్త . గీతా గోపీనాథ్ ఒక వ్యాసం రాస్తూ, పాలకులు మరిన్ని రాయితీల ద్వారా ఆర్థిక వ్యవస్థ కొలుకోవటానికి దోహదం చేయాలని సూచించారు.

తమిళనాడు: తమిళనాడు ప్రభుత్వం శబరిమల యాత్రికులకోసం మార్గదర్శకాలు జారీచేసింది. శబరిమల సందర్శనకు 48 గంటలముందు కరోనా లేదన్న సర్టిఫికెట్ తీసుకోవటం తప్పనిసరి అని స్పష్టం చేసింది. అప్పుడే వాళ్ళు శబరిమల వెళ్లటానికి అనుమతిస్తామని పేర్కొంది. ప్రవేశ మార్గాల దగ్గర డబ్బు చెల్లించి పరీక్షలు చేయించుకోవటానికి ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలియజేసింది.ఇలా ఉండగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత పాఠ్య గ్రంధాల పంపిణీ జరిగింది. ఈ పంపిణీ సాఫీగా జరగటానికి వీలుగా పాటించాల్సిన కోవిడ్ నియమాలను కూడా విడుదల చేసింది. కొత్త కోవిడ్ కేసులు తగ్గటంతో కోయంబత్తూర్ లొ కొన్ని కోవిడ్ కేంద్రాలను ఉపసంహరించుకోవాలని జిల్లా అధికారులు నిర్ణయించారు.

కర్నాటక: లాక్ డౌన్ కారణంగా నిలిపివేసిన హైదరాబాద్ సర్వీసులను కర్నాటక పునరుద్ధరించింది. పాఠశాలల పునఃప్రారంభం మీద సంబఆంధితులందరితీ సమాలోచనలు జరిపాక నవంబర్ 6 నాటికల్లా తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. మైసూరులోని జె ఎస్ ఎస్ ఆస్పత్రిలో 80 మందికి పైగా వాలంటీర్లు కోవిడ్ ట్రయల్ వాక్సిన్ తీసుకున్నారు. ఇతర దీర్ఘకాల వ్యాధులవలన కరోనా వాక్సిన పనిచేస్తున్నదా లేదా అనేది నిర్థారించటానికి ఈ పరీక్షలు జరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో 98% పాఠశాలలు తెరచుకున్నాయి. అయితే, హాజరు మాత్రం తొలిరోజున 45% లోపే నమోదైంది. నెల్లూరు జిల్లా మర్రిపాడు రూరల్ మండలంలోని నందవరంలో అధికారులు కోవిడ్ పరీక్షలు జరపగా ఐదుగురికి పాజిటివ్ నిర్థారణ అయింది. ప్రకాశం జిల్లా హనుమంతునిపు జోన్ లో గొల్లపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయునికి కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది. జిల్ల అధికారులు టీచర్లకు, విద్యార్థులకు కూడా పరీక్షలు జరుపుతున్నారు.దు నెలల విరామం అనంతరం ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య అంతర్రాష్ట ఆర్టీసీ బస్సులు నడవటం మొదలైంది.

తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 1536 కొత్త కేసులు వచ్చాయి. 1421 మంది కోలుకోగా 3 మరణాలు నమోదయ్యాయి. 1536 కొత్త కేసుల్లో 281 గ్రేటర్ హైదరాబాద్ లో నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కేసులు 2,42,506; చికిత్సలో ఉన్నవి: 17,742; మరణాలు: 1351; కోలుకున్నవారు: 2,23,413 మంది కాగా కోలుకున్నవారి శాతం 92.12 కి చేరింది. దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ మధ్యాహ్నానికి బాగా వేగం పుంజుకోగా భారీ వోటింగ్ ను సూచిస్తూ సాయంత్రం 3 గంటలకే దాదాపు 71 శాతంమంది వోటు వేశారు.

అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో మరో కోవిడ్ బాధితుడు మరణించాడు. దీంతో మరణాల సంఖ్య 38 కి చేరింది.గడిచిన 24 గంటల్లో కొత్తగా 117 పాజిటివ్ కేసులు నమోదు కాగా ప్రస్తుతం1722 మంది ఇంకా చికిత్సలో ఉన్నారు.

అస్సాం: గడిచిన 24 గంటల్లో 30334 శాంపిల్స్ పరీక్షించగా 465 కోవిడ్ కేసులు నిర్థారణ అయ్యాయి. దీంతో అస్సాంలో పాజిటివ్ శాతం 1.53% గా నమోదైంది. ఇప్పటివరకు రాష్టంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు 206982కి చేరుకోగా 197566 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

మేఘాలయ: మేఘాలయలో 71 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా తాజాగా 117 మంది కోలుకున్నారు.

మిజోరం: నిన్న మిజోరంలో 35 కొత్త కోవిడ్ కేసులు ధ్రువపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2792 కు చేరింది. చికిత్సలో ఉన్నవారు 444 మంది కాగా ఐజ్వాల్ లో లాక్ డౌన్ ను నవంబర్ 9 వరకు పొడిగించారు.

నాగాలాండ్: నాగాలాండ్ లోని మొత్తం 1363 చికిత్సలో ఉన్న కేసులలో 1296 కేసులకు లక్షనాలు పైకి కనబడటం లేదు. 42 కేసుల్లో స్వల్ప లక్షణాలు ఉండగా ఆరుగురిలో తీవ్రమైన లక్షణాలు కనబడుతున్నాయి. వారిలో ఒకరి ఐసియు లో వెంటిలేటర్ మీద ఉన్నారు.

FACT CHECK

 

 

Image

****

 

 



(Release ID: 1669884) Visitor Counter : 169