వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ప్రజా పంపిణీ ద్వారా ప్రయోగాత్మకంగా పౌష్టికాహార బియ్యం పంపిణీ

పథకం అమలుకోసం 15 రాష్ట్రాల గుర్తింపు
2019-20నుంచి మూడేళ్లపాటు అమలుకోసం రూ. 174.6కోట్ల బడ్జెట్ కేటాయింపు
దేశంలోని 112 ఆశావహ జిల్లాల్లో పథకం అమలుపై ప్రత్యేక శ్రద్ధ

Posted On: 03 NOV 2020 11:28AM by PIB Hyderabad

  దేశాన్ని పౌష్టికాహార భద్రత దిశగా నడిపించే ప్రక్రియలో భాగంగా, కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ (డి.ఎఫ్.పి.డి.) ఒక విభిన్నమైన పథకాన్ని నిర్వహిస్తూ వస్తోంది. బియ్యాన్ని పౌష్టికాహార నాణ్యతతో బలవర్ధకం చేయడానికి, ప్రజా పంపిణీ వ్యవస్థ (పి.డి.ఎస్.) ద్వారా ప్రజలకు సరఫరా చేసేందుకు కేంద్రం ఆధ్వర్యంలో ఒక ప్రయోగాత్మక పథకాన్ని చేపట్టారు. మొత్తం రూ. 174.6కోట్ల మేర  బడ్జెట్ కేటాయింపుతో  2019-20వ సంవత్సరంనుంచి మూడేళ్లపాటు ఈ ప్రయోగాత్మక పథకం అమలుకు ప్ ఆమోదం కూడా లభించింది. ఈ ప్రయోగాత్మక పథకం అమలుకు తొలుత 15 రాష్ట్రప్రభుత్వాలను గుర్తించారు. రాష్ట్రానికి ఒక జిల్లా చొప్పున మొత్తం 15 జిల్లాల్లో పథకాన్ని చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, చత్తీస్ గఢ్ వంటి 5 రాష్ట్రాల్లో గుర్తించిన జిల్లాల్లో పౌష్టికాహార బియ్యం పంపిణీని ఇప్పటికే ప్రారంభించారు.

  ఈ ప్రయోగాత్మక పథకంపై కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాలు, రైల్వేలు, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ 2020 అక్టోబరు 31న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోయెల్ మాట్లాడుతూ, దేశంలో పౌష్టికాహార బియ్యం పంపిణీకి మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే అంశానికి సంబంధించి, డి.ఎఫ్.పి.డి. కార్యదర్శి అధ్యక్షతన 2020 నవంబరు 2న మరో సమావేశం కూడా నిర్వహించారు. సమగ్ర శిశు అభివృద్ధి సేవలు (ఐ.సి.డి.ఎస్.), మధ్యాహ్న భోజన (ఎం.డి.ఎం.), పథకం కింద దేశంలోని అన్ని జిల్లాల్లో, 2021-22వ సంవత్సరం నుంచి పౌష్టికాహార బియ్యం పంపిణీ చేయడానికి ఒక సమగ్రమైన ప్రణాళికను రూపొందించవలసిందిగా ఈ సమావేశంలో భారత ఆహార సంస్థను (ఎఫ్.సి.ఐ.ని) ఆదేశించారు. ఆశావహ జిల్లాలుగా ప్రత్యేకంగా గుర్తించిన 112 జిల్లాల్లో పౌష్టికాహార బియ్యం పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ చూపనున్నారు.

    పౌష్టికాహార బియ్యం పంపిణీ పథకం అమలు పురోగతి, మరింత విస్తృతంగా అమలు చేయాల్సిన ఆవశ్యకత వంటి అంశాలపై నీతీ ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సి.ఇ.ఒ.) ఈ రోజు డి.ఎఫ్.పి.డి. కార్యదర్శితో చర్చించారు. అలాగే,.. భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ.) సి.ఇ.ఒ.తోపాటు, టాటా ట్రస్ట్, ప్రపంచ ఆరోగ్య పథకం, పాథ్ సంస్థ, న్యూట్రీషనల్ ఇంటర్నేషనల్ వంటి భాగస్వామ్య వర్గాలతో కూడా నీతీ ఆయోగ్ సి.ఇ.ఒ. చర్చలు జరిపారు.  మొట్ట మొదటగా ఆశావహ జిల్లాల్లో సమగ్ర శిశు అభవృద్ధి సేవలు/మధ్యాహ్న భోజనం పథకం అమలుచేసే ప్రక్రియలో భాగంగా,. పౌష్టికాహార బియ్యం పంపిణీ సరఫరా వ్యవస్థ, తత్సంబంధమైన ఇతర ఏర్పాట్లను విస్తృతం చేయడం తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. 

  ఈ లక్ష్య సాధనకోసం పౌష్టికాహార నాణ్యత కలిగిన గుళికల సరఫరా పెంచవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం సంవత్సరానికి 15వేల మెట్రిక్ టన్నుల గుళికలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తాజా పథకం కింద దేశంలోని 112 ఆశావహ జిల్లాల్లో పంపిణీ చేసేందుకు దాదాపు 130లక్షల మెట్రిక్ టన్నులు పౌష్టికాహార బియ్యం అవసరం. ఇందుకోసం దేశంలో పౌష్టికాహార గుళికల పంపిణీ సామర్థ్యం 1.3లక్షల మెట్రిక్ టన్నులవరకూ పెరగాల్సి ఉంది. పి.డి.ఎస్. కింద దాదాపు 350 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పౌష్టికాహార నాణ్యతతో బలవర్ధకంగా తయారు చేయాలంటే పరిశ్రమలనుంచి నిరాటంకంగా 3.5లక్షల మెట్రిక్ టన్నుల పౌష్టికాహార గుళికలు సరఫరా కావలసి ఉంటుంది.

  దేశంలో ఉన్న దాదాపు 28వేల బియ్యం మిల్లులకు బ్లెండింగ్ మెషీన్లు వంటి వాటిని అమర్చవలసి ఉంటుంది. సాధారణ బియ్యాన్ని పౌష్టికాహార గుళికలతో కలిపేందుకు బియ్యం మిల్లులకు ఈ యంత్రాలు అమర్చాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి అవసరమైన పెట్టుబడులకు గాను, వివిధ ప్రాంతాల్లోని బియ్యం మిల్లులతో తగిన అనుసంధానం ఏర్పాటు చేసుకోవాలని ఎఫ్.సి.ఐ.ని ఇప్పటికే ఆదేశించారు. పౌష్టికాహార నాణ్యత కలిగిన బియ్యం సేకరణ, పంపిణీని 2021-22నుంచి దశలవారీగా బలోపేతం చేయడానికి ఎఫ్.సి.ఐ. నిర్వహణాపరమైన సంసిద్థత ఎంతగానో దోహదపడుతుంది.

****(Release ID: 1669755) Visitor Counter : 523