PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
07 OCT 2020 6:23PM by PIB Hyderabad
(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- భారత్ మరో శిఖరారోహణ; 85 శాతం దాటిన కోలుకునే కేసుల సగటు;
- క్రియాశీల కేసులతో పోలిస్తే కోలుకున్నవి 48 లక్షలకన్నా అధికం;
- దేశంలో కోలుకునే కోవిడ్‌రోగుల సంఖ్యరీత్యా జాతీయ సగటును అధిగమించిన 18 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు.
- దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో వ్యాధి నయమైనవారి సంఖ్య 82,203 కాగా... తాజా నిర్ధారిత కేసుల సంఖ్య 72,049 మాత్రమే.
భారత్ మరో శిఖరారోహణ; 85 శాతం దాటిన కోలుకునే కేసుల సగటు; క్రియాశీల కేసులతో పోలిస్తే కోలుకున్నవి 48 లక్షలకన్నా అధికం; జాతీయ సగటును మించిన 18 రాష్ట్రాలు/యూటీలు
కోవిడ్ మహమ్మారిపై పోరులో భారత్ మరో శిఖరాగ్రం చేరింది. ఈ మేరకు నిరంతరం దూసుకుపోతున్న కోలుకునేవారి సగటు ఇవాళ 85 శాతం దాటింది. గత 24 గంటల్లో 82,203 మందికి వ్యాధి నయంకాగా, కొత్త కేసుల సంఖ్య 72,049 మాత్రమే కావడం గమనార్హం. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కోవిడ్ నుంచి బయటపడినవారి సంఖ్య 57,44,693గా నమోదైంది. ఈ గరిష్ట సంఖ్యతో అంతర్జాతీయ స్థాయిలో భారత్ అగ్రస్థానంలోని దేశాల జాబితాలో నిలిచింది. అలాగే క్రియాశీల (9,07,883), కేసుల మధ్య అంతరం 6.32 రెట్లదాకా... అంటే- 48 లక్షలు (48,36,810) దాటింది. దీంతో మొత్తం నమోదైన కేసులలో ప్రస్తుతం చికిత్సలో ఉన్నవి 13.44 శాతం మాత్రమే. ఇక 18 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కోలుకునేవారి సంఖ్య జాతీయ సగటును మించిపోయింది. కోలుకున్న తాజా కేసులలో 75 శాతం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనివే. ఈ జాబితాలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ఉన్నాయి. మహారాష్ట్ర దాదాపు 17,000తో అగ్రస్థానంలో ఉండగా, కర్ణాటక 10,000కన్నా అధికంగా కోలుకున్నవారితో రెండోస్థానంలో నిలిచింది. గత 24 గంటల్లో 72,049 కొత్త కేసులు నమోదవగా 78 శాతం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనివే. మహారాష్ట్రలో అత్యధికంగా 12,000 నమోదవగా, కర్ణాటక దాదాపు 10,000 కేసులతో తర్వాతి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 986 మరణాలు సంభవించగా, వీటిలో 83 శాతం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనివే. ఇందులోనూ మహారాష్ట్ర 37 శాతం (370)తో తొలిస్థానంలో ఉండగా, 91 మందితో కర్ణాటక తర్వాతి స్థానంలో ఉంది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1662266
మధ్యప్రదేశ్‌లోని రేవాలోగల శ్యామ్‌షా ప్రభుత్వ వైద్య కళాశాలలో సూపర్ స్పెషాలిటీ భవనాన్ని ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించిన డాక్టర్ హర్షవర్ధన్
మధ్యప్రదేశ్‌లోని రేవాలోగల శ్యామ్‌షా ప్రభుత్వ వైద్య కళాశాలలో సూపర్ స్పెషాలిటీ భవనాన్ని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, సహాయ మంత్రి శ్రీ అశ్వనీ కుమార్ చౌబే, రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లు డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ 200 పడకల సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌ను కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్‌ఎస్‌వై) కింద రూ.150 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇందులో న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, కార్డియాలజీ, సీటీవీఎస్, నియోనాటాలజీ, పల్మనరీ మెడిసిన్ విభాగాలున్నాయి. అలాగే 6 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, 200 సూపర్ స్పెషాలిటీ పడకలు, 30 ఐసీయూ పడకలు, 8 వెంటిలేటర్లు ఉంటాయి. అంతేగాక 14 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చే సదుపాయాలున్నాయి. ఈ సందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ- ప్రజలు కోవిడ్ జాగ్రత్తలకు అనుగుణంగా నడచుకోవాలని సూచించారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1662360
కోవిడ్-19 వ్యవహారాల పర్యవేక్షణ-ప్రగతిపై డిజిటల్ వేదిక రూపకల్పన: ఆరోగ్య శాఖ కార్యదర్శి; చికిత్సలో మార్గదర్శకాలు, వ్యవహరణ పద్ధతులతోపాటు ఆయుర్వేదం-యోగా ఆధారంగా జాతీయ వైద్యనిర్వహణ విధానాల ఉపయోగం: ఆయుష్ శాఖ కార్యదర్శి
దేశంలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నదని కేంద్ర ఆరోగ్య- కుటుంబ సంక్షేమశాఖ కార్యద్యర్శి శ్రీ రాజేష్ భూషణ్ చెప్పారు. ఈ మేరకు కోవిడ్-19పై తాజా సమాచారంతోపాటు ఇప్పటిదాకా తీసుకున్న చర్యలగురించి న్యూఢిల్లీలో నిన్న ఆయన విలేకరులకు వివరించారు. మునుపటి వారంతో పోలిస్తే ఇటీవల కోలుకునేవారి సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో రోజువారీ నిర్ధారిత కేసుల సగటుకన్నా వ్యాధి నయమయ్యేవారి సంఖ్య అధికంగా నమోదవుతున్నదని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అలాగే ఆయుష్ మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ వైద్యరాజేష్ కొటేచా మాట్లాడుతూ- కోవిడ్ నిర్వహణపై ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇటీవల ఆవిష్కరించిన ఆయుర్వేద-యోగా ఆధారిత “జాతీయ వైద్యనిర్వహణ విధివిధానాల ప్రక్రియ” గురించి వివరించారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1662119
రష్యా అధ్యక్షుడు గౌరవనీయ వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫోన్ సంభాషణ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రష్యా అధ్యక్షుడు గౌరవనీయ వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌ద్వారా సంభాషించారు. ఈ రోజు ఆయన జన్మదినం కావడంతో అభినందనలతోపాటు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పుతిన్‌తో తనది చిరకాల స్నేహానుబంధమని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. భారత్- రష్యాల మధ్య ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో శ్రీ పుతిన్ చూపిన చొరవను శ్రీ మోదీ కొనియాడారు. కోవిడ్-19 మహమ్మారి విసిరిన సవాళ్లుసహా వివిధ అంశాలపై రానున్న రోజుల్లో సంప్రదింపులు, సమాలోచనల కొనసాగింపుపై అధినేతలిద్దరూ పరస్పరం అంగీకరించారు. ప్రజారోగ్యం సాధారణ స్థితికి చేరిన తర్వాత సాధ్యమైనంత త్వరగా పుతిన్‌ను భారత పర్యటనకు ఆహ్వానించాలని భావిస్తున్నట్లు ప్రధానమంత్రి చెప్పారు.
రుణ దరఖాస్తుల స్వీకారం-పరిశీలన ప్రక్రియ సరళతరం చేసేదిశగా పీఎం స్వనిధి-ఎస్‌బీఐ పోర్టల్ల మధ్య ఏపీఐ అనుసంధానం ప్రారంభం
ప్రధానమంత్రి వీధి వ్యాపారుల స్వావలంబన నిధి (పీఎం స్వనిధి) పథకంలో భాగంగా సంబంధిత పోర్టల్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) పోర్టల్‌తో అనుసంధానించే ‘అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్’ (ఏపీఐ)ను కేంద్ర గృహ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ దుర్గాశంకర్ మిశ్రా ప్రారంభించారు. ఈ అనుసంధానంతో రెండు పోర్టళ్ల మధ్య నిరంతర సమాచార ఆదానప్రదానానికి వీలు కలుగుతుంది. కోవిడ్ దిగ్బంధం వల్ల దెబ్బతిన్న వీధి వ్యాపారుల జీవనోపాధి పునఃప్రారంభమయ్యేలా సరసమైన నిర్వహణ మూలధన రుణం అందించడం కోసం 2020 జూన్ 1 నుంచి పీఎం-స్వనిధి పథకాన్ని మంత్రిత్వశాఖ అమలు చేస్తోంది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1662412
దిగ్బంధం పూర్వంలాగానే రైలు బయల్దేరే వేళకు 30 నిమిషాల ముందు రెండో రిజర్వేషన్ చార్టు ప్రకటన పద్ధతి పునఃప్రారంభం
రెండో రిజర్వేషన్ చార్టు తయారీ ప్రక్రియను 10.10.2020 నుంచి తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. కోవిడ్ దిగ్బంధానికి ముందున్న పద్ధతుల ప్రకారం రైలు బయల్దేరే సమయానికి కనీసం 4 గంటలముందు తొలి రిజర్వేషన్ చార్టును రైల్వశాఖ ప్రకటించేది. అటుపైన రైలు బయల్దేరడానికి 30 నుంచి 5 నిమిషాలు ముందుగా రెండో రిజర్వేషన్ చార్టును ప్రకటించేది. ఈ వ్యవధి నడుమ రిజర్వు చేసుకున్న టికెట్లను రద్దు చేసుకోవడానికి అనుమతిస్తుంది. అయితే, కోవిడ్ దిగ్బంధం నిబంధనల అమలు ఫలితంగా రైలు బయల్దేరడానికి 2 గంటలముందు రెండో చార్టును ప్రకటించే పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌలభ్యం దృష్ట్యా, జోనల్ రైల్వేల అభ్యర్థన మేరకు పాత విధానాన్ని పునఃప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయించింది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1662194
జాతీయ అంకుర సంస్థల అవార్డులు-2020 ఫలితాల ప్రకటన
దేశంలో ‘అంకుర సంస్థల పురస్కారం-2020’ విజేతలను రైల్వే, వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- యువ పారిశ్రామికవేత్తల వినూత్న ఆలోచనలను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లే విధంగా ఈ అవార్డులు వారిలో ఉత్సాహప్రోత్సహాలను రగిలిస్తాయన్నారు. ఇవి ఓ కొత్త పర్యావరణ వ్యవస్థకు గుర్తింపునిస్తూ నిర్వహించుకునే వేడుకలు మాత్రమేగాక ఆకాశమే హద్దుగా అంకుర సంస్థలు ఎదగడానికి దోహదపడతాయని చెప్పారు. అనేక వ్యూహాత్మక రంగాల్లోల ఈ సంస్థలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలు ఆర్థికాభివృద్ధికి సహాయపడతాయని పేర్కొన్నారు. తద్వారా ప్రగతి, వృద్ధి ఫలాలను దేశంలోని చిట్టచివరి వ్యక్తిదాకా తీసుకెళ్తాయని ఆయన స్పష్టం చేశారు. కోవిడ్-19ను ఒక సవాలుగా కాకుండా అవకాశంగా చూడాలని అంకుర సంస్థల నిర్వహకులకు ఉద్బోధించారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1662079
భారత హాకీ జట్లకు కొనసాగుతున్న శిక్షణ; త్వరలో జోరందుకోవడంపై కెప్టెన్లు, శిక్షకులలో ఆశాభావం
కోవిడ్ నేపథ్యంలో దేశవ్యాప్త దిగ్బంధం వల్ల నిలిచిపోయిన భారత పురుషుల-మహిళల హాకీ జట్ల శిక్షణ ప్రస్తుతం పునఃప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల క్రీడాకారులు త్వరలోనే జోరందుకోగలరని కెప్టెన్లు, శిక్షకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే శిక్షణ కేంద్రంలో అమలు చేస్తున్న భద్రత చర్యలపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, పురుషుల-మహిళల హాకీ జట్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1662193
కోవిడ్-19 పరిస్థితుల్లోనూ గోధుమ సేకరణ నిరుటికన్నా 15 శాతం అధికం
కోవిడ్ మహమ్మారి సమయంలోనూ పంటల కొనుగోళ్లు లక్ష్యాలకు మించి సాగేవిధంగా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఇవాళ అన్నారు. సంక్షోభ సమయాల్లో రైతాంగం అవసరాలపై స్పందించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన నేతృత్వంలోని బృందం కట్టుబాటుకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఆ మేరకు కోవిడ్-19 పరిస్థితుల నడుమ కూడా దేశంలో గోధుమల సేకరణ నిరుటితో పోలిస్తే 15 శాతం అధికంగా సాగిందని, తదనుగుణంగా 390 లక్షల టన్నులు సేకరించారని పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1662418
‘మానసిక ఆరోగ్యం-కోవిడ్-19 తర్వాత భవిష్యత్తు’పై ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విశ్వవిద్యాలయంతో సంయుక్తంగా రేపు అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్న సాంఘిక న్యాయం-సాధికారత మంత్రిత్వ శాఖ
సాంఘిక న్యాయం-సాధికారత మంత్రిత్వశాఖ పరిధిలోని “వికలాంగుల సాధికారత విభాగం” ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విశ్వవిద్యాలయ సహకారంతో “మానసిక ఆరోగ్యం-కోవిడ్-19 తర్వాత భవిష్యత్తు”పై రేపు (2020 అక్టోబర్ 8న) అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తుంది. ఈ సదస్సును కేంద్ర సాంఘిక న్యాయం-సాధికారత శాఖ మంత్రి డాక్టర్ థావర్‌చంద్ గెహ్లోత్ ప్రారంభిస్తారు. ఆస్ట్రేలియా-భారత ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ క్రెయిగ్ జెఫ్రీ సహాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. న్యూఢిల్లీలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఇందులో పాల్గొంటారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1662409
ద్రవ్య సుస్థిరత సాధనకు కృషి: కోవిడ్ సంక్షోభం నుంచి బయటపడే మార్గాలు
ఈ 21వ శతాబ్దంలో ప్రపంచంలోని ఏ ఆర్థిక వ్యవస్థకైనా ద్రవ్యత్వ స్వరూపం మూడు ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉంటుందని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ శ్రీ ఎన్.కె.సింగ్ అన్నారు. కామన్‌వెల్త్ కూటమి దేశాల ‘ఆర్థిక మంత్రుల సమావేశం-2020’లో ఆయన ప్రసంగించారు. ఈ మేరకు మాట్లాడుతూ- ఆర్థిక నిబంధనల స్తంభం, ఆర్థిక నిర్వహణ ప్రక్రియల స్తంభం, పటిష్ఠ ఆర్థిక సంస్థల స్తంభం ఇందుకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ఒక నిర్దిష్ట కోణంలో వివిధ దేశాలు త్వరలో మూడోదశ ఆర్థిక నియమాలు, విధానాల్లో ప్రవేశిస్తామన్నారు. తొలిదశ స్థూల ఆర్థిక స్థిరత్వానికి తగినట్లు ద్రవ్యలోటు లక్ష్యాల నిబంధనలను నిర్దేశించడం ద్వారా ఈ నియమాలను అమలు చేసినట్లు పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1662354
కరోనాపై ఈశాన్య భారత రాష్ట్రాలు మెరుగైన నిర్వహణ తీరు కనబరిచాయని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంస
కోవిడ్-19 నిర్వహణలో ఈశాన్య భారత రాష్ట్రాలు మెరుగైన పనితీరు కనబరిచాయని ఈశాన్య ప్రాంత అభివృద్ధి కేంద్ర సహాయ (స్వతంత్రబాధ్యత)మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. ఈ రాష్ట్రాల చిత్తశుద్ధికి నిష్పాక్షిక సంస్థలు నిర్వహించిన దేశవ్యాప్త అధ్యయనాల ఫలితాలే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1662491
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- కేరళ: రాష్ట్రంలో రైతు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఇవాళ్టి సమావేశంలో కేరళ మంత్రిమండలి నిర్ణయించింది. అలాగే రైతుల నుంచి ధాన్యం సేకరణ బాధ్యతను సహకరా సంఘాలకు అప్పగించాలని తీర్మానించింది. రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి ఎం.ఎం.మణికి కోవిడ్ సోకినట్లు ఇవాళ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో వైరస్ బారినపడిన నాలుగో మంత్రిగా ఆయన జాబితాలో చేరారు. రాష్ట్రంలో నిన్న 7,871 కొత్త కేసులు నమోదవగా ప్రస్తుతం చికిత్స పొందే కేసుల సంఖ్య 87,738కి చేరింది. మరోవైపు 2.33 లక్షల మంది పరిశీలనలో ఉండగా ఇప్పటిదాకా రాష్ట్రంలో 884 మంది కోవిడ్ బాధితులు మరణించారు.
- తమిళనాడు: రాష్ట్రంలో పాఠశాలలను ఇప్పుడే పునఃప్రారంభించే పరిస్థితి లేదని, విద్యార్థుల ఆరోగ్యమే తమ ప్రాథమ్యమని తమిళనాడు విద్యాశాఖ మంత్రి చెప్పారు. కోయంబత్తూరు జిల్లా వెలుపలనుంచి వాల్పరై పర్వత పట్టణంలో ప్రవేశించేవారికి ఇ-పాస్ పొందటాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అధికార పార్టీ అన్నాడీఎంకే ఎమ్మెల్యే కె.ఎ.పాండియన్ కోవిడ్ బారినపడినట్లు బుధవారం నిర్ధారణ అయింది. దీంతో ఆయనను చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. తమిళనాడులో నిన్న 5,017 కొత్త కేసులు నమోదవగా రోజువారీ గణనలో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఇక 71 మంది మరణించగా, 5,548 మంది డిశ్చార్జి అయ్యారు. కొత్త కేసులలో 1036 చెన్నైలో నమోదయ్యాయి.
- కర్ణాటక: రాష్ట్రంలో జిల్లాలవారీగా కోవిడ్ రోగులకు అందుబాటులోగల పడకలు, ఇతర వైద్య సదుపాయాల లభ్యతపై సమాచారం ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. మాస్కు ధరించనివారికి రాష్ట్ర ప్రభుత్వం విధించే జరిమానా మొత్తాన్ని ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు నగరాల్లో రూ.1000 నుంచి రూ.250కి, గ్రామీణ ప్రాంతాల్లో రూ.100కు తగ్గించింది. కొడగులో పర్యాటకులకు కోవిడ్-19 పరీక్షను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. బెంగుళూరు పట్టణంలో నిన్న అత్యధికంగా 5012 కొత్త కేసులు నమోదయ్యాయి.
- ఆంధ్రప్రదేశ్: రాష్ట్ర రోడ్డురవాణా సంస్థకు సరుకుల రవాణా ఆదాయం క్రమంగా పెరుగుతోంది. ఇందులో భాగంగా తిరుపతి ప్రాంతీయ విభాగం దిగ్బంధం సందర్భంగా ఏప్రిల్‌లో రూ.1.67 లక్షలు సంపాదించగా, సెప్టెంబరులో రూ.58.58 లక్షల ఆదాయం ఆర్జించింది. ఇక రాష్ట్రంలో నిన్న 5795 కొత్త కేసులు నమోదవగా ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కేసుల సంఖ్య 7.29లక్షలకు పెరిగింది, అయితే, 6046 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా 33 మంది మరణించగా మొత్తం మృతుల సంఖ్య 6052కు చేరింది. ఏదేమైనా ఇప్పటిదాకా రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 6.72 లక్షలుగా ఉంది. ప్రకాశం జిల్లాలో ఇటీవల మరో 452 కేసులు నమోదవగా మొత్తం కేసులు 52,742కు చేరాయి.
- తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 2154 కొత్త కేసులు, 8 మరణాలు నమోదవగా, 2239మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 303 జీహెచ్‌ఎంసీ నుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు: 2,04,748; క్రియాశీల కేసులు: 26,551; మరణాలు: 1189; డిశ్చార్జి: 1,77,008గా ఉన్నాయి. మార్కెట్ పరిస్థితుల ప్రతికూలత నేపథ్యంలో రైతులకు అండగా నిలవడం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రస్తుత వానాకాలంలో పండించిన ధాన్యం, పత్తి మొత్తాన్నీ కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
- చండీగఢ్: ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఆర్థికంగా బలహీనవర్గాలపై ఆరోగ్యశాఖ ప్రధానంగా దృష్టి సారించాలని నగర పాలన యంత్రాంగాధిపతి ఆదేశించారు. తద్వారా సహజంగా రద్దీగా ఉండే ఆయా ప్రాంతాలలో కరోనా వ్యాప్తి నిరోధానికి వీలవుతుందని పేర్కొన్నారు. అలాగే నగరంలో నిత్యం పరిస్థితులను సమీక్షిస్తూ తదనుగుణంగా పరిష్కార చర్యలను సిఫారసు చేయాలని ఆయన వైద్యుల కమిటీలను ఆదేశించారు.
- హర్యానా: రాష్ట్రంలో రాబోయే పండుగ సీజన్ దృష్ట్యా, కోవిడ్ సముచిత ప్రవర్తన పద్ధతుల అనుసరణపై ప్రజలకు అవగాహన పెంచే దిశగా ప్రచార కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామీణులలో అవగాహన పెంపు దిశగా సర్పంచ్, గ్రామ కార్యదర్శి, ఆశా కార్మికులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. అందువల్ల వారందరూ చురుగ్గా పాలుపంచుకునేలా చూడాలని స్పష్టం చేశారు.
- మహారాష్ట్ర: రాష్ట్రంలో పారిశ్రామిక ఆక్సిజన్ సరఫరా త్వరలో సాధారణ స్థితికి వస్తుందని మహారాష్ట్ర పరిశ్రమల మంత్రి సుభాష్ దేశాయ్ వాణిజ్య సమాజానికి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో తయారయ్యే ఆక్సిజన్‌లో 80 శాతం కోవిడ్ రోగుల చికిత్సకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించిన నెల తర్వాత ఆయన ఈ మేరకు ప్రకటించడం గమనార్హం. గత 24 గంటల్లో 132 మంది పోలీసు సిబ్బందికి కోవిడ్ నిర్ధారణ కాగా, నలుగురు మరణించారు. దీంతో పోలీసు బలగాల్లో కోవిడ్ కేసుల సంఖ్య 24,386కు చేరింది. మహారాష్ట్రలో ప్రస్తుతం చురుకైన కేసులు 2.47 లక్షలు కాగా, మృతుల సంఖ్య 38,717గా ఉంది.
- గుజరాత్: రాష్ట్రంలో కోలుకునేవారి సగటు 86.16 శాతంగా నమోదైంది. ప్రస్తుత క్రియాశీల కేసులు 16,597 కాగా, గత 24 గంటల్లో 10 మంది మరణించారు.
- రాజస్థాన్: రాష్ట్రంలో నిన్న 2,121 కొత్త కేసులు నమోదవగా వీటిలో జైపూర్ (469), జోథ్‌పూర్ (292), అల్వార్ (196) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. గత 24 గంటల్లో 15 మరణాలు సంభవించగా, ప్రస్తుత క్రియాశీల కేసుల సంఖ్య 21,294గా ఉంది.
- మధ్యప్రదేశ్: రాష్ట్రంలో కోలుకునేవారి సగటు మరింత మెరుగుపడి 83 శాతానికి చేరింది. కరోనా వ్యాప్తిపై జిల్లాలవారీ సమీక్ష నేపథ్యంలో- ఇండోర్‌లో 425, భోపాల్‌లో 299, జబల్‌పూర్‌లో 141, గ్వాలియర్‌లో 70 వంతున నమోదయ్యాయి. క్రియాశీల కేసులు 18,141గా ఉన్నాయి.
- ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధానికి తగిన జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రచార కార్యక్రమం చేపట్టింది. ఈ మేరకు వివిధ జిల్లాల్లో అవగాహన కల్పన దిశగా బహిరంగ ప్రకటనలు, ఇంటింటి ప్రచారం, సామాజిక మాధ్యమాల వినియోగం వంటి మార్గాలను అనుసరిస్తోంది. ఇక మాస్కులు ఉపయోగిస్తామని ప్రమాణం చేస్తూ ఆన్‌లైన్ ఫామ్ నింపాల్సిందిగా ప్రజలను ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం చురుకైన కేసుల సంఖ్య 27,238గా ఉంది.
- గోవా: రాష్ట్రంలో రోగులకు ఔషధాలు, పోషకాహారం తదితరాలతోపాటు అనేక అంశాల్లో సహాయం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఈఎస్‌ఐ ఆస్పత్రిలో రోగుల నిర్వహణ సేవలను ప్రారంభించింది. తద్వారా దేశంలోనే రోగుల సురక్షిత నిర్వహణ సేవను మొదలుపెట్టిన తొలి రాష్ట్రంగా గోవా నిలిచింది. రాష్ట్రంలో ప్రస్తుత చురుకైన కేసుల సంఖ్య 4,720గా ఉంది.
- అసోం: రాష్ట్రంలో 1184 కొత్త కేసులు నమోదవగా 1586 మంది కోలుకున్నారు. అసోంలో మొత్తం 188902 కేసులకుగాను ప్రస్తుతం 33047 మంది చికిత్స పొందుతుండగా, మృతుల సంఖ్య 778గా ఉంది.
- మేఘాలయ: రాష్ట్రంలో ఇవాళ 115 మంది కోలుకున్నారు. మేఘాలయలో ప్రస్తుతం క్రియాశీల కేసులు 2371 కాగా, ఇప్పటిదాకా 4606 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు.
- మిజోరం: రాష్ట్రంలో నిన్న 20 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 2148కి చేరాయి. వీటిలో ప్రస్తుతం 261 క్రియాశీల కేసులున్నాయి.
- నాగాలాండ్: రాష్ట్రంలో మొత్తం 6662 కేసులకుగాను సాయుధ దళాలు 3141 మంది, పరిచయాలతో వ్యాధిబారిన పడినవారు 1634 మంది, నాగాలాండ్‌కు తిరిగి వచ్చినవారు 1530 మంది, ముందువరుస పోరాట యోధులు 357 మంది ఉన్నారు.
FACT CHECK
******
(Release ID: 1662534)
Visitor Counter : 208